
డొనాల్డ్ ట్రంప్
ఇరాన్ పై యుద్ధాన్ని ఆపండి: అమెరికా ప్రతినిధుల సభ తీర్మానం
డెమోక్రాట్లతో చేతులు కలిపిన రిపబ్లికన్లు, ఇరకాటంలో ట్రంప్
ఇరాన్ పై గత మూడు నెలలుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న సైనిక చర్యను తక్షణమే నిలిపివేయాలని అమెరికా ప్రతినిధుల సభ తీర్మానం చేసింది. డెమోక్రాట్లు ప్రవేశ పెట్టిన ఈ తీర్మానానికి కొంతమంది రిపబ్లికన్లు కూడా మద్దతు తెలపడంతో తీర్మానం ఆమోదం పొందింది. బుధవారం జరిగిన ఓటింగ్‌లో 215-208 ఓట్ల తేడాతో తీర్మానం ఆమోదం పొందగా, సభలో హర్షధ్వానాలు మిన్నంటాయి.
రెండు వారాల క్రితం ఇటువంటి తీర్మానం కోసం ప్రయత్నాలు జరగగా స్పీకర్ మైక్ జాన్సన్ సభా కార్యకలాపాలను హఠాత్తుగా నిలిపివేశారు. యూఎస్ వ్యాప్తంగా యుద్దం ఫలితాలపై వ్యతిరేకత వ్యక్తం అవుతున్న తరుణంలో ఇలాంటి తీర్మానం ఆమోదం పొందింది.
"ఈ విచక్షణారహితమైన, ఖరీదైన యుద్ధం ఈరోజే ముగియాలి" అని న్యూయార్క్‌కు చెందిన ప్రతినిధుల సభ డెమోక్రాటిక్ నాయకుడు హకీమ్ జెఫ్రీస్ ఈ వారం ప్రారంభంలో అన్నారు. "కొంతమంది రిపబ్లికన్లు మనతో చేరితే చాలు, మనం ఈ విచక్షణారహితమైన, ఖరీదైన ఇష్టపూర్వక యుద్ధాన్ని ముగించవచ్చు. ఈ యుద్ధం అమెరికన్ పన్ను చెల్లింపుదారులకు 100 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు పెట్టింది. అలాగే అమెరికా తీవ్రమైన బలహీనమైన స్థితికి నెట్టివేసిందని ఆయన విమర్శలు గుప్పించారు.
యుద్ధంపై తీవ్ర వ్యతిరేకత..
ఇరాన్‌పై అమెరికా యుద్ధాన్ని అరికట్టడానికి ప్రతినిధుల సభ ప్రయత్నించడం ఇది నాలుగోసారి కాగా తీర్మానాన్ని ఆమోదించడం మాత్రం మొదటిసారి. గత నెలలో, కొంతమంది రిపబ్లికన్ సెనేటర్లు అధ్యక్షుడితో విభేదించారు. ట్రంప్ తక్షణమే యుద్ధాన్ని నిలిపివేయాలని వారంతా డిమాండ్ చేశారు. దీనితో సెనెట్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఎన్నికల ప్రచారం సమయంలో యుద్ధాల వైపు చూడనని గొప్పలు చెప్పిన ట్రంప్, తరువాత పశ్చిమాసియాలో వేలుపెట్టడంతో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు.
కాంగ్రెస్‌పై నియంత్రణను నిర్ణయించే మధ్యంతర ఎన్నికలకు ముందు, ముఖ్యంగా దేశీయ రంగంపై ట్రంప్ "తీవ్రంగా దృష్టి సారించారని" జాన్సన్ నొక్కి చెప్పారు. వాణిజ్యం కోసం, ముఖ్యంగా చమురు రవాణా కోసం హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి సహాయపడాలని ట్రంప్ మిత్రదేశాలను కోరుతున్న నేపథ్యంలో, ఈ వారం తాను అధ్యక్షుడితో వైట్ హౌస్‌లో మూడు గంటల పాటు గడిపినట్లు స్పీకర్ తెలిపారు.
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా దాడులు ప్రారంభించినప్పటి నుంచి, అమెరికన్లు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ ధరలు విపరీతంగా పెరగడాన్ని ఎదుర్కొన్నారు. ఇది వినియోగదారుల వ్యయంపై ద్రవ్యోల్బణ ఒత్తిడిని పెంచింది. ప్రపంచంలోని చమురు, సహజ వాయువు, ఎరువుల వంటి సంబంధిత ఉత్పత్తులలో అధిక భాగానికి కీలకమైన మార్గమైన హార్ముజ్ జలసంధి గుండా జరిగే రవాణాను ఇరాన్ అడ్డుకోవడమే దీనికి కారణం.
రెండు పక్షాలు ఓ వైపు కాల్పుల విరమణ అంటూనే మరోవైపు దాడులకు దిగడంతో చర్చల ప్రక్రియ ముందుకు సాగడం లేదు. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ దూకుడు కూడా చర్చల ప్రక్రియకు విఘాతం కలిగిస్తోంది.
అయితే కాంగ్రెస్ చర్యలను అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కోరూబియో తప్పుపట్టారు. కాంగ్రెస్ యుద్ధానికి వ్యతిరేకంగా తీర్మానం చేస్తే ఇరాన్ ఒప్పందం నుంచి వైదోలిగే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. తమకు వ్యతిరేకంగా అమెరికా ఏం చేయలేదని భావించినప్పుడు ఒప్పందంపై ఎందుకు ఆసక్తి చూపుతారని ప్రశ్నించారు. అలాగే ఉక్రెయిన్ కు అమెరికా మద్దతును అందించడం, లెబనాన్ లో అమెరికా చర్యలు నిలిపివేయడం వంటి వాటిపై కూడా కాంగ్రెస్ లో తీర్మానాలు జరిగే అవకాశం ఉంది.
యుద్ధ అధికారాల చట్టం ప్రకారం సైనిక చర్యకు కాంగ్రెస్ ఆమోదం కోరేందుకు వైట్ హౌజ్ కు 60 రోజుల గడువు ఉంది. అయితే వీటిని తప్పించుకోవడానికి ట్రంప్ ఇరాన్ విషయంలో ఏకపక్షంగా కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించారు.
Next Story

