పాత చీరలతో కొత్త వ్యవసాయం.. రైతుల వినూత్న ప్రయోగం
x

పాత చీరలతో కొత్త వ్యవసాయం.. రైతుల వినూత్న ప్రయోగం

రాయలసీమ నుంచి దండకారణ్యం వరకు రైతులు, గిరిజనులు పాత చీరలను పర్యావరణహిత వ్యవసాయంలో వినూత్నంగా వినియోగిస్తున్నారు.


ఉదయం మదనపల్లి బస్ స్టాండ్ సమీపంలో ఒక ీVAటల్‌కి చేరుకున్నాం.

రిఫ్రెష్ అయిన తరువాత మాకు ఫీల్డ్ విజిటఓ సహకరించడానికి సుధాకర్ గారు వచ్చారు.

ఆయన ఒక స్వచ్ఛంద సంస్ధలో కోఆర్టినేటర్‌గా పని చేస్తున్నారు. వ్యవసాయంలో పెట్టుబడి తగ్గించి , ఆదాయం పెంచుకోవడం, తక్కువ నీటి వసతితో ప్రకృతి సేద్యం పై ఆ ప్రాంతంలో 200కు పైగా రైతులతో కలిసి పనిచేస్తున్నారు.

వాయిలపాడు వైపు బయలు దేరాం. అప్పటికే 8 దాటింది. దారిలో చిన్న పూరింటి దగ్గర టిఫిన్ చేయడానికి ఆగాం.

నాతో ఉన్న మిత్రులు దోసెలు తీసుకున్నారు. నేను రెండు ఉడికించిన గుడ్లు, ఇడ్లీ ఆర్డర్ చేసి కారపు పొడితో తీసుకుంటుంటే...

‘వాయిల్పాడులో టమాటా సాగులో నష్టం రాకుండా ఒకామె డిఫరెంట్‌గా సేద్యం చేస్తున్నారు. అంతకంటే ముఖ్యమైన ఎకోఫ్రెండ్లీ వ్యవసాయం మనం వెళ్లే దారిలో మీరు చూసి తీరాలి...’ అన్నాడు సుధాకర్. బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేసి పక్కనే షాపులో నన్నారి డ్రింక్ తీసుకొని బయలు దేరాం.


ఆలా రాయలసీమలోని మదనపల్లి చుట్టుపక్కల టమాటా పొలాల్లోకి అడుగు పెట్టగానే ముందుగా కనిపించింది పచ్చని బెడ్స్‌పై విస్తరించిన రంగురంగుల పాత చీరలు. మొదట చూసినప్పుడు ఇది ఏదో తాత్కాలిక ఏర్పాట్లా అనిపించింది. కానీ రైతులతో మాట్లాడితే అసలు కథ బయటపడింది.

‘ ఇది మాకు పాత చీర కాదు... మా పంటకు రక్షణ కవచం’ అని మల్చింగ్‌లో ప్లాస్టిక్ బదులు వస్త్రాన్ని వాడుతున్న అక్కడి రైతు చెప్పిన మాట అక్కడి వాతావరణాన్నే మార్చేసింది. ఇది కేవలం “పర్యావరణ ప్రయోగం” మాత్రమే కాదు, రైతుల జీవన విధానంలో నేల రక్షణ కోసం జరుగుతున్న ఒక పెద్ద మార్పు అని అర్థమైంది.


ప్లాస్టిక్‌కు బదులుగా నూతన పరిష్కారం

ఇప్పటివరకు కూరగాయల సాగులో ప్లాస్టిక్ మల్చింగ్ తప్పనిసరి అన్న భావన బలంగా ఉంది. కానీ అదే ప్లాస్టిక్ నేలలో శాశ్వతంగా మిగిలి భూమిని నిశ్శబ్దంగా నాశనం చేస్తోందని ఇప్పుడు రైతులు స్వయంగా గుర్తిస్తున్నారు.

‘ ప్లాస్టిక్ షీట్లు వాడితే తేమ నిలుస్తుంది, కలుపు తగ్గుతుంది. ఇది నిజమే. కానీ అదే సమయంలో నేలలో గాలి ప్రసరణ తగ్గడం, సూక్ష్మజీవుల జీవనం బలహీనపడడం, వర్షపు నీరు భూమిలోకి చొరబడకపోవడం వంటి సమస్యలు రైతుల కళ్లముందే కనిపిస్తున్నాయి.’ అన్నారు ఆ ప్రాంతంలో ఒక వాసన్ ఎన్జీఓలో పని చేస్తున్న రమేష్.

ఈ వాస్తవాన్ని ఎదుర్కొనేందుకు ఇక్కడి రైతులు ఎంచుకున్న మార్గం ఆశ్చర్యపరిచేంత సులభం... కానీ ప్రభావం మాత్రం చాలా లోతైనది.

చీరలు నేలతో మాట్లాడుతున్నాయి

మల్చింగ్‌గా పరచిన చీరలపై మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతున్న దృశ్యం అక్కడి పొలాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. రైతులు చెబుతున్నట్లు

‘ ఎండల వేడి ఎక్కువైనప్పుడు నేల ఆరిపోకుండా, తేమ ఎక్కువసేపు ఉంటుంది. కలుపు మొక్కలు తగ్గుతాయి. ముఖ్యంగా ఇవి మట్టిలో కలిసిపోతాయి... కాలుష్యం ఉండదు.’

ఈ మాటల్లో ఉన్న సాధారణతే ఈ ప్రయోగం వెనుక ఉన్న గొప్పతనం.

ఇదే ప్రాంతంలో పాత చీరలే కాకుండా కొందరు ఎండిన గడ్డిని కూడా మల్చింగ్‌గా వాడుతున్నారు.


అరణ్యాలకు విస్తరించిన పర్యావరణ విధానం

ఇలాంటి ఆలోచన కేవలం రాయల సీమ పొలాలకే పరిమితం కాలేదు. ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మేము చూసిన మరో దృశ్యం మరింత ఆసక్తికరం.

బస్తర్ అడవుల్లో ఇప్ప చెట్ల కింద రంగురంగుల చీరలు పరచి ఉండటం కనిపించింది. ఇది అలంకరణ కాదు పండ్లు వృథా కాకుండా సేకరించడానికి గిరిజన మహిళలు రూపొందించిన తెలివైన పద్ధతి. పూలు నేలపై పడితే నష్టం. కానీ చీరలు శుభ్రంగా సేకరించే “సహజ వల”గా మారాయి.

‘ గతంలో నేల మీద పడిని ఇప్పపూలను ఏరే వారు. మట్టి వల్ల పూలు త్వరగా చెడిపోయేవి. ఇపుడు నేలను తాక కుండా సేకరించడం వల్ల ఇప్పపూల తో చేసే పలు ఆహార పదార్ధాలకు డిమాండ్ పెరిగి ఆదాయం కూడా పెరిగింది’ అన్నారు బస్తర్ ఫుడ్స్ సంస్ధను నిర్వహిస్తున్న రజియా.

తూర్పు కనుమల్లో మరో వినూత్న దృశ్యం

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయÖ్యరు లో కొందరు రైతులు మామిడి, సపోట పండ్ల మొక్కల చుట్టూ వెదురు కంచెల బదులుగా పాత చీరలు, నైటీలు వాడుతున్నారు. ఇది జంతువుల దాడిని తగ్గించడమే కాకుండా, తేమను నిలుపుతూ మొక్కలకు సహజ రక్షణ కల్పిస్తోంది.

‘ ఇలా చేయడం వల్ల వానలు పడినా మంచు కురిసినా దుస్తుల్లో తేమ నిలువ ఉంటుంది. అది చుక్క చుక్కలుగా మొక్క ల వేర్లకు చేరుతుంది. తద్వారా మొక్కలు ఆరోగ్యంగా ఎదుగుతాయి. అంతే కాదు రంగు రంగుల దుస్తుల వల్ల జంతువులు రావడానికి కొంత వెనుకంజ వేస్తుంటాయి. ఇది కూడా మాకు అదనపు ప్రయోజనం’ అన్నాడు అక్కడ మాతోట పథకంలో తోటలు సాగు చేస్తున్న రైతులు.

పెద్ద పాఠం ఏమిటంటే...

ఈ అన్ని దృశ్యాలు ఒకే విషయాన్ని చెబుతున్నాయి. భారీ టెక్నాలజీ అవసరం లేకుండానే పర్యావరణ మార్పు సాధ్యమే.మనం పనికిరాకుండా పడేసే పాత చీర... రైతు చేతిలో పడితే అది ఒక జీవ రక్షణ వ్యవస్థగా మారుతోంది.

ప్లాస్టిక్‌పై ఆధారపడుతున్న ప్రపంచానికి ఇది ఒక నిశ్శబ్ద హెచ్చరిక కూడా.

ప్రకృతిని కాపాడే మార్గాలు ఎప్పుడూ దూరంగా ఉండవు... అవి మన ఇంట్లోనే ఉండొచ్చు.

Read More
Next Story