సోచీ తీరంలో ముడి చమురుకు అంటుకున్న మంటలు
x

సోచీ తీరంలో ముడి చమురుకు అంటుకున్న మంటలు

నౌకపై దాడి చేసిన ఉక్రెయిన్


Click the Play button to hear this message in audio format

రష్యా నుంచి నల్ల సముద్రం ద్వారా ముడి చమురు సరఫరా చేస్తున్న నౌక పై ఉక్రెయిన్ దాడి చేసింది. లైబీరియా జెండాతో ప్రయాణిస్తున్న నౌక పై డ్రోన్ల దాడి జరిగిందని, దానితో చమురు సముద్రంలో ఒలికి నిప్పు అంటుకుందని రష్యా ప్రకటించింది. మంటలను సిబ్బంది అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదని, నౌకలోని 23 మంది సిబ్బందిని రక్షించినట్లు తెలిపారు.

ట్యాంకర్ నౌక పై డ్రోన్ల దాడి జరిగింది. నల్ల సముద్ర జలాల్లో ముడి చమురు ఒలికి మండుతోందని మంత్రిత్వశాఖ అధికారికంగా ప్రకటించిందని, మంటల తీవ్రత తరువాత అగ్నిమాపక సిబ్బంది మరో ప్రయత్నం చేస్తారని స్థానిక వార్తా పత్రికలు పేర్కొన్నాయి.

సోచీ తీరంలో మంటలు..

దాదాపు ఐదు లక్షల జనాభా నివసిస్తున్న ప్రముఖ తీర ప్రాంత పట్టణమైన సోచీ సమీపంలో ఈ సంఘటన జరిగింది. దీనితో సోషల్ మీడియాలో మంటలు మండుతున్న వీడియోలు వైరల్ గా మారాయి. రాత్రి పూట సముద్రంపై మంటలు కనిపించడం స్పష్టంగా కనిపించింది.
తెల్లవారుజామున భారీ ఎత్తున పొగ కూడా ఆకాశంలో వెళ్లడాన్ని పలువురు వీడియోలు తీసి పోస్ట్ చేశారు. ప్రస్తుతం బీచ్ కు వెళ్లడాన్ని స్థానిక ప్రభుత్వం నిషేధించింది. ప్రజలు ఇళ్ల కిటీకీలు సైతం మూసివేయాలని ఆదేశాలు జారీచేశారు.
నిన్న రోమోనియా తీరంలో ఓ నౌకలో మంటలు చెలరేగి మునిగిపోయిన తరువాత ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. మరొకరు గల్లంతయ్యారు. ట్యాంకర్ పై రష్యా దాడి చేసిందని ఉక్రెయిన్ ఆరోపించింది. ఈ ఘటనలో భారతీయ సిబ్బంది గాయపడ్డారు. నల్ల సముద్రం కేంద్రంగా రష్యా, ఉక్రెయిన్ పదే పదే బలప్రదర్శన కోసం దాడులకు పాల్పడుతున్నారు.
2022 లో రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభం అయిన తరువాత నల్ల సముద్రంలో కేంద్రంగానే దాడులు, ప్రతిదాడులు ఎక్కువగా జరుగుతున్నాయని పలు అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచ సరఫరా గోలుసుకు తీవ్ర అంతరాయం కలుగుతోందని పేర్కొన్నాయి.
ఉక్రెయిన్ పట్టణాలు, నగరాలపై రష్యా చేస్తున్న దాడులకు ప్రతికారంగానే తాము చమురు కేంద్రాలపై దాడులు చేస్తున్నట్లు కీవ్ వెల్లడించింది. రష్యా, కీవ్ లోని కీలక వంతెనలపై దాడులు చేయడం, రాజధానిలో పగటిపూట డ్రోన్ దాడులు చేయడం కూడా ప్రారంభించింది. ఈ పరిణామం వల్ల భారీ ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది.
అంతకుముందు దక్షిణ రష్యాలోని చమురు సౌకర్యాలపై ఉక్రెయిన్ జరిపిన దాడుల ఫలితంగా చమురు తెట్టులు ఏర్పడటం, బీచ్ లను మూసివేయడం జరిగింది. ఈ తరువాత ఆకాశం నుంచి విషపూరితమైన నల్లవర్షం కురుస్తున్నట్లు కూడా నివేదికలు వచ్చాయి.
నల్ల సముద్రంలో వాణిజ్య నౌకలపై ఇటీవల జరుగుతున్న దాడులకు ఈ తాజా ఘటన తోడయింది. ఈ పోరాటాలు రష్యా, ఉక్రెయిన్, రోమేనియా తీరాలకు సమీపంలో సంచరిస్తున్న నౌకలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి.
Read More
Next Story