నేపాల్ ను వణికించిన భారీ వరదలు.. వందల మంది టూరిస్టుల గల్లంతు
x

నేపాల్ ను వణికించిన భారీ వరదలు.. వందల మంది టూరిస్టుల గల్లంతు

గ్లేసియర్ వల్ల జరిగిందా? మట్టి కొండలు జారీ పడటం వల్ల జరిగిందా అనే అనుమానం


Click the Play button to hear this message in audio format

హిమాలయ దేశం నేపాల్ అకస్మాత్తుగా సంభవించిన మెరుపు వరదలతో అతలాకుతలం అయింది. బుధవారం (ఆగస్టు 26) ఉదయం భోటే కోషి నది ఉప్పొంగడంతో కనీసం ఎనిమిది మంది మరణించారని తెలిసింది.

వరద కారణంగా రోడ్లు, విద్యుత్ స్తంభాలు, పెద్ద పెద్ద ఇళ్లు సైతం కొట్టుకుపోయాయి. వందలాది టూరిస్టుల జాడ తెలియరావడం లేదు. అందులో సుమారు వందమంది దాకా భారతీయులు ఉన్నారని సమాచారం. ఎలాంటి వర్షపాతం లేకుండా హిమాలయాల్లోని ఓ పెద్ద సరస్సు తెగిపోవడంతోనే ఈ మెరుపు వరద సంభవించినట్లు అంతా అనుమానిస్తున్నారు.

స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9 గంటల ప్రాంతంలో టిబెట్ దిశ నుంచి వచ్చినట్లు భావిస్తున్న ఈ వరద భోటే కోషి నదిలో ఉప్పొంగింది. వరదకు కారణం ఏమిటో ఇంకా నిర్ధారణ కానప్పటికీ, టిబెట్‌లో కరిగిన హిమానీనదం నదిలో ఉప్పొంగడానికి కారణమైందని చెబుతున్నారు.


హిమానీనద సరస్సు విస్ఫోటన వరద (GLOF) లేదా కొండచరియలు విరిగిపడటం వల్ల ఏర్పడిన అడ్డంకి ఈ ఆకస్మిక వరదలకు కారణమయ్యాయా అని అధికారులు పరిశీలిస్తున్నారు. టిబెట్‌లో పుట్టిన కోషి నది, నేపాల్‌లో త్రిశూలి నదిలో కలుస్తుంది. ఇది గండక్ నదిగా భారత్ ప్రవేశిస్తుంది.

కొట్టుకుపోయిన ఇళ్లు, వంతెనలు..

రసువా జిల్లాలోని తిమురే, సమీపంలోని సఫ్రుబేసి ప్రాంతంలో నీటిమట్టం అకస్మాత్తుగా పెరగడంతో విస్తృతమైన విధ్వంసం జరిగిందని, వాహనాలు, సరుకులు, ఇతర ఆస్తులు వరద నీటిలో కొట్టుకుపోయాయని నేపాల్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది.
ఖాఠ్మండుకు ఈశాన్యంగా, టిబెట్ సరిహద్దుకు సుమారు 125 కిలోమీటర్ల దూరంలో ఉన్న రసువా జిల్లాలో 50,000 మంది జనాభా ఉన్నారు. వరదల వల్ల కస్టమ్స్ ప్రాంగణంలో ఉంచిన అనేక వాహనాలు, సరుకులు కొట్టుకుపోయాయని రసువా చీఫ్ కస్టమ్స్ ఆఫీసర్ రాజేంద్ర ధుంగనా తెలిపారు.
ఇటీవల నిర్మించిన ఒక వంతెన కూడా ధ్వంసమైంది. వరదల తీవ్రత అసాధారణంగా ఉందని, ఈ రెండు నివాస ప్రాంతాలు గణనీయంగా దెబ్బతిన్నాయని రసువా అసిస్టెంట్ చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ధ్రువ ప్రసాద్ అధికారి తెలిపారు.
నేపాల్ ఇంధన మంత్రిత్వ శాఖ ప్రకారం, వరదలు అనేక జలవిద్యుత్, ప్రసార సౌకర్యాలను దెబ్బతీయడంతో, ప్రధానంగా జలవిద్యుత్ ప్రాజెక్టుల నుంచి వచ్చే సుమారు 430 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.

వందల మంది భారతీయుల గల్లంతు..

ఇప్పటివరకు ఎనిమిది మృతదేహాలు లభ్యమయ్యాయని, సాయక చర్యలు కొనసాగుతున్నాయని పోలీసు ప్రతినిధి అబి నారాయణ్ కఫ్లేను ఉటంకిస్తూ ఏఎఫ్‌పీ వార్తలు ప్రసారం చేసింది. రసువాలో 26 మంది నేపాల్ పోలీసు సిబ్బంది, ఏడుగురు సాయుధ పోలీసు దళ సిబ్బంది గల్లంతైనట్లు నివేదికలు చెబుతున్నాయి.
వరదల కారణంగా 100 మందికి పైగా భారతీయులు గల్లంతయ్యారని కూడా నివేదికలు చెబుతున్నాయి. నేపాల్ సరిహద్దున ఉన్న ఉత్తర ప్రదేశ్, బీహార్ ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేశారు. బుధవారం మధ్యాహ్నానికి నేపాల్ సైన్యం కనీసం 25 మందిని రక్షించినట్లు సమాచారం.
వరదల వల్ల తీవ్రంగా దెబ్బతిన్న స్యాప్రు బేసి, తిమురే ప్రాంతాల్లో సాయక చర్యల కోసం హెలికాప్టర్లను మోహరించినప్పటికీ, నీటిమట్టం ఎక్కువగా ఉండటంతో అవి అక్కడ దిగలేకపోయిందని రాయిటర్స్ వార్తలు ప్రసారం చేసింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

కొనసాగుతున్న సాయక చర్యలు..

రాసువా, నువాకోట్, ధాడింగ్, చిత్వాన్, గోర్ఖా నదీ తీరాల్లో నివసిస్తున్న ప్రజలు తదుపరి ఆదేశాలు వచ్చేవరకు అప్రమత్తంగా ఉండాలని, భద్రతా చర్యలు తీసుకోవాలని నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డిఆర్‌ఆర్‌ఎం) నేపాల్ ఒక ప్రకటన జారీ చేసింది.
వినాశకరమైన వరదల దృష్ట్యా సహాయక, పునరావాస కార్యకలాపాలను ముమ్మరం చేసేందుకు రసువా, పరిసర ప్రాంతాలలో నేపాల్ సైన్యం, సాయుధ పోలీసు దళం, నేపాల్ పోలీసు సిబ్బందిని మోహరించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.
వరద అనంతర పరిస్థితిపై చర్చించి, దానిని ఎదుర్కోవడానికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.
నది సమీప ప్రాంతాలకు గాలింపు, సహాయక చర్యల కోసం నేపాల్ సైన్యం ఇప్పటికే రెండు హెలికాప్టర్లను పంపింది. అత్యవసర వైద్య సహాయక బృందంతో కూడిన ఒక సైనిక హెలికాప్టర్ (MI 17)ను త్రిశూలిలోని జిల్లా ఆసుపత్రికి ఇప్పటికే పంపినట్లు వెల్లడించింది.
అయితే, నష్టానికి సంబంధించిన సమాచార సేకరణ కొనసాగుతున్నందున, వినాశకరమైన వరదల వల్ల జరిగిన నష్టం వివరాలు ఇంకా అందలేదని నేపాల్ సైన్యం పేర్కొంది.

టిబెట్ వైపు నష్టం..

వరదల అనంతరం టిబెట్ వైపు కూడా "భారీ ప్రాణనష్టం" నష్టం వాటిల్లిందని, గిరాంగ్ పోర్టులో చాలా మంది గల్లంతయ్యారని చైనా ప్రభుత్వ మీడియా నివేదించింది.
చైనా-నేపాల్ సరిహద్దుకు ప్రధాన మార్గంగా పనిచేసే గిరాంగ్ కౌంటీలో ఈ వరద రోడ్లు, కమ్యూనికేషన్, విద్యుత్ సరఫరాకు గణనీయమైన నష్టం కలిగించిందని కూడా అది నివేదించింది.
ఈ పరిస్థితి దృష్ట్యా, గల్లంతైన వారిని గుర్తించేందుకు పూర్తిస్థాయి గాలింపు, సాయక చర్యలకు చైనా ప్రధాని షీ జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి విషాదాలను నివారించడానికి ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయాలని ఆయన అధికారులను కోరారు.

గత ఏడాది ఇలాంటి వరదలే..

సరిగ్గా ఏడాది క్రితం, భోటేకోషిని రెండు వినాశకరమైన వరదలు ముంచెత్తి, రసువాలో బీభత్సం సృష్టించాయి. ఇందులో పది మంది చనిపోయారు. అంతకుముందు వరకూ సరిగా ఉనికిలో లేని 'సుప్రాగ్లేషియల్' సరస్సు అకస్మాత్తుగా ఎండిపోవడం వల్ల ఈ వరద సంభవించింది. జలవిజ్ఞాన, వాతావరణ శాఖ ప్రకారం, బుధవారం రసువాలో సంభవించిన వరదలకు వర్షపాతం కారణం కాదు.
Read More
Next Story