
అభివృద్ధికి దూరంగా ఆదివాసీ పల్లెల ఆవేదన
ఏజెన్సీ హోదా లేక అభివృద్ధికి దూరంగా ఉన్న నాన్ షెడ్యూల్ ఆదివాసీ గ్రామాల దయనీయ పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి.
ఒక వారం కింద నా మిత్రుడి కోరిక మేరకు ఒక నాన్ షెడ్యూల్ ఆదివాసీ గుడెంకు వెళ్ళడం జరిగింది. ఆ చిన్న గ్రామం పేరు కట్టుగూడెం. ఇది మహబూబాబాద్ జిల్లా కేంద్రం నుండి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. కేసముద్రం మండలంలోని పెనుగొండ గ్రామ పంచాయతి పరిధిలో చిన్న కోయ పల్లే ఈ కట్టుగూడెం. ఈ ఊరిలో అంతా కోయ ఆదివాసీ తెగకు చెందిన వారే ఉన్నారు. దీనికి పక్కన కాకతీయుల కాలములో నిర్మించిన ఒక చిన్న ఆనకట్ట లాంటిది ఉంది. ఇది ఒక రిజర్వాయరు లాగా ఉండి, నిరంతరం అన్ని కాలాలలో పారే వాగుకు అడ్డంగా కట్టి ఉంది. దీని వల్ల ఎంతటి కరువు కాలమైనా కనీసం ఒక పంటకు నీరు లభిస్తుంది.
ఆ వాగు కట్టకు దగ్గరలోనే ఈ కోయ పల్లె ఉంది. ఆ కట్టకు దగ్గరగా ఉన్నది కాబట్టే దీనికి కట్టుగూడెం అని పేరు వచ్చింది కావచ్చు. ఇది ప్రధాన గ్రామానికి తూర్పున దూరంగా ఎక్కడో పారేసినట్టు ఉంది. అందరి ఇండ్ల ముందు గల రాళ్ళ కుప్పలు, నాణ్యత, శుభ్రం లేని రోడ్లు, రాళ్ళ గోడలు, ఉండగా కొన్ని ఇండ్ల వద్ద కర్ర మొద్దులే ఒకదానిపై ఒకటి పేర్చి గోడ లాగా అమర్చి చుట్టూరా ఉన్నాయి. వారి ఇండ్లు, అక్కడి వాళ్ళ మొఖాలు, ఆయా గ్రామ పరిస్థితులు వారి కడు దీనమైన స్థితులకు అద్దం పడుతుంది. మహిళలు, ఆడ పిల్లలు అంత తీవ్ర రక్త హీనతతోనూ, పోషకాహార లోపం ఉన్నట్టు అనిపించింది. వారి సామాజిక ఆర్థిక వెనుక బాటు తనం స్పస్టంగా గోచరిస్తోంది. “ఇందులో సుమారు 80-90 కుటుంబాలు ఉన్నాయి. చాలా మంది పిల్లలు బడికి వెళ్ళడం లేదు. వెళ్ళినను మధ్యలో చదువు వదిలి వేసిన వారి సంఖ్య మరీ ఎక్కువ.
చదువు మానేసిన పిల్లలు కల్లు, సారా, గంజాయి తదధితరాలకు బాసిసలుగా మారి పోతున్నారు. ప్రతి మూడు కుటుంబాలలో ఒక కుటుంబంలో భర్తను కోల్పోయిన ఒక యుక్త మహిళ ఉంది. ఇక్కడ చనిపోయిన వాళ్ళ వయస్సు 20-25 సంవత్సరాల లోపు వారే. వీరిలో అధికంగా మద్యం తాగి, మద్యానికి బానిసలుగా మారి చనిపోయిన వాళ్ళే ఉన్నారు. ఇంకా కొన్ని కుటుంబాలలో అయితే భర్త చనిపోయిన తరువాత బార్య కూడా కుంగి, కృశించి బతుకు ఈద లేక ఆత్మ హత్యలు చేసుకుని చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి వారి పిల్లలు.. తల్లి తండ్రులు లేక అనాథలుగా మిగిలి పోయిన వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. ఇంకా కూలి నాలి, చిన్నా చితకా పనులు చేసుకుని బతుకు వెల్ల దీస్తున్నారు ” అని కట్టుగూడెం గ్రామ వార్డు మెంబర్ వాసం వెంకన్న కట్టుగూడెం పరిస్థితులను పంచుకున్నారు.
ఇంతకు ఏజెన్సీ అదివాలసులు అంటే ఏమిటి ?
భారత రాజ్యాంగంలోని 5 వ , 6 వ షెడ్యూల్ లో పొందపరిచిన ఆదివాసీ , గిరిజన ప్రాంతాలను ఏజెన్సీ ప్రాంతాలు(షెడ్యూల్ ) అంటారు. 6 వ షెడ్యూలేమో ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినది కాగా, దేశములోని వివిధ రాష్ట్రాలలో అక్కడక్కడా విస్తరించి ఉన్న ఆదివాసి ప్రాంతాలను 5 వ షెడ్యూలు ప్రాంతాలు అంటారు. అదివాసియేతరులైన మైదాన ప్రాంత ప్రజల దూరాక్రమనల నుండి , దోపిడీల నుండి రక్షణ కల్పించుటకు ఏర్పాటు చేసినదే ఈ 5వ షెడ్యూలు ప్రాంతాల ప్రత్యేక నిబంధన. ఇక్కడ గల అదివాసుల హక్కులకు, అభివృద్దికి ప్రత్యేక రక్షణ కల్పించి రాజ్యాంగ బద్దంగా ఉంది.
ఈ హక్కుల కొరకు మూల వాసులైన ఎందరో ఆదివాసీ వీరులు పోరాడి, ప్రాణ త్యాగాలు చేసి బ్రిటిష్ కాలములోనే సాధించుకున్నారు. మన దేశ స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగంలో కూడా ఇవి పొందు పర్చబడినవి. అందులో భాగంగానే రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలు ఎన్నో చట్టాలను, సంస్థలను నెలకొల్పాయి. ఒక ఉదాహరణగా మన తెలుగు రాష్ట్రాలలో అదివాసుల అభివరుద్దికి సమీకృత గిరిజాణభివృద్ది సంస్థలు(ITDA) ఏర్పాటు చేసి విద్య, వైద్యం, వ్యవసాయ తధితర ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఆదివాసుల భూమి రక్షణ కొరకు గిరిజనుల, గిరిజనేతరుల మధ్య భూమి బదలాయింపు నిషేద చట్టం 1/70 అమలులో ఉంటుంది. అది ఎంత వరకు ఆదివాసీలు భూమి అన్య క్రాంతం కాకుండా కాపాడింది అనే వాదన వేరే విషయం.
కాని పైన పేర్కొన్న సదుపాయాలు, రక్షణలు ఇవి అన్నీ కూడా ఏజెన్సీ ప్రాంతములోని అదివాసులకు(షెడ్యూలు ప్రాంత) మాత్రమే వర్తిస్తుంది. నాన్ ఏజెన్సీ వాళ్లకు( నాన్ షెడ్యూల్ ప్రాంత) ఇలాంటివి ఏ సదుపాయాలు లభించవు. ఒక ఏజెన్సీలోని బడులలో చదువుకునే ఒకే ఒక అవకాశం ఉంది. అక్కడక్కడ సబ్ ప్లాన్ ఏరియా నిధులతో కొంత సహాయం అందుతున్నదని కొందరు అంటున్నారు. అవి ఎంతమేర అందుతున్నాయో ? వాటి పర్యవేక్షణ ఎలా ఉందో మరి. వీరు మైదాన ప్రాంతంలో గల గిరిజన తెగలతో పోటీ పడాల్సి ఉంటుంది. కాని రాజకీయంగా, ఆర్థికంగా , సామాజికంగా ఎంతో ఎత్తులో ఉన్న మైదాన ప్రాంత గిరిజనులతో పోటీ పడలేక పోతున్నారు.
కాని ఒకటి ప్రత్యేక సదుపాయం ఉంది. అది తెలంగాణలోని ప్రస్తుత వికారాబాద్ జిల్లాలో (పాత రంగా రెడ్డి జిల్లా ) గల చెంచు పల్లెల అభివృద్దికి ఒక మిని ITDAను ఏర్పాటు చేసి సబ్ కలెక్టరు అదనపు బాధ్యతలు ఇచ్చినవి చూశాను. కాని షెడ్యూలు ప్రాంతంగా గుర్తించలేదు. చాలా మంది చెంచులు తమ భూములు పావుకో పరకకో అమ్మినవి కొన్నికాగా , ఇతరుల దోపిడి వల్ల ఈ అమాయకులు తమ భూములు కోల్పోయారు.
ఏజెన్సీ నాన్ ఏజన్సీ విభజన లోపాలు: స్వాతంత్ర్యం వచ్చిన తరువాత రాజ్యాంగం రూపొందించిన 5 వ షెడ్యూల్ ప్రాంతాలను గుర్తించేటప్పుడు ఆ ఏజెన్సీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న ప్రాంతాలు కొన్ని , సారిహద్దు ప్రాంతాలు కొన్ని ఏజెన్సీ ప్రాంతాలలో కలపలేదు. ఆయా ప్రాంతాలలో గల మైదాన ప్రాంతం వాళ్ళు , వాళ్ళకు గల రాజకీయ , అంగ, అర్థ బలాలను ఉపయోగించి ఏజెన్సీ ప్రాంతాలలో కలవకుండా అడ్డుపడి ఉండవచ్చు. అందుకే కట్టుగూడెం లాంటి ఎన్నో గ్రామాలు అభివృద్దికి అందనంత దూరములో ఉండి , కొట్టు మిట్టాడుతున్నాయి. “ 2011 అధికారిక లెక్కల ప్రకారం ఇలాంటి గ్రామాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాంలోనే షుమారు 552కు పైగా పల్లెలు ఉన్నాయి. ఇప్పటికీ గుర్తించని పల్లెలు ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. వీటిని పార్టీలకు అతీతంగా , సంఘాలకు అతీతంగా కలిసి కట్టుగా పట్టించ్చుకోవాలి” అని భారత అధివాసి పార్టీ , ఆంధ్ర ప్రదేశ్ విభాగ అధ్యక్షుడు మోటమ్ రాజబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాదు “ కొన్ని నాన్ షెడ్యూలు ప్రాంతాలకు దారి లేదు అక్కడికి వెళ్లాలంటే గుర్రాలమీద వెళ్ళావాల్సిందే . అలాంటి ప్రాంతాలలో ఆదిమ జాతుల ఆదివాసులు కూడా ఉన్నారు. అవి కూడా నాన్ షెడ్యూల్ ప్రాంతాలుగానే ఉన్నాయి. అక్కడ నివసించే వారి పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. ఇంకా కొన్ని ప్రాంతాలు షెడ్యూలు ఏరియాలో ఉండీ , వాటి కార్యాలయాలు నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉన్నవి. ఇక్కడ కాదు , అక్కడకు కలెక్టర్ ఆపీసుకు పొమ్మని ఒకరు. కాదు కాదు ITDAకు పొమ్మని ఒకరు ఇలా ప్రతి విషయానికి ఇటు-అటు తిరుగలేక చాలా ఇబ్బందులు పడే వారు కూడా ఉన్నారు” అని గిరిమిత్ర సంఘం నాయకుడు గంగ రాజు వాపోయారు.
అంతేకాదు ఇంకా “ జాతీయ గిరిజన విధానం 2007 ప్రకారం నాన్ షెడ్యూలు ప్రాంతాలను కూడా షెడ్యూలు ప్రాంతాలుగా పరిగణించాలని ఉంది. కాని అమలుకు నోచుకోలేదు. ఏ సంస్థ , సంఘం గాని , రాజకీయ పార్టీలు గాని పట్టించుకోవడం లేదు” అని ఒక ప్రముఖ ఆదివాసీ న్యాయవాది ఒకరు విచారం వ్యక్త పరిచారు.
ఇంకా దేశ వ్యాప్తంగా ఇలాంటి ఎన్ని నాన్ ఏజెన్సీ లేదా నాన్ షెడ్యూల్ ప్రాంతాల పల్లెలు ఉన్నాయో ? వాటికి లెక్కాపత్రం ఉందో లేదో ? వీటి పైన ఏమైనా అధ్యయనాలు , పరిశోధనలు జరిగాయో లేదో ? వారి దుర్బర పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయో ఏమో? అని తల్చుకుంటేనే గుండె తరుక్కు పోతోంది. మొత్తం మీద దేశ వ్యాప్తంగా ఉన్న నాన్ షెడ్యూలు ప్రాంతాల అదివాసుల సమస్య చాలా తీవ్రమైనప్పటికి నాయకత్వ లేమి, తక్కువ ఓటు బ్యాంక్ కారణం వల్ల ఎవరూ పట్టించుకోవడం లేదేమో.
ఎక్కడో ఒక గ్రామమో, ఒక సంఘం ఒంటరిగా కలెక్టరుకో, మంత్రికో విజ్ఞాపన పత్రాలు ఇస్తే సరిపోదు. పలు సంఘాలు, మేధావులు గ్రామ స్తాయి నుండి జాతీయ స్తాయి వరకు కలిసి సంయుక్త కార్యాచరణ కమిటీ(JAC) ఏర్పడి చేయాల్సిన అవసరం చాలా ఉంది.
ఈ ప్రాంతాల మీద వివిధ సంఘాల నాయకులు, మేధావులు. హక్కుల కార్యకర్తలు, మానవతావాదులు, జాతీయ అంతర్జాతీయ స్వచ్చంద సంస్థలు ఈ ప్రాంతాలపై, ప్రజల స్థితిగతుల మీద ముఖ్యంగా సామాజిక మాధ్యమాలు, దృశ్య , శ్రావణ , ప్రింటింగ్ మీడియా లాంటివి పట్టించుకుని, వెలుగులోకి తెచ్చి , బాహ్య సమాజానికి తెలియ జేయాలి. ఇది ఒక జాతీయ సమస్యగా గుర్తించాలి. పలు ఆదివాసీ సంఘ నాయకులు, చట్ట సభలలో గల ఆదివాసీ ప్రజా ప్రతినిధులు లేదా శాసన సభ్యులు , పార్లమెంటు సభ్యులు, మంత్రులు, ఆయా పార్టీలలో అంతర్గతంగా చర్చకు తోడ్పడి, తద్వారా చట్ట సభలలో ప్రస్తావించి షెడ్యూలు ప్రాంతాలలో కలుపడానికి కృషి చేయాలి. నాన్ షెడ్యూలు ప్రాంతాలు షెడ్యూలు ప్రాంతాలుగా గుర్తించే రోజు తొందరలోనే రావాలని ఆశిద్దాం.

