137 ఏళ్లుగా ఆగని చార్మినార్ గడియారం..
x

137 ఏళ్లుగా ఆగని చార్మినార్ గడియారం..

"కాలాన్ని నడిపిస్తున్న మూడు తరాల కథ!”


హైదరాబాద్ అంటే ముందుగా గుర్తొచ్చేది చార్మినార్. 1591లో నిర్మించిన ఈ చారిత్రక కట్టడం నాలుగు శతాబ్దాలకు పైగా నగర పరిణామానికి సాక్షిగా నిలిచింది. అయితే చార్మినార్‌కి మరో ప్రత్యేక గుర్తింపు ఉంది. దాని నాలుగు వైపులా ఉన్న పురాతన గడియారాలు. 1889లో ఏర్పాటు చేసిన ఈ గడియారాలు ఇప్పటికీ టిక్‌టిక్‌ మంటూనే ఉన్నాయి.

“గడియారాలు లేని రోజుల్లో సమయాన్ని ఎలా తెలుసుకునేవారు?” అనే ప్రశ్నకు చరిత్రలో మరో ఆసక్తికరమైన సమాధానం కనిపిస్తుంది. నగర ప్రజలకు సమయాన్ని తెలియజేయడానికి నిర్ణీత సమయాల్లో నౌబత్ పహాడ్‌ నుంచి నగారాలు మోగించేవారని చరిత్రకారులు చెబుతున్నారు. కాలం మారింది. యాంత్రిక గడియారాలు వచ్చాయి. ఆ తర్వాత డిజిటల్‌ గడియారాలు, మొబైల్ ఫోన్లు వచ్చాయి. కానీ చార్మినార్ గడియారాలు మాత్రం తమ పని ఆపలేదు.

చరిత్రకారుడు డాక్టర్ దివానపల్లి సత్యనారాయణ చెబుతున్న వివరాల ప్రకారం, 19వ శతాబ్దంలో యాంత్రిక గడియారాలు హైదరాబాద్ ప్రజలకు కొత్త అనుభవం. ప్రముఖ అతిథులకు స్వాగతం పలకడంతో పాటు నగరవాసులకు ఆధునిక గడియారాల పరిచయం చేయాలనే ఉద్దేశంతో వీటిని చార్మినార్‌ నాలుగు వైపులా ఏర్పాటు చేసినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. 1889లో లండన్‌ నుంచి ఈ గడియారాలను తీసుకొచ్చినట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు.

డాక్టర్ ఎం.డి. ఘియాసుద్దీన్ అక్బర్, హైదరాబాద్ హిస్టారికల్ సొసైటీ సభ్యుడు, చార్మినార్ గడియారాల చరిత్రను వివరిస్తూ.. అప్పట్లో చార్మినార్ చుట్టుపక్కల ప్రాంతమే నగరానికి ప్రధాన కేంద్రంగా ఉండేదని చెబుతున్నారు. నాలుగు దిక్కుల నుంచి కనిపించేలా ఉన్న ఈ గడియారాలు నగరవాసులకు సమయం తెలుసుకునే ముఖ్యమైన ఆధారంగా మారాయని వివరిస్తున్నారు. గుల్జార్‌హౌజ్ వైపు ఉన్న గడియారం ప్రత్యేకంగా మోగే వ్యవస్థతో ఉండటం కూడా దీని ప్రత్యేకత.

అయితే నిజాం పాలన ముగిసిన తర్వాత ఈ గడియారాలకు కష్టకాలం వచ్చింది. నిర్వహణ లేకపోవడంతో గడియారాలు ఆగిపోయాయి. కొన్ని పాత భాగాలు కూడా కనిపించకుండా పోయాయి. 1962లో గడియారాలను తిరిగి పనిచేయించే బాధ్యత వాచ్‌ మెకానిక్ రసూల్‌ ఖాన్ తీసుకున్నారు. అందుబాటులో లేని కొన్ని భాగాలను స్వయంగా తయారు చేసి గడియారాలను మళ్లీ పనిచేసేలా చేశారు.

అక్కడి నుంచి మొదలైంది ఒక కుటుంబం మూడు తరాల ప్రయాణం. రసూల్‌ ఖాన్ తర్వాత ఆయన కుమారుడు సికందర్‌ ఖాన్ ఈ బాధ్యతను కొనసాగించారు. ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యుడు గులాం రబ్బానీ చార్మినార్ గడియారాల నిర్వహణను చూస్తున్నారు. ప్రతి 48 గంటలకు ఒకసారి గడియారాలకు కీ ఇవ్వాలి. గంటల ముల్లు, నిమిషాల ముల్లు పనిచేయడానికి వేర్వేరు బరువుల వ్యవస్థ ఉంటుంది. ఆ బరువులు క్రమంగా కిందకు దిగుతాయి. 48 గంటల్లోపు వాటిని మళ్లీ పైకి ఎత్తకపోతే గడియారం ఆగిపోతుంది.

“ప్రతి రెండు రోజులకు ఒకసారి వచ్చి గడియారాలకు కీ ఇవ్వాలి. ఈ పని ఆగితే గడియారం కూడా ఆగిపోతుంది” అని గులాం రబ్బానీ వివరిస్తున్నారు.అంటే.. వేలాది మంది రోజూ చూసే చార్మినార్ గడియారాల వెనుక, ఎవరికీ పెద్దగా కనిపించని ఒక నిరంతర శ్రమ ఉంది. మూడు తరాలుగా ఒక కుటుంబం ఆ బాధ్యతను మోస్తోంది.

చార్మినార్ కేవలం నాలుగు మినార్ల కట్టడం కాదు. దాని గడియారాలు కూడా హైదరాబాద్ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం. నగరం మారింది. జీవన విధానం మారింది. సమయాన్ని చూసే పద్ధతి మారింది. కానీ 135 ఏళ్లుగా ఈ గడియారాల టిక్‌టిక్ మాత్రం కొనసాగుతూనే ఉంది.కాలాన్ని చూపిస్తున్న ఈ గడియారాల వెనుక.. మూడు తరాలుగా సాగుతున్న ఒక కుటుంబం కథ కూడా అంతే ఆసక్తికరం.

Read More
Next Story