
యూఏఈపై దాడి చేసిన ఇరాన్
రెండు బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించినట్లు ఆరోపణలు
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. యూఏఈపైకి ఇరాన్ రెండు బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించిందని యూఏఈ ఆరోపించింది. దీనితో టెహ్రాన్ తో అన్ని రకాల వాణిజ్య, ఆర్థిక లావాదేవీలను నిలిపివేసింది.
అప్రమత్తంగా యూఏఈ..
ఇరాన్ చేస్తున్న దాడులను ఎదుర్కోవడానికి తాము సిద్దంగా ఉన్నామని యూఏఈ రక్షణ శాఖ ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులలో ఒకటి దేశ ప్రాదేశిక జలాల వెలుపల పడగా, రెండవది లోపల పడిందని తెలిపింది. ఈ దాడి నేపథ్యంలో తాము అప్రమత్తంగా ఉన్నామని, భవిష్యత్ ముప్పులను ఎదుర్కోవడానికి "దృఢంగా ప్రతిస్పందించడానికి" సిద్ధంగా ఉన్నామని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
"రక్షణ మంత్రిత్వ శాఖ అత్యంత అప్రమత్తంగా ఉందని, ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉందని, యూఏఈ భద్రతను దెబ్బతీసే ఏ ప్రయత్నానికైనా దృఢంగా ప్రతిస్పందిస్తుందని, దేశ సార్వభౌమత్వం, భద్రత, స్థిరత్వాన్ని కాపాడుతూ, దాని ప్రయోజనాలను, జాతీయ సామర్థ్యాలను పరిరక్షిస్తుందని" తన ప్రకటనలో తెలిపింది.
ప్రజలు దేశంలోని అధికారిక వర్గాల నుంచి మాత్రమే పూర్తి సమాచారం పొందాలని, పుకార్లకు దూరంగా ఉండాలని కూడా మంత్రిత్వ శాఖ కోరింది. ఈ దాడుల నేపథ్యంలో, ఇరాన్‌తో అన్ని వాణిజ్య, ఆర్థిక లావాదేవీలను నిలిపివేస్తున్నట్లు యూఏఈ ప్రకటించింది.
"ప్రాంతీయ ఉద్రిక్తతల దృష్ట్యా... తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఇరాన్‌తో అన్ని వాణిజ్య, వ్యాపార మార్పిడులు, ఆర్థిక లావాదేవీలను నిలిపివేశారు" అని యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ అఫ్రా అల్ హమెలీ చెప్పినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై యుద్ధం ప్రకటించిన తర్వాత, ఆ దేశం క్షిపణులు, డ్రోన్‌లతో యూఏఈని పదేపదే లక్ష్యంగా చేసుకున్న నేపథ్యంలో, వారాల వ్యవధిలో జరిగిన మొదటి దాడి ఇది.
Next Story

