తెలుగు నాట ‘ప్రజాసేవ’కు చివరి ప్రతినిధి
x
Freedom fighter Vavilala Gopalakrishnaiah

తెలుగు నాట ‘ప్రజాసేవ’కు చివరి ప్రతినిధి

వావిలాల గోపాలకృష్ణయ్య (సెప్టెంబరు 17, 1906 - ఏప్రిల్ 29, 2003) నివాళి


-నందిరాజు రాధాకృష్ణ


ఆజన్మ బ్రహ్మచారి. అజాత శత్రువు. భౌతికంగా బక్కపలచని మనిషి... జీవితాంతం చెక్కుచెదరని ఆశయాలు. ప్రజాసేవే పరమావధి. అతిసాధారణ జీవనశైలి. ఆ మహనీయుడే ‘పద్మభూషణ్‌’ వావిలాల గోపాలకృష్ణయ్య. విద్యాధికుడు కాదు, సామాన్యమైన మాధ్యమిక విద్యాలయంలో చదువుకున్న విద్యే! అయిన అమోఘమైన ధారణ కలిగిన వ్యక్తి. తెలుగు ఆంగ్ల భాషలలో అనేక గ్రంధాలు రచించిన ఈ మేధావి తెలుగు వాడని చెప్పుకోవడానికి గర్వపడాలి. ఆంధ్రా విశ్వ విద్యాలయం 'కళాప్రపూర్ణ' సత్కారంతో గౌరవించింది. భారత ప్రభుత్వం 'పద్మ భూషణ్' బిరుదుతో సత్కరించింది.

అసంఖ్యాకంగా మేధావులు, విద్యావంతులు – విశ్వవిద్యాలయాలలో ఆయన 'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వపు బడ్జెట్ ఉపన్యాసాలు' వినటానికి కుతూహల పడేవారు. సుదీర్ఘమైన ప్రజాజీవిత ప్రస్థానంలో అనేక ఉద్యమాలలో పాల్గొన్నారు. అందులో 'విశాలాంధ్ర' ఉద్యమం, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం ముఖ్యమైనవి. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు ప్రధాని నెహ్రూ చేత శంకు స్థాపన చేయించటంలో కృషి అభినందనీయం. ఆ ప్రాజెక్ట్ వల్ల నల్గొండ-గుంటూరు జిల్లాలు ఇప్పుడు సుభిక్షంగా ఉన్నాయంటే, వావిలాలను నిత్యం స్మరించుకోవాలి. సాగర్ నేడు ఒక గొప్ప పర్యాటక ప్రాంతం.

స్వాతంత్య్ర సమరయోధునిగా, ఉత్తమ శాసనసభ్యునిగా, రాష్ట్ర తొలి అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఎనలేని కీర్తి పొందిన స్ఫూర్తి ప్రదాత. స్వాతంత్య్ర సమరయోధుల్లో ఒకరైన భీమవరపు నరసింహారావుతో కలిసి... ఇంటింటికీ తిరిగి ‘స్వరాజ్య భిక్ష’పేరుతో బియ్యం, జొన్నలు సేకరించిన ఆహారపదార్థాలతో కాంగ్రెస్ కార్యకర్తలకు భోజన సదుపాయం కల్పించారు. పల్నాడు పుల్లరి సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించారు. పత్రికా విలేఖరిగా జీవితం ప్రారంభించి, ‘ఆంధ్రపత్రిక’కు ఉపసంపాదకుడిగా వావిలాల తనవంతు పాత్రపోషించారు.

ఆయన జీవితమే ఓ సందేశం. గాంధీ బొమ్మ వున్న ఒక ఖద్దరు సంచిలో రెండు జతల ఖద్దరు బట్టలు, సర్దుకుని నిత్యమూ ప్రజా ఉద్యమంలో పాల్గొన్న అసాధారణ వ్యక్తి. ఆయన్ని కొందరు ఆంధ్రా గాంధీగా అభివర్ణిస్తారు. . గ్రంథాలయోద్యమ సారథిగా ఎందరికో స్ఫూర్తి ప్రదాత. 1906 సెప్టెంబరు 17న గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో శ్రీమతి పేరిందేవి, శ్రీ నరసింహం దంపతులకు ఈయన నాలుగో సంతానంగా జన్మించారు. చదువుకునే రోజుల్లోనే గాంధీజీ స్వాతంత్ర్య ఉద్యమం వైపు ఆకర్షితులై, చదువుకు స్వస్తి చెప్పారు.

ఉద్యమాలలో పాల్గొని బ్రిటిష్ హయాంలో జైలు శిక్షలు అనుభవించారు. జీవితమంతా నిరాడంబరంగా గడిపారు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాటం చేసిన యోధుడు. 1952లో జరిగిన ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా ఉభయ పోటీచేసి ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో వావిలాల ఖర్చుపెట్టినది కేవలం ఆరువందల రూపాయలు. 1955, 62, 67 సంవత్సరాల్లో కూడా సత్తెనపల్లి నుంచి స్వతంత్ర (ఇండిపెండెంట్) అభ్యర్ధిగా గెలుపొందారు.

1952 లో శాంతి సభలలో ఆయన భారతదేశ ప్రతినిధిగా చైనాలో పర్యటించారు. 1952 లోనే శాంతి సభలలో పాల్గొనే భారతదేశ ప్రతినిధిగా రష్యాలో పర్యటించారు. 1990 లో మద్యనిషేధ ఉద్యమంలో, 1992 అమెరికా ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొన్న గోపాలకృష్ణయ్యను 96 సంవత్సరాల వయసులో మృత్యువు 2003 ఏప్రిల్ 29న తన ఒడిలోకి తీసుకుంది.

(నందిరాజు రాధాకృష్ణ, సీనియర్ జర్నలిస్టు, హైదరాబాద్)

Read More
Next Story