
విద్యార్థుల నెత్తిన ట్రంప్ మరో పిడుగు
గ్రాడ్యూయేషన్ తరువాత ఉద్యోగం చేయాలంటే 70 వేల డాలర్లు కట్టాల్సిందే
విదేశీ విద్యార్థుల వలసలను అరికట్టే లక్ష్యంతో ఉన్న ట్రంప్ యంత్రాంగం మరో పిడుగు వేసింది. ఇక నుంచి అమెరికాలో విద్యాభ్యాసం పూర్తి చేసి పని చేయాలనుకునే విదేశీ విద్యార్థుల నుంచి 70 వేల డాలర్లు రుసుము వసూలు చేయాలని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రతిపాదించింది. ఈ మొత్తాన్ని కూడా సంబంధిత యూనివర్శిటీ చెల్లించాలని నియమం విధించింది.
ఈ నియమం ప్రకారం.. ఒక అంతర్జాతీయ విద్యార్థి ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఓపీటీ) కోసం మొదటి సారి దరఖాస్తు చేస్తే సంబంధిత యూనివర్శిటీ ఆ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఓపీటీతో గ్రాడ్యూయేషన్ పూర్తి చేస్తే ఓపీటీ ద్వారా ఒక సంవత్సరం వరకూ యూఎస్ లో పనిచేయవచ్చు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ విద్యార్థులు, గణిత శాస్త్ర రంగాల విద్యార్థులు మరో సంవత్సరం అదనంగా ఓపీటీ చేసుకోవచ్చు.
యూనివర్శిటీలు విద్యార్థికి తొలిసారి ఓపీటీకి దరఖాస్తు చేస్తే 70 వేల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇంకోసారి పునరుద్దరణ చేయాలంటే 30 వేల డాలర్లు కట్టాలి.
ఈ నియమం వల్ల ట్యూషన్ ఫీజు ఆదాయం కోసం విదేశీ విద్యార్థులపై ఆధారపడే అమెరికన్ యూనివర్శిటీలు శరాఘాతంగా మారే అవకాశం ఉంది. అలాగే సాంకేతిక ఉద్యోగాల కోసం అంతర్జాతీయంగా గ్రాడ్యూయేట్లను నియమించుకునే టెక్నాలజీ కంపెనీలు, ఇతర రంగాలపై వారి కూడా ప్రభావం చూపుతుంది.
భారీగా ప్రభావం ఉండొచ్చు..
ఓపీటీ కార్యక్రమం ద్వారా అమెరికాకు నైపుణ్యం ఉన్న విద్యార్థులు భారీగా వస్తున్నారు. అయితే కొత్త నియమాల వల్ల భారీ డిమాండ్ ఉన్న స్టెమ్ రంగాలకు ఉద్యోగాల కొరత ఏర్పడుతుందని అంతర్జాతీయ విద్యకు ప్రాతినిధ్యం వహించే నాఫ్సా సీఈఓ అయిన ఫాంటా అవ్ అన్నారు.
‘‘అంతర్జాతీయ విద్యార్థుల ప్రతిభ, దృక్పథాలు, ఆకాంక్షలను దూరం చేయడం అమెరికా ఆవిష్కరణ, ఆర్థిక వృద్ధి, కార్మిక శక్తి అభివృద్ధి, ప్రపంచ నాయకత్వానికి మాత్రమే హాని కలిగిస్తుంది’’ అని ఒక ప్రకటనలో తెలిపారు.
అయితే డిపార్ట్ మెంట్ ఆఫ్ హోంల్యాండ్ మాత్రం.. ఈ నియమాలు వీసా కార్యక్రమంలోని మోసాలు, దుర్వినియోగానికి అడ్డుకట్ట వేస్తుందని పేర్కొంది. ప్రజల అభిప్రాయాలు తెలపడానికి 60 రోజుల సమయం ఇచ్చింది.
నిబంధనలు కఠినతరం చేస్తున్న ట్రంప్...
గత సంవత్సరం రిపబ్లిక్ ప్రభుత్వం వేలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల చట్టపరమైన హోదాను ఆకస్మికంగా రద్దు చేయడం ప్రారంభించింది. వారిలో చాలామందిని బలవంతంగా దేశం నుంచి పంపించింది.
అలాగే ఫెడరల్ ప్రభుత్వం అనుమతి లేకుండా అంతర్జాతీయ విద్యార్థులు నాలుగు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం అమెరికాలో ఉండకుండా కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఈ చర్య యూనివర్శిటీలపై భారాన్ని పెంచుతుందని, అనేక కోర్సులు నాలుగు సంవత్సరాలు ఉంటాయి కాబట్టే ఉద్దేశపూర్వకంగా వారిని పంపేందుకు ఈ చర్యలు తీసుకున్నారని అవి వ్యతిరేకించాయి. అయితే ఫెడరల్ కోర్టు మాత్రం దీన్ని కొట్టివేసింది.
Next Story

