నేటి భారతంలో అత్యాచార పర్వం “సహాన” నాటకం
x

నేటి భారతంలో అత్యాచార పర్వం “సహాన” నాటకం

డాక్టర్ జతిన్ కుమార్ ‘సహాన’ సమీక్ష


‘రసరంజని’ ఆధ్వర్యంలో గుంటూరు అభినయ ఆర్ట్స్ వారు ఇటీవల హైదరాబాద్ రవీంద్రభారతి వేదికపై ప్రదర్శించిన ‘సహాన’ నాటకం ప్రేక్షకులను వెన్నాడుతుంది.

కలచి వేస్తుంది.ఆలోచనలతో కాల్చివేస్తుంది. ఈ సమాజం మహిళల పట్ల ఎంత అమానుషంగా ప్రవర్తిస్తున్నదీ చూసి తలదిoచుకుని సిగ్గుపడేలా చేస్తుంది.ఈ నాటకంలో చిత్రించబడ్డ సంఘటనలు, పాత్రలు చాలా వరకు మనకు తెలిసినవే. వాళ్ళు సమాజంలో నుంచి రంగస్థలం మీదికి నేరుగా నడిచివచ్చి మనలను నిగ్గదీస్తారు. దానివల్ల రంగస్థలం మీద కనిపించిన పాత్రలకు మించిన నేపథ్యం మనకు సాక్షాత్కరిస్తుంది. మనం నిర్విణ్ణులమై మిగిలిపోతాము.

ఆనందం అర్ణవమైతే, అనురాగం అంబరమైతే, ఆ జీవనం ఆనందపు లోతులు చూస్తుంది. వాయులీన సంగీతమై, కలల నదిలో పువ్వుల పడవలా సాగి పోతూ వుంటుంది. అలా వాయులీన రాగమై సాగిపోతున్న ఒక యువ డాక్టరు సహాన. అల్లారుముద్దుగా చూసుకునే తండ్రి వాసుదేవరావు, జీవన భరోసాగా నిలిచిన ఆదర్శ భావుకుడు, తోటి వైద్య విద్యార్థి చైతన్య స్నేహ సాంగత్యాలతో ఆమె ఓ ఆనంద భైరవి. అలాటి కుదురైన జీవితాన్ని పెద్దకుదుపుకు, కలవరపాటుకు గురి చేస్తూ ఆ నగర మేయర్ రత్నావళి కొడుకు, సహాన సహాధ్యాయి డాక్టర్ గుణవర్ధన్ ఆమె పై మోజు పెంచుకుని “అవునంటే ఆడుకుంటా! కాదంటే కాటువేస్తా” అనే రీతిలో ఆమెను వెంటాడుతుంటాడు. అతను అదునైన అవకాశం చూసుకుని హాస్పిటల్ డ్యూటీలో వున్న సహాన పై అత్యాచారం చేస్తాడు. ధనమదమూ, కుటుంబ రాజకీయ ప్రాబల్యమూ తనను అన్నివేళలా కాపాడగలవని, తనను ఎవరూ ఏమీ చేయలేరని అతని మూర్ఖ విశ్వాసం. అత్యాచారానికి గురైన కూతురుని చూసి తల్లడిల్లుతూనే, దుఖంలో మునిగిపోయిన సహానకు తోడుగా నిలుస్తాడు తండ్రి “తప్పు చేశావమ్మా! పెద్ద తప్పు చేశావు” అంటూ ఆపిల్ల చేతిలో పిస్టల్ పెట్టి నేరస్తుడిని కాల్చి చంపమని ఆక్రోశిస్తాడు. తరువాత ఆవేశం తగ్గించుకుని జీవితం అంటేనే పోరాటం, మౌనంగా భరించటం కాదు ఎదుర య్యే సుడిగుండాలను ఎదుర్కుని అధిగమించటమే ధీర గుణం అని సహానకు ధైర్యం నూరిపోస్తూ మరే ఆడ పిల్లకు ఇలాంటి స్థితి కలగకూడదు, నేరస్తులు తప్పించుకు పోకూడదు అని తండ్రీ కూతుళ్ళు న్యాయ పోరాటం కొనసాగిస్తారు. ఆ పోరాటమే ఈనాటకం.

*******

లైంగిక అత్యాచారాలకు సంబంధించి మనదేశంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలను తెలుసుకుందాము.

9 ఆగస్టు 2024న, కోల్కతాలోని ఆర్జి కార్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ డ్యూటీలో ఉన్న 28 సంవత్సరాల మహిళా డాక్టర్ పై ఆసుపత్రి సెమినార్ గదిలోనే అత్యాచారం, హత్య జరిగింది. డాక్టర్ పై అత్యాచారం-హత్య భారతదేశాన్ని కుదిపేసింది. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్ నే కాదు మొత్తం దేశం యొక్క మనస్సాక్షిని కదిలించింది. దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. పోలీసులు ఈ నేరంలో కోల్కతా పోలీసులతో పౌర స్వచ్ఛంద కార్యకర్త గా ఆ హాస్పిటల్ లోనే పనిచేస్తున్న సంజయ్ రాయ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతను ఒంటరిగానే నేరం చేశాడని నేర పరిశోధకులు భావించారు, కాని బాధితు రాలి కుటుంబమూ, జూనియర్ వైద్యుల సమూహాలూ ఈనేరంలో ఏదో విస్తృత కుట్ర, ఇతరుల పాత్ర వుందని అనుమానించాయి. హస్పీటల్ సూపరింటెండెంట్ ను బదిలీ చేశారు. ప్రిన్సిపల్ తన పదవి నుండి దిగిపోయాడు. ఆగస్టు 17 న బాధితురాలికి సంఘీభావం తెలుపుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపుకు దేశ వ్యాప్తంగా వైద్యులు 24 గంటల పాటు వైద్య సేవలను నిలిపివేశారు. దేశవ్యాప్తంగా ఆందోళన విస్తరించింది. వివిధ వైద్య కళాశాలల విద్యార్థులు ప్రజలతో కలిసి రాత్రి వేళ టార్చ్ ఊరేగింపులు, కొవ్వొత్తుల ప్రదర్శనలు, పగటిపూట శాంతియుత కవాతులు జరిపారు. దీర్ఘకాలం నిరసన శిబిరాలు, నిరాహార దీక్షలు నిర్వహిం చారు. దేశంలోనే అత్యంత సురక్షిత మైనదిగా పరిగణించబడే నగరంలో మహిళల భద్రత, వైద్యుల భద్రత గురించి సమస్యను లేవనెత్తిన ఈ కేసును చివరికి కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కు అప్పగించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, దేశంలో జరుగుతున్నమహిళల పై హింస అంశాన్ని తమతమ రాజకీయ లబ్ధికోసం పరస్పర ఆరోపణలతో పక్కదారి పట్టించాయి. ఆగస్టు 20, 2024న ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంలో జాప్యం చేసినందుకు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని, కోల్కతా పోలీసులను, ఆసుపత్రి యంత్రాంగాన్ని విమర్శించింది. సెప్టెంబర్ 2, 2024న సిబిఐ ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ను అరెస్టు చేసింది. జనవరి 18, 2025న సెషన్స్ కోర్టు రాయ్ ను దోషీగా తేల్చింది. నిందితుడికి జీవిత ఖైదు విధించింది. బాధితురాలి తల్లిదండ్రులు ఈ కేసును సీబీఐ సక్రమంగా దర్యాప్తు చేసి ఉంటే పలువురిని అరెస్టు చేసి దోషులుగా తేల్చేవారని భావించారు. దోషికి ఇచ్చిన తీర్పుతో తాను సంతృప్తి చెందలేదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. భయంకరమైన నేరానికి దోషిగా తేలిన నిందితుని తల్లి “ఈ నేరానికి కోర్టు అతన్ని ఉరితీస్తే కూడా నాకు ఎటువంటి బాధ వుండదని” చెప్పారు. సీబీఐ నిందితునికి మరణశిక్ష విధించాలని కలకత్తా హైకోర్టులో అప్పీల్ చేసింది. నిoదితుడు నేరం తో తన కేమీ సంబంధంలేదని, ఈ కేసులో తనను ఇరికించారని అప్పీల్ చేసుకున్నాడు. ఆగస్టు 9, 2025న సరిగ్గా సంఘటన జరిగిన సంవత్సరానికి కూడా బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజలు కోల్ కతాలో నిరసనలు తెలిపి రాష్ట్ర సచివాలయానికి రాలీమార్చ్ నిర్వహించారు.

2019లో జరిగిన “దిశ" కేసు దారుణ ఘటనను మరచిపోలేము. బాధితురాలు హైదరాబాద్ లో వెటర్నరీ డాక్టర్‌. నవంబర్ 27, 2019 శంషాబాద్ దగ్గర టోల్ ప్లాజా వద్ద నిందితులు ముందుగా ఆమె స్కూటీ టైర్ పంక్చర్ చేసి, సహాయం పేరుతో ఆమెను మోసం చేశారు. తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారం చేసి, హత్య చేసి, శరీరాన్ని కాల్చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. నవంబర్ 29న నలుగురు నిందితులను అరెస్టు చేసి, విచారణ ప్రారంభించారు. డిసెంబర్ 6, 2019 న పోలీసులు నిందితులను క్రైమ్ సీన్ (చటాన్‌పల్లి ప్రాంతం) కు తీసుకెళ్లీ ఎనకౌంటర్ చేశారు. నిందితులు ఆయుధాలు లాక్కొని పారిపోవడానికి ప్రయత్నించారనీ అందుకే “ఆత్మ రక్షణకోసం కాల్పులు జరిపామని పోలీసులు చెప్పారు. ఈ ఘటనలో నలుగురు నిందితులు అక్కడికక్కడే చని పోయారు. అప్పుడు చాలా మంది ప్రజలు ఈ చర్యను ప్రశంసించారు. “instant justice” అని భావించారు. అయితే తరువాత ఈ ఎన్కౌంటర్‌పై సుప్రీంకోర్టు ఒక విచారణ కమిషన్ నియమించింది. 2022లో ఆ కమిషన్ ఇది “నకిలీ ఎన్కౌంటర్ “(fake encounter) అని అధికారికంగా తేల్చడం వల్ల పెద్ద వివాదంగా మారింది. 10 మంది పోలీసులపై హత్య కేసు పెట్టాలని సూచించిoది. ఈ కేసు వల్ల: మహిళల భద్రతపై దేశవ్యాప్తంగా చర్చ పెరిగింది. కఠిన చట్టాల అవసరం గురించి డిమాండ్లు వచ్చాయి. తెలంగాణలో “దిశ చట్టం” వంటి ప్రతిపాదనలు వచ్చాయి.

అంతకు ముందు నిర్భయ పై జరిగిన దారుణ సంఘటన గుర్తుకొచ్చిందా! 2012 డిసెంబరు 16 న ప్రభుత్వ బస్సులో 23 ఏళ్ల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిoది. ఒక రాడ్ తో ఆమె స్నేహితుణ్ణి చావబాది ఆమె అంగాలను, పేగులను ఛిద్రం చేశారు. బాధితురాలిని కాపాడటానికి శస్త్రచికిత్స చేయవలసివచ్చింది. అయినప్పటికీ దాడి జరిగిన పదమూడు రోజుల తరువాత ఆమె మరణించింది. ఈ సంఘటన తో రాజధాని ఢిల్లీ అంతటా పెద్ద అలజడి చెలరేగింది. లోక్ సభలో అప్పటి ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ "రేపిస్టులను ఉరితీయాలి" అని డిమాండ్ చేశారు. డిసెంబరు 22 న జరిగిన భారీ నిరసన ప్రదర్శనలో వేలాది మంది ప్రజలు, ఎక్కువగా యువకు లు పాల్గొన్నారు. అత్యాచారానికి పాల్పడినట్లు అనుమానిoచిన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఒకరు బాల నేరస్థుడు. విచారణ తరువాత అతనికి జైలు శిక్ష విధించగా, ఐదుగురు నేరస్థులలో ఒకరు విచారణకు ముందు ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన నలుగురిని 2020 లో ఉరితీశారు.

2013 ఆగస్టులో ముంబైలోని ఒక ఆంగ్ల భాషా పత్రికలో ఇంటర్న్ అవుతున్న 22 ఏళ్ల ఫోటో జర్నలిస్టు పై దక్షిణ ముంబైలోని మహాలక్ష్మి సమీపంలోని శక్తి మిల్స్ కాంపౌండ్ లో ఒక బాలుడితో సహా ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. చాలా చురుకైన నైట్ లైఫ్ గల ముంబై మహిళలకు సురక్షితమైన స్వర్గధామంగా పరిగణించబడుతూ వున్నందున ఇది దేశవ్యాప్తంగా నిరసనలకు కారణమైంది. నిందితులను దోషిగా తేల్చి ముగ్గురు నేరస్థులకు మరణశిక్ష విధించారు. అయితే, 2021 నవంబరు 25 న బొంబాయి హైకోర్టు మూడు మరణశిక్షలను జీవిత ఖైదుగా మార్చింది

ఒడిశాలోని జలేశ్వర్ కు చెందిన యువతి ఒకరు కోల్ కతాకు 170 కిలోమీటర్ల దూరంలో గల అతిపెద్ద పారిశ్రామిక కేంద్రo – దుర్గాపూర్- సమీపంలో ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ డిగ్రీ రెండవ సంవత్సరం చదువు తోంది. ఆ విద్యార్థినిని అక్టోబర్ 14, 2025 న ఆసుపత్రి ప్రాంగణం సమీపంలోకి ఈడ్చుకెళ్లి కొందరు అత్యాచారానికి పాల్పడ్డారు. సామూహిక అత్యాచారం ఆరోపణలపై ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. “ఆమెను డాక్టర్ చేయాలనే కలతో ఆమెను కళాశాలలో చేర్పించానని "నా కుమార్తెకు న్యాయం జరగాలని, మరే అమ్మాయికి ఇలాంటి సంఘటనలు జరగకూడదని నేను కోరుకుంటున్నాను.” అని ఆమె తండ్రి వాపోయాడు. ‘క్యాంపస్ లో సరైన భద్రత లేదు' అని ఆయన ఆరోపించారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ నేరాన్ని ఖండిస్తూ "ఈ సంఘటన గురించి విని నేను షాక్ కు గురయ్యాను. అయితే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కూడా తమ విద్యార్థులను, ముఖ్యంగా ఆడపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. వారిని రాత్రిపూట బయటకు రానివ్వకూడదు. వారు తమను తాము రక్షించుకోవాలి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్థులు రాత్రిపూట బయటకు వెళ్లవద్దని కోరుతున్నాను.” అని ఆడపిల్లలకు హితవు(!) చెప్పారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు రాజకీయవేత్తలు, కొందరు ప్రవచనకారులు, నీతిబోధకులు బాధితురాలిని, ఆమె వస్త్రధారణని తప్పుబడుతూ, రాత్రి సమయంలో ఆడపిల్ల ఎందుకు బయటికి వెళ్ళింది అంటూ ఆరా తీస్తూ బాధితురాలి నే అపరాధిగా చిత్రించే ప్రయత్నం చేస్తుంటారు. అరిటాకు- ముల్లు కథలు చెబుతూ నేరo చేసిన మగవాని తోపాటు ఆ స్త్రీకి కూడా అన్యాయంగా నేరంలో బాధ్యత అంటగడతారు. రచయిత స్నిగ్ధ ‘సహాన’ నాటకంలో ఇలాటి అనేక హీనమైన సంఘటనలను చూసి, చలించి వాటిని ఎంతో భావో ద్వేగo తోను, ఆలోచన స్పోరకంగాను చిత్రించారు. ఈ దుస్సంఘటనకు బలైన స్త్రీలు పరిస్థితులను ఎలా ఎదుర్కో వాలో, వారిపట్ల కుటుంబమూ, సమాజమూ ఎలా సానునయంతో ప్రవర్తించాలో చాలా చక్కగా ప్రతిపాదించారు.

ప్రపంచ బ్యాంకు డేటా 2023 ప్రకారం, భారత జనాభాలో 48.4% మంది మహిళలు. వారు సదా గౌరవంతో ఆదరంగా చూడబడతారని చెప్పుకుంటాం. “యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః।యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రాఫలాః క్రియాః” అని వల్లె వేస్తుంటాము. అయితే, క్షేత్రస్థాయిలో, దృశ్యం పూర్తిగా భిన్నంగా ఉంది, ఇది సమాజంలోని స్త్రీ జనానికి వ్యతిరేకంగా భయంకరమైన నేరాల చుట్టూ తిరుగుతొంది. భారతదేశం లో మహిళలపై లైంగిక హింస, శారీరక వేధింపులు వేగంగా పెరుగుతున్నాయి, ఈ అగ్నిపర్వత పెరుగుదలను అరికట్ట డానికి జీవన సంస్కారం, సామూహిక సంస్కృతి, సమూలంగా మార్చుకోవలసి వున్నది. స్త్రీని అబలగా, రెండవ తరగతి పౌరురాలిగా, కామోద్దీపనకో, సంతాన ఉత్పత్తికో పనికి వచ్చే జీవిగా మాత్రమే చూసే, భావించే సంస్కృతినీ, “న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి” అనే వైఖరినీ వొదుల్చుకోవాలి.

భారతదేశంలో మహిళలపై అత్యాచారం అత్యంత సాధారణ నేరాలలో ఒకటి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2018 లో, భారతదేశంలో సగటున ప్రతి 15 నిమిషాలకు ఒక మహిళ అత్యాచారానికి గురయ్యింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో [ఎన్సీఆర్బీ] 2021 వార్షిక నివేదిక ప్రకారం, దేశవ్యాప్తంగా 31,677 అత్యాచార కేసులు నమోదయ్యాయి అంటే రోజుకు సగటున 86 కేసులు. 2022 సంవత్సరానికి సంబంధించి 31,000 లైంగిక వేధింపుల కేసులు, 2024 లో 30 వేలకు పైగా అత్యాచార కేసులు నమోదయ్యాయి. అత్యాచార నిందితులలో 44% మంది బాధిత మహిళల బంధువు లేదా కుటుంబ సభ్యుడిగా గుర్తించారు. అయితే మనదేశంలో, కుటుంబ పరువు ప్రతిష్టల భీతి, వ్యక్తిగత సామాజిక కళంకం గురించిన సిగ్గు, అవమానానికి భయపడుతున్నందున, కులవివక్ష తో జరుగుతున్న బెదిరింపు లు, ధనికులు ప్రతీకారo తీర్చుకుంటారనే భయం వల్ల, నేరస్థుడు కుటుంబ సభ్యుడో, పరిచయస్తుడో కావటం లేదా తగిన సాక్ష్యాధారాలు సేకరించ లేక పోవడం, న్యాయ వ్యవస్థపై విశ్వాసం లేకపోవడం, కారణంగా ఎక్కువ మంది పోలీస్ రిపోర్టు చేయరు. అత్యాచారం గురించి బయటకు చెప్పుకోరు. ముఖ్యంగా పేద వర్గాలు తమ ఖర్మ అనుకుని నోరు మూసుకు కూర్చుంటున్నారు. లక్ష ద్వీప్, నాగాలాండ్ వంటి చిన్న లేదా మారుమూల ప్రాంతాలలో, సాంస్కృతి క నిబంధనలు, సమాజ ఒత్తిళ్లు బాధితులను రిపోర్టు చేయడానికి ముందుకు రాకుండా మరింత నిరోధిస్తాయి. దీని వల్ల నేరస్తులు హాయిగా తప్పించుకు తిరుగుతుంటారు. దీనికి తోడు సమాజం నుంచి “వాడు మగాడ్రా” అనే మద్దతు ఎలాగూ వుంటున్నది.

నేడు మన సమాజంలో ఎoత ఆధునికత చోటుచేసుకున్నా, అసాధారణమైన అభివృద్ధి జరుగుతున్నా, మహిళల పై హింస ఒక ముల్లుగా బాధిస్తూనే వుంది. రాజస్థాన్ లో లక్ష మంది మహిళలు, బాలికలలో 16.4 మంది పై అత్యా చారం జరగగా, ఛత్తీస్ గఢ్ లో 13.5, చండీగఢ్ లో 13.3, ఢిల్లీలో 12.9, హర్యానాలో 12.3 మంది పై ఆ నేరాలు జరుగుతున్నాయి. తమిళనాడులో అత్యల్పoగా 0.8 ఉండగా, అండమాన్ & నికోబార్ దీవులు, దాద్రా & నగర్ హవేలీ, డామన్ & డయ్యూ, జమ్మూ, కాశ్మీర్, లడఖ్, లక్షద్వీప్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్ , పుదుచ్చేరి, సిక్కిం, త్రిపురతో సహా పన్నెండు ప్రాంతాలు అత్యాచార రేటును 0 గా ప్రదర్శిస్తున్నాయి. ఇది డేటా విశ్వసనీయతను ప్రశ్నార్ధకం చేస్తోంది. సున్నా అత్యాచార రేట్లకు కారణం ఈ ప్రాంతాల లో లైంగిక హింస లేకపోవడం కాదు. ఈ ప్రాంతాలలో ప్రత్యేక అధికారలు వున్న మిలిటరీ, పారా మిలటరీ బలగాలు లైంగిక హింసకు తలపడుతు న్నాయని అనేక సంవత్సరాలుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి భయంతో వాటిని తక్కువగా నివేదిస్తున్నారు. డేటా సేకరణలో పరిమితులు, చికాకులు లేదా చిన్న జనాభా పరిమాణo లో లెక్కించ దగిన నిష్పత్తి లో కేసుల సంఖ్య లేక పోవటం వంటి సందర్భోచిత కారణాల కలయిక వుంది

మానవ హక్కుల సంస్థలు నిర్వహించిన పరిశోధన ఈ ప్రాంతాలలో లైంగిక హింస జరుగుతుందని సూచిస్తుంది, కానీ అది అధికారిక, చట్టపరమైన చట్రాలకు వెలుపల పరిష్కరించబడుతుంది. తమిళనాడు (0.8), ఆంధ్రప్రదేశ్ (2.7), కర్ణాటక (3.4) వంటి దక్షిణాది రాష్ట్రాలు తక్కువ రేట్లను నమోదు చేశాయి. ఇది సామాజిక వైఖరులు, చట్టo అమలు అవుతున్న తీరు, రిపోర్టింగ్ ను ప్రభావితం చేసే ఇతర సాంస్కృతిక కారకాలలో గల తేడాలను ప్రతిబింబిస్తుంది. కొన్ని రాష్ట్రాలు లైంగిక వేధింపుల గురించి నివేదించబడని కేసులను అంచనా వేయడానికి లేదా సర్వే చేయడానికి ప్రయ త్నించా యి. 2006 నివేదిక ప్రకారం 71% అత్యాచార నేరాలు నివేదించబడటం లేదు. నివేదించబడిన నాలుగు అత్యాచార కేసుల్లో ఒకటి మాత్రమే నేర నిరూపణకు దారి తీస్తుంది.

అనేక సంఘటనలు ఈ మధ్య విస్తృతo గా మీడియా దృష్టిని ఆకర్షించాయి. అత్యాచార బాధితులుగా ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గల వారి నుండి 6౦ సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గలవారు వుంటున్నారు. స్థానికo గాను, దేశవ్యాప్తంగాను ఆ సంఘటనలు ప్రజా నిరసనలను ప్రేరేపించాయి. 2018 జనవరి 17న జమ్మూ కాశ్మీర్ లోని కథువా సమీపంలోని రసానా గ్రామంలో ఆసిఫా అనే 8 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారు. ఏప్రిల్ 2018 లో గాని ఈ సంఘటన జాతీయ వార్తల్లో కి రాలేదు. ఇన్ని ప్రతికూల పరిస్థితులలో కూడా కొందరు బాధితులు కోర్టు గుమ్మం ఎక్కుతున్నారు. అయితే అనేక సందర్భాలలో కోర్టులు, సంస్థలు, నిబంధనల పేరిట, సాక్ష్యాల పేరిట మహిళా వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్నాయి. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి కైలాష్ ఘంభీర్ అత్యాచార శిక్షా నిబంధనలను మహిళలు తరచూ " పగ, ప్రతీకారం తీర్చుకునే ఆయుధం గా" దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. ఏప్రిల్ 2013 లో, న్యాయమూర్తి వీరేంద్ర భట్ అత్యాచారం కేసు అనేది ఎవరి పైనైనా నేరారోపణ చేయడానికి "సులభమైన ఆయుధం" అని బాధితురాలి ఏకైక ధృవీకరణపై ఆధారపది శిక్ష విధించటం తప్పని సూచించారు. 2014లో ఢిల్లీ మహిళా కమిషన్ సమర్పించిన నివేదిక ప్రకారం, 2012-13లో నివేదించబడిన అత్యాచారాలలో 53% 'అబద్ధం' అని పేర్కొన్నారు. అయితే వివిధ కారణాల వల్ల తమ కేసులను బలవంతo గా ఉపసంహరించుకున్నవారిని అబద్దపు ఆరోపణలు చేసినవారిగా ఈ కమీషన్ భావించింది.

*******

అత్యాచారాలు, మానభంగాలు, లైంగిక దాడుల చుట్టూ వున్న ఈ వాస్తవాల నేపథ్యంలో నాటకాన్ని మనం సమీక్షిoచుకోవాలి. అప్పుడే ‘సహాన’ లోని విశిష్టత, దాని ప్రాముఖ్యత మనo అర్ధం చేసుకోగలం. సహాన అన్న యువతి వొకవంక తనపై జరిగిన లైంగిక దాడి కలిగిస్తున్న వ్యధలో, ఆందోళనలో హృదిలో జ్వాలలు రేగుతున్నా, మరో వంక మరణానికి ప్రాణం పోసే చైతన్య రాగాలు పలికిస్తుంది. అమెకు తోడు తండ్రి కొండంత అండగా నిలుస్తాడు. ఆమె స్నేహితుడు చైతన్య పేరుకు తగ్గట్లు విద్యార్ధిలోకాన్ని తరలించి ఆమె విజయం సాధించే వరకూ పౌర సమాజం సహానకు తోడుగా నిలిచేలా ఉద్యమిస్తాడు. కుదుటపడ్డ సహానతో చివరకు కళ్యాణ రాగం ఆలపిస్తాడు. స్టేజి మీదకు రాని ఈ పాత్ర నాటకానికి చోదకశక్తిగా నిలుస్తుంది. ప్రధాన పాత్రలకు తోడుగా ఇతివృత్తాన్ని బలంగా చెప్పేందుకు మరికొన్ని పాత్రల చిత్రణ చాలా తోడ్పడింది. ముఖ్యంగా తన కూతురు, అల్లుడి చేతిలోనే హత్యకు గురైనా న్యాయ పోరాటంలో ఆ విషయం నిరూపించలేక; దుఖంతో, ఆవేశంతో, చిత్త చాoచల్యంతో తిరుగుతూ నేరస్తుడిని మట్టు పెట్టిన సహాన బాబాయి నారాయణ మూర్తి కథనం నాటకానికి తగిన మూడ్ కల్పించింది. వాసుదేవరావు స్నేహితు డు ఎదుటి పక్షానికి అమ్ముడుపోయిన న్యాయవాది -సత్యదేవ్ పాత్ర ద్వారా రేప్ కేసులలో ఇన్ కెమెరా విచారణలలో కూడా కోర్టు తతంగాలు ఎంత అమానుషంగా, ఆడపిల్లలకు ఎంత అవమానకరంగా బాధాకరంగా వుంటాయో తెలియజెప్పారు రచయిత. అత్యాచారాలలో కానివాళ్ళు కాకుల్లా పొడుస్తుంటే, మనవాళ్లు అనుకునేవాళ్ళు ఎలా మారిపోతారో మనలో ఎలా పిరికి మందు పోస్తారో ఈ కథనం తెలియజేస్తుంది. సహాన తో కేసు విరమింప జేయటానికి బెదిరింపులు, కుయుక్తులు, కరెన్సీ కట్టలు పనిచేయకపోవటంతో మేయర్ రత్నావళి గుణ వర్ధన్, సహానాలకు వివాహం చేసి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది. ఆతండ్రీ కూతుళ్ళు ఈ ప్రతిపాదనను పూర్తిగా తిరస్క రిస్తూ, “మగువల పట్ల ఏమాత్రం సద్భావన, గౌరవం లేని, మద మృగo లాంటి నీ కొడుకు తిరుగుతున్న గదిలో అతని కళ్ళముందు ఏ స్త్రీ అయినా స్వేచ్చగా సంచరించగలదా? అసలు మీరు తిరగ గలరా?” అని ఆవేదనతో ప్రశ్నిస్తాడు వాసుదేవరావు. సమాధానం లేని రత్నావళి అప్రయత్నం గా పైట సర్దుకుని వక్షాన్ని దాచుకుంటుంది. “వీడికి అమ్మలో కూడా ఆడదే కనిపిస్తుంది. అదే వాడి పైశాచిక స్వభావం” అని అర్ధం కాగానే ఆ తల్లి కొడుకుని పోలీసులకు అప్పచెప్పి సహాన కు చేతులెత్తి మొక్కుతూ వెళ్ళిపోతుంది. మానవ స్వభావాలనీ, సహజ మానవీయ విలువలనీ శిఖరాయమానంగా నిలిపిన దృశ్యం ఇది.

ఈ నాటకంలో పాల్గొన్న దర్శకుడు, నటుడు తండ్రి పాత్రధారి ఎన్. రవీంద్ర రెడ్డి నాటకంలోని అనేక సున్నిత సన్నివేశాలను అతి సునాయసంగా బొమ్మకట్టించారు. కూతురుగా కుమారి కుసుమ సాయి, బాబాయి నారాయణమూర్తిగా పీవీ మీరయ్య లు పాత్రోన్మీలనంగా, అర్ధవంతంగా నటించారు. సెట్టింగ్, లైటింగ్, మ్యూజిక్ కళాకారులు అందరూ అవధులలో వుండి రసావిష్కరణం చేశారు. స్నిగ్ధ రచనలో ముఖ్యంగా క్లయిమాక్స్ భావోద్వేగాలను సంతృప్తి పరుస్తుంది కానీ సమస్య లోతులను స్పృశించలేదు అనిపించింది. అత్యాచారం ఒక వ్యక్తి లోని ప్రకోపమా? మానసిక వైపరీత్యమా? సామాజిక ఆలొచనా ధోరణిలో మహిళల పట్ల దాగివున్న వివక్ష, చులకన భావాల ఫలితమా? తన ఆభిజాత్య, ఆధిపత్య భావ ప్రకటనా రూపమా? అనే చర్చ అవసరం. పంటికి పన్ను, కంటికి కన్నుఅనే ఇన్స్టంట్, ఇన్స్టింక్ట్ జస్టిస్ [ సత్వరం స్పందించే, సహజ ప్రవృత్తి జనిత న్యాయాన్ని] ధర్మబద్ద పరిష్కారంగా ఆధునిక ప్రపంచం అంగీకరించడంలేదని మనం గుర్తించాలి.

Read More
Next Story