నిరంతర యాత్రికుడు: జీవితం, జ్ఞానం, ఆత్మాన్వేషణ కథ
x

నిరంతర యాత్రికుడు: జీవితం, జ్ఞానం, ఆత్మాన్వేషణ కథ

ఉపాధ్యాయుడి జీవితం, యాత్రలు, పరిశోధన, ఆధ్యాత్మిక అనుభవాలను కలిపిన మూర్తి కె.వి.వి.యస్ ఆత్మకథాత్మక నవల 'నిరంతర యాత్రికుడు'.

యాభై ఎనిమిదేళ్ళ జీవితం. ఆంధ్ర, ఆంగ్ల సాహిత్యంతో గట్టి పరిచయం, కథలు, కవితలు, వ్యాసాలు, పుస్తక సమీక్షలు చేసిన అనుభవం. “గాడ్ ఫాదర్”, “ది వర్జిన్ అండ్ ది జిప్సీ”, “ది ఓల్డ్ మాన్ అండ్ ది సీ” లాంటి ఆంగ్ల నవలలను తెలుగు చేసిన అనువాద కృషి ఇంకా ఎన్నో సాహిత్య కార్యక్రమాలతో పెనవేసుకున్న వైనం!! ఒక ఏకాంత సమయాన ధ్యానం ముగించి విశ్రాంతి తీసుకుంటున్న ఆ క్షణంలో తన ప్రమేయం లేకుండా తన జీవిత జ్ఞాపకాలన్నీ కుప్పలుగా మనసు లోగిలిలో రాలుతుంటే పరవాలేదు జీవితం సఫలమైయిందన్న ఒక మధుర వీచిక! మరు క్షణంలోనే తాకిన మరో మధుర భావన - ఈ జ్ఞాపాలను ఆత్మ కథ గా గుదిగుచ్చి తీర్చి దిద్దితే ఎలా ఉంటుందోనని – వేరేవరికోసమో కాదు, తన కోసం తన తృప్తి కోసం!! ఇంతలోనే ఇంకో తీయని ఆలోచనా వీచిక.. ఆత్మ కథగా రాయడం కన్నా ఒక కాల్పానిక రచనగా ఒక నవలిక గా తీర్చి దిద్దాలని! ఇంత వరకు సాహిత్య ప్రక్రియలన్నింటిలో తాను చేయి పెట్టనిది నవలా రచన. అలా మొదలైనది రచయత మూర్తి కె.వి.వి.యస్ గారి ఆత్మ కథాత్మక నవలా సౌధపు నిర్మాణం. ఇది “నిరంతర యాత్రికుడు” నవలగా రూపుదిద్దుకొని మన ముందుకు వచ్చింది.

ఉత్తమ పురుషలో సాగే ఈ కధనంలో కధకుడిది భద్రాచలంలోని ఒక పేద మధ్యతరగతి కుటుంబము. డిగ్రీ, బి.ఇ.డి పూర్తి చేస్తారు. గ్రంధాలయాలకు వెళ్ళి పుస్తకాలు చదివే అలవాటు ఉంది. ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా ఎంప్లాయిమెంట్ న్యూస్, కాంపిటీషన్ సక్సెస్స్ రివ్యూ లాంటి పత్రికలను నిత్యం చదవడం. వాటిలో ఐ.ఏ.ఎస్. టాపర్ల ఇంటర్వ్యూలు ఎంతో స్ఫూర్తి దాయకంగా ఉంటాయి. కష్టపడితే తనూ ఐ.ఏ.ఎస్. కొట్టగలనని ఒక ధీమా వస్తుంది. ఈలోగా సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా దగ్గరలోనే ఒక గ్రామంలో నియామకం జరుగుతుంది. అక్కడ అప్పటికే విధులలో ఉన్న సీనియర్ ఉపాధ్యాయుడు రాబర్ట్ గారి అపూర్వ ఆదరణ, అతడు అందించిన శాస్త్రీయ జ్ఞానము, లోకం పోకడ ముఖ్యంగా గ్రామీణ రాజకీయాలు, గ్రామీణులతో మెసిలే విధానము ఇట్లాంటివన్నీ కధకుడికి సుభోదకంగా అర్ధమవుతాయి. అయితే సివిల్స్ కొట్టాలనే కల ఇంకా మిగిలే ఉంది.

వైజాగ్ వెళ్ళి సివిల్స్ ప్రిలిమ్స్ తీసుకుంటాడు. ఫలితము ప్రతికూలంగా వస్తుంది. ఇక్కడ కధకుడు ఒక మాట చెబుతాడు, “సివిల్స్ పరీక్షా ఫలితం ఎలా ఉన్నా ఈ పరీక్షకు ప్రిపేర్ అయ్యే క్రమంలో ఎన్నో పుస్తకాలతో పరిచయం కలుగుతుంది. ఇంకా లోలోతులోకి వెళ్ళి జ్ఞానాన్ని తవ్వి చూడాలనే జిజ్ఞాస పెరుగుతుంది”. కధకుని లోని ఈ అధ్యయన శీలత్వము లోకయాత్ర చెయ్యాలనే కోరికకు బీజం వేస్తుంది. ఇక సివిల్స్ ని పక్కన పెట్టి దసరా, వేసవి సెలవులలో దేశాటన. మద్రాసు, బొంబాయి, బెంగుళూరు, మైసూరు, కేరళ, కలకత్తా, పూరి, భువనేశ్వర్, శ్రీలంక లాంటి ప్రదేశాలను తనివితీరా తిరగడం, సామాజిక సాంస్కృతిక వైవిధ్యాలను పరిశీలించి వాటిని నోట్ చేసుకోవడం. కధనంలో భాగంగా ఈ పర్యటనా విశేషాలు యిమిడి ఉంటూ మన పఠనాసక్తిని పెంచుతూ పోతుంటాయి తప్ప వీటిని కావాలని కధనంలో చొప్పించి నట్టుగా ఎక్కడా అనిపించదు.

ఈ క్రమంలో ఇదొక ఆత్మకధాత్మక నవల అన్న విషయాన్ని కాసేపు మరిచిపోయి మనం ఒక యాత్రా సాహిత్యాన్ని చదువుతున్న సంతోషకరమైన అనుభూతికి లోనౌతము. కేరళా ప్రయాణం గురించి చెబుతూ రైలు బండిలో మిగిలిన వాటి కంటే పుస్తకాలమ్మే కుర్రాళ్ళే ఎక్కువగా తనకు తారసపడ్డారని దేశంలో ఎక్కడా లేని ఈ ప్రత్యేకత ఒక్క కేరళా లోనే కనిపించిందని ఆశ్చర్యపోతూ చెబుతుంటే కధకుని తో పాటు మనం కూడా అబ్బుర పడతాం!! పదిమంది తో చేసే ప్రయాణాలు కంటే ఒంటరి ప్రయాణాలే చాలా ప్రణాళికా బద్దంగా, సాహసవంతం గా ఉండి ఎంతో ఆనందాన్ని ఆత్మ విశ్వాసాన్ని ఇస్తుంటాయని కధకుని అనుభవము. యాత్రా ప్రేమికులు ఆలోచించాల్సిన విషయమిది.

ఒక సారి భద్రాచలం తీరాన ఒక స్విజ్జర్లాండ్ వ్యక్తీ తారస పడతాడు. అతనితో మాటలు కలుస్తాయి. ఇతనిని ఇంకో మిత్రునికి పరిచయం చేస్తాడు. వారిరువురు ప్రపంచ సంగీత రీతుల గురించి లోతుగా ముచ్చటించు కుంటుంటే ఆ జ్ఞాన ప్రవాహంలో మనమూ వోలలాడుతాము. పక్క రాష్ట్రాలలోకి వెళ్ళడానికే మనం భయపడుతుంటాం కదా అలాంటిది దేశదేశాలు తిరుగుతూ భిన్న ప్రజా సమూహాలను కలిసి చూడటం వెనక గల ఐరోపీయుల ధైర్య సాహసాలు అలోచింప జేస్తాయంటూ కధకుడు ఒక టోన్ లో చెబుతుంటే నిజమే కదా అని మనం కూడా కళ్ళు తెరుచుకుంటాము. ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తొలి రోజులలో జ్ఞాన పిపాసి, నాస్తికుడు అయిన ఒక వి.ఆర్.ఓ. తో పరిచయం కలుగుతుంది వారింట్లో లెనిన్, స్టాలిన్ లాంటి వాళ్ళ చిత్ర పటాలు ఉంటాయి.

ఈ వి.ఆర్.ఓ. గారి ద్వార దుమ్ముగూడెం లో ఉన్న కట్టా సుబ్బారావు గారి స్నేహం కధకునికి లభిస్తుంది. దుమ్ముగూడెం లోని ఏనాటివో బ్రిటిష్ వారి పాడు పడిన బంగళాలు, సమాధులు గురించి విని ఉన్న కధకుడు మరింత సమాచారం కోసం సుబ్బారావు గారిని ఆశ్రయిస్తే ఆతను వాటి గురించి విలువైన సమాచారం ఇవ్వడమే గాక ఇద్దరు కలిసి ఆ భవంతులు, సమాధులను చూసి వస్తారు కూడా. సుబ్బారావు గారు తన ఇంట్లో ఉన్న దశాబ్దాల క్రితం నాటి పుస్తకాలు, రిపోర్ట్లు, సర్వేలు చదవమని యిస్తారు. వీటిలో దుమ్ముగూడెం పరిసర ప్రాంతాలలోని భూములు, గ్రామాలు, ప్రజలు, వృత్తులు ఇంకా ఈ ప్రాంతాన్ని ఏలిన రెవిన్యూ సబ్ కలెక్టర్, ఇతర బ్రిటిష్ అధికారుల వివరాలన్నీ చదివి మరింత లోతైన పరిశోధన చేస్తాడు కధకుడు. తదుపరి తను రాసిన వ్యాసము, ఫోటోలు పత్రికలలో రావడంతో దుమ్ముగూడెం చారిత్రిక కట్టడాలు, సమాధుల చరిత్ర ఎందరికో తెలుస్తుంది. ఎంతో మంది సందర్శకులు వెళ్ళి వస్తుంటారు. అట్లాంటి వారిలో జీవన్ ఒకడు.

సామాజిక స్పృహ కలిగిన యువకుడిగా జీవన్ కధకుని మనసుని దోచుకుంటాడు. అదలా ఉంచితే ఈ నవలికలో కధకునికి ఎదురైన అతీంద్రియ అనుభవ ఘట్టాలు అపూర్వమైనవిగా నిలుస్తాయి. ఒక రోజు ఉదయం ఇంట్లో కిటికీ ముందర కుర్చీలో కూర్చొని ఉన్న కధకునికి బయట ఎదో మానవ రూపము మెదులు తున్నట్టు అనిపిస్తుంది. తలుపు తీసి చూస్తారు. ఎవరు ఉండరక్కడ! ఇంకొకసారి ఇంట్లోనే ఉన్నప్పుడు తన హైస్కూల్ మిత్రుడు తలపుకి వస్తాడు. కాసేపటికి తలుపుకొట్టిన చప్పుడు వస్తుంది. తలుపు తీయగా “హలో” అంటూ ఆ మిత్రుడు ప్రత్యక్షం అవుతాడు. ఇలాంటివి ఇంకా కధకుని జీవితంలో చాలా జరుగుతుంటాయి. వీటికి సమాధానం దొరకదు. ఆందోళన, ఒత్తిడి, అశాంతి, నిద్ర పట్టదు. ఏమిటిదంతా అని తనలో తానె కుమిలిపోతూ ఆత్మ విశ్వాసం కోల్పోయి ఈ బాధలన్ని పోయి తనకు ఉపశమనం కలగాలంటే మరణం ఒక్కటే మార్గమని కధకుడు ఒక తీవ్రమైన నిర్ణయానికి వస్తాడు. ఈ ఘట్టం చదువుతున్నప్పుడు మనం ఒక గగుర్బాటుకి లోనుతాము. ఎవరు లేని ఒక రోజు తన గదిలో గోడకు చారగిల బడి బ్లేడుతో మణికట్టు నరాలను కోసుకుంటాడు, రక్తం ధారాళంగా పోతుంది, సరి యిక మరణిస్తానని అనుకుంటాడు కధకుడు.

కాని తానూ ఇంకా స్పృహలోనే ఉన్నట్టు గ్రహించి తన ప్రాణం ఎంత గట్టిదో అనుకొని బ్లేడుతో తన కంఠం పై మూడు గాట్లు పెట్టుకుంటాడు. రక్తం వలవలా ఒకటే ప్రవాహం!! ఈ లోగా తన తల్లి తలుపులు బాది లోనికి రావడం, ఆసుపత్రికి తీసుకుపోవడం అలా కధకుడు బతికి బట్టకడతాడు. తనకింకా భూమి మీద నూకలు చెల్లలేదనుకుంటాడు. సరే కొన్ని నెలలు గడిచిపోతాయి ఒక సాయంత్రం భద్రాచలం గోదావరి ఒడ్డుకి వ్యాహ్యాళి కెళ్ళిన కధకుడికి కొంత దూరంలో ఇసుక దిబ్బల మీద ద్యానంలో ఉన్న ఒక సాధువు కనిపిస్తాడు. ఎందుకో ఆ సాధువుతో మాట్లాడాలనిపించి కధకుడు “మీరు ఎక్కడివారు స్వామి!!” అని అడుగుతాడు. ఇద్దరికీ సంభాషణ కొనసాగుతుంది. కధకుడు తనకు ఎదురైన అతీంద్రియ అనుభవాలను అతని ముందు ఉంచుతాడు. సాధువు సన్నిధిలో తన సందేహాలన్నీ పటాపంచలు అవుతాయి.

ఆత్మ విశ్వాసంతో వెనుదిరుగుతాడు కధకుడు. సాధువు ఇచ్చిన సమాధానాలు ఏమిటి అన్నది నవలలో చదివితేనే రంజుగా ఉంటుంది. దీనికి కొనసాగింపు అన్నట్టుగా కొన్ని రోజుల అనంతరం “Gospels of Sri Rama Krishna” గ్రంధం తారస పడుతుంది కధకునికి. ఈ గ్రంధ పరిచయము అధ్యయనము తన జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పుతుంది. తానూ పాల్పడిన ఆత్మహత్యా యత్నం పిరికి చర్యగా తెలుసుకుంటాడు. చావు తనంతట తాను వస్తే తప్ప జీవితంలో ప్రతి క్షణం అది ఎంత కష్టమైనదైనా గాని పూర్తి ఎరుకతో జీవిస్తాననే ఒక చైతన్య స్థితికి వస్తాడు. ఆరోగ్యం కుదుట పడుతుంది. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. అణువణువు స్తైర్యాన్ని నింపు కుంటాడు. కట్టా సుబ్బారావు గారు వి.ఆర్.ఓ గారి ద్వారా తమ ఇంట్లో ఏనాటి నుంచో ఉన్న కుండలిని మీద పుస్తకాలు పంపితే వాటిని చదువుతూ ఆ దిశగా ధ్యానము, యోగము చేస్తూ పొందిన అనుభవాల వివరాలు మనకు కొత్త జ్ఞానకవాటాలు తెరుస్తాయి.

సత్యాన్వేషణ అన్నది ఒక నిరంతర ప్రక్రియ. యితరులకు ప్రదర్శించే వీలు లేనిది ఎవరివారే ధ్యాన మార్గము ద్వారా పొందవలసిన స్వీయానుభవము అది. అధిమానసిక అనుభవాలన్నీ భౌతిక ప్రపంచ భాషకు, వ్యక్తీకరణలకు అందనివి, లొంగనివి. అవి వైయక్తికము, భాషాతీతము. ఇవి కధకుడు పొందిన ఆధ్యాత్మిక అనుభవములు. హేతు వాదమని, భౌతిక వాదమని, శాస్త్రీయ విజ్ఞానమని అవే అంతిమ సత్యాలని గిరిగీసుకొని ఒక బిందువు వద్ద ఆగిపోవడం సత్యాన్వేషి చేయాల్సిన పని కాదు. వాటిని దాటి చూడవలిసిన సంఘటనలు ఎదురైతే వాటిని మూడనమ్మకాలు అని కొట్టి పారేయకుండా వాటిలో ఏ సత్యం దాగి ఉందోనన్న ఒక బాల్యపు ఉత్సుకతతో ముందుకు సాగాలి. ప్రకృతి రహస్యాల పుట్ట, అన్వేషించాలి అంటూ ఒక సూచనని లీలా మాత్రం గా విడిచిపెడతాడు కధకుడు.

ఇక తన పాఠశాల జీవితము, రాబర్ట్ లాంటి మంచి ఉపాధ్యాయులు, జనార్ధన్ లాంటి టోకరావేసే ఉపాధ్యాయులు, తనకి ఎదురైన కొన్ని దురదృష్టకర సంఘటనలలో తన శిష్య బృందం ఎలా సాయం చేసింది, అట్లాంటి సమయాలలో వారు చూపించిన తెగువ, విపత్తు నిర్వహణ సామర్ద్యము కధకుని మాటలలో చదువుతుంటే వాటి ద్వారా నిజ జీవితానికి సంబంధించి అవసరమయ్యే సామర్ధ్యాల సందేశం మనకి అందుతూ వుంటుంది. స్వచ్ఛంద ఉద్యోగ విరమణానంతరం కధకుడు భువనేశ్వర్ లో స్తిరపడతాడు తనకు నచ్చిన రీతిలో ప్రశాంతంగా గడుపుతాడు.

జీవన ప్రయాణంలో తనకు ఒకనాడు ఎదురైన యువ మిత్రుడు జీవన్ భువనేశ్వర్ మీదుగా పయనిస్తూ కధకుణ్ణి కలవాలనే కోరికను ఫోనులో వెల్లడిస్తాడు. “దానికేముంది ఒక సారి కలుసుకుందాం” అని రైల్వే స్టేషన్ కి వెళ్ళి జీవన్ కోరికను నేరవేరుస్తాడు. జీవన్ ఎంతో సంతోషించి వీడ్కోలు చెబుతాడు. రైలు కదిలి ముందుకు వెళిపోతుంది. కదిలి వెళ్ళిపోతున్న రైలును చూసి కధకుడు తనలో తాను స్వగతం గా అనుకుంటాడు “జీవితం ఒక ప్రయాణం” అని. నవల ఇక ముగుస్తుంది, పాఠకుని మదిలో గొప్ప అనుభూతి విభూదిని రాలుస్తూ!! వాక్యం రసాత్మకం కావ్యం అని అంటారు కదా. అట్లాంటి వాక్యాలతో నిండిన చిరు కావ్యం ఈ “నిరంతర యాత్రికుడు”. చదవడం ప్రారంభించడమే తరువాయి విమాన ప్రయాణంలా సాగిపోతుంది కధనము.

Read More
Next Story