నిజాంలు ఈ బావి నీళ్లే తాగేవార‌ట‌! 356 ఏళ్ల రహస్యం..
x

నిజాంలు ఈ బావి నీళ్లే తాగేవార‌ట‌! 356 ఏళ్ల రహస్యం..

హైదరాబాద్‌లోని చారిత్రక బావులలో ఒకటి - నవాబ్‌ రుక్న్‌–ఉద్‌–దౌలా బౌలి


హైదరాబాద్‌ అంటే చార్మినార్‌, కోటలు, గుంబజాలే కాదు, శతాబ్దాల నాటి చెరువులు, బావులు, ఊటలు కూడా నగర చరిత్రలో భాగమే. అలాంటి అరుదైన జలవనరుల్లో శివరాంపల్లిలోని బుమ్‌–రుక్న్‌–ఉద్‌–దౌలా చెరువు ఒకటి. 1770 ప్రాంతంలో నిర్మించిన ఈ చారిత్రక చెరువు ఇప్పుడు మరోసారి వార్తల్లోకి వచ్చింది. కారణం. చెరువు కింద ఉన్న పురాతన ఊట బావికి హైడ్రా పునర్జీవం పోస్తుండటమే.

చారిత్రక కథనాల ప్రకారం, మూడో నిజాం సికందర్‌ జా కాలంలో అప్పటి ప్రధాని నవాబ్‌ రుక్న్‌–ఉద్‌–దౌలా ఆధ్వర్యంలో ఈ చెరువును నిర్మించారు. ఒకప్పుడు దాదాపు 100 ఎకరాలకు పైగా విస్తరించిన ఈ జలాశయం తాగునీటి అవసరాల కోసం ఉపయోగపడేదని చారిత్రక ప్రస్తావనలు ఉన్నాయి.

"చెరువు నీరు సహజంగా వడపోతకు గురై కిందనున్న ఊట బావిలోకి చేరేది. చుట్టుపక్కల ఉన్న ఔషధ మొక్కల కారణంగా ఆ నీటికి ఔషధ గుణాలు వచ్చేవని, నిజాం పాలకులు ఈ నీటిని వినియోగించేవారు. నీటిని ఎడ్ల‌బండ్ల‌పై ప్యాలెస్‌కు తరలించేవారని" ప్ర‌ముఖ చ‌రిత్ర ప‌రిశోధ‌కుడు డాక్టర్‌ ఎం.ఏ. శ్రీనివాసన్ చెప్పారు.

"కాలక్రమంలో నిర్లక్ష్యానికి గురైన ఈ పురాతన ఊట బావి చెత్త, ప్లాస్టిక్‌, మట్టి, ఒండ్రుమట్టి, పిచ్చి మొక్కలతో పూడుకుపోయింది. దీంతో నీటి నిల్వ సామర్థ్యం దెబ్బతింది. ఇప్పుడు హైడ్రా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. సుమారు 1.50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చారిత్రక బావిని శుభ్రం చేసి, సహజంగా నీరు చేరే మార్గాలను పునరుద్ధరించే పనులు చేపట్టిందని" హైడ్రా కమిషనర్‌ ఏ.వీ. రంగనాథ్ చెప్పారు.

“చెరువు పునరుద్ధరణతోనే ఆగిపోం. దాని కింద ఉన్న చారిత్రక ఊట బావినీ పునరుద్ధరిస్తున్నాం. చెత్త, ప్లాస్టిక్‌, మట్టి, ఒండ్రుమట్టిని తొలగించి.. సహజంగా నీరు చేరే మార్గాలను పునరుద్ధరిస్తున్నాం. ఈ చారిత్రక జలవనరును భవిష్యత్‌ తరాలకు అందించడమే లక్ష్యం. రెండు మూడు నెలల్లో పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం” అని రంగనాథ్ తెలిపారు.

బుమ్‌–రుక్న్‌–ఉద్‌–దౌలా చెరువు 2026 మార్చి 8న పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ చెరువు ప‌క్క‌న ఉన్న బావిని కూడా పునరుద్ధరిస్తున్నారు.బుమ్‌–రుక్నుద్దౌలా చెరువు, బావి, మిరాలం ట్యాంక్‌.. నవాబుల కాలం నాటి సామాజిక, సాంస్కృతిక ఇంజనీరింగ్‌ నైపుణ్యాలకు నిదర్శనాలని చరిత్ర పరిశోధకుడు డాక్టర్‌ గియాసుద్దీన్‌ అక్బర్‌ తెలిపారు.

బుమ్‌–రుక్నుద్దౌలా పెంపకంలో పెరిగిన మహాలఖా బాయి చందా, ఆమె సమకాలీనుడు, గురువు మీరాలం ఈ చారిత్రక జలవనరులతో అనుబంధం కలిగి ఉన్నారని చెప్పారు. చౌమహల్లా ప్యాలెస్‌లోని నిజాం కుటుంబ సభ్యులు తాగునీటి కోసం ఈ చెరువు నీటినే వినియోగించేవారని, నీరు స్వచ్ఛంగా, చల్లగా ఉండేదని వివరించారు. ఇత్తర్‌ తయారీలోనూ ఈ నీటిని ఉపయోగించేవారని, గతంలో ఇక్కడి నుంచి సౌదీ అరేబియాకు నీటిని తరలించేవారని తెలిపారు.

“ఈ బావిలో నీరు సహజంగానే వడపోతకు గురయ్యేదని చెబుతారు. అంతేకాదు. అప్పట్లోనే జర్మనీ, ఇంగ్లాండ్‌ నుంచి తెప్పించిన యంత్రాలతో నీటిని శుద్ధి చేసేవారని పెద్దలు చెప్పేవారు. రెండు మూడు నెలల్లో పునరుద్ధరణ పూర్తయితే.. శతాబ్దాల నాటి ఈ ఊట బావికి మళ్లీ జలకళ వస్తుంది. ఇది కేవలం ఒక బావికి పునర్జీవం ఇవ్వడం కాదు.. హైదరాబాద్‌ పురాతన నీటి సంరక్షణ, సహజ వడపోత పద్ధతులు, నిజాం కాలం నాటి జలవారసత్వానికి మళ్లీ జీవం పోయడం. హైడ్రా చేస్తున్న ఈ ప్రయత్నం అభినందనీయం” అని స్థానికుడు షేక్‌ బాబర్‌ అన్నారు.ఒకప్పుడు నిజాం కాలం నాటి జలవైభవానికి గుర్తుగా నిలిచిన ఈ బావి.. త్వరలోనే హైదరాబాద్‌ ప్రజలకు మరో చారిత్రక గుర్తుగా నిలవనుంది.

Read More
Next Story