
ఇరాన్ లో నాయకత్వం నిజంగానే రెండుగా చీలిందా?
ఖమేనీ అంతిమ యాత్రలో పెజేష్కియాన్, అరాగ్చి పై రాళ్లదాడి దేనికి సంకేతం
ఇరాన్-యూఎస్ఏ మధ్య యుద్ధం తీవ్రమవుతున్న వేళ టెహ్రాన్ లో రాజకీయ నాయకత్వం రెండు చీలిపోయినట్లు అనుమానాలు ముసురుకుంటున్నాయి. ప్రస్తుతం అమెరికాతో చర్చలు జరుపుతున్న అధ్యక్షుడు పెజెష్కియాన్, స్పీకర్ మహ్మద్ అబ్బాస్ అరాగ్చీ దేశం తరఫున శాంతిచర్చలలో సంతకాలు చేశారు.
అయితే వీరిపై దేశంలో ఇస్లామిక్ మతోన్మాద మూకలు తీవ్ర వ్యతిరేకతను బహిరంగంగానే చూపిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రస్తుత సుప్రీంలీడర్ అమెరికాతో శాంతి ఒప్పందం చెత్తబుట్టలోకే వెళ్తుందని ప్రకటించారు.
ఈ యుద్ధం వల్ల వాషింగ్టన్ మర్చిపోలేని గుణపాఠాలు నేర్చుకుంటుందని హెచ్చరించారు. ఈ రెండు వైఖరులు టెహ్రాన్ నాయకత్వంలో స్పష్టమైన విభజన ఉందని సూచిస్తున్నాయి. ఒక వైపు సంస్కరణ వాదులు ఉండగా, మరోవైపు కఠినమైన ఇస్లామిక్ వాదులు ఉన్నట్లు తేటతెల్లమైందని సీఎన్ఎన్ కథనాలు ప్రచురించింది.
జూలైలో ఇరాన్ మాజీ సుప్రీంలీడర్ అలీ ఖమేనీ శవపేటికను టెహ్రాన్ వీధుల గుండా ఊరేగింపు చేస్తున్న సమయంలో కొంతమంది ఇస్లామిక్ మతోన్మాద మూకలు పేజేష్కియాన్ లక్ష్యంగా ‘‘రాజీపథంలో పడినవారికి మరణం’’ అని నినాదాలు చేశారు.
తరువాత కొంతమంది నిరసనకారులు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చిని ద్రోహి, అమ్ముడు పోయాడు, మరణ శిక్ష విధించాలని రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీనితో వీరు ఊరేగింపు మధ్య నుంచి అర్థాంతరంగా వైదొలిగాల్సి వచ్చింది.
ఈ పరిణామం కూడా ఇరాన్ లో ఉన్నత శ్రేణి నాయకత్వంపై ఇస్లామిక్ మతోన్మాద మూకలు శాంతి చర్చలకు ససేమిరా అనే సందేశాన్ని వినిపిస్తున్నాయని, అందుకు విరుద్దంగా వెళ్తున్న వారిని ద్రోహులుగా ముద్రవేస్తున్నాయని పేర్కొన్నారు.
మొజ్తాబా ఖమేనీ ఇస్తున్న ఆదేశాలను ఉన్నతాధికారులు, నాయకులు ధిక్కరిస్తూ ఉన్నారని వీరంతా భావిస్తున్నారు. సీనియర్ ఖమేనీ మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి వీరు వ్యతిరేకిస్తున్నారని వారి మదిలో ఉంది. శాంతియుత నాయకులు అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
పార్లమెంట్ ను రద్దు చేయడం, మొజ్తాబా ఆదేశాలు అమలు చేయకపోవడం, రాత్రిపూట ర్యాలీలు అణచివేయడం వీటిని కఠిన ఇస్లామిక్ వాదులు ఉదాహారణగా చూపుతున్నారు. తీవ్రవాదిగా పేరు పొందిన చట్టసభ సభ్యుడు మహ్మద్ నబావియన్.. ఖమేనీ అంత్యక్రియలకు కొన్ని రోజులకు ముందు మాట్లాడారు. దేశంలో తిరుగుబాటు జరుగుతుందా అని ప్రశ్నించారు. అదే జరిగితే దేశం తరఫున దృఢంగా నిలబడతానని ప్రకటించారు.
దీనితో ఆయనను పార్లమెంట్ జాతీయ భద్రతా కమిషన్ నుంచి తొలగించారు. ఇదే సమయంలో ట్రంప్ కూడా ఇరాన్ నాయకత్వం రెండుగా చీలిపోయిందని చెబుతున్నారు. అయితే ఇక్కడ రెండు గ్రూపులు ఉన్నప్పటికీ వారి లక్ష్యం ఒకటే అని ఆ దేశ వ్యవహరాలు పరిశీలిస్తున్న నిఫుణులు చెబుతున్నారు. ఆంక్షల నుంచి బయటకు వస్తూ హర్ముజ్ మీద నియంత్రణ సాధించి యుద్ధాన్ని ముగించాలని ఇరాన్ అనుకుంటోందని సీఎన్ఎస్ పేర్కొంది.
Next Story

