లామకాన్ లో ‘మా భూమి’ తెలుగు నాటకం
x

లామకాన్ లో ‘మా భూమి’ తెలుగు నాటకం

డాక్టర్ జతిన్ కుమార్ సమీక్ష


2026 మే 9వ తారీఖున సమాహార స్కూల్ ఆఫ్ డ్రామా వారు శ్రీ రత్నశేఖర్ రెడ్డి దర్శకత్వం, నిర్వహణలో హైదరాబాద్ లా మకాన్ వేదికపై చరిత్ర ప్రసిద్ధి చెందిన మాభూమి నాటకాన్ని ప్రదర్శించారు. సమాహార ద్వారా వారు వందలాది నాటక వర్క్‌షాప్ ప్రొడక్షన్లను రూపొందిస్తారు అలాంటి వర్క్ షాప్ లో భాగo గానె ‘మా భూమి’ నాటకం తయారు చేశారు. హైదరాబాదు సంస్థానంలో జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటo [1946-51] స్పూర్తితో 1947 లో సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు రచించిన నాటకం ఇది. ఆ పోరాటానికి దారితీసిన దుర్భర దోపిడీ, ప్రజల జీవన పరిస్థితిని కళ్ళకు కట్టిననాటకం.

చారిత్రక నేపథ్యం. నిజాం రాచరిక పాలనలో భూస్వాములు (దేశ్ ముఖ్ లు, దొరలు) ప్రజలను అనేకరకాలుగా దోపిడి చేసేవారు. వెట్టి చాకిరి అని పిలువబడే బలవంతపు శ్రమ వ్యవస్థలో ప్రజలు పీల్చి పిప్పి చేయబడ్డారు. గుప్పెడు అప్పుకు గంపెడు వడ్డీలు, నాగులు, అక్రమ పన్నులు, ధాన్యం సుంకాలు, బలవంతపు లెవీ వసూళ్ల తో దారుణమైన ఆర్ధిక దోపిడీ జరుగుతుండేది. నిజాం ప్రభుత్వం, సామాన్య రైతుకూలీలకు కొద్దిగా ఉపశమనం కలిగించే కొద్దిపాటి చట్టాలు ఎప్పుడైనా చేసినా గ్రామాలలోని భూస్వాములు, అధికారులు వాటిని ఏమాత్రం అమలు చేసేవారు కాదు. ఆ చట్టాలను ఎవరైనా ప్రస్తావించినా వారిపై తీవ్రమైన అణచివేత, నిర్బంధం ప్రయోగించేవారు. దొరల అరాచక నిరంకుశ పాలన నిరాఘాటంగా సాగేది. ఆ భూస్వామ్య అణచివేతకు గురైన తెలంగాణ రైతుల బాధలను, వివిధ రకాల దోపిడీ రూపాలను ఈ నాటకం చాలా వివరంగా చిత్రీకరిస్తుంది.

ప్రజలు ఆ బాధలు భరించలేక అప్పుడప్పుడు తిరగబడే వారు. వారిపై మరింత తీవ్రంగా నిర్బంధం విరుచుకు పడేది. ఆ స్థితిలో మిగతా దేశంలో పెరుగుతున్న జాతీయోద్యమ ప్రభావం, రష్యాలో ఫలించిన సామ్యవాద విప్లవ ప్రభావంతో చదువుకున్ననవతరం యువకులు గ్రామాలలో ప్రవేశించి మధ్యతరగతి కుటుంబాలలో చిన్న, సన్న కారు రైతులలో, కూలీలలో దోపిడీ వ్యతిరేక రాజకీయ చైతన్య దీపాలను వెలిగించసాగారు. జరుగుతున్న ఆందోళన లకు, తిరుగుబాట్లకు ఒక నిర్మాణాత్మక స్వరూపాన్ని ఇచ్చి క్రమబద్ధమైన విప్లవ కార్యాచరణకు పూనుకున్నారు. 1940 నుండి 45 వరకు ఈ సన్నాహాలు జోరుగా సాగాయి. సరిగ్గా ఆదశను చిత్రిస్తుంది మాభూమి. ప్రజలలో పెరుగుతున్నమేల్కొలుపునీ, వారి సామూహిక ప్రతిఘటననీ, వారి సంఘ నిర్మాణ నిబద్ధతనీ, కలిసికట్టుగా సాగించిన పోరాట పటిమనీ, నిర్భీతినీ, త్యాగ శీలతనీ, నాటకీయతకు దూరంగా, వాస్తవిక దృక్పథంతో చూపిస్తుంది.

ఇతివృత్తo : భూస్వాముల దోపిడీ, వూరూరా ఏర్పడుతున్న రైతుసంఘాల స్థితి, ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో సాగుతున్నపోరాట సన్నాహాలు, అధికారులు, పోలీసులు చేసే అణచివేత, ప్రజల ప్రతిఘటన, ఆ ఉద్యమంలో వివిధ కులాలు, మతాలకు చెందిన పేద రైతుల మధ్య అనివార్యంగా ఏర్పడుతున్నసమిష్టి సంగ్రామ ఐక్యత, మహిళల భాగస్వామ్యం, పోరాటాన్ని విచ్చిన్నం చేయటానికి పెత్తందారులు, అధికారులు అనుసరించే ఎత్తుగడలు, కల్పించే ఆశలు, వoఛనపూరితమైన వాదనలు, బెదిరింపులు, దాడులు, కాల్పులు వాస్తవికంగా జరిగిన చారిత్రిక ఘట్టాల ఆధారంగా ప్రేక్షకుల ముందుంచారు. రైతులు దొరల వాదనలను తిప్పికొట్టటం, దున్నేవానికే భూమి అనే నినాదం తో అందరినీ ఐక్యం చేయటం, భూమి పై హక్కులు, గౌరవ ప్రదమైన జీవితం కోసం డిమాండ్ చేస్తూ పోరాటానికి సిద్ధం కావటం అనే పోరాట దశను ప్రధానంగా చిత్రిస్తుంది. ప్రధానంగా నాటకం పోరాటానికి ఉద్యుక్తులవుతున్నచిన్న రైతు ల బాధలను, వారిలో పెరుగుతున్న చైతన్యాన్ని, రాజకీయ నిర్మాణాన్నిచిత్రిస్తుంది. ఇదంతా ఆతరువాత వచ్చిన సాయుధ పోరాట దశకు పూర్వపు స్థితి. బానిస భావజాల సంకెళ్లను, తటపటాయింపులను, సంకోచాలను తెంచి వేసుకుంటున్న దశ. స్పష్టమైన విప్లవ చైతన్యం పురుడు పోసుకుంటున్న దశ.

తన భూమిని దొరలు స్వాధీనం చేసుకోవటాన్ని ప్రతిఘటించి, పదకొండు సంవత్సరాల పాటు [ 1930 -జులై 1941 వరకు] కోర్టులో విసునూరు దేశముఖు రామచంద్రా రెడ్డి తో పోరాడి న్యాయమైన తన హక్కును సాధించి విజయం పొందటంతో సహించలేని భూస్వాములచే అప్పుడే హత్యకు గురైన ముస్లిం రైతు షేక్ బందగి చిరస్మరణీయమైన కథను అతని ఆరవ వర్ధంతి రోజున తలచుకుంటూ తెరతీస్తారు. బందగీ మరణం వేలాది మంది యువకుల్ని కదిలించింది. తమ హక్కుకోసం తిరగబడాలనే సోయి కలిగించింది. ఈ నాటకం అతని మరణాన్ని ప్రతిఘటనకు స్పూర్తిగా, పేదల మధ్య ఐక్యతకు చిహ్నంగా ప్రబోధిస్తుంది. తాము రైతు సంఘం నెలకొల్పుకొవాలని బందగీ సమాధివద్ద ఒక గ్రామ ప్రజలు తీసుకున్ననిర్ణయంతో నాటకం ఆరంభమవుతుంది.

నాటకంలో ఒక దృశ్యం

వీరారెడ్డి అనే చదువుకున్న అభ్యుదయ భావాల యువకుడు, అతని భార్య సీతమ్మ, చెల్లెలు కమల, పేద ముస్లిం రైతు కుటుంబాలు, గొల్ల ఎల్లమంద, వెట్టి రాముడు, వంటి బాధితులoదరిని సభ్యులుగా కలిపి ఒక సంఘం ఏర్పాటు చేస్తాడు. ఆ సంఘబలంతో దేశముఖు జగన్నాథ రెడ్డి దొర, అమీన్ సాబు, పోలీస్ పటేలు, పట్వారీ వెంకటరావు, వాళ్ల మోచేతుల కింద నీళ్ళు తాగే రౌడీ మస్తాన్, తదితర సిబ్బంది సాగిస్తున్నధాష్టీకానికీ, అన్యాయ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూ, వారి కుట్రలను విచ్చిన్నకర కార్యక్రమాలను వమ్ము చేస్తారు. ఆ పోరాట క్రమంలో వీరారెడ్డి భార్యసీతమ్మ, ముస్లిం కుటుంబాల పెద్ద దాదా లు కిరాతకమైన అమీన్ తుపాకి తూటాలకు బలై ప్రాణాలు కోల్పోతారు. వీరి సమాధుల దగ్గర సంఘ సభ్యులందరూ కూడి సంఘాన్ని విస్తృత పరచడం, భూస్వామ్య పునాదు లు కూలిపోయేవరకూ పోరాటం కొనసాగించి “మాభూమిని మేము తిరిగి సాధించుకుంటాము” అన్న ప్రతిజ్ఞ చేసి వ్యవసాయ విప్లవాన్నికొనసాగించటానికి పూనుకోవటంతో నాటకం ముగుస్తుంది.

బందగీ సమాధి ముందు సంకల్పం చెప్పుకున్ననాటికి వారు ఏదో చేయాలి, నిరంకుశ పాలన నుండి బయట పడాలి అనే కొరిక తప్ప మరేమీ లేని నిస్సహాయులు, ఆవేశపరులు కాగా, దాదా సమాధిముందు ప్రతిజ్ఞ చేసిన నాటికి వారు తాము ఏమి చేయాలో, ఎలా చేయాలో తెలుసుకున్న చైతన్య కారులు, పోరాట వీరులు. ఈ పరిణామ చరిత్రే మాభూమి నాటకం.

మా భూమి నాటకం అణచివేతకు వ్యతిరేకంగా సంఘటితం కావడానికి రైతులను, కార్మికులను ప్రేరేపించింది. ఈ నాటకం తెలుగు నాటకాన్నిఅప్పటికి ప్రధానంగా వున్న పౌరాణిక, వినోదం స్థాయి నుండి సామాజిక స్పృహతో కూడిన రాజకీయ అంశాల విశ్లేషణా ప్రదర్శన గా మార్చింది. ఇది వాస్తవికత, జానపద సంగీతం, ప్రజల పాటలు, ప్రజల భాషలను ప్రధాన స్రవంతి రంగస్థలం మీదకు బలీయమైన శక్తిగా తీసుకువచ్చింది. భూస్వామ్య వ్యతిరేక పోరాటం, సామూహిక ప్రతిఘటన, భూ సంస్కరణలు, సమానత్వం, లౌకికవాదం వంటి ఆదర్శాలను వేదిక మీదకు తెచ్చింది. తెలుగు సాంస్కృతిక ఉద్యమాలలో బలంగా ఉన్న మార్క్సిస్టు, అభ్యుదయ సాహిత్య ప్రభావాలను ప్రతిబింబిం చింది. కళను సామాజిక పోరాటంతో మిళితం చేసినందున మా భూమి ఒక మైలురాయిగా మిగిలిపోయింది. తెలంగాణ సాయుధ పోరాటానికి సాంస్కృతిక ఆయుధంగా మారింది. ఇది కేవలం నాటకం మాత్రమే కాదు, తెలంగాణలో అణచివేతకు గురైన రైతుల సాంస్కృతిక గొంతుకగా, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా జరిగిన ప్రతిఘటనకు శాశ్వత చిహ్నంగా మారింది.

1948 నాటి సమకాలీన నివేదికలు ఈ నాటక ప్రదర్శనల గురించి ఇలా చెబుతున్నాయి. నాటకం ఆడిన ప్రతి చోటా వేలాది మంది ప్రజలు హాజరయ్యేవారు. ఒక తిరుణాలలా వుండేది. ఉద్యమ ఉత్తేజంతో తిరిగి వెళ్ళేవారు. దాదాపు 125 ప్రదర్శక బృందాలు లక్షలాది మంది ప్రజల వద్దకు ఈ సందేశాన్ని తీసుకు వెళ్లాయి. ఇది చూసి భయపడ్డ నిజాం ప్రభుత్వం, ఈ నాటకం శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తుందని భావించింది. దాని తీవ్రమైన రాజకీయ ప్రభావం వల్లనూ, ప్రజల్లో అది కలిగించిన చైతన్యం కారణంగాను నిజాం ప్రభుత్వం లోను, బ్రిటిష్ పాలనా ప్రాంతంలోనూ మాభూమి నాటకం తీవ్ర అణచివేతకు గురైంది. భూస్వాముల అరాచకాలకు, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజా తిరుగుబాటును బలంగా సమర్ధిస్తున్నదని, ప్రజలను తిరుగుబాటుకు పురికొల్పుతున్నదని దీన్నినిషేధించారు. నాటక ప్రదర్శనలు జరిగే చోట పోలీసులు దాడులు చేయడం, నటులను అరెస్టు చేయడం జరిగేది. ప్రదర్శనలు జరగకుండా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిజాం ప్రభుత్వం ఈ నాటకాన్ని హైదరాబాద్ రాష్ట్రంలో 1947-48లో అధికారికంగా నిషేధించింది. కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా, ఆంధ్ర ప్రాంతంలో [అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలో] కూడా బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనిస్ట్ పార్టీ కార్యకలాపాలతో పాటు ఈ నాటక ప్రదర్శనలను అడ్డుకున్నారు. బెజవాడ గోపాల్ రెడ్డి మద్రాసు ప్రెసిడెన్సీలో ఆర్ధిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు స్వయంగా ఈ నాటకాన్ని 1948 మే నెలలో మద్రాసులోని రాజాజీ హాల్‌లో చూశారు. ప్రదర్శన తర్వాత దాని కళాత్మకతను బ్రహ్మాండంగా అభినందించి, తరువాత అది కమ్యూనిస్టు సిద్ధాంతాల ప్రచారమని చెప్పి నిషేధించారు

నిషేధాలు ఉన్నప్పటికీ, ప్రజానాట్యమండలి కళాకారులు రహస్యంగా గ్రామ గ్రామాన ఈ నాటకాన్ని ప్రదర్శించారు. అయితే పోరాటం జరుగుతున్న తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ ప్రదర్శనలు జరగలేదు. రహస్య స్థలాల్లో ప్రదర్శనలు కొనసాగించారు. సాయుధ పోరాట ప్రాంతాల్లో (నల్గొండ మొదలైన చోట్ల) గెరిల్లా రక్షణలో, రాత్రి సమయాల్లో ప్రదర్శించేవారు. ఆంధ్ర ప్రాంతాల లోనూ, పొరుగున వున్న తెలంగాణ లోని కొన్ని సరిహద్దు గ్రామాలలోనూ నాటకం ప్రదర్శించి కళాకారులు వెంటనే అక్కడి నుండి తప్పుకునే వారు. ప్రదర్శకులు కేవలం నటులుగా కాకుండా ప్రజాసంస్కృతికోద్యమ కార్యకర్తలుగా, ప్రజా ఉద్యమ సంఘీభావ మిత్రులుగా తమ కర్తవ్యం నిర్వహించారు. నిషేధం ఈ నాటక ప్రాచుర్యాన్ని తగ్గించకపోగా, అది ప్రజల్లో మరింత ఆవేశాన్నినింపింది. తెలంగాణ రైతాంగ పోరాట భావజాలాన్ని ప్రజలకు చేరవేయడంలో ఈ నాటకo ఒక ఆయుధం అయ్యింది.

డా. గరికపాటి రాజారావు నాయకత్వంలో ప్రజా నాట్యమండలి బృందాలు గ్రామాల నుంచి పట్టణాల వరకు తిరిగి వేలాది ప్రదర్శనలు ఇచ్చాయి.20 లక్షల మంది నాటకాన్ని చూశారని ఒక అంచనా వున్నది. “మాభూమి” విజయానికి రచయితలతో పాటు గరికపాటి రాజారావు దర్శకత్వం, నిర్వహణా ప్రతిభ కూడా ఒక ప్రధాన కారణంగా భావిస్తారు. కోగంటి గోపాలకృష్ణయ్య, కోడూరి అచ్చయ్య చౌదరి వంటి వారి శిక్షణ, నిర్వహణలో అనేక మంది కళాకారులు - వల్లo నరసింహారావు [వీరారెడ్డి గా] మాచినేని వేంకటేశ్వర రావు /మిక్కిలినేని [దాదా పాత్రలో] షేక్ నాజర్ [దేశముఖు గా] పెరుమాళ్ళు [ఎల్లమంద గా]- సుశిక్షితులై ఈ నాటకంలో పాల్గొన్నారు. వీరిలో చాలామంది తదుపరి కాలంలో సినీ కళాకారులుగా రాణ కెక్కారు.

ఇంత విఖ్యాతి పొందిన ఈ నాటకం తరువాతి రోజులలో అంతగా ప్రదర్శింప బడలేదు. గత ముప్పై సంవత్సరాలలో ఐదారు ప్రదర్శనలకు మించి ఈ నాటకం వేయలేదు. ఈ పరిస్థితిలో హైదరాబాదులోని “సమాహార” స్కూల్ ఆఫ్ డ్రామా వారు తమ శిక్షణా కార్యక్రమానికి ఈ నాటకాన్నిఎన్నుకుని దాదాపు అందరూ కొత్తవారితో ప్రశంసనీయమైన రీతిలో ప్రదర్శించారు. మాభూమి ప్రదర్శన అందులో పాల్గొన్న కళాకారులందరికీ తొలి ప్రదర్శన అని ప్రకటించారు. సమాహార స్కూల్ ఆఫ్ డ్రామా 2004లో హైదరాబాద్‌లో రత్న శేఖర్ రెడ్డి (నటుడు, దర్శకుడు) అంజలి పార్వతి కోడ (నాటక రచయిత్రి) చేత స్థాపించబడింది. ఇది హైదరాబాద్‌లో అత్యంత చురుకుగా వున్న థియేటర్ గ్రూప్‌లలో ఒకటి. వీకెండ్ వర్క్‌షాపులు, యాక్టింగ్ కోర్సులు, నాటక ప్రదర్శనలు, నాటకోత్సవాలు నిర్వహిస్తుంది. రత్నశేఖర్ రెడ్డి లీ స్ట్రాస్ బర్గ్ థియేటర్ (న్యూయార్క్) నుంచి శిక్షణ పొందిన కళాకారుడు. ఆయన సమాహార యాక్టింగ్ స్కూల్‌ లో ప్రధాన శిక్షకునిగా ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషల్లో వివిధ నాటకాలు తయారు చేశారు, అనేక ముఖ్య పాత్రలలో నటించారు. వారి నాటకాలు కోర్ట్ మార్షల్ (స్వదేశ్ దీపక్ రచన, హిందీ) పురుషోత్తo (అంజలి పార్వతి కోడ రచన) ద లాస్ట్ విశ్ బేబీ, గ్రిగర్ సాంసా (ఫ్రాంజ్ కాఫ్కా మెటామార్ఫోసిస్ నాటకీకరణ) చాలా ప్రాచుర్యం పొందాయి. ప్రముఖ రచయితలు ఆస్కార్ వైల్డ్, ఆంటన్ చెఖవ్, షేక్స్‌పియర్ రచనలు కొన్నిటిని నాటకాలుగా హైదరాబాద్ ప్రేక్షకులుకు ఆయన అందించారు. ఊరుభoగం, ప్రాణం ఖరీదు, నాగమండల వంటి అనేక తెలుగు నాటకాలు రూపొందించారు. ఆధునిక నాటకరంగంలో ఒక ప్రముఖ స్థానం సంపాదించుకున్నఈ సంస్థ మాభూమిని ఎన్నుకోవటం ఒక విశేషం. ఈ నాటకానికి వీళ్ళు ఏ కొత్త వన్నెలు దిద్దుతారో, ప్రదర్శనలో ఏకొత్త సాంకేతికతను ఉపయోగిస్తారో అనే ఆసక్తి కలిగింది. రంగస్థల అమరికలో, దృశ్య నిర్మాణంలో కొద్దిపాటి ప్రతీకాత్మకత ను ప్రవేశపెట్టారు తప్ప నాటకoలో చెప్పుకోదగ్గ మార్పులేమీ చేయలేదు. యధామాతృకగా ప్రదర్శించారు. గతంలో ఈ నాటకం మీద వున్న కొన్ని విమర్శలను, లోపాలని చెప్పుకున్నవాటిని కూడా సరి చేసే ప్రయత్నం చేయలేదు.

ముఖ్యంగా కథ అంతా తెలంగాణ గ్రామo లో జరిగేదె అయినా కథనం లో ఆ వాతావరణ ప్రభావం అంతగా కానరా దు. అలాగే వివిధ పాత్రలు పలికే సంభాషణల లో స్థానికీయత, మాండలిక యాసా భేదాలు, నిర్దుష్టంగా లేవు. అలాగే ముస్లిం పాత్రలకు కూడా ఒక వూరికి చెందిన ప్రామాణికత లేదు. ఇది మూల నాటకంలోనే వున్నది, రచయిత లు కథా ప్రాంతానికి చెందినవారు కాకపోవటం, ప్రాంత సంస్కృతిపట్ల అంతగా పట్టు లేకపోవడం దీని కారణం కావొచ్చు. ఆనాటికి అదే ముందడుగు కావొచ్చు కానీ భాషా స్పృహ, సాంస్కృతిక సూక్ష్మ అంశాల పట్ల శ్రద్ధ పెరిగిన తరువాత కొద్ది మార్పులు చేసి మరింత సహజంగా ప్రదర్శించే అవకాశం వున్నది. అలాగే కొందరు పాత్రధారులు ఒకే మూడ్ లో వుండిపోయారు. ఒకే రకమైన ఆవేశం ప్రదర్శించటం తో, సన్నివేశానుగుణంగా సంక్లిష్ట భావనలు వెలికి రాలేదు. సంభాషణలు పలకటంలో వైవిధ్యం [ నాటకీయత కాదు] కాస్త కొరవడింది. అయినప్పటికీ మొదటిసారి ఇంత మంచి నాటకం ద్వారా రంగ ప్రవేశం చేసిన అందరికీ, చక్కటి టీమ్ వర్క్ తో ఉన్నత స్థాయి ప్రదర్శన ఇచ్చిన ఈ బృందాని కి అభినందనలు చెప్పాలి. ప్రదర్శన పటాటోపo తక్కువగానే వుంది కనుక ఒక్క హైదరాబాద్ లోనే కాక ఇతర పట్టణాలలో కూడా దీన్ని సులభంగా ప్రదర్శించే వీలు వున్నది. అలాజరిగితే ఈనాటకం చారిత్రిక ప్రాధాన్యతను గుర్తు చేయటమే కాక ప్రస్తుత ప్రాసంగీకత కూడా అవగతం అవుతుంది.

చాలా కృషితో, చారిత్రక నిజాయితీతో, ప్రజాకళల పట్ల గౌరవంతో మరో సారి మాభూమిని ఈ తరానికి పరిచయం చేసిన సమాహార బృందానికి హృదయ పూర్వక అభినందనలు. అంతే కాదు ప్రేక్షకులలో 95% ముప్పై ఏళ్ల లోపు వారు వుండటం, వారు ప్రదర్శన ఆద్యంతం ఆసక్తిగా వీక్షించడం చాలా ఆనoదాన్ని, యువతరం పట్ల, భవిష్యత్తు పట్ల విశ్వాసాన్ని కలిగించింది.



Read More
Next Story