అజిత్ ధోవల్- వాంగ్ యీ మధ్య చర్చలు
x

అజిత్ ధోవల్- వాంగ్ యీ మధ్య చర్చలు

సరిహద్దు సమస్యపై సుదీర్ఘ సమావేశం


Click the Play button to hear this message in audio format

భారత్- చైనా సరిహద్దు సమస్య పై అజిత్ ధోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి తో ప్రత్యేక చర్చలు జరిపారు. సెప్టెంబర్ 12-13 తేదీలలో బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ న్యూఢిల్లీ పర్యటనకు రానున్న నేపథ్యంలో ఈ చర్చలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.

భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాలలో సరిహద్దు, అరుణాచల్ ప్రదేశ్ అంశాలపై విభేదాలు ప్రముఖంగా కొనసాగుతున్న తరుణంలో కూడా ఈ చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ ను చైనా సౌత్ టిబెట్ గా పేర్కొంటూ వివాదాలు రేపుతోంది. దీనికి భారత్ కూడా ధీటుగా బదులిస్తోంది. తాజాగా పీఎల్ఏ అరుణాచల్ ప్రదేశ్ లో వివాదం రేపడానికి ప్రయత్నించగా భారత ఆర్మీ వారిని వెనక్కి పంపింది.

పొడవైన సరిహద్దు..

భారత్- చైనా మధ్య 3,488 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. రెండు దేశాల మధ్య మెక్ మోహన్ రేఖ సరిహద్దుగా ఉంది. అయితే వీటిలో చాలా భాగాన్ని బీజింగ్ సరిహద్దుగా గుర్తించడం లేదు. భారత్-చైనా సరిహద్దు వివాదాన్ని సమగ్రంగా పరిష్కరించడానికి 2003లో ఏర్పాటు చేసిన సరిహద్దు చర్చల యంత్రాంగానికి దోవల్, వాంగ్ ఇద్దరూ ప్రత్యేక ప్రతినిధులుగా నియమితులయ్యారు.
సోమవారం రెండు రోజుల పర్యటన నిమిత్తం చైనా చేరుకున్న దోవల్, ఈ చర్చలకు ముందు ఆ దేశ ఉపాధ్యక్షుడు హాన్ జాంగ్‌ను కలిశారు. ఇరు దేశాల నాయకుల మధ్య కుదిరిన ఏకాభిప్రాయానికి అనుగుణంగా, సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతతను బలోపేతం చేసే మార్గాలపైనా, ఆర్థిక, రాజకీయ, బహుపాక్షిక వేదికలపైనా ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరచడంపైనా ఇద్దరు నాయకులు చర్చించారని భారత రాయబార కార్యాలయం 'ఎక్స్' లో చేసిన ఒక పోస్ట్‌లో తెలిపింది.
2020 గాల్వాన్ లోయ ఘర్షణ, తూర్పు లడఖ్‌లో సుదీర్ఘ సైనిక ప్రతిష్టంభన తర్వాత న్యూఢిల్లీ, బీజింగ్‌ల మధ్య సంబంధాలు తీవ్ర ఒడిదుడులకు గురయ్యాయి. కానీ అప్పటి నుంచి ఇరుపక్షాలు సంబంధాలను తిరిగి పట్టాలెక్కించేందుకు చర్యలు తీసుకున్నాయి.
సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడంలో విజయం దక్కనప్పటికీ, వివిధ రంగాలలో ఇరు దేశాల మధ్య పునరావృతమయ్యే ఉద్రిక్తతలను పరిష్కరించడంలో ఈ వ్యవస్థీకృత యంత్రాంగాన్ని ఒక ఉపయోగకరమైన సాధనంగా ఇరుపక్షాల అధికారులు భావిస్తున్నారు.
సోమవారం ఇక్కడ జరిగిన మీడియా సమావేశంలో ప్రత్యేక ప్రతినిధుల (SR) చర్చలను ప్రకటిస్తూ, చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్, అధ్యక్షుడు షీ జిన్ పింగ్ భారత పర్యటన గురించిన ప్రశ్నకు మాత్రం నేరుగా సమాధానం ఇవ్వకుండా దాటవేశారు.
ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు, శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యేందుకు జిన్ పింగ్ పర్యటన ఒక అవకాశాన్ని కల్పిస్తుంది.
మోదీ, జిన్ పింగ్ చివరిసారిగా 2025 ఆగస్టులో టియాంజిన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సదస్సు సందర్భంగా సమావేశమయ్యారు. ఎస్ఆర్ చర్చల గురించి లిన్ మాట్లాడుతూ, డోవల్, వాంగ్‌లు సరిహద్దు సమస్యతో పాటు ఇతర ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ సంబంధాలపైనా లోతైన చర్చలు జరుపుతారని తెలిపారు.
"సరిహద్దు సమస్యపై చైనా, భారత్ మధ్య చర్చలకు ఈ చర్చల రౌండ్లు ప్రధాన మార్గం, అలాగే పరస్పర ఆసక్తి ఉన్న అంశాలపై ఇరుపక్షాల మధ్య సంభాషణకు ఇవి ఒక ముఖ్యమైన వేదిక" అని లిన్ అన్నారు.
గత ఏడాది ఆగస్టులో చైనా, భారత్ 24వ రౌండ్ చర్చలను విజయవంతంగా నిర్వహించాయని, ఆ సందర్భంగా ఇరుపక్షాలు సరిహద్దు సమస్యపై నిష్కపటంగా, లోతుగా అభిప్రాయాలను పంచుకుని, అనేక ఉమ్మడి అవగాహనలకు వచ్చాయని ఆయన తెలిపారు.
సరిహద్దు ప్రాంతాలను సంయుక్తంగా శాంతియుతంగా, ప్రశాంతంగా ఉంచాలనే ఇరు దేశాల నాయకుల మధ్య ఉన్న ఉమ్మడి అవగాహనల స్ఫూర్తితో, ఈ రౌండ్ చర్చల సందర్భంగా ఇరుపక్షాలు సరిహద్దు సమస్యపై లోతైన సంభాషణను కొనసాగిస్తాయని ఆయన అన్నారు. ఇరుపక్షాలు ద్వైపాక్షిక సంబంధాలు, అంతర్జాతీయ ప్రాంతీయ సమస్యలపై కూడా అభిప్రాయాలను పంచుకుంటాయని ఆయన తెలిపారు.
Read More
Next Story