
పేలుళ్లతో దద్దరిల్లుతున్న ఇరాన్ రాజధాని టెహ్రాన్
ఖమేనీ మృతితో పాక్ లోనూ అలజడి, పదుల సంఖ్యలో షియాలను కాల్చివేసిన అమెరికా సైన్యం
పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఇరాన్ సుప్రీంలీడర్ అయతుల్లా అలీ ఖమేనీని ఇజ్రాయెల్- అమెరికా కలిసి హతమార్చడంతో అంటుకున్న దావాగ్ని ఇప్పుడు గల్ఫ్ ప్రాంతాన్ని మొత్తం చుట్టుముట్టింది. ఇరాన్ తనకున్న మొత్తం ఆయుధ బలాన్ని గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా బేస్ లపైకి గురిపెట్టి ప్రయోగిస్తోంది. అలాగే తన చిరకాల ప్రత్యర్థి ఇజ్రాయెల్ పైకి మిస్సైల్సు, డ్రోన్లను ఉపయోగిస్తోంది.
ప్రతీకారం తీర్చుకుంటాం..
ఇరాన్ ను పాలించండి..
కరాచీలో అమెరికా సైన్యం కాల్పులు..
Live Updates
- 1 March 2026 9:12 PM IST
ఇరాన్‌పై చేసిన సైనిక చర్యలో ముగ్గురు అమెరికా సైనికులు మరణించగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఈ విషయాన్ని ఆదివారం సోషల్ మీడియాలో ప్రకటించినప్పటికీ, ఘటనకు సంబంధించిన అదనపు వివరాలు వెల్లడించలేదు.
- 1 March 2026 8:57 PM IST
మిడిల్ ఈస్ట్ సంక్షోభం ప్రభావంతో విమాన మార్గాలపై పరిమితులు రావడంతో టూర్ బుకింగ్స్ రద్దులు, తేదీ మార్పుల అభ్యర్థనలు పెరిగినట్లు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ తెలిపింది. ముఖ్యంగా గల్ఫ్ హబ్‌ల ద్వారా యూరప్‌కు వెళ్లే ప్రయాణాలపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నట్లు పేర్కొంది.
దేశవ్యాప్తంగా ట్రావెల్ ఏజెంట్లు విమానయాన సంస్థలు, విదేశీ భాగస్వాములతో కలిసి ప్రయాణికులకు ఇబ్బంది తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్లు ఐఏటీఓ అధ్యక్షుడు రవి గోసైన్ తెలిపారు. రీబుకింగ్స్, రీఫండ్స్, ప్రత్యామ్నాయ మార్గాల ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుత పరిస్థితి తాత్కాలికమేనని, త్వరలో స్థిరపడే అవకాశం ఉందని ఆయన సూచించారు. ప్రయాణికులు ఆందోళన చెందకుండా తమ ట్రావెల్ ఏజెంట్లతో సంప్రదింపులు కొనసాగించాలని, అవసరం లేకుండా బుకింగ్స్ రద్దు చేయవద్దని సూచించినట్లు తెలిపారు. విమానయాన సంస్థలు చాలా సందర్భాల్లో సరైన ప్రత్యామ్నాయాలను అందిస్తున్నాయని చెప్పారు.
- 1 March 2026 8:34 PM IST
10వ, 12వ తరగతి బోర్డు పరీక్షలను సీబీఎస్ఈ వాయిదా
ఇరాన్–ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో జరగాల్సిన 10వ, 12వ తరగతి బోర్డు పరీక్షలను సీబీఎస్ఈ వాయిదా వేసింది. మార్చి 2న నిర్వహించాల్సిన పరీక్షలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల కారణంగా బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమాన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ దేశాల్లో మార్చి 2న జరగాల్సిన పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు పరీక్షల నియంత్రణాధికారి సన్యం భరద్వాజ్ తెలిపారు.
కొత్త పరీక్ష తేదీలను తరువాత ప్రకటిస్తామని ఆయన చెప్పారు. అలాగే మార్చి 3న పరిస్థితిని సమీక్షించి, మార్చి 5 తర్వాత జరగాల్సిన పరీక్షలపై తగిన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
- 1 March 2026 8:23 PM IST
ఖమేనీ హత్యపై చైనా ఏమందంటే!
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమెనీ హత్యను చైనా తీవ్రంగా ఖండించింది. ఇది ఇరాన్ సార్వభౌమత్వం, భద్రతపై తీవ్రమైన ఉల్లంఘన అని పేర్కొంది. అలాగే అమెరికా, ఇజ్రాయెల్ దాడులను తక్షణమే నిలిపివేయాలని చైనా కోరింది.
చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్‌తో ఫోన్‌లో మాట్లాడి పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై చర్చించారు.
ఇరాన్, చైనా, రష్యా మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా చైనా, ఇరాన్ నుంచి గణనీయమైన పరిమాణంలో చమురు, వాయువును దిగుమతి చేసుకుంటుంది.
ఇరాన్ సుప్రీం లీడర్‌పై దాడి చేసి హత్య చేయడం ఇరాన్ సార్వభౌమత్వం, భద్రతకు తీవ్రమైన భంగం కలిగించిందని చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది ఐక్యరాజ్యసమితి చార్టర్ ఉద్దేశాలు, సూత్రాలకు విరుద్ధమని పేర్కొంది. అంతర్జాతీయ సంబంధాల ప్రాథమిక నిబంధనలను కూడా ఉల్లంఘించిందని తెలిపింది. ఈ ఘటనను చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖండిస్తున్నట్లు వెల్లడించింది.
సైనిక చర్యలను వెంటనే నిలిపివేయాలని, పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారకుండా చూడాలని చైనా కోరింది. అలాగే మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో, ప్రపంచవ్యాప్తంగా శాంతి, స్థిరత్వం కోసం అన్ని దేశాలు కలిసి పనిచేయాలని సూచించింది.
- 1 March 2026 8:22 PM IST
మిడిల్ ఈస్ట్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత వాణిజ్యంపై ప్రభావం ఎలా ఉంటుందో అంచనా వేసేందుకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశం సోమవారం జరగనుంది. ఎగుమతిదారులు, షిప్పింగ్ సంస్థలు, ఫ్రైట్ ఫార్వర్డర్లు, ఇతర శాఖల అధికారులు ఇందులో పాల్గొననున్నారు. సమావేశం హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్నారు.
శనివారం అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై సైనిక దాడులు జరిపాయి. దీనికి ప్రతిగా ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్‌పై దాడులు చేసింది. అలాగే గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు, అంతర్జాతీయ వ్యాపార కేంద్రంగా ఉన్న దుబాయ్ వైపూ దాడులు జరిగాయి.
ఈ పరిస్థితులు భారత వాణిజ్యంపై ఎలా ప్రభావం చూపుతాయో తెలుసుకునేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి, బాబ్ ఎల్-మందెబ్ జలసంధి మార్గాలపై ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గాలు భారతదేశాన్ని గల్ఫ్ దేశాలు, ఉత్తర అమెరికా, యూరప్ ప్రాంతాలతో కలుపుతాయి. ఈ మార్గాల్లో అంతరాయం ఏర్పడితే వాణిజ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
- 1 March 2026 7:08 PM IST
హోరెత్తిన నిరసనలు
ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందారు. ఆయన మృతికి వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. జమ్ముకశ్మీర్ లెహ్‌లోని లద్ధాఖ్ ప్రాంతంలో షియా ముస్లింలు వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఇరాన్‌పై దాడులను ఖండిస్తూ.. ఇజ్రాయెల్, అమెరికా వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఇరాన్‌కు సంఘీభావం తెలుపుతూ.. ఖమేనీ చిత్రాలు, నల్ల జెండాలు, ఇరాన్‌కు మద్దతిచ్చే బ్యానర్లతో ఈ నిరసనలు చేపట్టారు. 'నేడు మా ప్రియతమ నాయకుడు అలీ ఖమేనీ దారుణ హత్యకు గురయ్యారు. ఈ సంతాప సభను మా నగరంలో శాంతియుతంగా నిర్వహిస్తాం' అని ఓ నిరసనకారుడు అన్నారు.


