
యూరప్ వీధుల్లో యువత ఆగ్రహజ్వాలలు..
రాజకీయాలకు అతీతంగా పెరుగుతున్న నిరసనలు
యూరప్‌లో యువత ఆందోళనలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఫ్రాన్స్‌లో పాఠశాలల సమస్యలతో మొదలైన నిరసనలు.. ఇటలీలో పెరుగుతున్న జీవన వ్యయాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమాలు.. స్పెయిన్, పోర్చుగల్‌లో ఇళ్ల అద్దెల భారంపై ఆందోళనల వరకు విస్తరించాయి. అల్బేనియాలో అవినీతికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ పరిణామాలు చూస్తే యూరప్‌లో యువత అసంతృప్తి కేవలం రాజకీయాలకే పరిమితం కాలేదని స్పష్టమవుతోంది.
యువతకు మెరుగైన విద్య, ఉపాధి, అందుబాటులో ఇళ్లు, నాణ్యమైన ప్రజాసేవలు లభించడం లేదనే భావన ఈ నిరసనలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. భవిష్యత్తుపై అనిశ్చితి, ప్రస్తుత సామాజిక వ్యవస్థపై నమ్మకం తగ్గడం యువతను వీధుల్లోకి తీసుకొస్తున్నాయని సామాజిక శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు.
ఫ్రాన్స్‌లో పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, మౌలిక సదుపాయాల లోపాలను నిరసిస్తూ విద్యార్థులు మూడు వారాలకు పైగా ఆందోళనలు చేపట్టారు. ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాలు నివసించే ప్రాంతాల్లోని పాఠశాలల్లో వనరుల కొరతపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కార్మిక సంఘాలు, ఇతర కార్యకర్తలు కూడా ఈ ఉద్యమంలో చేరడంతో జీవన వ్యయాలు, ప్రభుత్వ సేవలకు సంబంధించిన డిమాండ్లు ముందుకొచ్చాయి.
అయితే, ఫ్రాన్స్‌లో నిరసనలు కొన్ని ప్రాంతాల్లో హింసాత్మకంగా మారాయి. పారిస్ సహా పలు నగరాల్లో దోపిడీలు, ఆస్తుల ధ్వంసం చోటుచేసుకున్నాయి. వారాంతంలో జరిగిన అల్లర్లకు సంబంధించి సుమారు 2,400 మందిని అరెస్టు చేశారు. ఘర్షణల్లో వందలాది మంది గాయపడగా, కొన్ని పాఠశాలలకు నిప్పుపెట్టారు. లిమోజెస్‌లోని పాత సిటీ హాల్ భవనంలో కూడా మంటలు చెలరేగాయి. ఈ హింసను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఖండించారు. విధ్వంసానికి పాల్పడినవారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇక స్పెయిన్‌లో విద్యారంగ సమస్యలతో పాటు గృహ సంక్షోభం యువతను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. మాడ్రిడ్‌లోని పుయెర్టా డెల్ సోల్ ప్రాంతంలో అధిక అద్దెలకు వ్యతిరేకంగా నిరసనకారులు వారాలుగా గుడారాలు వేసుకుని ఆందోళన చేస్తున్నారు. 87 ఏళ్ల మారికార్మెన్ అనే మహిళ ఇంటి నుంచి ఖాళీ చేయించబడిన తర్వాత ఆసుపత్రిలో మరణించడం ఈ నిరసనలకు మరింత ఊపునిచ్చింది. ఇతర నగరాల్లోనూ ఇలాంటి శిబిరాలు ఏర్పడ్డాయి.
స్పెయిన్‌లో కనీస వేతనం 1,221 యూరోలుగా ఉండగా, 80 చదరపు మీటర్ల ఇంటి సగటు నెలవారీ అద్దె సుమారు 1,130 యూరోలుగా ఉంది. దీంతో సంపాదనలో ఎక్కువ భాగం అద్దెలకే ఖర్చవుతోందని యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహ సంబంధిత చర్యలకు పార్లమెంట్లో మద్దతు లభించకపోవడంతో నవంబర్‌లో ముందస్తు ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు, మెరుగైన వేతనాలు, పని పరిస్థితుల కోసం స్పెయిన్‌లో ఉపాధ్యాయులు నిరవధిక సమ్మెకు దిగారు. పోర్చుగల్‌లోనూ ఇళ్ల ధరలు, అద్దెల పెరుగుదలకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి.
ఇటలీలోనూ జీవన వ్యయాల పెరుగుదల ప్రజలను రోడ్డెక్కిస్తోంది. మెరుగైన ఉద్యోగాలు, వైద్యం, విద్య, గృహ వసతి, అధిక వేతనాలు కోరుతూ వేలాది మంది ‘ఇటాలియా ఇన్ పియాజ్జా’ ఉద్యమంలో పాల్గొంటున్నారు. సెప్టెంబర్‌లో ఇటలీ ద్రవ్యోల్బణం 4.2 శాతానికి చేరగా, యూరోజోన్ సగటు 3.8 శాతంగా నమోదైంది. ట్యూరిన్, బొలోనియా, మిలాన్ నగరాల్లో నిరసనలు హింసాత్మకంగా మారాయి. మిలాన్‌లో రెండు రోజుల అల్లర్ల సందర్భంగా 271 మందిని అరెస్టు చేయగా, భద్రతా సిబ్బందిలో 14 మంది గాయపడినట్లు సమాచారం. అక్టోబర్ 17 ఉద్యమంగా ఏర్పడిన మరో బృందం దేశవ్యాప్తంగా ప్రతి శనివారం నిరసనలు కొనసాగిస్తామని ప్రకటించింది.
అల్బేనియాలో అవినీతికి వ్యతిరేకంగా సాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంలో విద్యార్థులు కూడా భాగస్వాములయ్యారు. రాజధాని టిరానాలో నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ప్రధాని ఎడి రామా రాజీనామా చేయాలని ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. అవినీతిని అంతం చేయడంతో పాటు వైద్యం, విద్య, పింఛన్లకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. మరోవైపు, నిరసనకారులు తీవ్రవాద భావజాలంతో ప్రభావితమయ్యారని రామా ఆరోపించారు.
సెర్బియాలోనూ దాదాపు రెండేళ్లుగా అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న విశ్వవిద్యాలయ విద్యార్థులు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నెల 25న జరగనున్న పార్లమెంటరీ ఎన్నికల నేపథ్యంలో, మాజీ అధ్యక్షుడు అలెగ్జాండర్ వూచిచ్ తిరిగి అధికారంలోకి రావాలనే ప్రయత్నాలను విద్యార్థుల మద్దతున్న పార్టీ సవాలు చేస్తోంది. దీంతో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.
మొత్తంగా చూస్తే, యూరప్‌లోని వివిధ దేశాల్లో నిరసనలకు కారణాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, యువత ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, విద్యా వ్యవస్థలో సమస్యలు, గృహ వసతి కొరత, ప్రజాసేవలపై అసంతృప్తి వంటి అంశాలు ఉమ్మడిగా కనిపిస్తున్నాయి. ఈ ఆందోళనల మధ్య కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటుండగా, రాజకీయ పార్టీలు కూడా ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. యువత డిమాండ్లకు ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయన్నది రాబోయే రోజుల్లో కీలకంగా మారనుంది.

