
రష్యా ముడిచమురుపై మరోసారి మాట మార్చిన అమెరికా
ఆంక్షలను మరో నెలరోజుల పాటు నిలిపివేసిన వాషింగ్టన్
రష్యా ముడి చమురు ఆయిల్ విషయంలో అమెరికా మరోసారి మాట మార్చింది. మొన్నటి దాకా ఆ దేశ క్రూడ్ ఆయిల్ ఎగుమతులపై విధించిన ఆంక్షలను తొలగించిన వాషింగ్టన్, వాటిని మరోసారి పొడిగించేది లేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ నిబంధనలను మరోసారి పొడిగించింది. రష్యా నుంచి అన్ని దేశాలు పెట్రోలియం ఉత్పత్తులు దిగుమతి చేసుకోవచ్చని, దానికి మరో నెల అదనపు సమయం ఇస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 17న లేదా అంతకంటే ముందు సముద్రంలో ఉన్న రష్యా చమురుపై ఆంక్షల మినహాయింపును మే 16 వరకు పొడిగిస్తూ అమెరికా ట్రెజరీ శాఖ శుక్రవారం ఆలస్యంగా ఒక ఉత్తర్వు జారీ చేసింది.
అంతకుముందు అంటే మార్చి 5 నుంచి ప్రారంభమయ్యే ఒక నెలపాటు రష్యా చమురు కొనుగోలుకు గాను భారత్‌కు అమెరికా ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చింది. కొన్ని రోజుల తర్వాత, ఇదే విధమైన మినహాయింపును అనేక ఇతర దేశాలకు పొడిగించగా, అది ఏప్రిల్ 11తో ముగిసింది.
శుక్రవారం అమెరికా జారీ చేసిన ఈ సాధారణ లైసెన్స్, ఇరాన్, ఉత్తర కొరియా, క్యూబా లేదా ఉక్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాలలో ఉన్న వ్యక్తి, సంస్థ లేదా జాయింట్ వెంచర్‌తో కూడిన ఏ లావాదేవీకి అధికారం ఇవ్వదు. రష్యా చమురుకు, ఇరాన్ చమురుకు ఇచ్చిన మినహాయింపులను వాషింగ్టన్ పునరుద్ధరించబోదని బుధవారం ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ తెలిపారు.
ఇరాన్‌తో అమెరికా యుద్ధం నేపథ్యంలో ధరలు పెరగడంతో, గతంలో ఇచ్చిన ఆంక్షల మినహాయింపు వల్ల, అప్పటికే ఓడల్లో లోడ్ చేయబడిన 14 కోట్ల బ్యారెళ్ల రష్యా చమురు ప్రపంచ మార్కెట్లకు అందుబాటులోకి వచ్చింది. "మార్చి 19, 2026 నాటి నుంచి ఏప్రిల్ 11, 2026న గడువు ముగిసిన జనరల్ లైసెన్స్ నెం. 134A స్థానంలో, ఏప్రిల్ 17, 2026 నుండి ఈ జనరల్ లైసెన్స్ నెం. 134B పూర్తిగా అమలులోకి వస్తుంది" అని ట్రెజరీ డిపార్ట్‌మెంట్ జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొంది. మరో వైపు హార్ముజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా తెరిచినట్లు ప్రకటించింది. అయితే ఓడలు మాత్రం తాము సూచించిన మార్గంలోనే ప్రయాణించాలని హెచ్చరించింది.
హార్ముజ్ జలసంధిని పునరుద్దరించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు 11 శాతం మేర తగ్గాయి. అయితే వెంటనే ముడి చమురు రవాణా ఊపందుకోదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అక్కడ ఇరాన్ అమర్చిన సీమైన్స్ తో పాటు మునిగిపోయిన ఓడల అవశేషాలను తొలగించాల్సి ఉంది.
దీనికి దాదాపు మరో రెండు నెలల సమయం దాకా పట్టవచ్చు. మరోవైపు గల్ఫ్ దేశాలలో అనేక ముడి చమురు ఉత్పత్తి కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వాటిని పునరుద్దరించాల్సిన అవసరం ఉంది. ప్రపంచ ముడి చమురు రవాణాలో హార్ముజ్ జలసంధి గుండా దాదాపు 20 శాతం సరఫరా అవుతుంది. అమెరికా, ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య జరిగిన యుద్ధంతో దాదాపు 45 రోజులుగా ఈ సంధి గుండా ముడి చమురు రాకపోకలు నిలిచిపోయాయి.
Next Story

