
ఇటలీలో ఇద్దరు సిక్కు యువకుల కాల్చివేత
టార్గెట్ కిల్లింగ్ గా అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు
ఇటలీ లో నివసిస్తున్న ఇద్దరు సిక్కులను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. వైశాఖీ పండగ సందర్భంగా గురుద్వారాలో ప్రార్థన పూర్తయి బయటకు వస్తున్న వారిని తుపాకీతో కాల్చారు. సంఘటన స్థలంలో దాదాపు పది ఖాళీ తూటాలు లభించినట్లు పోలీసులు తెలిపారు.
కాల్పులు జరిపిన వ్యక్తిని కూడా భారతీయ మూలానికి చెందిన వ్యక్తే అని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రెండు సిక్కు వర్గాలకు చెందిన వ్యక్తుల మధ్య ఆధిపత్య పోరులోనే ఈ సంఘటన జరిగినట్లు అనుమానాలు ఉన్నాయి. కాల్పులు జరిపి కారులో పారిపోయిన వ్యక్తి ఇంతకుముందు కూడా ఇదే గురుద్వారాకు వచ్చేవాడని తెలిసింది.
వైశాఖి వేడుకల కోసం భక్తులు గుమిగూడిన సమయంలో, బెర్గామో ప్రావిన్స్‌లోని కోవో పట్టణంలో ఉన్న గురుద్వారా మాతా సాహిబ్ కౌర్ జీ వెలుపలి ప్రాంగణంలో శుక్రవారం (ఏప్రిల్ 17) అర్ధరాత్రికి కొన్ని నిమిషాల ముందు ఈ ఘటన జరిగింది. లా సిసిలియా వార్తాపత్రిక ప్రకారం, ప్రార్థనా స్థలంగా ఉపయోగించే ఒక గిడ్డంగి నుంచి బాధితులు బయటకు రాగానే దుండగుడు దాడి చేశాడు. మృతులను కోవో నివాసి అయిన 48 ఏళ్ల రగీందర్ సింగ్, సమీపంలోని అగ్నాడెల్లోకు చెందిన 48 ఏళ్ల గుర్మిత్ సింగ్‌గా గుర్తించారు. గుర్మిత్ సింగ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ప్రణాళిక ప్రకారమే హత్య..
ఆకస్మిక వాగ్వాదం హింసగా మారే అవకాశం లేదని ప్రాథమిక విచారణలో తేలింది. కాల్పులు జరిపిన వ్యక్తి "ఒక భారతీయుడు" అని, అతను కూడా తరచుగా ఆ గురుద్వారాకు వస్తుంటాడని ఒక సాక్షి విలేకరులకు చెప్పాడు. ఆ సాక్షి అనుమానితుడిని "ఆంటెగ్నేట్‌కు చెందిన ఒక భారతీయ వ్యక్తి"గా గుర్తించాడు.
దాడి సమయంలో మూడో వ్యక్తికి కూడా తూటాలు తగిలాయని తెలిసింది. కాల్పుల తీవ్రత, కచ్చితత్వం కారణంగా, ఈ హత్యలకు వ్యక్తిగత వివాదాలు లేదా స్థానిక సిక్కు సమాజంలోని ఉద్రిక్తతలతో సంబంధం ఉందా అని కారబినేరి బెర్గామో యూనిట్ దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ సంఘటన స్థానిక సమాజాన్ని కుదిపేసింది.
ఇక్కడంతా ప్రజలు కలసిమెలిసి జీవిస్తుంటారని, గత పదిహేను సంవత్సరాలుగా ఇక్కడ ఎలాంటి హింసాత్మక సంఘటన జరిగినట్లు రికార్డులు లేవని కోవో మేయర్ ఆండ్రియా కాపెల్లెట్టి అన్నారు.
అత్యంత ముఖ్య పండగ వైశాఖీ..
సిక్కు క్యాలెండర్‌లో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటైన, ఖల్సా ఆవిర్భావానికి గుర్తుగా జరుపుకునే వైశాఖి పండుగ ముందు రోజు ఈ హింస చోటుచేసుకుంది. మరుసటి రోజు సమీపంలో స్థానిక సంస్థలతో ఒక అధికారిక వేడుక జరగాల్సి ఉంది. అధికారులు మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పావియాకు తరలించారు. సాక్షులను ప్రశ్నిస్తూ నిఘా ఫుటేజీని సమీక్షిస్తున్నారు. అయితే, హత్య వెనుక ఉద్దేశ్యం ఇంకా అస్పష్టంగానే ఉంది.
Next Story

