ఇరాన్‌పై మరోసారి దాడులకు అమెరికా సిద్ధం?
x
ట్రంప్

ఇరాన్‌పై మరోసారి దాడులకు అమెరికా సిద్ధం?

ట్రంప్ వ్యాఖ్యలతో తీవ్ర ఉత్కంఠ


Click the Play button to hear this message in audio format

పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. యూఎస్ లో జరగనున్న మధ్యంతర ఎన్నికలు, ఎల్లుండి కూడా ఇజ్రాయెల్ లో కూడా పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇరాన్ పై భారీ దాడులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఇరాన్ కూడా అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంటోంది. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్టోబర్ 25న దాడులు చేయవచ్చని, లేదంటే ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవచ్చని సంకేతాలివ్వడంతో పరిస్థితి మరింత ఉత్కంఠగా మారింది.

అమెరికా మధ్యంతర ఎన్నికలకు ముందు ఇరాన్‌పై దాడులు చేయబోమని ట్రంప్ గతంలో సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అయితే, అక్టోబర్ 24న ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత, ఇరాన్‌పై దాడి ఎప్పుడు జరగవచ్చని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, దాడి చేసే అవకాశంతో పాటు ఇరాన్‌తో పెద్ద ఒప్పందం కుదిరే అవకాశమూ ఉందని ఆయన తెలిపారు. అయితే, ఒప్పందం కుదిరినా ఇరాన్ దానికి కట్టుబడి ఉంటుందా అన్నది అసలు సమస్యగా పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ ఎన్నికలకు ముందే ఇరాన్‌పై భారీ స్థాయిలో బాంబు దాడులు జరిగే అవకాశముందని తమకు సమాచారం అందినట్లు ఓ సీనియర్ ఇరాన్ అధికారి వెల్లడించినట్టు డ్రాప్‌సైట్ న్యూస్ కథనం పేర్కొంది. ఇరాన్‌తో ఉద్రిక్తతలను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన ఎన్నికల ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నట్లు ఇజ్రాయెల్ మీడియా కూడా కథనాలు ప్రచురించింది.
అమెరికా దాడులకు సంబంధించిన సైనిక ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని కూడా డ్రాప్‌సైట్ న్యూస్ వెల్లడించింది. అయితే, దాడులకు సన్నద్ధం కావడం అంటే తప్పనిసరిగా దాడులు ప్రారంభమవుతాయని కాదని అమెరికా అధికారి ఒకరు పేర్కొన్నట్లు తెలిపింది. గతంలోనూ ట్రంప్ చివరి నిమిషంలో సైనిక చర్యలను నిలిపివేసిన సందర్భాలున్నాయని ఆ కథనం వివరించింది.
మరోవైపు, యుద్ధాన్ని ముగించేందుకు జరుగుతున్న చర్చలను అమెరికానే అడ్డుకుంటోందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఆరోపించారు. చర్చలు కొనసాగుతున్న సమయంలో అమెరికా వాటికి అంతరాయం కలిగించిందని ఆయన అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్‌లోని ఇరాన్ రాయబారి రెజా అమిరీ మొఘడం కూడా అమెరికాతో చర్చలకు తమ దేశం సిద్ధంగానే ఉందని తెలిపారు.
హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు, ఇరాన్ నౌకాశ్రయాలపై అమెరికా విధించిన నావికా దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని ప్రతిపాదించినప్పటికీ, వాషింగ్టన్ దాన్ని అంగీకరించలేదని ఇరాన్ రాయబారి ఆరోపించారు. ఈ నేపథ్యంలో దౌత్యపరమైన ప్రయత్నాలు ముందుకు సాగడం లేదని ఇరాన్ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే, ఇరాన్‌పై మరోసారి సైనిక చర్య చేపట్టవచ్చని ట్రంప్ అక్టోబర్ 23న కూడా హెచ్చరించారు. అయితే, దాడులపై తుది నిర్ణయం తీసుకున్నట్లు ఇప్పటివరకు స్పష్టత లేదు. ఒకవైపు సైనిక సన్నద్ధతపై వార్తలు వస్తుండగా, మరోవైపు చర్చలకు అవకాశాలు ఉన్నాయన్న సంకేతాలూ వెలువడుతున్నాయి. దీంతో రానున్న రోజుల్లో అమెరికా, ఇరాన్ మధ్య పరిస్థితి ఏ మలుపు తిరుగుతుందన్నది అంతర్జాతీయంగా ఆసక్తికరంగా మారింది.

పశ్చిమాసియాకు కదులుతున్న అమెరికా దళాలు..

ఇరాన్ పై దాడి చేసే లక్ష్యంతో ఉన్న యూఎస్ తన బలగాలను ఇప్పటికే పశ్చిమాసియాకు తరలిస్తోంది. ఇరాన్ పై దాడి చేయాలని అభిలాషిస్తున్న వారిలో యూఎస్ సెంట్రల్ కమాండ్ చీఫ్ బ్రాడ్లీ కూపర్ కూడా ఉన్నారని ఓ అధికారి వెల్లడించారు. ‘‘ ప్రధాన పోరాట కార్యకలాపాలను పునరుద్ధరించడానికి సెంట్రల్ కమాండ్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది’’ అని ఆ అధికారి తెలిపారు. అయితే జూలై నుంచి ఇప్పటి వరకూ దాడులు విషయంలో ట్రంప్ ఏడుసార్లు వెనక్కి తగ్గారని, కచ్చితంగా మరోదాడి జరుగుతుందా లేదా అనేది వైట్ హౌజ్ నుంచి ఆదేశాలు వచ్చే వరకూ తెలియదని చెప్పారు.


Read More
Next Story