
జీవితమా కాస్త తప్పుకో!
నేటి మేటి కవిత
జీవితమా, కాస్త పక్కకి తప్పుకో!
దారివ్వు కొంచెం!
దాచిపెట్టుకున్న తొవ్వ ఒకటుంది నా లోపల!
నువ్వు ముళ్ళై,రాళ్ళై గుచ్చిన పాదాల్ని
కాస్త నా లోపలి రహస్య రహదారిలో సుతిమెత్తగా మోపాలి!
ఒక్కో ముల్లూ తీసెయ్యాలి!
అలసిన పాదాల్ని ప్రేమగా నిమురుకోవాలి!
***
నా లోపల
బయట పడని ఎండిన తోట ఒకటి ఉంది.
దాని దాహం తీర్చాలి.
పూలు పూయించాలి!
నా లోపల
అణిచివేసుకున్న ఒక రాగం ఉంది
గొంతెత్తి పాడుకోవాలి!
గుండెల్లో దఫన్ అయిన
ఒక మార్మిక పురా గ్నాపకం లాంటి గజల్ని తనివితీరా వినాలి!
నాలో దాగున్న వెన్నెల రాత్రులలో,
అలుపు లేకుండా భగ్న వీణను మ్రోగించుకోవాలి!
***
నిర్లక్ష్యం చేసిన
ప్రియురాలి ఇంటి తలుపు తట్టి రావాలి!
ఆమె కళ్ళల్లోని జలపాతాల్లోకి దుంకి
ఆమె హృదయంలో సర్దుకు కూర్చోవాలి.
మొహమాటం లేకుండా
కనీసం ఆమె పాదాలనన్నా ముద్దాడి రావాలి!
జీవితమా ఆపకు!
పోనివ్వు ఆమె దగ్గరకి!
~~
జీవితమా ఎంత నొప్పినిచ్చావు నువ్వు?
ఎంతగా వణికించావు నన్ను?
కాస్త ఆగి
దాహం కూడా తీర్చుకో నివ్వ లేదు కదా?
అంతగా తరిమావు!
తోడే లేకుండా ఒంటరిని చేసావు!
కాస్త ఏకాంతంలో కదలి కదలి
ఏడ్చుకోవాలి పక్కకెళ్ళు కొంచెం!
~
ఇంత కాలం
కనికరమన్నా లేకుండా ఎంతగా దహించి పడేశావు?
నా లోపలి కనిపించని
చల్లని జలపాతాల కింద కాసింత చల్లబడాలి!
ప్రవహించే పిల్ల కాలువల్లో మునకలెయ్యాలి!
తప్పుకో!
~
ఎప్పటి నుంచో
తెరవని పుస్తకం ఒకటి ఉంది
నా హృదయపు అలమరలో.
ఇప్పుడిక
దాన్ని తెరిచి కాస్త తీరిగ్గా కూర్చుని చదవాలి!
~
ఎన్ని రాత్రుళ్ల నా నిదురని దోచుకుని
రాత్రుళ్ళని కలత బార్చావు?
కాసింత సుకూన్ తో నిదుర పోనీ !
కమ్మటి కలను కననీ!
దేహమంతా నువ్వు నింపిన ఖంగారుని,
పరుగుని కాస్త నెమ్మదించుకుని
మెల్లిగా ఇంత అన్నం ముద్ద తిననీ.
పొలం గట్ల చెట్టు నీడలో
నింపాదిగా కూర్చుని చల్లగాలిని అద్దుకొనీ!
సూర్యోదయాలని,చంద్రోదయాలని
తొలిసారి చూసినట్లు అబ్బురపడుతూ చూడనీ!
~
జీవితమా!
కర్కశ నగర రంపంతో
రోజూ కొంత కొంత కోస్తూ పోయావు!
ఇక నన్ను ఈ నగరాన్ని వీడిపోనీ!
నన్ను నా ఊరు వెళ్ళనీ !
నా మీద అలిగిన నన్ను పెంచిన ఇల్లుని చేరని!
~
అక్కడ ముసలి రెక్కలేసుకుని
అమ్మ ఎదురు చూస్తుంది!
అమ్మని చేరుకోనీ!
జ్ఞాపకం మందగించిన నా తల్లి ముందు నిలబడి
నన్ను గుర్తుపట్టమని వేడుకోనీ!
జీవితమా ఎంతగా భయపెట్టేసావు నన్ను?
అమ్మ ఒడిలో ముడుచుకు పడుకోనీ!
అమ్మ కొంగు చాటున దాక్కొనీ కాస్త!
నన్ను మళ్ళీ పసివాడిగా చేసుకొని
పెంచుకొమ్మని అమ్మని బ్రతిమిలాడుకోనీ!
అమ్మ ముందు
గోరుముద్దల కోసం చేయి చాపి నిలబడనీ!
~
జీవితమా చాలిక!
నన్ను ఈడ్చుకు పోకు!
వెంటాడకు,వేటాడకు!నన్ను పోనీ!
ఊరంతా బాల్యపు కాళ్ళేసుకుని
వీధి వీధీ తిరగనీ!
బాల్య మిత్రుని భుజం మీద చేయి వేసి
"బాగున్నావోయ్" అని పల కరించుకోనీ !
చూడూ! నన్నిక బెదిరించకు!
బంధించకు!
నా ఇష్టానికి నన్ను పోనీ!
~
ఇక నాకు సంకెళ్ళు వేయకు!
వదిలేయ్!
నా దారిన నన్ను పోనీ!
ఉక్కిరిబిక్కిరి చేయకు!
ఊరినీ, ఇంటినీ, అమ్మనీ
చేరనీ!
కాసింత సేద తీరనీ!
తరమకు !
మిగిలిన ఈ కొద్ది కాలాన్ని
నా లెక్కలతో నడవనీ!
నువ్వు తప్పుకో!

