
డొనాల్డ్ ట్రంప్
భారత నౌకలపై ఇరానే దాడి చేసింది: ట్రంప్
అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలపై మండిపడ్డ టెహ్రాన్, అవి నిరాధార ఆరోపణల అని వివరణ
హార్ముజ్ జలసంధి నుంచి వస్తున్న భారతీయ నౌకలపై ఇరాన్ డ్రోన్ దాడులకు పాల్పడుతోందని ఇది ఆమోదయోగ్యం కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు చేసిన ఆరోపణలను ఇరాన్ ఖండించింది. ఇవి పూర్తిగా నిరాధార వార్తలుగా కొట్టిపారేసింది.
ఈ వారం ఒమన్ తీరంలో భారత సిబ్బందితో ఉన్న మూడు నౌకలపై దాడి జరిగింది. వాటిలో ఒక దాడిలో బుధవారం ముగ్గురు భారత నావికులు మరణించారు. "హార్ముజ్ జలసంధి నుంచి బయలుదేరుతున్న భారత నౌకలపై నిన్న రాత్రి వారు (ఇరాన్) జరిపిన డ్రోన్ దాడి పూర్తిగా ఆమోదయోగ్యం కాదు," అని ట్రంప్ 'ట్రూత్ సోషల్'లో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.
అదే పోస్ట్‌లో, చర్చలో ఉన్న అంశాలతో సంబంధం లేని శాంతి ఒప్పందంలోని నిబంధనలను మీడియాకు లీక్ చేసిందని కూడా ట్రంప్ ఇరాన్‌పై ఆరోపించారు. అయితే ట్రంప్ ఆరోపణను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. "హార్ముజ్ జలసంధిలోని భారత నౌకకు సంబంధించి ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడి ఆరోపణ పూర్తిగా నిరాధారమైనది," అని భారతదేశంలోని ఇరాన్ రాయబార కార్యాలయం శుక్రవారం రాత్రి ఆలస్యంగా ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది.
"వారం లోపే అమెరికా మూడు భారతీయ నౌకలపై దాడి చేసి, ముగ్గురు అమాయక భారతీయ నావికులను చంపిందన్న దారుణ వాస్తవం నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమిది. ఇది చాలా దయనీయం!" అని అందులో పేర్కొన్నారు.
ఒమన్ తీరం సమీపంలో భారత పౌరులతో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై అమెరికా దాడులకు నిరసనగా న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ఛార్జ్ డి అఫైర్స్‌ను భారత్ పిలిపించిన తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. వాణిజ్య నౌకలపై జరిగిన దాడులను భారత్ "తీవ్ర ఆందోళనకరం"గా అభివర్ణించింది. ఈ విషయాన్ని అమెరికాతో గట్టిగా ప్రస్తావించింది.
Next Story

