ఒడిసా యాత్రలో షాకులు, అద్భుతాలు.. 1400 కిమీ బస్సు ప్రయాణం
x

ఒడిసా యాత్రలో షాకులు, అద్భుతాలు.. 1400 కిమీ బస్సు ప్రయాణం

విశాఖ నుంచి ఒడిసా వరకు 1400 కిమీ బస్సు ప్రయాణం.. బస్సు మిస్, భాషా సమస్యలు, చిలికా, పూరి, కోణార్క్, మల్కన్‌గిరి అనుభవాల కథ.

ఎప్పటినుండో ఒడిసాని సందర్శించాలనే నా కోరిక ఈ రోజుకి నెరవేరింది (మే 17, 2026). సాధారణంగా అందరూ సుదూర ప్రయాణానికి రైలు మార్గాన్ని ఎంచుకుంటారు. కాని నేను రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నాను. 5వ జాతీయ రహదారి మీద కేవలం బస్సులమీదే నా ప్రయాణాన్ని చేశాను. మే 17, 2026 ఆదివారం ఉదయాన విశాఖపట్నం ద్వారక కాంప్లెక్స్ నుంచి భగ భగ మండుతున్న ఎండలో నా ప్రయాణం ప్రారంభమయినది. నేను ఎండ, వాన, చలి ని సమానంగా తీసుకుంటాను. నా ప్రయాణాలకి ఇవి అడ్డు కావు. నేను జీవితాన్ని తన అన్ని రంగులలో ఎలా ప్రేమిస్తానో అలానే అన్ని కాలాలను ఒకేలా యిష్టపడతాను.

మొదటి రోజు మే 17, 2026: ఈవేళ ఉదయం 9 గంటలకు విశాఖపట్నం కాంప్లెక్స్ లో ఇచ్చాపురం డీలక్స్ బస్సులో కిటికీ పక్క సీట్ ని ఎంచుకొని కూర్చున్నాను. ఈ రోజు ప్రయాణం అనుకోని విధంగా చాలా మలుపులతో చాలా ఉత్సాహభరితంగా సాగింది. బస్సు శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి మొదలైన పట్టణాలను దాటుకొని పలాస కాంప్లెక్స్ లో మధ్యాహ్నం భోజనం కోసం ఆగింది. కాంప్లెక్స్ ఆవరణలో నేను హోటల్ కోసం వెతికాను. కాని ఏవి లేకపోవడంతో కొన్ని మీటర్లు నడిచి పట్నంలోకి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ “కిచెన్” అనే ఒక మాదిరి హోటల్ తారస పడింది.

లోపలికి వెళ్ళి కూర్చొని అక్కడ కుర్రాళ్ళకి భోజనం త్వరగా వడ్డించమని చెప్పాను. ఎందుకంటే తిరిగి నేను వెళ్ళి నా బస్సుని పట్టుకోవలసి ఉంది. ఆ విధంగా కుర్రాళ్ళను గాబరా పెడుతూ ఉన్నప్పటికీ వడ్డించడం కాస్తా ఆలస్యమైనది. భోజనం ముగించి నేను తిరిగి కాంప్లెక్స్ కి వెళ్ళే సరికి నేను అనుకున్నదే జరిగింది. బస్సు వెళ్ళి పోయింది. యిప్పుడు ఏమి చెయ్యాలో పాలు పోక అక్కడ ఎంక్వైరీ లో అడిగాను. నా గాభరా బస్సు వెళ్ళి పోయినందుకు కాదు బస్సులో నా బాగ్ ఉండిపోయింది. ఎంక్వైరిలో ఉన్న అతను తప్పు మీదే నండి అంటూ కాస్తా అమర్యాదగా ప్రవర్తించాడు.

ఆ ప్రక్కనే కూర్చున్న మరో ప్రయాణికుడు యిచ్చిన సలహా మేరకు డిపో లో ఉన్న సెక్యూరిటీ ఆఫీసుకి వెళ్ళాను. అక్కడ ఉన్న హెడ్ కానిస్టేబుల్ తో మాట్లాడి జరిగిన విషయం చెప్పాను. ఆతను నా పరిస్థితిని అర్ధం చేసుకొని నా టికెట్ అడిగి వివరాలను చూసి ఇచ్ఛాపురం బస్సు డ్రైవర్ నంబర్ కి ఫోన్ చేసారు. దిగిన ప్రయాణికులందరూ తిరిగి వచ్చారా లేదా చూసుకొని బస్సు తియ్యాలి కదా అంటూ ఆ డ్రైవర్ని వారించి బస్సులో ఉండిపోయిన నా బాగ్ ని గుర్తించి దానిని సోంపేట బస్ కాంప్లెక్స్ లో యిమ్మని చెప్పాడు. తరువాత సోంపేట వెళ్తున్న ఒక పల్లెవెలుగు బస్సులో నన్ను ఎక్కించి టిక్కెట్ లేకుండానే నన్ను అక్కడ దించాలని బస్ కండక్టర్ కి చెప్పి నన్ను సాగనంపాడు.

ఆయన చూపించిన ప్రేమకి సహాయానికి నేను బాగా చలించిపోయాను. హృదయ పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసి బస్సులో ఎక్కి సోంపేటలో దిగాను. అక్కడ విచారించగా నా బాగ్ కాంప్లెక్స్ సిబ్బంది చేతిలో సురక్షితంగా ఉంది. దానిని తీసుకొని ఎంతో ఆనందించాను. మరొక్కసారి ఫోన్ చేసి పలాస డిపో హెడ్ కానిస్టేబుల్ కి ధన్యవాదాలు చెప్పాను. ఇప్పుడు నా ముందున్న ప్రశ్న ఏమిటంటే సోంపేట నుంచి ఒడిసా వెళ్ళడం ఎలా అన్నది. అక్కడ ఎంక్వైరీ చేయగా కొద్ది నిమిషాలలో కాంప్లెక్స్ బయట ఒడిసా బస్సు వస్తుందని దానిని పట్టుకొని మీరు ఒడిసా లోని బెరహంపూర్ వరకు వెళ్ళవచ్చని చెప్పారు.

బస్సు సమయానికే వచ్చి నిలిచింది. బస్సులో ఎక్కి కూర్చున్నాను. కండక్టర్ వచ్చి టిక్కెట్ కి డబ్బులు తీసుకున్నాడు కాని టిక్కెట్ ఇవ్వలేదు. అడిగితే ఇక్కడ అలాంటివి అలవాటు లేదండి మీకు ఏ యిబ్బంది లేదు అన్నాడు. బెరహంపూర్ చేరే సరికి సాయంత్రం 5 గంటలు అయ్యింది. ఈ నగర పెద్ద విశాలమైన రోడ్ల మీద ఒక గంట సేపు నడుస్తూ వెళ్ళగా భువనేశ్వర్ పోవు బస్సులు నిలిచే స్థలం వచ్చింది. అక్కడ ఎక్కువ సేపు వేచి వుండనక్కర లేకుండానే వెంటనే భువనేశ్వర్ పోవు ఏ.సి. బస్సు దొరికింది. ఈ ఒడిసా ప్రయాణంలో నేను గమనించినది ఏమిటంటే ఇక్కడ రోడ్లు మరియు బస్సులు అత్యంత సౌకర్యవంతంగా ఉన్నాయి.

నేను భువనేశ్వర్ లో దిగే సరికి రాత్రి 8.30 గంటలు అయ్యింది. అక్కడ రిచి రీజెన్సీ అనే మంచి హోటల్ లో రాత్రి బస చేసాను. ఇక్కడ బస మరియు భోజనం రెండూ చాలా అద్భుతంగా ఉన్నాయి. నేను తీసుకున్న సింగల్ రూమ్ కి ఒక రోజు కి 2500/- రూపాయలు తీసుకున్నాడు. ఈ ఒడిసా ప్రయాణంలో నాకు వింతగా భాషా సమస్య ఎదురైంది. స్థానికులందరూ ఒడియా మరియు హిందీ మాట్లాడుతున్నారు. ఈ రెండూ భాషలు నాకు రావు. ఆంగ్లములో ఎలాగో ఒకలాగ లాగిద్దామనుకున్నాను. కాని, ఇక్కడ హోటల్ కుర్రాళ్ళకి, ఆటో మరియు టాక్సీ డ్రైవర్ లకు ఆంగ్లము అర్ధం కావడం లేదు. ఆఖరికి నేను సంజ్ఙల ద్వారానే నా భాషా సమస్యను అధిగమించడానికి ప్రయత్నించాను. భారత దేశంలో ప్రయాణాలు చేయాలంటే హిందీ భాష రావడం ఎంత అవసరమో తెలిసి వచ్చింది.

రెండవ రోజు మే 18, 2026: నా అసలైన ఒడిసా యాత్ర ఇవాళ ఉదయం భువనేశ్వర్ లో ప్రారంభమయినది. నా ప్రయాణం సుఖవంతంగా జరగడానికి ఒక ఎయిర్ కండిషన్డ్ కార్ ని మాట్లాడుకున్నాను. కారు డ్రైవర్ జితేంద్ర పాండా నన్ను హోటల్ వద్ద కలుసుకోవడం తో ఈ 39 సంవత్సరాల యువకుడితో నా ప్రయాణం ఆరంభమైనది. జితేంద్ర పాండా ఈ ప్రయాణంలో నాకు ఏంతో చేదోడు వాదోడు గా వున్నాడు.

పాండా నన్ను మొదట చిలక సరస్సుకి తీసుకు పోయాడు. ఇది భువనేశ్వర్ కి 130 కిలో మీటర్ల దూరంలో ఉన్నది. నగరం దాటాక ఈ దారిలో నాకు ఎన్నో ఒడిసా గ్రామాలు తగిలాయి. వాటిని మరియు వాటి విచిత్ర మయిన పేర్లని చూసుకుంటూ నేను సాగి పోయాను. చివరికి మా కారు “శత పథ” అని ఊరు వద్ద ఆగింది. ఈ పేరు నన్ను విస్మయము కలిగిస్తున్నది. మన ప్రాచీన వేద సాహిత్యంలో ఉన్న బ్రాహ్మణాలులో ఒకదాని పేరు శత పథ బ్రాహ్మణము. శత పథ అనగా నూరు దారులు అని అర్ధం. ఈ శత పథ గ్రామం వద్ద చిలక సరస్సు బోటు విహార కేంద్రం ఉన్నది.

ఒక బోటుకి ఒక ట్రిప్పుకి 330 రూపాయలు డబ్బులిచ్చి, కాస్తా రేటు ఎక్కువైయినా చెల్లించి బోటు ఎక్కాను. ఎందుకంటే డబ్బులను చూసుకుంటే చిలకా సరస్సులో విహరించలేము. నేను ఎక్కిన బోటులో ఒక యువకుడు కూర్చొని ఇంజను సహాయంతో బోటును సరస్సులోకి తీసుకుపోతున్నాడు. మేము చిలక సరస్సు నీటి అలలను మరియు అక్కడ విహరిస్తున్న “హంసరాణి” పక్షులను చూస్తూ మా బోటు షికారు ఆనందిస్తున్నాము. ఈ సరస్సులో ఒక రెండు మూడు కిలోమీటర్లు వెళ్ళాక అక్కడ డాల్ఫిన్ చేపలు తిరిగే పాయింట్ ఉంది. అక్కడ మేము డాల్ఫిన్ చేపలను చూసాము.

పూరి జగన్నాథ్ ఆలయం దగ్గర

అవి చేస్తున్న విన్యాసాలను కన్నాము. అవి మా బోటు పక్కనుంచే నీటిలో దుమకడం మళ్ళి పైకి తేలడం, వాటి తలలను, తోకలను, నడుముని చూపించేవి. ఈ చిలక సరస్సులో ఇదొక అద్భుతమైన దృశ్యము. డాల్ఫిన్ చేపలను నీటిలో ప్రత్యక్షంగా చూడటం నాకిదే మొదటి సారి. చిలక సరస్సు పూరి, కుర్దా మరియు గంజాం జిల్లాలలో విస్తరించి వున్న విశాలమైన సరస్సు. దీనిని యునెస్కో వారు ఒక గొప్ప “World Heritage Site” గా గుర్తించారు. మా తదుపరి ప్రయాణం పూరి జగన్నాధ స్వామి ఆలయ సందర్శన. ఇది చిలక సరస్సుకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.

మేము పూరి చేరే టప్పటికి మిట్ట మధ్యాహ్నం. గుడి లోపలికి వెళ్లాలని ప్రయత్నించాను కాని అప్పటికే అక్కడ 5 కంపార్ట్మెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు. ఒక్కో కంపార్ట్మెంట్ లో భక్తులు 200 లకు తక్కువ లేకుండా ఉన్నారు. ఈ క్యూలో నిలబడితే దర్శనానికి కనీసం 5 గంటల సమయం పడుతుంది అన్నారు. ఇక మేము ఆ ఆలోచనని విరమించుకున్నాం. బయటనుంచే ఆ ఆలయ వైభవాన్ని చూసి ఫోటోలు దిగాము. ఈ వేళ ఇక్కడ కనిపించిన అద్భుతమైన దృశ్యం ఏమిటంటే పదుల సంఖ్యలో వడ్రంగులు అక్కడున్న పందిళ్ళ కింద కూర్చొని జగన్నాధ రధం తయారీలో భాగంగా కలపను, చక్కలను కోస్తున్నాను. ఇదొక సామూహిక కార్యము.

వీల్లంతా ఒడిసాలోని విభిన్న ప్రాంతాలనుంచి వచ్చినవారు. జగన్నాధ స్వామి పట్ల వారి భక్తి భావము ఎంతటిదో వీరి సామూహిక రధ తయారి కార్యక్రమంలో తెలియవచ్చినది. ఆలయం బయట విశాలమైన వీధిలో స్థానిక వ్యాపారులు “పేడ” అనే ఒక రకమైన తీపి పదార్ధాన్ని అమ్ముతున్నారు. ఇది పూరిలో ఒక స్పెషల్ అని మా టాక్సీ డ్రైవర్ చెప్పాడు నేను ఒక కిలో “పేడ”ని కొనుక్కొని దీనినే జగన్నాధ స్వామి ప్రసాదంగా భావించి యింటికి తెచ్చుకున్నాను. జగన్నాధ స్వామి ఆలయానికి ఒక కిలో మీటరు ముందు టాక్సీ నిలపడానికి ఒక స్థలం ఉంది. అందరూ తమ వాహనాలను అక్కడే నిలిపి గుడికి నడుచుకుంటూ పోవాలి.

ఈ స్థలంలో సెంట్రీలు వాహన చోదకుల వద్దనుంచి కొంత డబ్బుని లంచంగా తీసుకొని పార్కింగ్ ప్లేస్ లను ఇవ్వడాన్ని నేను గమనించాను. మా టా టాక్సీ డ్రైవర్ జితేంద్ర పాండా కూడా అక్కడ సెంట్రీకి చేయి తడపడం చూసాను. ఇది చాలా దారుణంగా ఉంది. పూరిలో నాకు కనిపించిన మరో భీకరమైన దృశ్యం ఏమిటంటే ఇక్కడ ఎక్కువ సంఖ్యలోనే ఇంకా రిక్షా పుల్లర్ లు లు రిక్షా ల మీద అతి తక్కువ డబ్బులకు ప్రయాణికులను తీసుకుపోతున్నారు. నేను మా టా టాక్సీ డ్రైవర్ జితేంద్ర ఒక రిక్షా ఎక్కాము కాని, రిక్షా లాగుతున్న వాని కష్టాన్ని చూసి జితేంద్ర తట్టుకోలేక మధ్యలోనే దిగిపోయి రిక్షా వెంట నడుచుకుంటూ వచ్చాడు.

పూరి ఆలయ నిర్మాణాలు అత్యద్భుతమైన ఇంజినీరింగ్ కౌశలముతో ఉన్నాయి. ఆలయ శిఖరము పైన ఒక పెద్ద సుదర్శన చక్రం రాతితో చెక్కబడిఉంది. దీనిపైన ఒక జండా ఉంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది గాలివాటుకి వ్యతిరేకంగా ఎగురుతూ వుంటుంది. ఇక్కడ ఆలయ ప్రవేశం చాల కట్టు దిట్టంగా ఉంది. లోపలికి కెమెరాలు, సెల్ ఫోన్లు మరియు చర్మ వస్తువులు తీసుకెల్లనివ్వడం లేదు. అలాగే ప్రతి భక్తుడు ఒక డ్రెస్ కోడ్ ని పాటించాలి. హిందువులకు మాత్రమే ఆలయ ప్రవేశము ఉంటుంది. గతంలో ఇందిరా గాంధి ఈ ఆలయ సందర్శనానికి వచ్చినపుడు ఆమె పూర్తిగా హిందువు కాదని ఆమెకు ఆలయ పూజారులు ప్రవేశాన్ని నిరాకరించారు.

కోణార్క్ ఆలయం దగ్గర

ఇక మా తదుపరి లక్ష్యం కోణార్క్ సూర్య దేవాలయ సందర్శనము. మా డ్రైవర్ కారుని కోణార్క్ వైపుగా లంగించాడు. పూరి నుంచి కోణార్క్ 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది బంగాళాఖాతానికి 2 కిలోమీటర్ల దూరంలో నిర్మించబడి ఉన్నది. ఈ ఆలయం ఒక ఉన్నతమైన వాస్తుకి, కళ్ళు చెదిరే శిల్ప సౌందర్యానికి ప్రసిద్ది. భారత దేశంలో ఉన్న అనేకమైన ఉన్నత ఆలయాల జాబితాలో ఇది ప్రధమ స్థానంలో ఉంటుంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. నేను గమనించిన కారణం ఏమిటంటే మొత్తం ఆలయం ఒక రధం మాదిరిగా నిర్మించబడినది. ఇది 24 చక్రాలు మరియు 7 గుర్రాల శిల్పాలతో నిర్మించ బడిన రధాలయం.

కోణార్క్ సూర్యదేవాలయం

పురాణాల ప్రకారం సూర్యుడు పడమర నుంచి తూర్పుకి గుర్రాలు పూసిన రధంలో తిరుగు తుంటాడు. దీనిని ఆధారంగా చేసుకొని ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఈ ఆలయం పై అక్కడక్కడ శృంగార శిల్పాలు కూడా కనిపిస్తాయి. మానవ జీవితంలో శృంగారానికి ఉన్న ప్రాధాన్యతని తెలియజేస్తున్నట్టుగా ఉన్నాయి ఈ శిల్పాలు. కోణార్క్ ఆలయ ఆవరణ అత్యద్భుతంగా ఉంది కాని బయట ఆలయం చుట్టూ అసంఖ్యాకమైన కొట్లు షాపులు లేచిపోయి పర్యావరణాన్ని పాడుచేస్తున్నాయి. షాపులతో నిండివున్న ఈ వీధులను దాటుకొని ఆలయ ఆవరణలోకి ప్రవేశించడం ఒక పెద్ద పరీక్ష.

భువనేశ్వర్‌లోని లింగరాజ ఆలయం దగ్గర

ఈ ఆలయాన్ని చూసినపుడు నేను పొందిన ఆనందం నాకు మరి ఏ యితర ఆలయ సందర్శన లో కూడా లభ్యం కాలేదు. ఇదీ ఈ ఆలయ స్థాయి మరియు వైభవము. ఈ ఆలయాన్ని 13 శతాబ్దం లో తూర్పు గంగా వంశానికి చెందిన 1వ నరసింహ దేముడు నిర్మించాడు. ఈ ఆలయం స్వచ్చమైన కళింగ శైలి వాస్తుకి ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది. ఇక ఈవాళ మా చివరి లక్ష్యం భువనేశ్వర్ లోని లింగరాజ ఆలయ సందర్శనము. ఇది ఒక శివాలయము. ఈ ఆలయం లో కూడా చర్మ వస్తువులు, కెమెరాలు, సెల్ ఫోన్ లు నిషిద్దము. ఈ ఆలయ మూల విరాట్ ఉన్న గర్భ గుడి పైన అత్యంత ఎత్తైన శిఖరం ఉన్నది.

ఇది ఆకాశాన్ని చుంబిస్తున్నదా అనిపిస్తుంది. దీని ఆవరణలో ప్రధానమైన లింగరాజ స్వామి ఆలయముతో బాటు మరో యాబై వరకు చిన్న పరిమాణంలో ఆలయాలు కూడా వున్నాయి. ఈ ఆలయ గర్భ గుడిలో ఆశ్చర్య కరంగా శివుని విగ్రహం గాని లింగం గాని లేవు. ఒక్క పాన పట్టము మాత్రమే కనిపించింది. ఈ ఆలయం తన సంపద్ వంతమైన వాస్తు, శిల్పం మరియు బాహిర నిర్మాణం తో కలకాలం గుర్తుండి పోతుంది. ఒడిసా నిజానికి ప్రకృతి ప్రసాదించిన వారాల పుట్ట అని మనకి అనిపిస్తుంది. ఇక్కడ నిర్మాణాలు మరియు చిలక సరస్సు అద్భుతమైన ప్రకృతి ప్రసాదించిన వరం.+ ఇవన్ని కలిపి ఒడిసాని ఒక గొప్ప పర్యాటక కేంద్రం గా మారుస్తున్నాయి.

మూడవ రోజు మే 19, 2026: నిన్న రాత్రి 8.30కి భువనేశ్వర్ లోని మణిపాద బస్సు స్టాప్ లో స్లీపర్ క్లాస్ బస్సు ఎక్కి ఒడిసా రాష్ట్రానికి దక్షిణ చివర గల మల్కన్ గిరి ఊరికి బయలు దేరాను. సుమారు 950 కిలోమీటర్లు ప్రయాణించి ఈవేళ ఉదయం 10 గంటలకు ఇక్కడ దిగాను. ఈ మార్గంలో మరికొన్ని ముఖ్య పట్టణాలైన బ్రహ్మగిరి, నవరంగపూర్, జైపూర్ లను దాటుకొని మల్కన్ గిరి చేరాను. ఒడిసా రాష్ట్రం యొక్క గ్రామీణ మరియు గిరిజన జీవితాన్ని చూసే అవకాశం ఈ మార్గం నాకు ఇచ్చింది. నవరంగపూర్ ఆ జిల్లా ముఖ్య పట్టణము, జైపూర్ కోరాపుట్ జిల్లా లోని ఒక ముఖ్యమైన పట్టణము.

నేను భువనేశ్వర్, పూరి నగరాలలో చూసిన ఒడిసా వైభవం ఈ గ్రామా సీమలలో పూర్తిగా అదృశ్యమైనది. ఈ ప్రాంతమంతా చాల వరకు చెట్లు లేని కొండలతో, చవిటి నేలలతో నిండి వున్నది. ఆర్ధిక వెనుకబాటు తనం చాల స్పష్టంగా కనిపిస్తున్నది. ఒడిసా ఒక వైరుధ్యాల పుట్ట అని అర్ధమౌతున్నది. నేను మల్కన్ గిరి చేరే టప్పటికి ఈ వైరుధ్యం. అత్యున్నత స్థాయికి చేరుకున్నది. మల్కన్ గిరి వివిధ గిరి జాతులతో నిండిన ఒక పూర్తి గిరిజన జిల్లా. ఇక్కడ నక్సలైట్ కార్యకలాపాలు ఎక్కువ. ఈ జిల్లా పూర్తిగా నూటికి నూరు శాతం ఆర్ధిక ప్రగతి లేని ప్రాంతము. ఇవి ఇలా ఉండగా యిక్కడ మల్కన్ గిరి పట్టణం ఎంతో మంది బంగ్లా దేశీయులకు నిలయం గా ఉన్నది.

వీరు 1972 పాకిస్తాన్-బంగ్లాదేశ్ యుద్ద సమయంలో ఆ దేశాన్ని విడిచిపెట్టి పొట్ట చేత పట్టుకొని ఒడిసా రాష్ట్రం లోకి ప్రవేశించి కొన్ని వందల కుటుంబాలు మల్కన్ గిరి పట్టణంలో స్థిరపడ్డారు. ఇక్కడ బంగ్లదేశీయులకు ఒక పెద్ద వీధి ఉండడం గమనించాను. వీరిక్కడ వివిధ రకాలైన వ్యాపారాలు చేసుకుంటూ బ్రతుకును వెళ్లదీస్తున్నారు. నేను ఒక బంగ్లా దేశీ కుంటుంబాన్ని కలిసాను. ఆ కుటుంబ పెద్ద నాకు ఈ వివరాలన్నీ చెప్పాడు. వీరంతా హిందువులట. ఈ బంగ్లా దేశీయుల వలసలలో నాకు సామాన్య మానవులపై చరిత్ర విసిరిన ఒక పరిహాసం స్పష్టంగా కనిపించింది. ఇక ఈ నా ప్రయాణంలో నేను చూసిన చివరి పట్టణం చిత్రకొండ.

ఇది పూర్తిగా నక్సలైట్ కార్యకలాపాలకు నిలయము. ఈ ఊరిలో “గంగాధర్”- అనే రచయత కొన్నాళ్ళు నివాసమున్నాడు. అలా అతనికి చిత్రకొండ గంగాధర్ అనే పేరు స్థిరపడింది. వీరు అనంతర కాలంలో బ్రతుకుని వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. మల్కన్ గిరి-చిత్రకొండ మార్గ మధ్యలో ప్రఖ్యాతి గాంచిన బలిమెల రిజర్వాయర్, డామ్ లు ఉన్నాయి. కొన్నేళ్ళ క్రితం ఈ రిజర్వాయర్ లోనే నక్సలైట్ లు ఆంధ్ర పోలీసులు చాలా మందిని పొట్టన పెట్టుకున్నారు. మధ్యాహ్న భోజనం కోసం మా బస్సు బలిమెలలో ఆగితే అక్కడ ఒడిసా హోటల్ లో భోజనం ముగించి చిత్రకొండ వెళ్లాను.

చిత్రకొండ ఒక మామూలు గిరిజన గ్రామము. అయితే ఇక్కడ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ వారి ఆఫీసులు, బిల్డింగులు, క్వార్టర్ లు ఎక్కువగా వున్నాయి. బలిమెల రిజర్వాయర్, డామ్ పనుల నిమిత్తము ఇవి వెలిసాయి. ఇక నేను చిత్రకొండ నుంచి సీలేరు వెళ్ళాల్సి ఉంది. ఇది ఆంధ్రాలో ఉన్న ఒక హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్. సీలేరు వెళ్ళడానికి ప్రత్యేకమైన బస్సులేమి లేకపోవడంతో ఒక ఆటో ని 400 రూపాయలు ఇచ్చి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీలేరులో సాయంత్రం 4 గంటలకు దిగాను. ఇక్కడ వెంటనే నర్సీపట్నం పోవు బస్సు దొరికింది. అందులో ఎక్కి, కూర్చొని ఘాటిలో 5 గంటలు ప్రయాణించి రాత్రి 9 గంటలకు నర్సీపట్నం చేరాను.

ఈ మార్గంలో చింతపల్లి తగిలింది. ఇది కాఫీ తోటలకు ప్రసిద్ది. ఇంకొక విశేషమేమిటంటే 1921-22లో అల్లూరి సీత రామ రాజు చింతపల్లి పోలీస్ స్టేషన్ పై దాడి చేసాడు మా బస్సు ఈ పోలీస్ స్టేషన్ ముందే ఆగింది. ఒక సారి దిగి కొద్ది సేపు స్టేషన్ లోపలి వెళ్ళి చూసి వచ్చాను. ఈ స్టేషన్ ముందు అల్లూరి సీత రామ రాజు విగ్రహం అతను ఈ స్టేషన్ పై ఎప్పుడు ఎలా దాడి చేసాడు ఆవివరాలు వున్నాయి. ముఖ్యంగా భారత స్వతంత్ర సంగ్రామ కాలంలో బ్రిటిష్ వారు తీసుకొచ్చిన కఠినమైన అటవీ చట్టాలు గిరిజనుల బ్రతుకుని, ఉనికిని ప్రశ్నార్ధకం చేసాయి.

ఈ చట్టాలకు వ్యతిరేకంగా సీత రామ రాజు బ్రిటీష్ వారి తో చేసిన సాయుధ పోరాటంలో భాగంగా అతను ఈ చింతపల్లి పోలీస్ స్టేషన్ పై దాడి చేసాడు. ఈ ప్రయాణం ముగించి నేను విశాఖపట్నం ఇంటికి చేరే సరికి అర్ధ రాత్రి 12 దాటింది. ఈ ఒడిసా ప్రయాణంలో నేను సుమారు 1400 కిలోమీటర్లు బస్సులలోనే ప్రయాణిస్తూ చూసుకొని వచ్చాను. చరిత్ర, సామాజిక జీవితం మరియు ప్రకృతి – ఈ మూడింటిని చాల దగ్గరగా చూసే భాగ్యాన్ని ఈ ప్రయాణం నాకు ఇచ్చింది. ఈ విధం గా ఇది నాకు ఒక ఆహ్లాదకరమైన ప్రయాణం మాత్రమే కాకుండా ఒక శిక్షణ మరియు విజ్ఞానపు యాత్ర గా మిగిలిపోతుంది.

Read More
Next Story