
రాజా రవివర్మ జీవితం.. కళ వెనుకున్న కష్టాల గాథ
భారత చిత్రకళకు కొత్త రూపు ఇచ్చిన రాజా రవివర్మ జీవితం, ఆయన విజయాలు, కుటుంబ వేదనలు, కళా ప్రయాణం గురించి ప్రత్యేక కథనం.
చిత్ర కళా జగత్తులో రవివర్మ స్థానం శిఖరాయమానమైనది. పాశ్యాత్య చిత్రకళ పారిస్, డచ్, ఇంగ్లాండ్ లలో ఉజ్వలంగా వెలుగొందుతున్న కాలంలో ఆ ఉద్యమాలకు సమాంతరంగా స్వీయ ప్రతిభతో ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదుగుతూ దేశ విదేశాలలో సమున్నత ఖ్యాతిని సముపార్జించుకున్నవాడు ఒక్క రాజా రవివర్మ మాత్రమే. తన చిత్రాలతో భారత దేశమంతటా ఇంటింటి పేరుగా మారినవాడు కూడా ఒక్క రాజా రవివర్మ మాత్రమే. రామాయణ, భారత, భాగవతాది పురాణ పాత్రలకు అంతకు ముందు చిత్రకళా జగత్తులో రూప చిత్ర (portraits) ప్రయత్నం జరగలేదు.
శిల్ప కళలో కొంత ప్రయత్నం జరిగినా అదికూడా సంపూర్ణంగా లేదు. రవివర్మ ఆగమనము తోనే చిత్రకళలో పురాణ పాత్రలకు రూప చిత్ర శకం ప్రారంభమైయింది. తన భాల్యం నాటికి చిత్రకళా ప్రపంచంలో విరివిగా ఉన్నవి నీటి రంగుల చిత్రాలే. భారత దేశం, జపాన్, చైనా లాంటి ఆసియా దేశాలలో నాడు చలామణిలో ఉన్న సాంప్రదాయం ఇదే. రవివర్మ తన కిళిమానూరు దివాణంలో మేనమామ రాజరాజ వర్మ వద్ద నేర్చుకున్నది ఈ నీటి రంగుల చిత్ర కళనే. కాల గమనములో పాశ్చాత్య చిత్ర కారుల తైలవర్ణ (Oil Painting) చిత్రాలతో ప్రభావితుడై, ఆ రంగులలోని మహోజ్వల కాంతి, మెరుపులకు ఆకర్షితుడై కొంత గురు ముఖాన, కొంత గ్రంధాధ్యయనము, ఇంకొంత స్వీయ సృజనాత్మక కృషితో తైల వర్ణాల మేళవింపులోను కుంచె పైన పట్టు సాధించి ఎన్నో అజరామరమైన రూప చిత్రాలను వేసాడు రవివర్మ.
భారతీయ పురాణ పాత్రలకు ఒక రూపు నిచ్చింది రవివర్మయే. నాటి బ్రిటిష్ ప్రభుత్వం చేత కైజర్ ఐ హింద్ లేదా రాజా అనే బిరుదుని అందుకునే స్థాయికి అతనిని తీసుకెళ్ళింది అతని యొక్క ఈ ప్రతిభయే. తిరువాన్కూర్ సంస్థాన ఆస్థాన చిత్ర కారునిగా ఒక స్థాయిని ఇచ్చింది, ఎంతో మంది చిత్రకారులకు అసూయకలిగించిందీ, సంస్థానాధీసులు, జమిందారులు, మహారాజాలు, బ్రిటిష్ రెసిడెంట్లు, గవర్నర్లు ఆహ్వానించి తమ రూప చిత్రాలను గీయించు కునేట్టు చేసింది కుడా రవివర్మలో దాగి ఉన్న ఎవరికీ సాధ్యం కానీ ఈ నిగూఢ చిత్రకళా వైదుష్యమే. కృష్ణుడు వేణువు ఊదినంత సహజంగా, కోకిల పాడినంత సజీవంగా, అరుణోదయమంత ఉజ్వలంగా ఉంటుంది అతని చిత్రము.
అయితే యిదంతా ఒక ఎత్తు, కళారాధన మాటున అతను పడిన క్లేశాలు, వేదనలు, వైవాహిక బంధంలో పొడసూపిన పగుళ్ళు మరో ఎత్తు. పర్వతమంత ఎత్తున పోగుపడిన కష్టాల్ని అధిగమించి తన చిత్రకళా సాధనతో కీర్తి శిఖరాన్ని అధిరోహిస్తాడు రవివర్మ. పురాణ పాత్రల రూపు రేఖల వర్ణనలైతే గ్రంధాలలో లభ్యమవుతున్నాయి గాని కేవలం వాటి మీదనే ఆధార పడి రూప చిత్రాలను వేయడం అసాధ్యము అని గ్రహిస్తాడు. అప్పటికి పాశ్చాత్య దేశాలలో మనుషులను ఎదురుగా పెట్టుకొని (models) తమకు కావాల్సిన భంగిమలలో చిత్రించే సాంప్రదాయం ఉన్నది. ఇది రవివర్మకి ఉత్తేజాన్ని ఇస్తుంది.
కాని భారతదేశం లాంటి సాంప్రదాయక దేశాలలో స్త్రీ పురాణ పాత్రల కోసమై మోడల్స్ గా ఒప్పుకునే వారు ఎవరుంటారు!? అతి కష్టం మీద తన అత్తవారి ఊరు అయిన మావేళికార దివాణంలో పనిచేస్తున్న ఒక సేవికను ఒప్పించి స్త్రీ రూప చిత్రాలను చిత్రించ గలుగుతాడు రవివర్మ. రాధ రూప చిత్రం అలా రూపు దిద్దుకున్నదే. ఇక తన చిత్రకళా ప్రయాణంలో రవివర్మ కి బొంబాయి తన రెండవ నివాసమౌతుంది. అక్కడ తమ్ముడు రాజవర్మ సహాయంతో లితోగ్రాఫ్ ప్రెస్ ప్రారంభిస్తాడు వాటి కోసం ఎన్నో చిత్రాలను వేస్తాడు. కొంత ప్రయత్నం మీదట బొంబాయిలో ముగ్గురు నలుగురు కళావంతుల స్త్రీలు మోడల్స్ గా కుదురుతారు. ఎన్నో చిత్రాలు దిగుతాయి. దేశవ్యాప్తంగా రవివర్మ గీసిన చిత్ర పటాలు, కేలండర్లు ఇంటింటా వెలుస్తాయి. తన సొంత సంస్థానమైన ట్రావెంకోర్ నుంచి మొదలిడి మద్రాస్, పుదుక్కోట, బొంబాయి, బరోడా, రీవా, పుదుచ్చేరి, గుజరాత్, ఉదయ్ ఘర్, మైసూరు, విజయనగరం, కురుపాం ఇలా నాటి జమిందారులు, సంస్థానాదిపతులు చివరికి హైదరాబాద్ నవాబు కూడా రవివర్మ చిత్రకళా ప్రతిభకు ముగ్దులై తమ చిత్రాలను వేయించు కుంటారు. రవివర్మ ప్రతిభ నాటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయిన లార్డ్ గర్జన్ కు కూడా తెలిసింది.
ఇంటా బయట ప్రతి ఒక్కరు తమ బొమ్మలు వేయించు కోడానికి ఎగబడుతుంటారు. ఈ కళా యజ్ఞంలో తనకి చేదోడు వాదోడుగా నిలుస్తాడు తమ్ముడు రాజా వర్మ. వీరి సోదరత్వము నభూతో నభవిష్యతి. భార్య జానకిని యింటి వద్దనే వదిలి అన్నతో పాటుగా దేశమంతా పర్యటిస్తూ ప్రెస్, యితరత్రా లౌకిక వ్యవహారాలన్నీ తమ్ముడు చూసుకున్నాడు. అదే విధంగా రవివర్మ తన భార్య భాగీరధీ, మేనమామ రాజ రాజ వర్మ, తల్లి, మరో తమ్ముడు గోదా వర్మ మరణించి నప్పుడు ఆవేదనను దిగమింగి తట్టుకొని నిలబడగలుగుతాడు కాని తమ్ముడు రాజవర్మ మరణాన్ని మాత్రం జీర్ణించుకోలేక పిచ్చి పిచ్చిగా మారిపోతాడు రవివర్మ. చివరికి ఆ ఆవేదన తోనే పలవరిస్తూ మరణిస్తాడు కూడా. తమ్ముని మరణానంతర రవివర్మ జీవితాన్ని చదివే టప్పుడు పాఠకులు కూడా ఏంతో దిగులు చెందుతారు.
రవివర్మది నాయర్ కులము. ఒకప్పుడు కాలికట్ లోని వీరి నాయర్ రాజ్యాలపై హైదర్ అలీ, టిప్పుసుల్తాన్ మొదలగు మైసూరు సుల్తానులు దండెత్తి నాశనం చేయడం తో వీరి పూర్వులు కాలికట్ వదిలి తిరువాన్కూరు వస్తారు. అప్పటి కేరళలోని మాతృస్వామిక సమాజ నిర్మితిలో నంబూదిరి బ్రాహ్మణులు నాయర్ క్షత్రియ స్త్రీలను వివాహమాడే ఒక సంప్రదాయం ఉంది. రవి వర్మ తండ్రి నంబూదిరి తల్లి నాయర్. ఇక్కడ ఆస్తులకు అధికారానికి స్త్రీలదే వారసత్వము. తన కిళిమానూరు దివాణానికి తల్లే కారణవన్ అంటే యజమనురాలు. ఆమె అనంతరము రవివర్మ సోదరి కారణవన్ అవుతుంది. తన అవసాన దశ వచ్చేటప్పటికి రవివర్మ మనవరాళ్ళు ట్రావెన్కోర్ సంస్థానానికి రాణులు అవుతారు.
రవివర్మ తన చిత్ర కళా జీవితంలో ఆనాటి ప్రముఖులు దాదాబాయి నౌరోజీ, తిలక్, మహాదేవ్ గోవింద రనడే, సురెంద్రనాద్ బెనర్జీ, అరవింద ఘోష్, గురజాడ అప్పారావు, ఇంగ్లాండ్ ను సందర్శించిన మొదటి తెలుగు మహిళా జానకమ్మ, వివేకానంద లాంటి ఎందరో దేశీయ ప్రముఖులను కలుస్తాడు. ఒకరిద్దరు ముఖ్యంగా అరబింద ఘోష్, గురజాడ తప్ప అందరూ అతని రూప చిత్రకళను ప్రశంచినవారే. అయితే అతని మొత్తం కళ, వైయుక్తిక జీవితాన్ని తరచి చూచినపుడు అతని లోని బహు రూపాలు గోచరిస్తాయి. రవి వర్మ ఒక కళాకారుడు, ఒక సౌందర్యా రాదకుడు, ఒక వనితాసక్తుడు, ఒక వియోగ దహితుడు, ఒక నిత్యాన్వేషకుడు, ఒక ఆవిష్కర్త, ఒక అనుగామి, ఒక స్వేచ్చా ప్రియుడు, ఒక శృంఖలా బద్దుడు, ఒక కీర్తి లాలసుడు, ఒక సాహసి, ఒక పిరికిపంద, ఒక స్వార్దపరుడు, ఒక దయాళువు కుడా.
ఈ కోణాలన్నిటిని సంపూర్ణంగా తెలుసుకోగోరేవారు, రవివర్మ నిజరూప దర్శనాన్ని చేయ్యాలనుకునేవారు పి.మోహన్ రచించిన జీవిత నవల ‘’రాజా రవివర్మ’’ చదివి తీరాల్సిందే. పి.మోహన్ తన చివరి మాట లో ‘’ఈ నవల లో వాస్తవము ఎంత అని పాఠకులకు అనుమానం రావచ్చు. ఇందులోని ఘటనలలో, పాత్రలలో ముప్పావు వంతుకు పైగా వాస్తవమే. చారిత్రక ఘటనలు, రవివర్మ చిత్రాలు ఆధారంగా కొన్ని సన్నివేశాలను కల్పించాను. అంతే గాక రూపిక చావ్లా, మనుపిళై, దీపంజన పాల్, బాలకృష్ణన్ నాయర్ మొదలగు వారు రవివర్మ కళా జీవితం పై రాసిన పుస్తకాలు, వ్యాసాలు, రాజ రాజ వర్మ డైరీలు, రవివర్మ ముని మనువరాలు చిత్ర కారిణి రుక్మిణి వర్మ వెల్లడించిన వివరాలు, కేరళ చరిత్ర పుస్తకాలు కూడా ఉపకరించాయి’’ అని అంటారు. తెలుగులో సాహిత్య కారుల ఆత్మ కథలు, జీవిత చరిత్రలు ఉన్నాయి. కానీ చిత్ర కళాకారులవి బహు అరుదు. ఈ దృష్టితో చూసినపుడు దేశంలోనే విఖ్యాత చిత్రకారుడైన రవివర్మ జీవితాన్ని తీసుకొని ఒక నవల గా తెలుగులో తీసుకురావడం దానికదే ఒక ప్రత్యేకత. అందుకు పి. మోహన్ గారు ఎంతైనా అభినందనీయులు. తెలుగు సాహిత్యంలో ఈ నవల స్థానం విశిష్టమైనది. దీనిని ఒక వినూత్న ప్రయోగాత్మక నవలగా అభివర్ణించవచ్చును.

