
వెలది పదాలలో బాల వికాసం- రాగ బాల శతకం
పుస్తక సమీక్ష: డాక్టర్. సూర్యజ
ఛందస్సులో రచనలు అరుదైపోతున్న వేళ పిల్లల కోసం డాక్టర్ సూర్యదేవర రాధారాణి హృద్యంగా మలచిన ఆట వెలదుల శతకం “రాగ బాల శతకం” ఈ మధ్య వెలువడింది.
పద్య శతకం వెలువడటం విశేషమైతే దాన్ని అభ్యుదయ భావుకుడు, ఉగ్గుపాల బాల కథలకు కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన మాన్యుడు డాక్టర్ భూపాల్ ఆవిష్కరించటం మరో విశేషం. ఈ పుస్తక తొలిప్రతి స్వీకర్త ‘పిల్లల కోసం’ ‘పిల్లలలోకం’లో కృషి చేస్తూ కీర్తి పురస్కారం అందుకున్నడాక్టర్. వి. ఆర్. శర్మ గారు. ఒక సంప్రదాయ శతకాన్ని వీరేందుకు ఆవిష్కరించారు? అని సాహిత్య విమర్శకులకు సందేహం వస్తుంది. తెలుగుశతకం అనగానే ప్రధానంగా భక్తి, ముక్తి విషయమేమో అనుకుంటాము కానీ రాగ శతకానీది పూర్తిగా భిన్నమైన విషయం, ఇది ఆధునిక జీవన దృగ్విషయం, ఆ ప్రత్యేకత లేమిటో పరిశీలించటం ఆసక్తికరంగా వుంటుంది.
వృత్తి రీత్యా డాక్టరు, ప్రవృత్తి తో సాహిత్యకారిణి, వయో పరిపాకంతో అమ్మమ్మ అయిన డాక్టర్ రాధారాణి తన మనుమరాలు రాగ తో చేసిన సాహితీ సంభాషణ ఈ పద్యమాల. రాగ చెప్పిన మాటలు, రాగ కోసం చెప్పిన మాటలు, ఈ రెండూ కలిపి పిల్లల పెంపకంపై పెద్దలకు ఒక కర దీపిక లా భాసిస్తున్నది బాల శతకం. రాగ అనుమానాలు, అభి ప్రాయాలు పది పన్నెండేండ్ల పిల్లలకు సహజం గా ఉండేవే. వాళ్ళ ఊహలు, ఊసులు, ఉపాయాలు, నేర్పులు అన్నింటినీ గుర్తించి, గౌరవించి, పట్టిoచు కోవలసిన బాధ్యత తల్లి దండ్రులది. పెద్దలది. అందుకే పెద్దలందరికి మనవి గా ‘రాగ మాట, వినుము బాగుగాను.” ఒక శతక మకుటం అయ్యింది. పిల్లల ఆట, మాట, పాట, ప్రవర్తనలను సరిదిద్ది, శిక్షణతో విచక్షణ నేర్పి పరిణిత వాణిని సమకూర్చేది పెద్దలు. అందుకే “రాగ! మాట వినుము బాగుగాను” అని వారంటారు. ఈ శతకానికి ముందుమాట రాసిన పెద్దలు పండితులు శ్రీ దొరవేటి గారు అందుకే “రాగ మాట వినుము బాగు పడుము” అని అన్నారు. ఇలా వ్యక్తిగత అనుభవాలు సార్వజనీనం అయ్యాయి. రాగ పిల్లల ప్రతినిధిగా మారిపోయింది.
బాల్యం అనే అద్భుత సమయాన్నిసమయోచితంగా తీర్చిదిద్దటం, వివేకం వికసించేలా నీతిని, జీవన రీతిని వివరించటం ఈ శతక గీతి. “శుచిగా మనసు, తోడు శుభ్రమౌ యోచన/ సాయపడేటి కరము, జాలి గుండె/ మానవత్వమున్న మనిషిలో కొలువుండేలా” [61] ఎదగడమె ఈ శతకం చదువరుల నుంచి ఆశించే ఫలశ్రుతి. ఆ చదువు ఓ పెద్దపాఠం చెప్పినట్లు, ప్రబోధం చేసినట్లు, బెదిరించినట్లు కాకుండా ఆత్మీయంగా, ఆదరంగా, బుజ్జగిస్తు న్నట్లు, మెల్లగా బుద్ధి చెబుతున్నట్లు, అమ్మమ్మ పాలబువ్వ కలిపి తినిపిస్తున్నట్లు పద్యమై సాగింది.
పద్యం ముఖ్యంగా పిల్లల కోసం రాసిన పద్యం వారి చెవికి ఎక్కాలి. నోట తిరగాలి. వల్లె వేయ గలగాలి. వొంట పట్టాలి. అందుకు పద్యం తేలికగా వుండాలి. యతి, గణాలు ప్రాసల కోసం చేసే ఫీట్లు అన్వయ కాఠిన్యానికి దారి తీయకూడదు. రాధారాణి ఈ విషయంలో ఎంతో అభ్యాసం చేసినట్లు, నైపుణ్యాన్ని సంతరించు కున్నట్లు ఈ పద్యాలే సాక్ష్యం చెబుతున్నాయి. ఎక్కడో అక్కడ తప్పించి ఎక్కువభాగం సాఫీగా, సూటిగా, తేటగా వున్నాయి. ఐదు ఇన గణాలలో ఇంత భావ సంపదను, భాషాపటిమను రంగరించి పిల్లలకు చేరువగా చెప్పినందుకు రచయిత్రిని అభినందించాలి. రాసిన ప్రతి పద్యమూ మనవరాలితో చదివించి, పాడించి, తనకేమి అర్ధమయ్యిందో తెలుసుకుని తగు మార్పులు చేయటం ఈ రచయిత్రి అనుసరించిన ఒక కొత్త పద్దతి. పిల్లలకోసం రాసేప్పుడు, పిల్లల స్థాయికి వెళ్ళటం అంటే ఏమిటో ఈ అనుభవం చెబుతున్నది.
ఇక్కడ పాండిత్య ప్రదర్శన లేదు. కఠినమైన పద బంధాలు, సమాసాలు లేవు. ఇంత తేలికగా, సాధారణ భాషలో రాయటానికి రచయిత్రి పడిన శ్రమ, ఆమె విశేష శేముషి అర్థమవుతున్నది. భావాలు నేల విడిచి సాము చేయవు. ఏ వివరణ, విశ్లేషణ లేకుండా పిల్లలు స్వయంగా చదువుకొని అర్ధం చేసుకునే రీతిలో వున్నాయి. కచ్చితంగా ఈ లక్షణం వల్లే ఇతర రచయితలు ఈ శతకాన్ని తప్పని సరిగా విశ్లేషించు కోవలసిన అవసరం ఏర్పడింది. తమ రచనలను ప్రజలకు చేరువ చేసే మెళకువ లను ఒడిసి పట్టుకోవలసిన అవసరమూ తెలుస్తున్నది.
ఒక్కో పద్యమూ ఒక్కో అనుభవాన్ని మన ముందుకు తెస్తుంది. అనుభవాల గని నుండి వెలికి తీసిన అరుదైన ఖనిజాలు ఇవి. పిల్లల పట్ల ప్రేమ, బాధ్యత, వారి భవిష్యత్తు పట్ల బెంగ, వర్తమాన అమానవీయ, కుసంస్కారపు విధానాల పట్ల తిరస్కారము, ఈ పరిస్థితులలో పెరిగే పిల్లలు ఏమై పోతారో, ఏమై మిగులుతారో అనే ఆవేదన, చేతనయినంతవరకు వారిని చక్క దిద్దాలనే తపన, తాపత్రయం ఈ శతక సారాంశం. “ధ్యానముంచి వినుము ధన్యమవును బ్రతుకు” అన్ననమ్మికతో నాలుగు మంచి మాటలతో ఈ పుస్తకాన్ని వెలువరించారు.
పద్యవనం లో విహరించే ముందు ముఖచిత్రం గురించి, లోపల పేజీల్లోవున్న రేఖా చిత్రాల గురించి చెప్పుకోవాలి. రెండు హరివిల్లుల మధ్య స్వేచ్చగా ఎగురుతూ, మేఘాల నుండి తలకిందులుగా వేలాడుతూ, పుస్తకమేదో చదువుతూ, ఆకాశంలో చుక్కల్లా మరిసిపోయే పిల్లలు ఎవరిని ఆకర్షించ కుండా వుంటారు. “చుక్కలాగా నేను చక్కగా మెరవాలి/మబ్బులడ్డు రాని, మసక గాని… ఘనమైన చారు నక్షత్రం” లా [92] అవ్వాలనుకునే బాల్య ఆకాంక్షలకు రూపం ఇది. ప్రతి పేజీలోనూ పిల్ల చేష్ట ల అల్లరి వల్లరి. ఈ బొమ్మలకోసమైనా పిల్లలు పద్యం చదివేలా ఆకట్టుకుంటుంది.
శతకంలో బొమ్మలు ఎప్పుడు చూశాము కనుక? “తీర్చిదిద్ది మేము కూర్చిన హరివిల్లు కనుల పండుగేను …సప్త వర్ణములను చక్కగా పేర్చాము… కాంచ రండి” [90] అని ఆహ్వానిస్తున్నారు. ఈ చిత్రకారిణి డా. సింధుజ, రచయిత్రి కుమార్తె కావటం తోవారి మధ్య అవగాహన, నెనరు, సహకారం వల్ల పుస్తక రూప కల్పన లో సామరస్యం కానవస్తున్నది.
మొదటి పద్యమే హృద్యంగా మొదలెట్టారు “మనము చిన్నవారమను మాట మరవొద్దు /పెద్ద పనుల జోలీ వద్దు మనకు/ బుర్ర పెట్టి చదివి బుద్ధిగా ఎదగాలి/ రాగ మాట వినుము బుద్ధిగాను” అంటూ రాగ పాప తన స్నేహితులతో చెప్పుకునే ముచ్చటగా ఆరంభమవుతుంది.
ఆ చిన్న పిల్లల మది గదుల్లో మనం పలికే మాటలు ఎన్నిఅవమానాలను, చీకట్లను నింపుతాయో ఎన్ని గాయాలను చేస్తాయో! మన వూహించుకోలేము. “చిన్నబుచ్చకండి చిన్ని పాపల మది (4) “ఎదురు ప్రశ్నలనుచు కుదురు లేదనుచు తేప కొక్క మారు తిట్టకండి” [20]. వాళ్ళ గాయాలకు స్వంత నోరు లేదు. కానీ ముడుచుకు పోయిన వాళ్ళ హృదయ ఆక్రందనలే ఇక్కడ గేయాలుగా పలుకుతున్నాయి. “కక్ష చూపకండి కరుణనే పంచండి” [6] అన్నదే ప్రీతి వాక్యం.
పిల్లలంటే రెక్కలు లేకుండానే ఆకాశంలో విహరించే ఊహల ఊయలలు. స్వేచ్చా విహంగాలు. అప్పుడే “విరియు మస్తకమ్మువేల తీర్లు/బంది చేసి మమ్ము బానిస చేయొద్దు” (21) అని వాళ్ళ మానసాలు మూలుగుతుంటాయి. వింటే “అల్లరన్నమాట పిల్లల స్వంతము… మించనీము శ్రుతిని మీ మీద యాన” (17) అన్నమాట వినిపిస్తుంది. ఇంతకీ వాళ్ళు చెప్పేదేమిటి? “ఆటలాడుకొనుట, పాటలు పాడుట, గంతులేయుట, మరికొంత యలక జన్మ హక్కు మాది” [52] అని. ఇవే కదా! బాల్యానికి చిహ్నాలు. వాటినే కత్తిరించివేస్తే మరి బాల్యానికి రుచి ఏది?
బాల్యం నుండి విడదీయ లేనిది చదువు. విద్య మీద, పాఠశాలమీద, ఉపాధ్యాయుల మీద అపారమైన గౌరవం కలిగేలా ఇందులో అనేక పద్యాలు ఉన్నాయి. చదువు ప్రాధాన్యతను అలతి పదాలలో పిల్లల కు వివరిస్తూ, “తెలివి పెంపు కొరకు తీరైన సదనాలు/ పాఠశాలలేను పరము, వరము” [85] అని చెప్పారు. “వదలబోకు బడిని, చదువుకో బాగుగా/ కలిమి యదియే మనకు” [26] అని అనేక కారణాల వల్ల స్కూలు మానివేస్తున్న పిల్లలకు చెబుతారు. “చదువు వేయును చక్కని బాటను” అని వారి తల్లిదండ్రులకు భరోసా కల్పిస్తూ, “బడికి పంపవలెను భారమనక / కొంత జ్ఞానమైన కూర్చుకో నివ్వండి” [102] అని హిత వాక్యం పలుకుతారు. “చదువు వదులు వారిని దయతో మరలించి పాఠశాల జేర్చ ఫలము మెండు” [79] అని డ్రాప్ అవుట్ పిల్లలమీద ఎంతో శ్రద్ధ కురిపి స్తారు. సామాజిక బాధ్యతను గుర్తు చేస్తారు.
తల్లి దండ్రులు “ఒక్క బిడ్డ తోనే లెక్కలేని వెతలు” అని భావిస్తూ వుంటే ఒక్కో తరగతిలో 40 మంది పిల్లలను సంభాళించుకు వస్తున్న “గురువు బాధ కనుము, గోడు వినుము” అమ్మను మించి కాచే చదువు లమ్మలు కోపగిస్తే బెదురు వలదు ఆ “కోపమందు వెదుక కోరినంత మమత” వుంది గుర్తించ మని ఆర్ధిస్తూ (24,25) “చదువు నేర్పు వారు సాక్షాత్తు వేల్పులే” అని ఉపాధ్యాయుల ఓర్మి, కూర్మి గురించి ప్రశంసగా వారిపట్ల గౌరవం కలిగేలా పిల్లలకు చెబుతారు. “నడకతోటి మాకు నడతను బోధించి/కంటి పాపలాగా కాచినారు.” [14] “బ్రతుకు బాట మాకు భవ్యముగా తీర్చి దిద్దినారు” [15] అని ఇటు అమ్మనాన్నలను, ఉపాధ్యాయులను వందనాలతో గౌరవించినప్పుడు ముగ్ధులు కానిదెవ్వరు?
కుటుంబ జీవితాల్లో వచ్చిన పరిణామాల ఫలితంగా చాలా ఇళ్లునూక్లియర్ కుటుంబాలుగా మారి పోయాయి. దానివల్ల “పెద్దవారు జెప్పు సుద్దులు కరువాయే” ఇక బాల్యం, కౌమారం ‘వక్రమార్గ మందు వాలి తూలే’. [84] చేటు జేయు బాల్య చేష్టలు కనలేని స్థితి నెలకొంది. పరిసరాలు, ఇరుగు పొరుగు వల్ల పిల్లలు విపరీత ప్రభావాలకు గురి అవుతున్నారు. చూస్తున్నచలన చిత్రాలు, టి. వి. మీడియా, సెల్ ఫోను స్క్రీన్లు హింసానల జ్వాలలై పిల్లలలోని, మృదుత్వాన్ని, మార్దవాన్ని, స్నేహ భావాన్నిపెరికి పార వేస్తున్నాయి. అందుకే “ఇంటి పెద్దలెపుడు కంటి రెప్పలుగను కాచి యుండ వలెను (83) అనే జాగురూకతను నేర్పుతున్నది ఈ శతకశాల. “మమతలూరు మనసే మానిత మ్ము ఇలలోన” [107] “కంటి పాప లాగా కాచుకో స్నేహము/ స్నేహమన్నదొక్క చెలిమ నిజము” [98] ‘మరచి కల్మషమ్ము మమతలె పంచాలి” “చిలిపితనం తోటి చేసిన తప్పులు/ మరువ వలెను మీరు/చెలిమితో మన్నించు” [13] “మాట కలుప వలెను మంచికొరకు” [30] “తుడిచి వైరము లను దొరలనీ మైత్రిని” [55] అని స్నేహన్ని నిలుపుకునే హిత మార్గమూ చెబుతుంది. కుటుంబం పట్ల ఒక ఆవ్యాజ అనురాగాన్ని కల్పిస్తుంది. “అమ్మ నాకు నీవే యవని లో సర్వము/ భువికి దిగిన సిరుల బొమ్మవమ్మ” [43] అంటూ అమ్మను పరమాత్మ రూపమని సంభావిస్తుంది. ఇక నాన్న యన్ననాయకుడే/ “వయసు మరచి (తనతో) ఆడు పసివాడు మా తాత.” [45] ఇక “తాత బామ్మగార్లు తరగని యాస్థులు పలుకు పలుకులన్నీ బలిమి, కలిమి” [67] అంటూ పిల్లలతో కుటుంబ సంబంధాల లోని గరిమను, మధురిమను ఆస్వాదింప జేశారు.
పిల్లలలో ఒక ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మాభిమానాన్నిమేలుకొలిపే భావ విత్తనాలు ఎన్నో ఎదలలో జల్లారు. “తప్పు చేయనపుడు తల దించుకోవద్దు” [18] “ఒప్పు కాని వాటిని ఒప్పబోకు” [93] “పంచుకున్న కొద్ది పరిమళించు తెలివి” [37]. ఇవి పిల్లలకు చెప్పే నీతి వాక్యాలలో గతంలో లేని ఆలోచనలు.
అక్కడక్కడా రచయిత్రి డాక్టరుగా కూడా కొన్ని సలహాలు ఇచ్చారు. ఆరోగ్యానికి ప్రాణాధారం ఒత్తిడి లేకుండా హాయిగా గడపటమే కనుక “ప్రాణవాయువౌను పక పకానవ్వుట/చిందులే మురిపము చిన్ననాడు (65) “ఆరు బయట పగలు, హాయిగా తిరిగిన ఎండ పొడకు వచ్చు మెండు మేలు (22) అని చెబుతారు. ఆరోగ్యానికి మరో రక్షణ కవచం సరైన ఆహారం. దాని గురించి మంచిసూచన ఇచ్చారు. “జంకు ఫుడ్డు హాని సలుపునటంచుచూ/ అందుబాటు నుంచు టెందుకంట/ఎదుట యుంచి యేల ఏడిపించెదిరిలా” (62) “బయటి తిండి నెపుడు బాగు కాదంటారు/మేలు కాని దేల మించు దొరకు?” (16) అని పిల్లల దృష్టి నుంచి ప్రశ్నించారు. “ముద్దు జేసి, మమ్ము హద్దులో నుంచక” పిల్లలను దురలవాట్లకు మప్పుతున్నది తల్లి దండ్రులే. మళ్ళీ వాళ్ళే చెడ్డ పిల్లలనుట విడ్డూరమే కదా?” (19) అని ఆశ్చర్య పోతుంది రాగ.
పద్యాలను నోటికి వచ్చేలా చేయటానికి అనేక సామెతలు, నానుడులు ప్రయోగించారు. తెలుగు భాష లోని తియ్యదనాన్నిపరిచయం చేశారు. “కలుపు మొక్కలున్నచేనుకు చేరుపేను” [3], ఒక్క చెట్టు కాయ లొక్క తీరునుండునా?” [27], కాల గతియే మాన్పు గాయములను [38], అగ్గి నీటిలోన బుగ్గి కాదే, పంట ఒకటి వేయ ఫలితము వేరవునా? [57] అన్నవి పద్యంలో ఒద్దికగా ఒదిగి కూర్చున్నాయి. పదాలలో ఒక లయ, ఒక తూగు ప్రయోగించి అనేక పద్య పాదాలను సామెతల స్థాయికి తీసుకు వెళ్లారు. “ఇచ్చినంత మీకు వచ్చిచేరు” [6] “చిన్నమెచ్చుకోలు చేవను పెంచును [6] “వయసును మరచి వైనాలు పోవద్దు” [12] “హానికరపు మనిషిని ఆవలుంచు” [18], కించ పరచు వారి నెంచి దూర ముంచు” [29], “చింతలన్నీబాప చిరునవ్వు చాలదా?” [31] “అనుభ వమ్ము నేర్పునేనలేని పాఠములు” [32] “చిన్నకటువు మాట చెరుపును బంధాలు” [36] “పెదవి దాటనీకు పెళుసైన మాటను” [75] “ధనము కన్న క్షణము ఘనమని తెలుసుకో” [95], “పై మెరుగులు కాంచి భ్రాంతి పడకు” [107] --ఈ వాక్యాలన్నీ పునః ప్రవచించే లక్షణాలను పొడివి పుచ్చుకున్నాయి.
“జాతి, కులము, మతము జాడ్యమును వదిలి/ మనిషివన్న మాట మతిని నిలిపి/మంచి గుణము తోటి మానవతను పంచు/ రాగ మాట వినుము బాగు గాను (78) అన్న పద్యమొక్కటి చాలు ‘మతములన్నీ మాసిపోవును/జ్ఞాన మొక్కటి నిలిచి వెలుగును” లాగా చిరకాలం రాగ బాల శతకాన్నివెలిగించటానికి
“బాల్య దశకు మించి బంగారు సమయము/ఎంత వెదికి చూడు, సుంత లేదు/ మెరుగు పెట్టినంత, మెరుపులే జగమంత” (103). అలాంటి మెరుపులు కురిపించే ప్రయత్నం చేసిన రచయిత్రికి అభి నందనలు. తన రెండవ పుస్తకమే ఇంత శ్రేష్టంగా పిల్లల కోసం సృష్టించిన డాక్టర్ రాధారాణి గారికి శతకం చదివిన పిల్లలు, వారి తల్లి దండ్రులు తప్పకుండా కృతజ్ఞతలు చెప్పుకుంటారు. పిల్లకు ఇవ్వటానికి ఇది ఒక మంచి కానుక. ఈ శతకం ఒక బాలవికాస స్వర తరంగం.
-డాక్టర్ సూర్యజ


