యుద్ధానికి ముందు ఉన్న స్థితికి హార్ముజ్ రాదు: ఇరాన్
x

యుద్ధానికి ముందు ఉన్న స్థితికి హార్ముజ్ రాదు: ఇరాన్

అది పూర్తిగా మా ఆధీనంలోనే ఉంటుందన్న స్పీకర్ బఘేర్ ఘాలీబాఫ్


Click the Play button to hear this message in audio format

ఇరాన్ ఆధీనంలో ఉన్న హార్ముజ్ జలసంధి ఫిబ్రవరి 28 వ తేదీకి ముందున్న పరిస్థితికి రాదని ఆ దేశ స్పీకర్ బఘేర్ ఘాలీబాఫ్ అన్నారు. అది ఎప్పటికీ మా ఆధీనంలోనే ఉంటుందని పేర్కొన్నారు. 60 రోజుల వ్యవధిలో శత్రుత్వానికి శాశ్వత ముగింపు పలకడానికి యుద్ధంలో ఉన్న అమెరికా - ఇరాన్ ఒక అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేసిన నేపథ్యంలో ఘాలిబాఫ్ ఈ ప్రకటన చేశారు.

ఈ అవగాహన ఒప్పందంలోని కీలక అంశాలలో ఒకటి హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం. ఇది పర్షియన్ గల్ఫ్‌ను, గల్ఫ్ ఆఫ్ ఒమన్, అరేబియా సముద్రంతో కలిపే ఒక ముఖ్యమైన వాణిజ్య మార్గం. ఇరాన్ దీనిని దిగ్బంధించడం వల్ల, చమురు, గ్యాస్ కోసం పశ్చిమాసియాపై ఆధారపడిన దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

హార్ముజ్ కోసం హాట్‌లైన్

“యుద్ధం ప్రారంభంలోనే నేను స్పష్టంగా చెప్పిన మొదటి వ్యక్తులలో ఒకడిని, హార్ముజ్ జలసంధి నిర్వహణ యుద్ధానికి ముందు ఉన్న విధంగా ఎప్పటికీ తిరిగి రాదని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి” అని మంగళవారం (జూన్ 23) స్విట్జర్లాండ్‌లో చర్చల నుంచి తిరిగి వస్తున్నప్పుడు ఇరాన్ మీడియాతో ఘాలిబాఫ్ అన్నారు. అయితే, జలసంధి గుండా నౌకల రాకపోకలపై సందేహాలను నివారించడానికి ఒక హాట్ లైన్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని కూడా చెప్పారు.
ఈ హాట్‌లైన్ “అత్యున్నత స్థాయి భద్రత, రాకపోకల ప్రవాహాన్ని” అందిస్తుందని, అలాగే అంతర్జాతీయ చట్టాల అమలుకు ఇరాన్ కట్టుబడి ఉంటుందని సమస్యలు, అపార్థాలను పరిష్కరించడానికి త్వరితగతిన చర్యలు తీసుకుంటుందని ఘాలిబాఫ్ హామీ ఇచ్చారు.
హాట్‌లైన్‌తో పాటు, నౌకల రాకపోకలను సమన్వయం చేయడానికి, ఏవైనా సమస్యలు లేదా అస్పష్టతలు తలెత్తినప్పుడు వారికి సాయపడటానికి ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కూడా యూఎస్ - ఇరాన్ నిర్ణయించాయి.

'అమెరికాపై నమ్మకం లేదు'

అమెరికా పై మాకు నమ్మకం లేదని గాలిబాఫ్ అన్నారు. చర్చల సమయంలో ఇరాన్ బృందం నిరసన తెలిపిందని, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్‌ను మార్చాలని అమెరికాపై ఒత్తిడి తెచ్చిందని ఆయన తెలిపారు.
ఆ పోస్ట్‌లో ట్రంప్, "ప్రాక్సీ గ్రూపులకు" మద్దతు ఇవ్వవద్దని ఇరాన్‌ను హెచ్చరించారు, ఇది లెబనాన్ హిజ్బుల్లాను ఉద్దేశించి చేసిన పరోక్ష వ్యాఖ్య. నిరసన తెలిపిన గంటలోపే అమెరికా ఆ పోస్ట్‌ను మార్చిందని ఆయన అన్నారు. “మేము అమెరికన్లను ఎప్పుడూ నమ్మలేదు. ఇప్పుడు కూడా వారిని నమ్మడం లేదు. భవిష్యత్తులో కూడా అవిశ్వాసంతో ఉండటమే సమంజసం” అని ఆయన అన్నారు.

సీజ్ చేసిన ఆస్తులు..

స్విట్జర్లాండ్‌లో యూఎస్ అధికారులతో జరిపిన చర్చల సందర్భంగా, స్తంభింపజేసిన 12 బిలియన్ డాలర్ల ఇరాన్ ఆస్తులను టెహ్రాన్‌కు విడుదల చేయడానికి అంగీకరించినట్లు ఇరాన్ సంధానకర్త కూడా ప్రకటించారు. స్విట్జర్లాండ్‌లో అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేసిన తర్వాత, సోమవారం నుంచి అమల్లోకి వచ్చేలా యూఎస్ ఇరాన్‌పై అన్ని ఆంక్షలను 60 రోజుల పాటు ఎత్తివేసింది.
ఇరాన్ ఒప్పందంలోని తన భాగాన్ని నిలబెట్టుకోకపోతే.. “నేను చేయవలసినది చేస్తాను” అని యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. మధ్యంతర ఒప్పందంలో భాగంగా ఇరాన్ చమురుపై ఆంక్షలను ఎత్తివేస్తూ, యూఎస్ ట్రెజరీ సోమవారం 60 రోజుల లైసెన్స్‌ను జారీ చేసింది. ముఖ్యంగా, ఈ లైసెన్స్ యూఎస్‌లోకి ఇరాన్ చమురును దిగుమతి చేసుకోవడానికి అనుమతిస్తుంది. యూఎస్ 1990ల నుంచి ఇరాన్ చమురును పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకోలేదు.

పెరిగిన రాకపోకలు..

ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేసింది. దీనివల్ల ఆ ప్రాంతానికి ఆవల కూడా ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. యుద్ధాన్ని ముగించడానికి కుదిరిన మధ్యంతర ఒప్పందం ప్రకారం ఈ జలసంధిని తిరిగి తెరవాల్సి ఉంది.
ప్రధాన మార్గంలో ఇంకా మైన్లు అమర్చి, మూసివేసి ఉన్నప్పటికీ, వారాంతంలో డజన్ల కొద్దీ నౌకలు దీని గుండా ప్రయాణించాయి. ఏపీ (AP) ప్రకారం, హార్ముజ్ జలసంధి గుండా ట్యాంకర్ల రాకపోకలు పెరుగుతూనే ఉన్నాయి. డేటా, విశ్లేషణల సంస్థ క్లెప్లర్ (Kpler) ప్రకారం, వారాంతంలో 71 నౌకల ప్రయాణించాయి.
శనివారం నాడు గరిష్టంగా 35 నౌకలు ప్రయాణించాయి. యుద్ధానికి ముందు, ప్రతిరోజూ 100 నుంచి 130 నౌకలు ఈ జలసంధి గుండా ప్రయాణించేవి. నౌకలు మైన్ల బారి నుంచి తప్పించుకోవడానికి మధ్య మార్గాన్ని తప్పించుకుని, దానికి బదులుగా ఇరాన్ జలాల గుండా వెళ్లే చిన్న ఉత్తర మార్గాన్ని, ఒమన్ జలాల గుండా వెళ్లే దక్షిణ మార్గాన్ని ఎంచుకుంటున్నాయి.
Read More
Next Story