పాకిస్థాన్‌లో ఎమర్జెన్సీ.. ఇమ్రాన్ ఖాన్ పార్టీ ప్రభుత్వానికి ముగింపు!
x

పాకిస్థాన్‌లో ఎమర్జెన్సీ.. ఇమ్రాన్ ఖాన్ పార్టీ ప్రభుత్వానికి ముగింపు!

షెషావర్ నుంచి ఇస్లామాబాద్ కు మార్చ్ నిర్వహిస్తున్న ఆయన మద్దతుదారులు, ప్రభుత్వాన్ని రద్దు చేసిన జర్దారీ


Click the Play button to hear this message in audio format

కొంతకాలంలో పాకిస్తాన్ లో ఎమర్జెన్సీ విధిస్తారనే ఊహాగానాలు నిజమయ్యాయి. ముఖ్యంగా పాక్ లో పాపులర్ అయిన ఇమ్రాన్ ఖాన్ పార్టీ అయిన పీటీఐ ని ఎలాగైన రాజకీయ సమాధి చేయాలని అక్కడ సైన్యం కంకణం కట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అది అధికారంలో ఉన్న ఖైబర్ ఫఖ్తూన్ ఖ్వా లో ప్రభుత్వాన్ని రద్దు చేసింది. దాని స్థానంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించింది.

రాష్ట్రంలో ఉగ్రదాడులు పెరగడం, శాంతిభద్రతల పరిస్థితి దిగజారడం, రాజ్యాంగ వ్యవస్థ సరిగా పనిచేయడం లేదనే కారణాలతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో అక్కడి ప్రావిన్షియల్ ప్రభుత్వ అధికారాలు కేంద్రం చేతుల్లోకి వెళ్లనున్నాయి.
పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఆదివారం, అక్టోబర్ 11న రాజ్యాంగంలోని 232(1), 234(1) అధికరణాల ప్రకారం ఎమర్జెన్సీ ప్రకటన జారీ చేశారు. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వచ్చింది.
ముఖ్యమంత్రి, మంత్రులు, సలహాదారులు, ప్రత్యేక సహాయకులు, అడ్వకేట్ జనరల్ తమ పదవులను విడిచిపెట్టాల్సి ఉంటుంది. ప్రావిన్షియల్ అసెంబ్లీ అధికారాలను కూడా పార్లమెంట్ లేదా దాని ఆదేశాల మేరకు నిర్వహించే అవకాశం ఉంటుంది. ఈ నిర్ణయానికి ముందు ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో కేంద్ర మంత్రివర్గం ఎమర్జెన్సీ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలో ప్రభుత్వ కార్యాలయాలు, మౌలిక సదుపాయాలు, భద్రతా సంస్థలపై దాడులు పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఉగ్రవాదాన్ని అడ్డుకోవడంలో ప్రావిన్షియల్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించింది. గత పదేళ్లలో ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు, భద్రతను మెరుగుపరిచేందుకు ప్రావిన్స్‌కు కనీసం 800 బిలియన్ పాకిస్థానీ రూపాయలు ఇచ్చినా పరిస్థితి మెరుగుపడలేదని షరీఫ్ ప్రభుత్వం తెలిపింది.
అయితే, ఈ పరిణామాల వెనుక రాజకీయ ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్ విడుదల చేయాలని, ఆయనకు సరైన వైద్య చికిత్స అందించాలని డిమాండ్ చేస్తూ ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిది నిరసన పాదయాత్ర చేపట్టారు.
అక్టోబర్ 4న లక్కీ మార్వత్‌లో ప్రారంభమైన ఈ యాత్ర పలు జిల్లాల మీదుగా కొనసాగుతోంది. తొలుత ఇస్లామాబాద్‌కు చేరుకుని ధర్నా నిర్వహించాలని పీటీఐ భావించినప్పటికీ, నిరసనకారులను రాజధానిలోకి అనుమతించబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ఇస్లామాబాద్‌లో భద్రతను కట్టుదిట్టం చేసి, యాత్ర మార్గంలోని రహదారులను కంటైనర్లతో మూసివేశారు.
సైనిక చర్యలతో సమస్యలు పరిష్కారం కావని, శాంతియుత నిరసనలను కొనసాగిస్తామని అఫ్రిది ప్రకటించినట్లు కథనం పేర్కొంది. మరోవైపు, పీటీఐతో చర్చలు జరిపేందుకు జమియత్ ఉలేమా-ఇ-ఇస్లాం-ఫజల్ అధినేత మౌలానా ఫజ్లుర్ రెహమాన్ ద్వారా మధ్యవర్తిత్వ ప్రయత్నాలు కూడా జరిగాయి. అయితే అవి ఫలించలేదు.
ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు అనుమతి ఇచ్చిన తర్వాతే నిరసన విరమిస్తామని పీటీఐ పట్టుబట్టగా, ముందుగా నిరసనను ముగించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్నారు. 2023 నుంచి జైల్లో ఉన్న ఆయనపై అవినీతి, హింసను ప్రేరేపించారనే ఆరోపణలు సహా వందకు పైగా కేసులు ఉన్నాయి.
ఆయనను వెంటనే కలిసేందుకు అనుమతి ఇవ్వడం, వ్యక్తిగత వైద్యులను అందుబాటులోకి తీసుకురావడం, నిరసనకు ముందు అరెస్టయిన ఆయన సోదరీమణులు, మద్దతుదారులను విడుదల చేయడం వంటి డిమాండ్లను పీటీఐ ముందుకు తెచ్చింది.
ఇమ్రాన్ భార్య బుష్రా బీబీకి సరైన వైద్య పరీక్షలు నిర్వహించాలని కూడా కోరుతోంది. మొత్తంగా, ఉగ్రవాదం, శాంతిభద్రతల సమస్యలను కారణంగా చూపుతూ పాకిస్థాన్ కేంద్ర ప్రభుత్వం ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలో ఎమర్జెన్సీ విధించగా, ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం పీటీఐ నిరసనలు కొనసాగిస్తోంది. ఈ నిర్ణయం ప్రావిన్స్‌లో పాలనపై ఎలాంటి ప్రభావం చూపుతుంది, కేంద్రం-పీటీఐ మధ్య ఉద్రిక్తతలు ఎలా మారతాయన్నది కీలకంగా మారింది.
Read More
Next Story