ముదురుతోన్న సింధు జలాల వివాదం..
x

ముదురుతోన్న సింధు జలాల వివాదం..

నీటి విషయంలో భారత్‌తో యుద్ధానికైనా సిద్ధం: ఖవాజా ఆసిఫ్


Click the Play button to hear this message in audio format

సింధు జలాల ఒప్పందంపై భారత్–పాకిస్థాన్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. తమ జల భద్రతకు ముప్పు వాటిల్లితే, భారతదేశంపై సైనిక చర్యకు వెనుకాడబోమని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ హెచ్చరించారు. జమ్మూకశ్మీర్‌లోని పహెల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ నిలిపివేసిన సింధు జలాల ఒప్పందం నేపథ్యంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఏఆర్‌వై న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. పాకిస్థాన్‌కు నీరు జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని చెప్పారు. సింధు నదీ పరివాహక ప్రాంతంలోని నీటి ప్రవాహాలపై భారత్ చర్యలు తమ ప్రయోజనాలకు ముప్పుగా మారుతున్నాయని అనిపిస్తే, పాకిస్థాన్ స్పందిస్తుందని స్పష్టం చేశారు. “మా జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతోందని భావించిన క్షణమే, మేము భారత్‌పై యుద్ధానికి వెళ్తాం” అని ఆయన అన్నారు.

భారత్ నీటి ప్రవాహాన్ని పరిమితం చేయడానికి లేదా మళ్లించడానికి వేగంగా చర్యలు తీసుకుంటోందని సూచనలు కనిపిస్తే, ఇస్లామాబాద్ కఠినంగా స్పందించే అవకాశం ఉందని ఆసిఫ్ సంకేతం ఇచ్చారు. కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్‌కు చెందిన వీడియో క్లిప్ ఒకటి వెలుగులోకి వచ్చిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఆ వీడియోలో 2028 జూన్ నాటికి పాకిస్థాన్‌కు సింధు జలాల ప్రవాహాన్ని పూర్తిగా నిలిపివేయవచ్చని సూచించినట్లు ప్రచారం జరిగింది.

ఈ వివాదానికి కేంద్రబిందువుగా 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరిన సింధు జలాల ఒప్పందం ఉంది. జలాల విషయంలో భారత్, పాకిస్థాన్‌ మధ్య ఒప్పందం జరిగింది. ఇందులో పాకిస్థాన్‌కు సుమారు 80 శాతం నీటి వినియోగ హక్కులు ఉన్నాయి. ఈ నదీ వ్యవస్థ పాకిస్థాన్ వ్యవసాయం, నీటిపారుదల వ్యవస్థ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం.

జమ్మూకశ్మీర్‌లోని పహెల్గామ్‌లో 2025 ఏప్రిల్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించారు. ఉగ్రమూకలకు పాకిస్థాన్ మద్దతు ఇస్తోందని భారత్ ఆరోపిస్తోంది. వారిపై చర్యలు తీసుకునేంత వరకు సింధు జలాల ఒప్పందం నిలిపివేస్తామని న్యూఢిల్లీ ప్రకటించింది.

ఇదిలా ఉండగా, భారత్ చర్యలను పాకిస్థాన్ నిరంతరం వ్యతిరేకిస్తోంది. నీటి ప్రవాహాలకు ఆటంకం కలిగించే ఏ చర్యైనా తమ జీవనోపాధి, వ్యవసాయం, తాగునీటి అవసరాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఇస్లామాబాద్ వాదిస్తోంది. గత వారం పాకిస్థాన్ ఉప ప్రధాన మంత్రి ఇషాక్ దార్ ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. అలాగే, చెనాబ్ నది నీటిని మళ్లించేలా భారత్ కొత్త నదుల అనుసంధాన ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తోందని పాకిస్థాన్ ఆరోపించింది. అవి సింధు జలాల ఒప్పందానికే కాకుండా ఇతర అంతర్జాతీయ కట్టుబాట్లకూ విరుద్ధమని పేర్కొంది.

Read More
Next Story