
స్టార్‌లింక్ వివాదం.. అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్!
ప్రధానమంత్రి అంటూ వ్యంగ్యంగా సంబోధన
భారత్ లో స్టార్ లింక్ శాటిలైట్ సేవలను రాకుండా కొంతమంది అడ్డుకుంటున్నారని వివాదాన్ని రాజేసిన ప్రపంచ కుబేరుడు ఇలాన్ మస్క్.. తాజాగా వివాదాన్ని మరింత తీవ్రతరం చేశాడు. ఈసారి నేరుగా జియో అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీని వ్యంగ్యంగా ‘‘ప్రధానమంత్రి అంబానీ’’ అంటూ సంభోదించారు.
అంబానీ తన గుత్తాధిపత్యాన్ని కాపాడుకోవడానికి చూస్తున్నారని ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ విషయాన్ని స్పష్టం చేసిన కొన్ని గంటలకే ఎక్స్ ద్వారా మస్క్ మరోసారి విమర్శలు గుప్పించారు.
అంబానీపై మస్క్ విమర్శలు
భారత్‌లో స్టార్‌లింక్ సేవల ప్రారంభానికి అనుమతులు ఎందుకు ఆలస్యమవుతున్నాయనే అంశంపై మస్క్ గతంలోనే ప్రశ్నలు లేవనెత్తారు. భారత ప్రభుత్వ నిబంధనలను పాటించేందుకు ఐదేళ్లుగా ప్రయత్నిస్తున్నామని, అయినప్పటికీ అనుమతులు ఎందుకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు. దేశంలో అసలు అధికారం అంబానీ చేతుల్లో ఉందా అని కూడా వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
దీనికి కొనసాగింపుగా శుక్రవారం మరోసారి స్పందించిన మస్క్.. అంబానీని ప్రధానమంత్రిగా సంబోధిస్తూ, భారత్‌లో తన కంపెనీకి పోటీ పడే అవకాశం కల్పించాలని కోరారు. దేశంలో ఇంకా ఇంటర్నెట్ సౌకర్యం లేని ప్రాంతాలకు స్టార్‌లింక్ ద్వారా కనెక్టివిటీ అందించవచ్చని, దీనివల్ల విద్యార్థులకు విద్యావకాశాలు, చిన్న వ్యాపారాలకు అంతర్జాతీయ మార్కెట్లను చేరుకునే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థలు విఫలమైనా స్టార్‌లింక్ సేవలు ప్రాణాలను కాపాడటంలో ఉపయోగపడతాయని కూడా మస్క్ వెల్లడించారు.
కేంద్రం ఏమంటోంది?
మస్క్ ఆరోపణల నేపథ్యంలో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు. దేశంలో ఏ రంగంలోనూ గుత్తాధిపత్యాన్ని అనుమతించబోమని స్పష్టం చేశారు. వినియోగదారులకు వివిధ సాంకేతిక పరిజ్ఞానాలతో కూడిన సేవలు అందుబాటులో ఉండాలని, తమకు నచ్చిన సంస్థ సేవలను ఎంచుకునే స్వేచ్ఛ వినియోగదారులకు ఉంటుందని వివరించారు.
ప్రస్తుతం మస్క్‌కు చెందిన స్టార్‌లింక్, రిలయన్స్ జియో శాటిలైట్ విభాగం, భారతి మద్దతున్న యూటెల్‌శాట్ వన్‌వెబ్ సంస్థలకు శాటిలైట్ కమ్యూనికేషన్ లైసెన్సులు ఉన్నాయని మంత్రి తెలిపారు. అయితే, సేవలు ప్రారంభించాలంటే ప్రతి సంస్థ భద్రతా నిబంధనలు, ఇతర అవసరమైన షరతులను పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పారు. స్పెక్ట్రమ్ కేటాయింపునకు సంబంధించి ఆదాయ ఆధారిత చార్జీల విధానంపై నిర్ణయం తీసుకున్న తర్వాత తదుపరి ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు.
శాటిలైట్ కమ్యూనికేషన్ స్పెక్ట్రమ్ ధరల విధానంపై టెలికాం శాఖ, ట్రాయ్ తుది నిర్ణయానికి దగ్గరగా ఉన్నాయని కూడా సింధియా వెల్లడించారు. మరోవైపు, అమెజాన్‌కు చెందిన కైపర్ సంస్థ కూడా ఈ రంగంలో ప్రవేశించేందుకు ఆసక్తి చూపుతోందని తెలిపారు.
కొనసాగుతున్న మాటల యుద్ధం
స్టార్‌లింక్ భారత్‌లో ప్రవేశించడాన్ని కొందరు ప్రభావశీల వ్యాపారవేత్తలు అడ్డుకుంటున్నారన్న మస్క్ ఆరోపణలను టెలికాం శాఖ ఇప్పటికే ఖండించింది. దేశంలో టెలికాం, శాటిలైట్ సేవలకు సంబంధించిన అనుమతుల విధానం నిష్పక్షపాతంగా ఉంటుందని స్పష్టం చేసింది.
ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీపై కూడా సింధియా విమర్శలు చేశారు. స్టార్‌లింక్‌కు లైసెన్సు ఇవ్వడంపై గతంలో అభ్యంతరాలు వ్యక్తం చేసిన కాంగ్రెస్, ఇప్పుడు అనుమతుల జాప్యాన్ని ప్రశ్నించడం ద్వారా భిన్నమైన వైఖరి ప్రదర్శిస్తోందని వ్యాఖ్యానించారు.
మొత్తంగా, స్టార్‌లింక్ ప్రవేశానికి సంబంధించిన అనుమతులు, స్పెక్ట్రమ్ కేటాయింపుల అంశం ఇప్పుడు వ్యాపార పోటీతో పాటు రాజకీయ చర్చకు కూడా దారితీసింది. ఈ నేపథ్యంలో, సంబంధిత సంస్థలు భద్రతా నిబంధనలు పూర్తి చేయడం, ప్రభుత్వం అనుమతుల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం తదుపరి పరిణామాల్లో కీలకంగా మారనున్నాయి.ఇదే సమయంలో భారత్ లో స్టార్ లింక్ సేవలు ఎంత ఖరీదు అయినవో అని కూడా పలువురు వినియోగదారులు వెల్లడిస్తున్నారు.
ఃదేశంలో ప్రస్తుతం 100 ఎంబీపీఎస్ డేటాకు నెలకు రూ. 700 వరకూ ఖర్చు అవుతోంది. ఇదే సమయంలో స్టార్ లింక్ సేవలకు మాత్రం నెలకు దాదాపు రూ. 8,500 వరకూ ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలియజేస్తున్నారు. ఇదే సమయంలో అమెరికన్ కంపెనీలు కీలక సమయాల్లో తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయుధంగా మార్చే అలవాటు ఉంది. ఉదాహారణకు ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధ సమయాల్లో ఇలాన్ మస్క్ కంపెనీలు స్టార్ లింక్ సేవలను నిలిపివేశాయి.
అలాగే మయన్మార్ నుంచి భారత్ కు దాదాపు ఐదు వేల కోట్ల విలువైన డ్రగ్స్ రాగా వాటిని పట్టుకుంది. వీటిని తరలించడానికి స్టార్ లింక్స్ సేవలు వాడుకున్నారు. దాన్ని ఎవరూ బుక్ చేసుకున్నారో వివరాలు ఇవ్వాలని స్టార్ లింక్ న కోరగా.. అది ప్రైవసీ పాలసీ అంటూ తిరస్కరించింది. దీన్ని కూడా నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు.
Next Story

