నీ రాత్రి ఎక్కడుందో చెప్పు!
x
Source: artesty

నీ రాత్రి ఎక్కడుందో చెప్పు!

గీతాంజలి ‘నేటి మేటి కవిత’


రాత్రిని

నేను చాలా శ్రద్ధగా
కొంత వెన్నెలా కొన్ని పాటల దారాలు కలిపి
రజాయి కుట్టుకుంటాను!
అందులో నువ్వు పంపిన రాగాలను
రత్న ఖచిత,వజ్ర వైడూర్యాల్లా పొదువు కుంటాను!
రజాయిని కప్పుకుంటానా,నిలువెల్లా కమ్ముకుంటావు నువ్వు!
**
నీ రాత్రిని కాస్త నాకివ్వు కవీ !
నీ రాత్రిని ఊరి చెరువులో
వెన్నెల తాగి విచ్చుకోబోతున్న
కలువ పువ్వులా మార్చుకుంటాను!
నీ రాత్రిని కాలువలా
నా పంట వైపుకు మలుపుకుంటాను!
నీ రాత్రిని నా ఇంటికి వచ్చే వీధిలోకి
గుర్రపు బగ్గీలా తిప్పుకుంటాను!
నా తోటలోని ప్రతీ పువ్వుకీ
నీ రాత్రి నుంచి ఇంత చీకటి రంగుని
దొంగలించి కాటుక అద్దుతాను!
నీ రాత్రిని
మార్మిక రహస్యాలను గుసగుస లాడే
చిక్కని అడవిలా పెంచుకుంటాను!
ఓహ్!నీ రాత్రిని నాకు దొరకనీ !
కాబా అత్తరు చిలికి
పరిమళ భరితం చేసుకుంటాను!
ఇవ్వ రాదూ నీ రాత్రిని?
**
చూడు!
నీ రాత్రి కావాలి నాకు!
నా రాత్రితో, నీ రాత్రిని కౌగిలిస్తాను!
సూర్యుడు రాకుండా
తూరుపు తలుపులు మూసేస్తాను!
రాత్రిని తెల్లారనీయకుండా
వేయి చంద్రులను ఆకాశంలో వదులుతాను!
రాత్రిని నిద్రపుచ్చడానికి
హిందోళ రాగాన్ని ఎత్తుకుంటాను.
నా రాత్రిలో నువ్వుంటావేమోనన్న
ఆశతో కలలోనో,మెలకువ లోనో
నిద్రా జాగ్రదావస్థల్లో ఊగిసలాడుతూ
తపస్సు చేస్తాను!
రాత్రి కొస దాకా నిరీక్షణ దీపాన్ని
వెలిగించి చూడు కాలిపోతానలా!
**
అవును!
రాత్రి ముగిసిపోయే లోపల
మన ఏకాంతాలని గజల్స్ లోకి వంపేస్తాను!
దొరికీ దొరకని పదాలని బ్రతిమిలాడుకుని
కొన్ని విరిగిన కవితల్ని అతికించుకుంటాను!
కవిత్వంలో కాదు కానీ కవిత్వం రాసేశాక
నా మురిపెంలోనో, కన్నీటిలోనో
కొంచెం దొరుకుతావు నువ్వు!
అప్పుడు
నీ స్మృతుల నుంచి పుట్టిన కవిత్వాన్ని
ప్రేమగా ముద్దు పెట్టుకుని నిదుర పుచ్చుతాను!
*
ముక్కలు ముక్కలుగా పట్టి వదిలిన
నిదుర తరువాతి, మెలకువలో
కలలు చూపించిన కథల్ని డైరీలో రాసుకుంటాను.
కథల్లో నువ్వే నా కథానాయకుడివి!
నా కలల్లోని ముషాయిరాల్లో నువ్వే నా షాయర్ వి!
నా గాన కచేరీల్లో
కోయిలలని ఎగరగొట్టి నీతో పాడించుకుంటాను!
నువ్వు నా గాయకుడివి!
నువ్వు నా గుండెల మీద
ఆనుకుని వెచ్చబడే వయొలిన్ వి!
*
కలా,మెలకువా రెంటిలోనూ
దొరకని నిన్ను భ్రమల్లో ఊహించుకుంటాను!
వేసవి రాత్రిని నేను మల్లెల దారాలతో
నయగారం చెడకుండా,
పరిమళం చెదరకుండా
సున్నితంగా శాలువగా పేనుతాను!
నీకు నిదుర పట్టనివ్వని నీ రాత్రికి,
నీకూ కప్పి పోతాను!
**
అది సరే గానీ,
నా రాత్రిలోకి నిదుర పట్టనివ్వని
ఏ రాగం వొంపిపోయావో కాస్త చెప్పు!
పోనీ నీ రాత్రి ఎక్కడుందో కాస్త జాడ చెప్పు!
నువ్వు చదివే పుస్తకంలో ఉందా?
నువ్వు సన్నగా పాడుకునే పాటలో ఉందా?
పైకి తొనకనివ్వని కన్నీటిలో ఉందా?
నీ రాత్రే నీ ఏకాంత తావుగా మారిపోయిందా?
కలవలేని ప్రేమికుల కన్నులలో
నిదుర రాని తనమైందా నీ రాత్రి?
ఎటు తప్పిపోయిందో నీ రాత్రి,
ఏమైందో చెప్పు!
*
నాకు తెలుసు!
నీ రాత్రేమీ మధువు తాగి మత్తెక్కి నిదుర పోదు!
వియోగ దుఃఖాన్ని వెక్కిళ్లు పెడుతుంటుంది!
దిగులు మొఖాన్ని,గలీబులో దాచుకుంటుంది!
*
సరేలే!
నీ రాత్రిలోకి నేను రావాలంటే దారి దొరకాలిగా చెప్పు!
పోనీ,
నా రాత్రిలో దాక్కుందా నీ రాత్రి? పోనీ అదైనా చెప్పు!
నీ రాత్రి లోని చంద్రుడికి
నీ మీద చాడీలు చెప్పి మరీ పోతాను!
ఎక్కడ పోగొట్టుకున్నావోయీ నీ రాత్రిని?
పోనీ నీలా తప్పిపోయిన ఆ బాటసారికన్నా చెప్పు!
**
చూడు!
నీ రాత్రిని వెంబడించే రాత్రిని నేను!
ఎటు పోతావోయి నన్ను విడిచి?


Read More
Next Story