
గుజరాత్ యూనివర్శిటీ పాఠాల్లో ‘మోదీ తత్వం’
సోషియాలజీ పాఠాల్లోకి ఎక్కిన మోదీ ఫిలాసఫీ
సామాజిక శాస్త్ర ఆలోచన విధానం ప్రధానంగా పాశ్చాత్య దేశాలలో, పందొమ్మిదవ శతాబ్దంలో యూరప్‌లో జరిగిన విస్తృత సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిణామాల నేపథ్యంలో అభివృద్ధి చెందింది. పారిశ్రామీకరణ, పట్టణీకరణ, పెట్టుబడిదారీ వ్యవస్థ విస్తరణతో పాటు ఫ్రెంచ్ రెవల్యూషన్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వంటి చారిత్రక సంఘటనలు ఆధునిక సమాజ నిర్మాణాన్ని గణనీయంగా ప్రభావితం చేసినప్పుడు పాశ్చాత్య దేశాలలోని సామాజిక, శాస్త్రవేత్తలు ఆధునిక సమాజ స్వభావం, వర్గ విరోధాలు, సామాజిక క్రమం, బ్యూరోక్రసీ, మతం, హేతుబద్ధత వంటి అంశాలను లోతుగా విశ్లేషించారు. ఈ నేపథ్యంలో పాశ్చాత్య సామాజిక శాస్త్రం ప్రధానంగా ఆధునికత, వ్యక్తివాదం, శాస్త్రీయ హేతువాదం, సంస్థాగత నిర్మాణాల అధ్యయనం వంటి ప్రధాన అంశాలపై దృష్టి సారించింది. సమాజాన్ని శాస్త్రీయంగా అర్థం చేసుకోవడానికి అనుభవాధారిత పరిశోధన, సార్వత్రిక సిద్ధాంత నిర్మాణం ప్రధాన లక్షణాలుగా ఉండాలని పేర్కొన్నారు.
ఇక భారతదేశంలో సామాజిక శాస్త్ర ఆలోచన పూర్తిగా భిన్నమైన చారిత్రక-సామాజిక పరిస్థితుల నేపథ్యంలో రూపుదిద్దుకుంది. వలసపాలన అనుభవం, కులవ్యవస్థ, మత వైవిధ్యం, గ్రామీణ సామాజిక నిర్మాణం, జాతీయ విమోచన ఉద్యమం వంటి అంశాలు భారతీయ సామాజిక శాస్త్ర అభివృద్ధిని ప్రభావితం చేశాయి. పాశ్చాత్య సామాజిక శాస్త్రం పారిశ్రామిక ఆధునికతపై దృష్టి పెట్టగా, భారతీయ సామాజిక శాస్త్రం కులం, గ్రామీణ సమాజం, బంధుత్వ వ్యవస్థ, మతం, సామాజిక అసమానతలు, సామాజిక మార్పులు వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టింది. ఇక్కడ అధ్యయనాలు చేసిన సామాజిక శాస్త్ర వేత్తలు భారతీయ సమాజాన్ని స్వదేశీ దృక్కోణంతో విశ్లేషించారు. ముఖ్యంగా భారతీయ సామాజిక శాస్త్ర ఆలోచనలలో సామాజిక న్యాయం, కుల అణచివేత, ప్రజాస్వామ్యం, అభివృద్ధి, అసమానతలపై విమర్శనాత్మక విశ్లేషణకు ప్రాధాన్యం ఇచ్చారు.
ఇలాంటి విస్తృత సామాజిక శాస్త్ర సంప్రదాయాల నేపథ్యంలోనే బరోడాలోని మహారాజ సాయాజిరావు విశ్వవిద్యాలయం సామాజిక శాస్త్రాల్లో “మోదీ తత్వం” అనే పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టడం అకడమిక్ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది. దీనిని మనం కేవలం ఒక కొత్త కోర్సు ప్రవేశంగా మాత్రమే చూడకుండా, జ్ఞానం, రాజకీయ అధికారం, విద్యా స్వాతంత్ర్యం మధ్య ఉన్న సంబంధాలపై మౌలిక ప్రశ్నలను విమర్శనాత్మకంగా చర్చించాల్సిన అవసరం ఉంది. సాధారణంగా సామాజిక శాస్త్రాల లక్ష్యం విభిన్న దృక్కోణాల మధ్య విమర్శనాత్మక ఆలోచనను, సంభాషణను ప్రోత్సహించడం. అయితే ఒక రాజకీయ నాయకుడి ఆలోచనలను “తత్వం”గా పాఠ్యాంశంలో కేంద్రీకరించడం అనేది జ్ఞాన నిర్మాణాన్ని విచారణాత్మక సమతుల్యత లేని దిశలో నడిపించే ప్రమాదాన్ని సూచిస్తోంది. ఇలాంటి పరిణామాల నేపధ్యంలో విశ్వవిద్యాలయాల పాత్ర, వాటి మేధో స్వాతంత్ర్యం, అలాగే విద్యా వ్యవస్థలో రాజకీయ ప్రభావాల స్వభావంపై కూడా విసృతంగా చర్చ జరగాలి.
ఇక్కడ మనం సామాజిక శాస్త్రంలోని జ్ఞానం-అధికార సంబంధ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటే- జ్ఞానం, అధికారము పరస్పరం అనుసంధానమై ఉంటాయి- అంటే అధికార వ్యవస్థలు జ్ఞానాన్ని ఉత్పత్తి చేస్తే, జ్ఞానం తిరిగి అధికారాన్ని న్యాయబద్ధం చేస్తుంది. ఈ కోణంలో “మోదీ తత్వం”ను పరిశీలిస్తే, ఒక రాజకీయ దృక్కోణాన్ని పాఠ్యాంశంగా తీసుకురావడం కేవలం బోధన వరకు మాత్రమే పరిమితం కాదు. అది పరిశోధనలను, అకడమిక్ చర్చల స్వరూపాన్ని, విద్యార్థుల ఆలోచనా విధానాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఫలితంగా విశ్వవిద్యాలయాలు విమర్శనాత్మక వేదికలుగా కాకుండా అధికార పార్టీల, ప్రభుత్వాల సిద్ధాంతాలను పునరుత్పత్తి చేసే యంత్రాంగాలుగా మారే ప్రమాదం ఉంటుంది.
అదే విధంగా “కరిస్మాటిక్ అథారిటీ” భావనను కూడా ఈ సందర్భంలో అవగతం చేసుకోవచ్చు. ఈ భావన ప్రకారం కరిస్మాటిక్ నాయకత్వం వ్యక్తిత్వ ఆకర్షణ, అనుచరుల విశ్వాసం, అసాధారణ నాయకత్వ ప్రతిభ వంటి అంశాలపై ఆధారపడుతుంది. సాధారణంగా ఇది చారిత్రక లేదా రాజకీయ సంక్షోభ పరిస్థితుల్లో సహజంగా ఉద్భవిస్తుంది. అయితే అదే కరిస్మాను విద్యా వ్యవస్థలో పాఠ్యాంశంగా ప్రవేశపెట్టినప్పుడు, అది విమర్శనాత్మక అధ్యయనం కంటే ఆరాధనాత్మక బోధనగా మారే అవకాశం ఉంది. దాంతో విద్యార్థులు విశ్లేషణాత్మక అధ్యయనం కంటే వ్యక్తి-కేంద్రీకృత అనుసరణ వైపు వెళ్లే ప్రమాదం ఉంది.
అలాగే “కల్చరల్ హేజిమనీ” అనే సిద్ధాంతం ద్వారా కూడా “మోదీ తత్వం” పాఠ్యాంశాలుగా చేర్చే పరిణామాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. దీని ప్రకారం పాలక వర్గం కేవలం బలప్రయోగంతోనే కాదు; విద్య, సంస్కృతి, మీడియా వంటి సాధనాల ద్వారా తన ఆధిపత్యాన్ని “సహజం”గా, “సాధారణం”గా స్థిరపరుస్తుంది. ఈ నేపథ్యంలో ఒక నాయకుడి ఆలోచనలను “తత్వం”గా పాఠ్యాంశంలో చేర్చడం అనేది వాటిని క్రమంగా “కామన్ సెన్స్”గా మార్చే ప్రక్రియగా కనిపిస్తుంది. ఫలితంగా విద్యార్థులు తమ ఆలోచనలను ప్రశ్నించకుండానే వాటిని స్వీకరించే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ జ్ఞానం విమర్శనాత్మక విచారణ సాధనంగా కాకుండా ఆధిపత్య భావజాలాన్ని పునరుత్పత్తి చేసే సాధనంగా మారుతుంది.
వాస్తవానికి విశ్వవిద్యాలయం అనేది “స్వతంత్ర అకడమిక్ ఫీల్డ్”గా పనిచేయాలి. అక్కడ జ్ఞాన ఉత్పత్తి అకడమిక్ ప్రమాణాలు, పరిశోధనా నైతికత, విమర్శనాత్మక సంభాషణల ఆధారంగా జరగాలి. కానీ విద్యా, పరిశోధనలో రాజకీయ జోక్యం పెరిగినప్పుడు అకడమిక్ స్వతంత్రత క్రమంగా బలహీనపడుతుంది. అకడమిక్ కేపిటల్ స్థానంలో రాజకీయ కేపిటల్ ప్రభావం పెరిగి, ఇది కేవలం పాఠ్యాంశ మార్పుకే పరిమితం కాకుండా మొత్తం విద్యా వ్యవస్థ స్వరూపాన్నే ప్రభావితం చేసే అవకాశం ఉంది.
ప్రజాస్వామ్య సమాజంలో విద్యాసంస్థలు విభిన్న అభిప్రాయాలు, ప్రత్యామ్నాయ సిద్ధాంతాలు, విమర్శనాత్మక చర్చలకు వేదికలుగా ఉండాలి. కానీ ఒకే తత్వాన్ని కేంద్రీకరించే ధోరణి పెరిగితే ఆ విభిన్నత క్రమంగా సంకుచితం అవుతుంది. ఫలితంగా ప్రత్యామ్నాయ స్వరాలు అణిగిపోయి విమర్శనాత్మక ఆలోచన దోరణి కూడా బలహీనపడుతుంది. దీర్ఘకాలంలో ఇది ప్రజాస్వామ్య సంస్కృతిపైనే ప్రభావం చూపుతుంది.
అకడమిక్ ప్రమాణాల పరంగా చూసిన ఏదేని సిద్ధాంతం విమర్శలకు తెరచి ఉంటూ అనుభవాధారిత ఆధారాలతో నిలబడాలి. అదేవిధంగా జ్ఞాన నిర్మాణానికి సంబంధించిన సామూహికత, విశ్వవ్యాప్తత, స్వార్థరహితత్వం, వ్యవస్థీకృత సందేహవాదం వంటి ప్రామాణిక ప్రమాణాలు కలిగి ఉండాలి; అవి నిరంతరం ప్రశ్నించబడాలి, పరీక్షించబడాలి, పునర్మూల్యాంకనం చేయబడాలి. అయితే ఇక్కడ “మోదీ తత్వం” విషయంలో విమర్శనాత్మక పరిశీలన కంటే అనుకూలతకు ప్రాధాన్యం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అయితే దీనిని ప్రత్యామ్నాయ అకడమిక్ విధానంలో చూడవచ్చు. అంటే “మోదీ తత్వం”గా కాకుండా “మోదీ పాలన”ను ఒక అనుభవాధారిత కేస్ స్టడీగా బోధించవచ్చు. అదే సమయంలో మోదీతో పాటు ఇతర రాజకీయ నాయకుల విధానాలను తులనాత్మకంగా విశ్లేషిస్తూ, మార్క్సిజం, లిబరలిజం, పోస్ట్-కాలనియలిజం వంటి విభిన్న సిద్ధాంతాల కోణంలో పరిశీలిస్తే విద్యార్థులకు విస్తృత అవగాహన లభిస్తుంది. ఇది సమాచార స్వీకరణ మాత్రమే కాకుండా విమర్శనాత్మక ఆలోచనను, తులనాత్మక విశ్లేషణ సామర్థ్యాన్ని కూడా పెంపొందిస్తుంది. అంతేకాకుండా ఇది విశ్వవిద్యాలయాలను ప్రజాస్వామ్య మేధో వేదికలుగా నిలబెట్టడంలో సహాయపడుతుంది.
మొత్తానికి “మోదీ తత్వం” పాఠ్యాంశ ప్రవేశం అనేది సాధారణ విద్యా మార్పు కాదు. ఇది జ్ఞానం, రాజకీయ అధికారం, సిద్ధాంతీకరణ మధ్య ఉన్న సంక్లిష్ట సంబంధాన్ని స్పష్టంగా బయటపెడుతోంది. సామాజిక సిద్ధాంతాల దృష్టిలో చూస్తే, ఇది అకడమిక్ స్వేచ్ఛను విస్తరించే చర్య కంటే రాజకీయ-సాంస్కృతిక ఆధిపత్యాన్ని బలోపేతం చేసే ప్రయత్నంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో భారతీయ విశ్వవిద్యాలయాల భవిష్యత్తు, వాటి స్వతంత్రత, విమర్శనాత్మక పాత్ర, ప్రజాస్వామ్య బాధ్యతలపై మరింత విస్తృతమైన చర్చ అవసరం.

