ఉమ్మడి ఆదిలాబాద్ పేరు చెప్పగానే కనుచూపు మేర విస్తరించిన పచ్చని దండకారణ్యం, జలపాతాల హోరు, ఎత్తైన కొండలు, లోయలు గుర్తుకొస్తాయి. వీటన్నింటికి మించి 'జల్, జంగల్, జమీన్'నే తమ దైవంగా భావించే అమాయక గిరిజనులు, ఆదివాసీ బిడ్డలు కళ్లముందు కదలాడుతారు. తరతరాలుగా పర్సపెన్, జంగుబాయి, నాగోబా, అకిపెన్ వంటి ప్రకృతి దేవతలను ఆరాధించే అడవి బిడ్డల జీవనశైలిలో ఇప్పుడు సరికొత్త ఆధ్యాత్మిక పవనాలు వీస్తున్నాయి. పచ్చని అడవుల మధ్య హనుమంతుని కాషాయ జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఆదిలాబాద్ అడవుల్లోకి ‘హనుమంతు’డి జైత్రయాత్ర మొదలైంది. సాధారణంగా అడవుల్లో నివసించే వారే అరాధ్యులంతా మాతృదేవతలే. జంగుబాయి గోండుల దేవత అయితే, కన్సారీ బిల్లు ధాన్యదేవత. ఇక సమ్మక్క సారక్కలు గిరిజన కోయదేవతలు. వల్లి కరుమార్ తెగ దేవత. వీళ్ల పంటల సమృద్ధి, గిరిజన ఆవాస రక్షణ, అడవి రక్షన చూసే దేవతలు. ఇపుడు పురుష దేవుళ్లు కూడా గిరిజన గూడెేల్లో ప్రత్యక్షమవుతున్నారు. వీళ్లకి ప్రార్థనలు నిత్య పూజలు ఉండవు, ఏడాదికో, రెండేళ్ల కో జరిగే జాతరలు తప్ప. వీళ్లని వేదకాలానికి ముందునుంచి ఉన్న దేవతలుగా చెబుతారు. ఇపుడు పరిస్థితి మారుతున్నది. అడవుల్లోకి మైదాన ప్రాంతాల ప్రజలు, కూలీలు, కాంట్రాక్టర్లు, రాజకీయ పార్టీలు, వాళ్ల సాంస్కృతిక సేనలు, స్వచ్ఛంద సంస్థలు వస్తున్నాయి. కొంత సంస్కృతిని ప్రవేశపెడుతున్నాయి. అడవుల్లోకి ఒక వైపు నుంచి కోక్, పెప్సిలు చొరబడుతుంటే మరొక వైపు నుంచి మైదాన ప్రాంతాల పురుష దేవుళ్లు ప్రవేశిస్తున్నారు. ఇపుడు ఏ గిరిజన గూడెంలోకి అడుగుపెట్టినా, ఏ పల్లెను పలకరించినా ఇప్పుడు అక్కడ 'జై శ్రీరామ్.. జై హనుమాన్' నినాదం మారుమోగుతోంది. కాషాయ జెండా రెపరెపలాడుతూ ఉంది.
చందాలతో హన్మాన్ మందిర నిర్మాణం
ఇంద్రవెల్లి మండలం మల్లాపూర్ గిరిజన గూడెంలో స్థానికులంతా 500 రూపాయల నుంచి వెయ్యి రూపాయల దాకా స్వచ్ఛందంగా చందాలు వేసుకొని హన్మాన్ మందిరం నిర్మించుకుంటున్నామని స్థానిక ఆలయ కమిటీ అధ్యక్షుడు బాపురావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.మల్లాపూర్ గిరిజన గూడెంలో గతంలో భీందేవుడు, పోచమ్మ దేవాలయాలుండేవి. గతంలో ఊరు మధ్యలో హనుమాన్ బండ ఉండేది. హనుమాన్ జయంతి రోజు ఆ బండ వద్దనే గిరిజనులు హన్మాన్ దీక్షలు చేసేవారు. తమ గ్రామంలో చందాల రూపేణా రూ.15లక్షలు రావడంతో ఆలయ నిర్మాణం చేపట్టామని బాపురావు పేర్కొన్నారు. మరో రూ.5 లక్షలు వసూలైతే ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. ఆదివాసీ గోండు, కొలం గిరిజనుల ఆరాధ్య దేవత జంగుబాయి, పెర్చపెన్ దేవతలను గిరిజనులు కొలుస్తుంటారు. గూడేల్లో చైత్రమాస పూజలు ముగిసే వరకు గిరిజనులు మంచినీళ్లను కూడా ముట్టరు.నెలరోజుల పాటు ఎంతో నియమ నిష్టలతో గిరిజనులు దీక్షలు చేపడతారు. ఈ దీక్షా సమయంలో నెలరోజుల పాటు ఆదివాసీ గిరిజనులు మద్యం, మాంసం ముట్టరు.
అడవి బిడ్డల ఆరాధ్య దైవంగా 'ఆంజనేయుడు'
ఆదిలాబాద్ జిల్లాలోని గోండు, కోలాం, తోటి, పర్ధాన్ తెగలకు చెందిన గిరిజనులకు అడవే ప్రాణాధారం. దట్టమైన అడవుల్లో, క్రూర జంతువుల మధ్య జీవించే వారికి అపారమైన ధైర్యం కావాలి. ఆ ధైర్యానికి, బలానికి, అంకితభావానికి ప్రతీక అయిన హనుమంతుడు (భజరంగ్ దళ్) ఇప్పుడు ఆదివాసీలకు అత్యంత ఆరాధ్య దైవంగా మారాడు. హనుమంతుడు వానర రూపుడు కావడం, ఆయన కూడా అటవీ ప్రాంతాలతోనే ఎక్కువ మమేకమై ఉండటం గిరిజనులను ఆయన వైపు ఆకర్షితుల్ని చేసింది. చెడుపై పోరాడే శక్తిగా, తమ గూడెంను రోగాలు, దుష్ట శక్తుల నుంచి కాపాడే రక్షకుడిగా అంజనీపుత్రుడిని వారు గిరిజనులు విశ్వసిస్తున్నారు. గిరిజన గూడెల్లో మందిరాలు నిర్మిస్తే వనవాసి వికాస్ పరిషత్ వాళ్లు విగ్రహాలను విరాళంగా అందిస్తున్నారని గోండ్వానా సాహిత్య సంస్కృతి పరిరక్షణ సమితి ప్రచార కార్యదర్శి అర్జున్ పెందూర్ ‘ఫెడరల్ తెలంగాణ’ చెప్పారు.
ఆదివాసీ గ్రామాల్లో వనవాసి వికాష పరిషత్, ఆర్ఎస్ఎస్, భజరంగదళ్ సంఘాల ప్రతినిధులు వచ్చి గూడేల్లో హన్మాన్ మందిరాల నిర్మాణానికి ప్రోత్సహిస్తున్నారని అర్జున్ పేర్కొన్నారు.
ప్రతి గూడెంలో కొలువుదీరుతున్న మందిరాలు
ఒకప్పుడు గిరిజన గూడెం పొలిమేరల్లో చెట్ల కింద సింధూరం పూసిన రాళ్లకే పూజలు చేసిన గిరిజనులు, ఇప్పుడు తామ సొంత చందాలతో చిన్న చిన్న హనుమాన్ మందిరాలను నిర్మించుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, సిర్పూర్(యు), కెరమెరి, ఆసిఫాబాద్ లాంటి ఏజెన్సీ మండలాల్లోని వందలాది మారుమూల గూడెల్లో ఇప్పుడు మారుతి మందిరాలు వెలిశాయి. ఊరి మధ్యలో రావి లేదా వేప చెట్టు కింద ఎర్రటి రంగు పులిమిన హనుమంతుని విగ్రహాలు, దానిపై రెపరెపలాడే కాషాయ జెండాలు ప్రతి గూడెంలోనూ దర్శనమిస్తున్నాయి. జైనూర్ మండలం రాసిమెట్ట, ఇంద్రవెల్లి మండలం డోంగర్ గాం, పొల్లంగూడ, పాకెడిగూడ, హీరాపూర్, దోడిందా, చిత్తాపూర్ గూడేల్లో హన్మాన్ దేవాలయాలు వెలిశాయి.
ఉదయం, సాయంత్రం గూడెంలోని యువత, మహిళలు గుడి వద్ద చేరి హనుమాన్ చాలీసా పఠించడం నిత్యకృత్యంగా మారింది.
గిరిజన గూడెల్లో వెల్లివిరుస్తున్న ఆథ్యాత్మికత
ఆదివాసీలు జంతువులను వేటాడి మాంసాన్ని తింటుంటారని, కల్లు, మద్యం తాగుతుంటారని, అయితే హన్మాన్ మందిరాల నిర్మాణంతో హన్మాన్ జయంతి సందర్భంగా 40 రోజుల పాటు హన్మాన్ దీక్షలు చేపట్టి మాసం, మద్యం ముట్టకుండా ఉంటున్నారని, గిరిజన గూడేల్లో ఆథ్యాత్మికత వెల్లివిరుస్తుందని మహాభారతాన్ని గోండు భాషలోకి అనువదించి తొడసం కైలాష్ మాస్టారు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ప్రతీ గిరజన గూడెంలలోనూ హన్మాన్ మందిరాలు వెలిశాయని తొడసం అమృతరావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఆదిలాబాద్ లో గిరిజన గూడెల్లో హన్మాన్ ఆలయాలు వెలుస్తుండటంతో ఆదివాసీ గిరిజనుల్లో హనుమంతునిపై భక్తి ప్రపత్తులు పెరిగాయి. ప్రతీ శనివారం గిరిజనులు తమ విరాళాలు వేసుకొని తండాల్లో హన్మాన్ దేవాలయాలను సొంతంగా నిర్మించుకుంటున్నారు.దీంతో వందలాది గూడేల్లో హన్మాన్ మందిరాలు వెలిశాయి. హన్మాన్ దేవాలయాల్లో హనుమాన్ చాలీసా పఠనంతోపాటు నిత్య పూజలు చేస్తూ ఆదివాసీ గిరిజనులు అథ్యాత్మిక బాట పట్టారు.
ఆదిలాబాద్ గిరిజన గూడెల్లో వెల్లివిరిసిన ఆధ్యాత్మికతతతో కొండకోనల్లో మారుతి నామస్మరణ మారుమోగుతుంది.
ఆధ్యాత్మికతతో పాటు పెరుగుతున్న సామాజిక క్రమశిక్షణ
ఆదివాసీల్లో వచ్చిన ఈ ఆధ్యాత్మిక మార్పు కేవలం గుడుల నిర్మాణానికే పరిమితం కాలేదు, వారి జీవనశైలిని కూడా అద్భుతంగా మార్చేస్తోంది. ముఖ్యంగా గిరిజన యువత భారీ సంఖ్యలో 'హనుమాన్ దీక్షలు' తీసుకుంటున్నారు.దీక్షా సమయంలో గిరిజనులు మద్యపానానికి, ధూమపానానికి దూరంగా ఉంటున్నారు.మాంసాహారాన్ని విడిచిపెట్టి, కఠినమైన శాకాహార నియమాలు పాటిస్తున్నారు.ఉదయాన్నే చన్నీటి స్నానాలు ఆచరించి, భక్తి మార్గంలో నడుస్తున్నారు.దీని వల్ల గూడెల్లో గొడవలు తగ్గిపోయాయి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా గిరిజన కుటుంబాలు మెరుగుపడుతున్నాయి. దీక్ష పూర్తిఅయిన తర్వాత కొండగట్టు అంజన్న ఆలయానికో, లేదా మహారాష్ట్రలోని నాందేడ్ తదితర ప్రాంతాల్లో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయాలకో కాలినడకన లేదా వాహనాల్లో వెళ్లి ఇరుముడి సమర్పిస్తున్నారు.
సరికొత్త సాంస్కృతిక సమ్మేళనం
ఆదివాసీలు హిందూ దేవుళ్లను పూజిస్తున్నప్పటికీ, తమ మూలాలను, సొంత సంప్రదాయాలను ఏమాత్రం విస్మరించకపోవడం ఇక్కడ విశేషం. పండుగల సమయాల్లో హనుమాన్ మందిరాల వద్ద వారి సాంప్రదాయ వాయిద్యాలైన దప్పు, తుడుం మోతలు వినిపిస్తాయి. గుస్సాడీ, ధింసా నృత్యాలు చేస్తూనే దేవుడిని కీర్తిస్తారు. ఇది అడవి తల్లి ఆరాధనకు, హనుమంతుని భక్తికి మధ్య కుదిరిన ఒక అద్భుతమైన సాంస్కృతిక సమ్మేళనం. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ప్రతీ గిరిజన గూడెంలో హన్మాన్ దేవాలయాల నిర్మాణంతో గిరిజనుల్లో ఆథ్యాత్మికత వెల్లివిరుస్తుందని నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రితేష్ రాథోడ్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. గిరిజనులు, ఆదివాసీలు 45 రోజుల పాటు మద్యం, మాంసం ముట్టకుండా చేపడుతున్న హన్మాన్ దీక్షల వల్ల చెడు వ్యసనాలకు గిరిజనులు దూరంగా ఉంటున్నారని, దీనివల్ల గిరిజన తండాల్లో మార్పు వచ్చిందని ఆయన తెలిపారు. గిరిజన తండాలన్నీ భక్తిభావంతో ఉన్నాయని ఆయన చెప్పారు.
ఆదిలాబాద్ అడవుల్లో వీస్తున్న ఈ ఆధ్యాత్మిక గాలి గిరిజనుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోంది. ఒకవైపు తమ పూర్వీకులు అందించిన ప్రకృతి ఆరాధనను కాపాడుకుంటూనే, మరోవైపు హనుమంతుని భక్తిలో ఓలలాడుతున్నారు. గిరిజన గూడెల్లో వెలుస్తున్న ఈ హనుమాన్ మందిరాలు కేవలం భక్తికి మాత్రమే కాకుండా, వారిలో క్రమశిక్షణకు, ఐకమత్యానికి, ఆరోగ్యకరమైన జీవనశైలికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. అడవి పూల స్వచ్ఛతకు, కాషాయపు భక్తి పరిమళాలు తోడై ఆదిలాబాద్ గిరిజన గూడెంలు ప్రశాంతతకు నిలయాలుగా మారుతున్నాయి.