‘వుడ్ ఆఫ్ ది గాడ్స్’ కోసం తెలంగాణ రైతుల కొత్త ప్రయోగం
x
అగర్‌వుడ్ ఫార్మింగ్ నిపుణుడు సంపంగి ప్రసాద్‌తో జర్నలిస్టు శ్యాంమోహన్

‘వుడ్ ఆఫ్ ది గాడ్స్’ కోసం తెలంగాణ రైతుల కొత్త ప్రయోగం

అగర్‌వుడ్ సాగుతో తెలంగాణ రైతులు కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. గల్ఫ్ మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉన్న ఈ సువాసన కలప రైతుల్లో ఆసక్తి పెంచుతోంది.


‘ ఈ చెట్టును “వుడ్ ఆఫ్ ది గాడ్స్ ” అని పిలుస్తారు.

సాధారణ చెక్కలా కనిపించే ఈ కలపలో అసలు మాయ ఫంగస్ వల్లే మొదలవుతుంది. చెట్టు కాండానికి గాయాలు ఏర్పడినప్పుడు ఒక ప్రత్యేక ఫంగస్ లోపలికి ప్రవేశిస్తుంది. అప్పుడు చెట్టు తనను తాను రక్షించుకునేందుకు సువాసనగల నల్లటి జిగురును ఉత్పత్తి చేస్తుంది.’ అన్నాడు సంపంగి ప్రసాద్.

విశాఖ శివారులోని ఒక గ్రామంలో మాకు ఆగర్‌వుడ్ తోటలు చూపించాడు. వాటి కాండానికి వైరస్ ఎలా ఇంజక్ట్ చేయాలో చూపించాడు.

అగర్ వుడ్ చెట్లకు వైరస్ ఇంజక్ట్ చేస్తున్న ప్రసాద్

అస్సాం రాష్ట్రంలోని Hojai . గ్రామ శివారులో పిట్టల కిలకిలారావాలు, పొడవైన చెట్ల మధ్య ఓ విచిత్రమైన దృశ్యం కనిపించింది. చెట్టు కాండానికి డ్రిల్లింగ్ మిషన్‌తో రంధ్రాలు చేస్తున్న ఓ యువకుడు... వెంటనే ఆ రంధ్రాల్లోకి సూదితో ఏదో ద్రావణం పంపిస్తున్న మరో రైతు!

ఆ దృశ్యాన్ని ఆశ్చర్యంగా తన సెల్‌ఫోన్‌లో బంధిస్తున్నారు తెలంగాణకు చెందిన యువ రైతు సంపంగి ప్రసాద్.

“సాధారణంగా చెట్టుకి తెగులు వస్తే రైతు భయపడతాడు. కానీ ఈ చెట్టుకి మాత్రం ఫంగస్ సోకాలి. అప్పుడే దీని విలువ పెరుగుతుంది. ఆ పరిమళం కోసం గల్ఫ్ దేశాలు కోట్ల రూపాయలు ఖర్చు పెడతాయి...” అని నవ్వుతూ చెప్పాడు ఆ అస్సామీ రైతు.

అది సాధారణ కలప కాదు. ప్రపంచ మార్కెట్లో ‘లిక్విడ్ గోల్డ’గా పేరొందిన అగర్‌వుడ్!

వరి పొలాల నుండి అగర్‌వుడ్ సాగు వరకు...

ఖమ్మం జిల్లా కొణిజర్లకు చెందిన సంపంగి ప్రసాద్ కుటుంబం వరి సాగు చేస్తోంది. కానీ “అందరూ చేసే పంటే ఎందుకు?” అన్న ఆలోచన అతడిని కొత్త దారిలో నడిపించింది. విదేశాల్లో ఉన్న బంధువుల ద్వారా అగర్‌వుడ్ గురించి తెలుసుకున్న ప్రసాద్, నేరుగా అస్సాం, మిజోరాం ప్రాంతాలకు వెళ్లి అక్కడి రైతులతో నెలల తరబడి గడిపాడు.

చెట్ల పెంపకం నుంచి ఫంగస్ ఇంజెక్షన్ వరకు ప్రతిదీ అధ్యయనం చేశాడు. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని కొందరు రైతులను ఒప్పించి దాదాపు 200 ఎకరాల్లో అగర్‌వుడ్ మొక్కలు పెంచుతున్నాడు.

విశాఖలో అగర్‌వుడ్ తోటల సాగులో రైతులు

అసలు ఈ అగర్‌వుడ్ అంటే ఏమిటి?

‘ అగర్‌వుడ్‌ను అగరు, గవురు, ఊద్ అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఇది అక్విలేరియా జాతికి చెందిన చెట్టు. వేల సంవత్సరాలుగా అరబ్ దేశాల్లో ధూపం, అత్తర్లు, ఆయుర్వేద ఔషధాల్లో దీనిని ఉపయోగిస్తున్నారు. కొన్ని మత గ్రంథాల్లో కూడా దీని ప్రస్తావన ఉంది. అందుకే దీనిని “వుడ్ ఆఫ్ ది గాడ్స” అని పిలుస్తారు.

సాధారణ చెక్కలా కనిపించే ఈ కలపలో అసలు మాయ ఫంగస్ వల్లే మొదలవుతుంది. చెట్టు కాండానికి గాయాలు ఏర్పడినప్పుడు ఒక ప్రత్యేక ఫంగస్ లోపలికి ప్రవేశిస్తుంది. అప్పుడు చెట్టు తనను తాను రక్షించుకునేందుకు సువాసనగల నల్లటి జిగురును ఉత్పత్తి చేస్తుంది. ఆ జిగురు చెక్కతో కలిసిపోయి సంవత్సరాల తర్వాత అరుదైన అగర్‌వుడ్‌గా మారుతుంది.’ అని సంపంగి ప్రసాద్ వివరించారు.

ఆయన తెలంగాణలోనే కాక విశాఖపట్నంలో కూడా పది ఎకరాలు లీజుకు తీసుకొని అగర్ వుడ్ చెట్లు పెంచుతున్నారు.

అదే ప్రపంచ మార్కెట్లో కోట్ల రూపాయల వ్యాపారం!

సహజంగా ఈ జిగురు ఏర్పడటానికి 20 నుంచి 30 సంవత్సరాలు పడుతుంది. కానీ ఇప్పుడు రైతులు శాస్త్రీయ పద్ధతుల్లో చెట్టుకు కృత్రిమంగా ఫంగస్ ఇంజెక్ట్ చేస్తున్నారు. అలా 20 ఏళ్ల ప్రక్రియను 7 ఏళ్లకు తగ్గిస్తున్న రైతులు

“ఫంగస్ చేరని చెక్కకు మార్కెట్లో పెద్దగా విలువ ఉండదు. సరైన సమయంలో ఫంగస్ ఎక్కిస్తే ఏడెనిమిదేళ్లలోనే చెట్టు మార్కెట్‌కు సిద్ధమవుతుంది,” అని రైతులకు శిక్షణ ఇస్తున్న కుమార్ వివరించారు. ఈయన అగర్ వుడ్ మొక్కల నర్సరీని హైదరాబాద్ సమీపంలోని షాద్ నగర్ వద్ద నిర్వహిస్తున్నారు.

చెట్టు లోపల గోధుమరంగు రెసిన్ పెరుగుతున్న కొద్దీ దాని విలువ కూడా పెరుగుతుంది. అని ఆయన అన్నారు.

తెలంగాణలో పెంపకం

జనగామ జిల్లా చినరామన్‌చెర్ల గ్రామానికి చెందిన అన్నెబోయిన మంజుల కుటుంబం తమ మామిడి, మునగ తోటల్లో అంతర పంటగా 300 అగర్‌వుడ్ మొక్కలు నాటింది.

జనగామలో జిగురు కలప చెట్లను పెంచుతున్న రైతులు

“మొదట్లో చుట్టుపక్కల వాళ్లు నవ్వుకున్నారు. ఇవేం పిచ్చి చెట్లు అన్నారు. కానీ మాకు నమ్మకం ఉంది. మేము ఒక్క పంట మీద ఆధారపడటం లేదు. మామిడి, మునగ, కూరగాయలు, వరి, పశుపోషణ... అన్నీ కలిపి సాగు చేస్తున్నాం. ఈ చెట్లు భవిష్యత్తులో పెద్ద ఆదాయం ఇస్తాయని ఆశిస్తున్నాం,” అని మంజుల చెబుతున్నారు.

గల్ఫ్ దేశాల్లో విపరీతమైన డిమాండ్

అగర్‌వుడ్ లేకుండా అత్తరు పరిశ్రమను ఊహించలేమని హైదరాబాద్ పాతబస్తీలోని వ్యాపారులు చెబుతున్నారు. గల్ఫ్ దేశాల్లో ధూపంగా కాల్చే ఈ చెక్క నుంచి వచ్చే పరిమళానికి విపరీతమైన డిమాండ్ ఉంది.

నాణ్యమైన అగర్‌వుడ్ ఆయిల్ ధర కిలోకు రూ.60 లక్షలకుపైగా పలుకుతుందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. చెక్క నాణ్యతను బట్టి కిలో రూ.4 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ధర ఉంటోంది.

రైతులకు కీలక సూచనలు

అగర్‌వుడ్‌ను ఒకే పంటగా సాగు చేస్తే మంచి ఫలితాలు రావని నిపుణులు చెబుతున్నారు.

కొబ్బరి, వక్క, కోకో, మామిడి, వేప వంటి చెట్ల నీడలో అంతర పంటగా పెంచితేనే మంచి వృద్ధి ఉంటుంది. మొక్కలు నాటే ముందు భూసార పరీక్షలు జరిపి వ్యవసాయ నిపుణుల సూచనలు అనుసరించాలి.

ఈశాన్య రాష్ట్రాల్లో వేల ఎకరాల్లో సాగవుతున్న ఈ అరుదైన చెట్టు... ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా నెమ్మదిగా అడుగులు వేస్తోంది.

ఒకప్పుడు రైతులు “పిచ్చి చెట్లు” అని ఎగతాళి చేసిన ఈ మొక్కలు... రాబోయే కాలంలో గ్రామీణ రైతుల అదృష్టాన్ని మార్చే “సువాసన బంగారం”గా మారుతాయేమో!

Read More
Next Story