
రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌కు భారీ ఊరట..
గ్రాహం చట్టంపై ట్రంప్ కీలక నిర్ణయం!
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై భారీ సుంకాలు విధించే దిశగా అడుగులు వేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు కీలక మినహాయింపులు ప్రకటించారు. లిండ్సే ఓ గ్రాహం చట్టం కింద విధించాల్సిన ఆంక్షలు, పరిమితులు, సుంకాల అమలును తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత్ పర్యటనకు సిద్ధమవుతున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రష్యా నుంచి భారీగా ముడి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌కు ఈ నిర్ణయం ఊరటనిచ్చే అవకాశముంది.
లిండ్సే ఓ. గ్రాహం పేరుతో తీసుకొచ్చిన ఈ చట్టం ద్వారా రష్యా చమురు, సహజ వాయువును అత్యధికంగా కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు అదనపు సుంకాలు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడికి లభించింది. ఈ చట్టం పరిధిలో చైనా, భారత్ వంటి దేశాలు కూడా ఉన్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గించాలనే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టారు.
అయితే, శుక్రవారం జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వుతో ట్రంప్ ఈ సుంకాలు, కొన్ని ఆంక్షల అమలుకు మినహాయింపులు ఇచ్చారు. ఈ నిర్ణయం అమెరికా జాతీయ ప్రయోజనాలకు అవసరమని పేర్కొంటూ, ఇందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని కాంగ్రెస్‌కు సమర్పించినట్లు వెల్లడించారు.
ఈ మినహాయింపులకు నిర్దిష్ట గడువును ప్రకటించలేదు. అమెరికా అధ్యక్షుడు లేదా విదేశాంగ మంత్రి తదుపరి చర్యలు అవసరమని నిర్ణయించే వరకు ఇవి అమల్లో ఉంటాయి. అదే సమయంలో రష్యా చమురు, సహజ వాయువు కొనుగోళ్లను అమెరికా అధికారులు పర్యవేక్షిస్తూనే ఉంటారు. అవసరమైతే తదుపరి చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటికే రష్యాపై అమల్లో ఉన్న ఇతర అమెరికా ఆంక్షలకు మాత్రం ఈ ఉత్తర్వు వర్తించదు.
మరోవైపు, మార్కో రూబియో అక్టోబర్ 17 నుంచి 22 వరకు ఉజ్బెకిస్థాన్, భారత్‌లో పర్యటించనున్నారు. భారత్‌లో ముంబై, జామ్నగర్లను సందర్శించనున్నారు. అక్టోబర్ 20న ముంబైలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో చర్చలు జరపడంతో పాటు, జామ్‌నగర్‌లోని చమురు శుద్ధి కర్మాగారాన్ని సందర్శించే అవకాశం ఉంది. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు కూడా కొనసాగుతున్నాయి.
అయితే, ట్రంప్ నిర్ణయంపై అమెరికాలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రష్యాపై ఒత్తిడి కొనసాగించేందుకు చట్టంలోని నిబంధనలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కొందరు చట్టసభ సభ్యులు కోరుతున్నారు. ఆంక్షల నుంచి మినహాయింపులు ఇస్తే, రష్యాపై ఆర్థిక ఒత్తిడి తగ్గుతుందనే ఆందోళనను వారు వ్యక్తం చేస్తున్నారు.
మొత్తంగా, గ్రాహం చట్టం కింద తక్షణ సుంకాల ముప్పు తగ్గినప్పటికీ, రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా వైఖరి పూర్తిగా మారిపోయిందని చెప్పలేం. భారత్‌పై ఈ నిర్ణయం చూపించే ప్రభావం, అలాగే రూబియో పర్యటనలో జరిగే చర్చలు ఇరు దేశాల వాణిజ్య, ఇంధన సంబంధాల దిశను నిర్ణయించడంలో కీలకం కానున్నాయి.
ప్రపంచానికి ఓ వైపు సుద్దులు చెబుతూనే మరోవైపు అదే రష్యా నుంచి అమెరికా భారీ స్థాయిలో డీజిల్ కొనుగోలు చేస్తోంది. దేశంలో మధ్యంతర ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ గ్యాసోలీన్(పెట్రోల్) ధర ఏకంగా ఆరు డాలర్లకు చేరింది. దీనితో ఈ ప్రభావంతో రిపబ్లికన్లకు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు అయ్యాక తిరిగి ఇరాన్ పై దాడి చేయడంతో పాటు, రష్యా పై మరోవైపు ఆంక్షలు విధిస్తారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

