
రాత్రికి రాత్రే రష్యాను విడిచిపెట్టడం సాధ్యం కాదు: రూబియో
లిండ్సే గ్రాహం చట్టం అమలు ప్రభావాన్ని అంచనా వేస్తున్నామని వ్యాఖ్యలు
రష్యా నుంచి భారీ స్థాయిలో ముడిచమురు కొనుగోలు చేస్తున్న భారత్, దాన్ని రాత్రికే రాత్రే నిలుపుదల చేయడం సాధ్యం కాదని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై భారీ స్థాయిలో సుంకాలు విధించాలని లిండ్సే ఓ గ్రాహం చట్టాన్ని యూఎస్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని అధ్యక్షుడు ట్రంప్ 60 రోజుల పాటు నిలిపివేస్తూ కార్య నిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయంపై రూబియో మాట్లాడారు.
రష్యాపై మాత్రమే కాదు..
ఉజ్బెకిస్తాన్, భారత్ పర్యటనకు బయలుదేరే ముందు మార్కో రూబియో విలేకరులతో మాట్లాడారు. ఈ చర్యలు ప్రపంచ మార్కెట్లను, అమెరికా ఆర్థిక వ్యవస్థను ఎలా దెబ్బతీస్తున్నాయో అంచనా వేయడానికి వాషింగ్టన్ కు సమయం అవసరమని రూబియో అన్నారు.
‘‘ఆంక్షలు రష్యా పై మాత్రమే కాదు. సమస్య ఏంటంటే.. ఈ ఆంక్షలు కేవలం రష్యాని ఉద్దేశించినవి మాత్రమే కాదు. అందువల్ల ఆంక్షలు, సుంకాలు రెండింటినీ విధించడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, చివరికి అమెరికా ఆర్థిక వ్యవస్థకు కూడా ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో విశ్లేషించడానికి అధ్యక్షుడు 60 రోజుల సమయాన్ని తీసుకోవాలని అనుకుంటున్నారు’’ అని రూబియో అన్నారు.
ట్రంప్ శుక్రవారం జాతీయ ప్రయోజనాలను ఉటంకిస్తూ.. లిండ్సే ఓ గ్రాహం రష్యా, ఇరాన్ పై ఆంక్షల చట్టం కింద ఆంక్షలు, సుంకాలు రద్దు చేశారు. జూలై 11 న మరణించిన రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం పేరు మీద ఈ చట్టం రూపొందించబడింది. రష్యా చమురు లేదా సహజ వాయువును కొనుగోలు చేసే భారత్, చైనాతో సహ ఐదు అతిపెద్ద దేశాల వస్తువులపై మాస్కోపై ఆంక్షలు, వంద శాతం సుంకాలు విధించే అధికారాన్ని ఇది ట్రంప్ కు ఇచ్చింది.
ఇంధన మార్కెట్లు..
అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం, సౌదీ పై హూతీల దాడులు, రష్యా.. ఉక్రెయిన్ మధ్య నాలుగు సంవత్సరాల నుంచి కొనసాగుతున్న యుద్ధం వల్ల చమురు ఉత్పత్తి, ఎగుమతికి ఆటంకాలు కలుగుతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని అమెరికా అధ్యక్షుడు ఆంక్షల అమలును నిలిపివేశాడు. ఈ బిల్లు ఆమోదించిన సమయంలో కూడా మినహాయింపులు చేర్చారన రూబియో చెప్పారు.
ఇప్పుడే సాధ్యం కాదు..
భారత్ ఇప్పటికే తన ఇంధన వనరులను వైవిధ్య పరిచిందని అయితే సరఫరాదారులను మాత్రమే తక్షణమే మార్చడం సాధ్యంకానందున రష్యా చమురునే కొనసాగిస్తోందని ఆయన అన్నారు.
‘‘అది ప్రపంచ ధరలపై కూడా ప్రభావం చూపుతోంది. కాబట్టి వీటన్నింటిని పరిగణలోకి తీసుకుంటే ఒకదానితో ఒకటి బేరీజు వేసుకోవాలి. ఉదాహరణకు భారత్ వంటి దేశాలు స్వచ్చందంగా తమ ఇంధన పోర్ట్ పోలియేను వైవిధ్యపరిచాయి. కానీ ఇప్పటికీ రష్యా నుంచి గణనీయమైన మొత్తంలో ఇంధనాన్ని పొందుతున్నాయి.
ఎందుకంటే ఒక రోజులోనే అంతా మార్చడం సాధ్యం కాదు. కానీ అవి యూఎస్ కు అత్యంత మిత్రదేశాలు కాబట్టి అధ్యక్షుడు వీటి ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి సమయం తీసుకుంటున్నారు’’ అని రూబియో చెప్పారు. నవంబర్ లో జరగబోయే మధ్యంతర ఎన్నికలకు ముందు దేశీయ ఇంధన ధరలను తగ్గించేందుకు అమెరికా, రష్యా నుంచి డీజిల్ దిగుమతి చేసుకుంటుందని ప్రకటించిన కొద్ది రోజులకే ఈ మినహాయింపులు ప్రకటించారు.
Next Story

