‘ఈయూ’పై ఆంక్షల విషయంలో వెనక్కి తగ్గిన ట్రంప్
x
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

‘ఈయూ’పై ఆంక్షల విషయంలో వెనక్కి తగ్గిన ట్రంప్

గ్రీన్ ల్యాండ్ ను బలవంతంగా తీసుకోము , సుంకాలు వేయమని పేర్కొన్న అమెరికా అధ్యక్షుడు


ముందు పెద్ద నోరేసుకుని అరవడం, తరువాత వెనక్కి తగ్గడం, బెదిరింపులకు దిగడం, సర్వం సహ చక్రవర్తిలా వ్యవహరించడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు బాగా అలవాటైన వ్యవహరం.

తాజాగా మరోసారి గ్రీన్ ల్యాండ్, ఈయూ విషయంలోనే ఇలాగే వ్యవహరించారు. గ్రీన్ ల్యాండ్ విషయంలో తమకు సహకరించకుండా ఎదురుతిరిగిన నాటో మిత్ర దేశాలపై అదనపు సుంకాలు విధిస్తామని బెదిరించిన ఆయన వాటిని విరమించుకున్నట్లు ప్రకటించారు.ఆర్కిటిక్ భద్రతపై కూడా నాటో కలిసి కొత్త ఫ్రేమ్ వర్క్ ను రూపొందించామని కూడా వెల్లడించారు.

గ్రీన్ ల్యాండ్ విషయంలో అమెరికా సైనిక ప్రయోగం చేయదని హమీ ఇచ్చిన ట్రంప్, నాటో దేశాలు చేసిన దాన్ని మాత్రం కచ్చితంగా గుర్తుపెట్టుకుంటామని మాత్రం పేర్కొన్నారు.

అయితే అమెరికా మాత్రం గ్రీన్ ల్యాండ్ విషయంలో హక్కు, టైటిల్, యాజమాన్యాలను పొందే విషయంలో వెనక్కి తగ్గదని పేర్కొన్నారు. గ్రీన్ ల్యాండ్ విషయంలో దావోస్ లో జరిగిన సమావేశంలో ట్రంప్ మాట్లాడిన తరువాత ఈ ప్రకటనలు వచ్చాయి.

వాణిజ్యం ఒప్పందం నిలిపివేసిన ఈయూ?
ట్రంప్ చేస్తున్న బెదిరింపులపై ఈయూ కూడా గట్టిగానే స్పందించింది. అమెరికాతో కుదిరిన కీలక వాణిజ్య ఒప్పందాన్ని నిలిపివేయడానికి సమాయత్తమైంది. ఒప్పందంలో భాగంగా అమెరికా పారిశ్రామిక వస్తువులపై సుంకాలను తొలగించడంపై ఈయూ పార్లమెంట్ రాబోయే వారాలలో ఓటింగ్ కు ప్రణాళిక వేసింది.
ఇది వైట్ హౌజ్ కు బలమైన సందేశం పంపినట్లు అయింది. అమెరికన్ వ్యాపారాలను ఆందోళనకు గురిచేసిందని ఈయూ చట్టసభ సభ్యులు వాదించారు. యూరప్ తో వాణిజ్యం విషయంలో అమెరికా తమను తక్కువగా అంచనా వేస్తుందని పేర్కొన్నారు.
గ్రీన్ ల్యాండ్ విషయంలో ఎనిమిది యూరోపియన్ దేశాలపై ట్రంప్ సుంకాలు విధించడంపై ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్ లీన్ స్పందించారు. ఇది పూర్తిగా ఏకపక్షంతో కూడిన ప్రణాళికగా పేర్కొన్న ఆమె, ట్రంప్ విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ మాట్లాడుతూ.. ఈయూ దేశాలపై ట్రంప్ సుంకాలు విధిస్తే.. తాము కూడా అదే స్థాయిలో ప్రతిస్పందిస్తామని పేర్కొన్నారు. దీనితో ట్రంప్ కూడా వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు. దీనివల్ల అమెరికా కంపెనీలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉండటంతో వెంటనే తన చర్యలను ఉపసంహరించుకున్నారు.
మాకు సంబంధం లేదు: పుతిన్
గ్రీన్ ల్యాండ్ పై అమెరికా అధ్యక్షుడు చేస్తున్న వాదనలను రష్యా అధ్యక్షుడు ఖండించారు. తమకు ఆ దీవి అక్కరలేదని చెప్పారు. ‘‘గ్రీన్ ల్యాండ్ పై ఏం జరుగుతుందో అది మాకు సంబంధం లేదు’’ అని జాతీయ భద్రతా మండలి సమావేశంలో పుతిన్ తన టెలివిజన్ లో వ్యాఖ్యానించారు.
‘‘యాధృచ్చికంగా డెన్మార్క్ ఎల్లప్పుడూ గ్రీన్ ల్యాండ్ ను ఒక కాలనీగా చూస్తుంది. దానిపట్ల చాలా కఠినంగా, క్రూరంగా కాకపోయినా, ప్రవర్తిస్తోంది. కానీ అది పూర్తిగా వేరే విషయం, ఇది మాకు సంబంధించింది కాదు.
వారు తమలో తాము దానిని పరిష్కరించుకుంటారని నేను అనుకుంటున్నాను’’ అని పుతిన్ అన్నారు. 1917 లో డెన్మార్క్ వర్జిన్ దీవులను అమెరికా కు విక్రయించిందని గుర్తు చేశారు. 1867 లో రష్యా, అలస్కాను అమెరికాకు 7.2 మిలియన్ డాలర్లకు విక్రయించిందని గుర్తు చేసుకున్నారు.
కోలుకున్న స్టాక్ మార్కెట్..
యూరప్ పై సుంకాలు విధిస్తామని బెదిరించి, తరువాత గ్రీన్ ల్యాండ్ విషయంలో వెనక్కి తగ్గిన తరువాత అమెరికా స్టాక్ మార్కెట్ తిరిగి ఫుంజుకుంది. గ్రీన్ ల్యాండ్ గురించి ఒప్పందం తుది విషయానికి చేరుకుందని ట్రంప్ ప్రకటించిన తరువాత బుధవారం ఎస్ అండ్ పీ 500 ఒకశాతం పెరిగింది.
ఇండెక్స్ క్రితం రోజుకు కోల్పోయిన తరువాత సగం కోలుకుంది. డౌ జోన్స్ ఇండస్ట్రీయల్ యావరేజ్ గా 1.2 శాతం పెరిగింది. నాస్ డాక్ కూడా ఫుంజుకుంది.
యూరప్ కు ఉపశమనం..
గ్రీన్ ల్యాండ్, డానిష్ సార్వభౌమత్వం కాపాడుకోవడానికి యూరోపియన్ మిత్రదేశాలపై కొత్త సుంకాలు విధిస్తామని చెప్పిన తరువాత ఆర్థిక మార్కెట్లు కుప్పకూలాయి.
గ్రీన్ ల్యాండ్, డెన్మార్క్ ఇతర నాటో మిత్రదేశాల పట్ల ట్రంప్ కఠిన వైఖరి, యుద్దోన్మాద రంకెలపై అమెరికా అధికారులు కూడా ఆందోళన చెందారు. ఎందుకంటే ఇది ఇతర విదేశాంగ విధాన లక్ష్యాలకు హని కలిగిస్తుందని వారు భయపడ్డారు.
మరోవైపు గాజాపై ట్రంప్ ఏర్పాటు చేసిన పీస్ కమిటీ ఏర్పాటు, గ్రీన్ ల్యాండ్ విషయంలో యూరప్ ఆసక్తి చూపకపోవడంతో పరిస్థితి ఒక్కసారిగా వైట్ హౌజ్ కు వ్యతిరేకంగా మారింది.
గ్రీన్ ల్యాండ్ పై ఉద్రిక్తతలు చల్లబడిన తరువాత దేశీయ స్టాక్ మార్కెట్ బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 నేడు లాభాలతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. భారత్- ఈయూ వాణిజ్య ఒప్పందం కూడా సెంటిమెంట్ లను పెంచే అవకాశం ఉంది. బుధవారం భారత స్టాక్ మార్కెట్లు అధిక అస్థిరతను చూశాయి. సెన్సెక్స్ 0.33 శాతం తగ్గి 81,909.63 వద్ద ముగిసింది. నిఫ్టీ 50.03 శాతం తగ్గి, 25,157.50 వద్ద ముగిసింది.
Read More
Next Story