
ఇండోనేషియా బాలి యాత్ర మరుపురాని అనుభూతి...
ఇస్లామిక్ ఇండోనేషియాలో హిందూ సంప్రదాయాలను కాపాడుకున్న బాలి ద్వీపం పర్యటనలో కనిపించిన ప్రకృతి, సంస్కృతి, విశేషాలు.
ఇండోనేషియాలోని బాలి ద్వీపం ప్రపంచ ప్రసిద్ధి పొందిన పర్యాటక ప్రదేశం. అక్కడికి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కానీ అనుకోని అవాంతరాలవల్ల అప్పుడు వెళ్ళలేకపోయాను. రెండోసారి మళ్ళీ ఏర్పాట్లు చేసుకున్నాను. ఈసారి ప్రయాణానికి నాలుగు రోజుల ముందు నాకు వైరల్ ఫీవర్ పట్టుకుంది. ఒకసారి ఆగిపోయిన బాలి ప్రయాణానికి మరొకసారి ఆగిపోవడానికి మనసు సిద్ధంగా లేదు. అందుకే అలాగే బయలుదేరాను.
కాఫీ ప్లాంటులో
థాయ్ ఎయిర్ లైన్స్ లో ప్రయాణం. ముందుగా బ్యాంకాక్ చేరుకున్నాం. రెండుగంటలే విరామం. పరుగులాంటి నడకలతో మరో విమానం ఎక్కి డెన్ పసార్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగి, అక్కడ కరెన్సీ మార్చుకున్నాం. మన భారతదేశ నగదు పదివేల రూపాయలకు ఇండోనేషియా కరెన్సీ సుమారు 18 లక్షలు వచ్చింది. అందరం ఒక్కసారిగా మిలియనీర్లం అయిపోయామని కొద్దిసేపు ఆనంద పడిపోయాం. అంత సంఖ్యలో ఉన్న కరెన్సీని చాలా జాగ్రత్తగా లెక్క చూసుకొని ఖర్చు పెట్టవలసి వచ్చింది. బాలి కరెన్సీని ఐడిఆర్ RP గుర్తిస్తారు. హోటల్ గదికి చేరుకునే సరికి సాయంత్రం నాలుగు అయింది. కాసేపు విశ్రాంతి తీసుకొని రోడ్లమీద పడ్డాం. తడిసిపోయి గదికి చేరుకున్నాం.
ఉదయం లేవలేక పోయాను. కళ్ళుతిరిగాయి. ఇంత దూరం వచ్చాను.. ఆరోగ్యం సహకరించకపోతే ఎలా? లోలోపల టెన్షన్. నా స్నేహితురాలు, రూమ్మెట్ నవీన కూడా కంగారు పడింది. గట్టిగా కళ్ళు మూసుకొని ప్రాక్టికల్ గా ఆలోచించాను. మెదడు చురుకుగా పనిచేసింది. అప్పుడున్న పరిస్థితికి నా అనారోగ్యం ఒక్కటే కారణం కాదు. ప్రయాణ బడలిక, భారత, బాలి కాలమానంలో వ్యత్యాసం. మన దేశ కాలమానం కంటే బాలి కాలమానం రెండున్నర గంటలు ముందుంటుంది. తెలియ చేయకుండా వర్షంలో తడవడం లాంటివన్నీ కారణాలుగా అనిపించాయి. నెమ్మదిగా టెన్షన్ తగ్గింది. రూంలో నవీన యిచ్చిన కాఫీ తాగి ఓపిక చేసు కొని డైనింగ్ హాలుకు వెళ్ళాం. ఉదయం ఆరున్నరకే కాంటినెంటల్ బ్రేక్ ఫాస్ట్ సిద్ధంగా ఉంది. కడుపు నిండా తిని, అవసరానికి ఉంటుందని కొద్దిగా ప్యాక్ చేసుకొని పర్యాటక ప్రదేశాలను చూడడానికి వెళ్ళాం.
స్థానికుల ఇల్లు
హోటల్ గది నుంచి బాహ్య ప్రపంచంలోకి రాగానే నా అస్వస్థత కనిపించకుండా పోయింది. గైడ్ సిద్ధంగా ఉన్నాడు. పేరు కడిక్. నవ్వుతూ ఉండే ప్రశాంతమైన ముఖవర్చస్సు. నేను అతనిని ' లాఫింగ్ బుద్ధా ' అని పిలవడం మొదలు పెట్టాను. సిగ్గుపడుతూ చాలా సంతోషపడిపోయాడు. బాలి ప్రత్యేకతల గురించి ఇలా చెప్పడం మొదలు పెట్టాడు. ఇండోనేషియా లోని బాలి ద్వీపం ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. విదేశీయులు కూడా చాలా మంది వస్తుంటారు. బాలి విస్తీర్ణం సుమారు 5,700చదరపు కిలో మీటర్లు. జనాభా నలభై లక్షల పైన ఉంటుందట. బాలి ని దేవతల ద్వీపం అంటారని, ఇండోనేషియా 90 శాతం ముస్లిం దేశం అయినా బాలిలో మాత్రం బాలినీస్ హిందువులు 85% ఉంటారని చెప్పాడు. అయితే ఇది భారతదేశ హిందూ మతం కంటే భిన్నమైంది. ప్రకృతి, కళలు, పూర్వీకులు అన్నీ దేవుడితో ముడిపడి ఉంటాయి వాళ్ళ మతంలో. మాటల్లోనే 'కింట మణి' కాఫీ ప్లాంటేషన్ కు చేరుకున్నాం. ప్రవేశ రుసుం 30000 ఐడీఆర్.
యాజమాన్యం మమ్మల్ని సాదరంగా ఆహ్వానించింది. ముప్ఫైరెండు రకాల కాఫీని పర్యాటకులు రుచి చూడవచ్చు. మేం మాత్రం అక్కడ బతూర్ వాల్కనో వ్యూ చూస్తూ మూడు నాలుగు రకాల కాఫీని రుచి చూసాం. అందులో లువాక్ కాఫీ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధమైంది. చాలా ఖరీదైనది కూడా.. లువాక్ అనేది ఒకరకమైన జంతువు. దానిని సివెట్ అని కూడా అంటారు. చూడడానికి పిల్లిలాగా ఉంటుంది. పగలు నిద్రపోయి రాత్రిపూట తిరుగుతుంది. పండ్లు కీటకాలు దాని ఆహారం. ముఖ్యంగా కాఫీ పండ్లు ఇష్టంగా తింటుంది. ఆ పండ్లలోని విత్తనాలు తిరిగి దాని మలం ద్వారా బయటకు వస్తాయి. ఆ విత్తనాల పౌడర్ తో చేసిన కాఫీయే లువాక్ కాఫీ. అధిక ప్రొటీన్లు కలిగి ఉంటుంది. కప్పు కాఫీ మన కరెన్సీలో రు.1500 - 2000 వేల ఖరీదు చేస్తుంది. దీని వాడకం విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. థ
స్థానిక గృహిణితో
అక్కడి నుంచి వెళుతూ దారిలో ఒక స్థానికుల ఇంటికి వెళ్ళాం. ఎంతో మర్యాదగా ఆహ్వానించి ఇల్లంతా చూపించారు. చెక్కతో నిర్మించిన మూడు గదుల ముచ్చటైన యిల్లు. అందులో ఒకటి వంటగది. గ్యాస్ స్టా మీద కాకుండా కట్టెలపొయ్యి మీద వంటచేసుకుంటున్నారు. ఇంటి చుట్టూ పూలమొక్కలు, ఇంటివెనక ఒక చేద బావి, ఇంటి ముందు తాడుతో కట్టిన ఒక ఉయ్యాల ఉన్నాయి. ఆ బావినీటినే వాళ్ళు తాగడానికి, వంటకు వాడుకుంటామని చెప్పారు. దిగువ మధ్యతరగతి కుటుంబం లాగా వుంది. బాలినీస్ భాషలో మాట్లాడు కుంటున్నారు. అందులో కొన్ని సంస్కృత పదాలు నాకు అర్థమై కాకుండా వినిపించాయి. చెక్కతో శిల్పాలు చేసి అమ్మేవాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం. ముందుభాగంలో షాపు, వెనక భాగంలో కుటుంబం నివాసముంటోంది. బాలి దారుశిల్పాలకు ప్రసిద్ధి మోటార్ బైక్ లాంటి ఆధునిక బొమ్మలు కూడా అక్కడున్నాయి.
స్థానికుల ఇంట్లో బావి
తెల్లవారి ఉదయం హోటల్లో ఉపాహారం ముగించుకొని ఎనిమిదిన్నరకు బయలుదేరి బాలిలో అత్యంత ప్రసిద్ధమైన పురా ఉలున్ దాను బ్రటాన్ ప్రదేశానికి వెళ్ళాం. ఇది బాలి ఐకానిక్ ప్రదేశం. బాలిలోని బెడుగుల్ ప్రాంతంలో ఉంది. సముద్రమట్టానికి 1200 మీటర్ల ఎత్తులో బ్రటాన్ అనే సరస్సు ఒడ్డున ఉంది. అక్కడి బాలినీస్ హిందూదేవాలయాన్ని ' పురా ' అంటారు. ఈ దేవాలయాన్ని 1633లో మెంగ్వి రాజు కట్టించాడని చరిత్ర చెపుతోంది. గుడిలోపలికి విదేశీయులకు అనుమతి లేదు. సరస్సులోపల పదకొండు అంతస్తుల మేరు గోపురం ఉంది. ఇది బాలి ఐకానిక్. అక్కడి 50000 కరెన్సీ నోటుమీద కూడా ఈ గోపురం ఉంటుంది. దీని ప్రత్యేకత ఏంటంటే సరస్సులో నీరు ఎక్కువగా ఉన్నప్పుడు నీటిలో తేలుతున్నట్లుగా ఉంటుంది. చుట్టూ పచ్చని కొండలు, ముందు సరస్సు, మధ్యలో గుడి. పొగమంచు కమ్ముకున్నప్పుడు భలే అందంగా ఉంటుంది. విదేశీయులకు ప్రవేశరుసుం 75000 ఇండోనేషియా రూపీస్. ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఏడు వరకు అనుమతిస్తారు.
స్థానిక కళాకారుల దుకాణంలో తల్లీ బిడ్డల దారు శిల్పం
బ్రటాన్ సరస్సు అగ్నిపర్వతం పేలి ఏర్పడిన కార్డెరా సరస్సు అని గైడ్ చెప్పాడు. ఇది బాలిలో రెండో అతి పెద్ద సరస్సు. నాలుగు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఇరవైరెండు మీటర్ల లోతు ఉందట. చుట్టు పక్కల గ్రామాలకు సాగునీరు, తాగునీటికి ఈ సరస్సు ప్రధాన ఆధారం. అందుకే అక్కడి ప్రజలు ఆ నీటిని పవిత్ర జలంగా భావిస్తారు ఈ సరసులో స్పీడ్ బోటు సౌకర్యం కూడా ఉంది. ఒక పడవలో ముగ్గురు కూర్చోవచ్చు. 25000 ఐడిఆర్ చార్జి చేస్తారు. మేం ముందుగా స్పీడ్ బోటు షికారు చేసి ఆ తర్వాత ఆ ప్రదేశమంతా తిరిగి చూసాం. ఇండోనేషియాలోనే పెద్దదైన బెడుగుల్ బొటానికల్ గార్డెన్ కూడా తిరిగి ఫోటోలు తీసుకున్నాం. అక్కడ ఉన్న ఎర్రపూలను కానాలిల్లీ అంటారట.
పురా లుహర్ ఉలవాటు గుడి
ఆ మరునాడు మేం పురా లుహర్ ఉలవాటు గుడికి వెళ్ళాం. ఇది 70 మీటర్ల నిటారు కొండ చివరలో ఉంటుంది. కింద హిందూ మహా సముద్రం అలలు గోడను ఢీకొడుతూ ఉంటాయి. బాలినీస్ భాషలో ఉలు అంటే చివర, వాటు అంటే రాయి అని అర్థం. పురా లుహుర్ అంటే పవిత్రమైన గుడి అని అర్థమట. దానిని 11 వ. శతాబ్దంలో జావా నుంచి వచ్చిన ఎంపు కుతురన్ అనే సాధువు కట్టించాడని చెపుతారు. లోపల గుడి మూడు అంతస్తుల (మేరు ) గోపురం ఉంటుంది. విదేశీయులకు ప్రవేశం నిషిద్ధం.
గరుడ విష్ణు పార్క్ లో గరుత్మంతుడు, విష్ణువు శిల్పాలు
మేం అక్కడినుంచి గరుడ విష్ణు కాంచన (GWK) పార్కుకు వెళ్ళాం. పార్కు 150 ఎకరాల విస్తీర్ణంలో చాలా పెద్దది. మొత్తం పార్కు సున్నం రాయి కొండను తొలిచి ఆ మధ్యలో కట్టారు. చూట్టూ సహజమైన సున్నపు రాయి కొండ ప్రహరీగోడలాగా ఉంటుంది. అందులో యాoఫీ థియేటర్లున్నాయి. ప్రవేశ రుసుం 125000 ఐడిఆర్. మేం పార్కు అంతా తిరుగుతూ గరుత్మంతుడి తల, విష్ణువు తల ఉన్నచోట్ల ఫోటోలు తీసుకున్నాం. విష్ణువు తల 75 అడుగుల ఎత్తు. ఛాతీ వెడల్పు 25 మీటర్లు. దాదాపు 4000 టన్నుల బరువు. రాగి , ఇత్తడి లోహాలతో చేశారట నడుo నుంచి తల వరకు మాత్రమే ఉంది. కాళ్ళు చేతులు లేవు. గరుడుని ఎత్తు 18 అడుగులు. వెడల్పు నాలుగు మీటర్లు.
గరుడ విష్ణు విగ్రహం
ఈ రెండింటి శిల్పి న్సోమాస్ ను ఆర్త 1997 లో ఆ ప్రాజెక్టు మొదలు పెట్టినప్పుడు విష్ణువు, గరుత్మంతుడిని విడి విడిగా కట్టాలని ప్లాన్ చేసారట. 16 యేళ్ళు నిధుల కొరత వల్ల పని ఆగిపోయింది. 2013లో విష్ణువు, గలరుత్మంతుడిని కలిపి ఒకే విగ్రహంగా 121 మీటర్ల ఎత్తులో కట్టాలని పూర్వపు ప్లాన్ మార్చారని గైడ్ చెప్పాడు. కానీ మేం వెళ్ళినప్పుడు రెండూ విడి విడిగానే ఉన్నాయి. వాటిని అలాగే ఉంచి ఆ తర్వాత 121 మీటర్ల విగ్రహాన్ని 2018 సెప్టెంబర్ లో పూర్తి చేశారని విన్నాను. గరుత్మంతుడి ముక్కు వాడిగా కొనదేలి, కిరీటం పైన బాలినీస్ చెక్కడం, మెడమీద పాము ఆభరణాలు స్పష్టంగా కనిపిస్తాయి.
గరుత్మంతుడు దుష్ట శక్తులనుంచి కాపాడేవాడని బాలి ప్రజల నమ్మకం. అందుకే కాబోలు .. ఇండోనేషియా జాతీయ చిహ్నం గరుడ పంచ శిల. దేశ జెండా, కరెన్సీ, పాస్ పోర్ట్ లాంటి అన్నిటి మీద గరుత్మంతుడు ఉంటాడు.
మంకీ ఫారెస్ట్ దారిలో
సాయంత్రం అదే పార్కులో ఉన్న యాంఫీ థియేటర్లో మేం బాలి సంప్రదాయ నృత్యం 'కెచెక్ 'షో చూసాం. 'రామాయణ మంకీ చాంట్ ' లేదా 'ఫైర్ డాన్స్' అని కూడా అంటారు. మధ్యలో పెద్ద కాగడా వెలుగుతూ ఉంటుంది. దాని చుట్టూ 70 మంది పురుషులు గళ్ళలుంగీ కట్టుకొని చక్రాకారంలో కూర్చోవడంతో మొదటి సీన్ మొదలవుతుంది. మొత్తంగా ఐదు సీన్లు ఉంటాయి. రామాయణంలోని సుందరకాండ అంటే రావణుడు సీతను అపహరించడం, హనుమంతుడు లంకకు వెళ్ళడం, లంకాదహనం వరకు చూపిస్తారు. ప్రత్యేకమైన సంగీత వాయిద్యాలేమీ ఉండవు. లయ బద్ధంగా 'చక్ 'అని అరుస్తూ నృత్యం చేస్తారు. అందుకే కెచెక్ అనే పేరు వచ్చింది. అదే నేపథ్య సంగీతం. ఇది పురాతనమైన నృత్యం కాదు. జర్మన్ పెయింటర్ వాల్టర్ స్పైస్ , బాలినీస్ డాన్సర్ వయన్ లింబాక్ ఇద్దరూ కలిసి 1930లో దాని రూపకల్పన చేశారట. ముందు ఐదువరుసల్లో కనక సీటు సంపాయించుకోగలిగితే సూర్యాస్తమయంతో కలిపి ఆ నృత్యాన్ని చూడడం గొప్ప అనుభూతి. సాయం సంధ్యలో, చల్లని వాతావరణంలో ఆ నృత్యాన్ని చూడడం మరపురాని అనుభవంగా మిగిలిపోతుంది. ఒక గంటపాటు సాగుతుంది. ప్రవేశ రుసుం 150000 ఐడిఆర్.
బాలి ఎయిర్పోర్ట్ లో
మరునాడు ఆరున్నరకు బయలుదేరి సానూరు పోర్టుకు చేరుకున్నాం. ఆ రోజు క్రూజ్ లో నుసాపెనీడా ఐలాండుకు వెళ్ళాలి. టికెట్ 300000 ఐడిఆర్. ఫార్మాలిటీస్ అన్నీ ముగించి విండో దగ్గర కూర్చున్నాం. కొందరికి సీ సిక్ నెస్ తో వాంతులు అవుతాయని ముందు జాగ్రత్తగా అందరికీ ఖాళీ కవర్స్ యిచ్చారు. అందరికీ ఏదో లోషన్ చేతికి రాసారు. అది కూడా వాంతులు కాకుండా ఉండడం కొరకే.. అయినా తిరుగు ప్రయాణంలో సముద్రం పోటు మీద ఉండడం వల్ల ... గంట సముద్ర ప్రయాణంలో అక్కడ చాలా మంది సీ సిక్ నెస్ బారిన పడ్డారు. బ్రేక్ ఫాస్ట్ క్రూజ్ లోనే ముగించాం.
బనానా రైడ్
క్రూజ్ దిగి క్రిస్టల్ బే బీచికి చేరుకున్నాం. ముందుగా మేం 45 నిమిషాలపాటు సబ్ మెరైన్ లో సముద్ర గర్భంలోకి వెళ్ళాం. అలా వెళుతూ అనంత జల జీవకోటిని దర్శించడం అద్భుతమైన అనుభవం. సముద్ర క్రీడలకు అది అనువైనది. ఆ తర్వాత మేం బనానా రైడ్ చేశాం. అంటే అరటి పండు ఆకారంలో ఉండే ఒక బెలూన్ ను తాడుతో పడవకు కడతారు. ఆ బెలూన్ మీద నలుగురు కూర్చోవచ్చు. అది సముద్రంలోకి వెళుతుంది. సముద్రపు అలల హోరుకు బెలూన్ అటూ ఇటూ ఊగుతూ భలే థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా బ్యాలెన్స్ తప్పి సముద్రంలో పడిపోవడం ఖాయం. అయినా భయం లేదు. వెనక పడవలో రెస్క్యూ టీమ్ సిద్ధంగా ఉంటుంది. ఆ బనానా రైడ్ పదిహేను నిమిషాలు సాగుతుంది. మేం ఎలాంటి ఉపద్రవం లేకుండా ఆ రైడ్ ను పూర్తిచేశాం. తర్వాత స్నోర్కలింగ్ చేశాం. నీళ్ళపై తేలుతూ తల నీళ్ళలో కిందకు వంచి సముద్రగర్భంలోని ప్రాణికోటిని వీక్షించడమే స్కోర్కలింగ్.
తర్వాత దీవి అంతా కలియదిరిగాం. దీని విస్తీర్ణం సుమారు 206 చదరపు కిలోమీటర్లు. జనాభా అరవై వేలు. నుసా అంటే ద్వీపం. పెనీడ అంటే పూజారులు. పూజారుల ద్వీపమని అర్థం. స్థానిక ఆహారాన్ని రుచి చూసాం. అక్కడ సీ వీడ్ ప్రధాన పంట.

