భారత్ లో ఆందోళనలను కఠినంగా అణచివేస్తున్నారు: ఐరాస ఆందోళన
x

భారత్ లో ఆందోళనలను కఠినంగా అణచివేస్తున్నారు: ఐరాస ఆందోళన

తిరస్కరించిన భారత్


Click the Play button to hear this message in audio format

యువత నిరసనలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారని మరోసారి ఐరాస ఆందోళన వ్యక్తం చేయగా, భారత్ వాటిని తోసిపుచ్చింది. మానవ హక్కుల అంశాలను రాజకీయ ఒత్తిడికి, కొన్ని దేశాలను లక్ష్యంగా చేసుకునేందుకు ఉపయోగించకూడదని ఐక్యరాజ్యసమితి గడ్డి పెట్టింది.

ఐరాస జనరల్ అసెంబ్లీలోని మూడో కమిటీలో అక్టోబర్ 20న భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీ బర్ఖా తమ్రాకర్ ఈ అంశంపై భారత్ తరఫున మాట్లాడారు. అంతర్జాతీయ మానవ హక్కుల వ్యవస్థలు సంభాషణ, సంప్రదింపులు, సహకారం, పారదర్శకతతో పనిచేయాలని ఆమె పేర్కొన్నారు. నివేదికల్లోని అంశాలను వాస్తవాలకు అనుగుణంగా ప్రస్తావించాలని, మానవతా పరమైన ఆందోళనలను తుది తీర్పులుగా చిత్రీకరించకూడదని భారత్ అభిప్రాయపడింది.
అయితే, భారత్ స్పందనకు ముందు జెనీవాలోని 20 మందికి పైగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల నిపుణులు దేశంలో యువత నేతృత్వంలో జరిగిన నిరసనలపై ఆందోళన వ్యక్తం చేశారు. గత మూడు నెలలుగా ఢిల్లీతో పాటు ఇతర ప్రాంతాల్లో శాంతియుతంగా నిరసనలు తెలిపిన యువతపై పోలీసులు పదేపదే కఠినంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు.
విద్యా వ్యవస్థకు సంబంధించిన ప్రభుత్వ నిర్ణయాలతో పాటు, ఇటీవల ఓటర్ల జాబితాల నుంచి పేర్ల తొలగింపునకు వ్యతిరేకంగా విద్యార్థులు, వారి మద్దతుదారులు ఆందోళనలు చేపట్టారని తెలిపారు. ఈ ఓటర్ల జాబితాల మార్పులు సుమారు 13 కోట్ల మందిపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు.
ఢిల్లీలో 7,000 మందికి పైగా యువకులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, మానవ హక్కుల కార్యకర్తలు, రాజకీయ పార్టీల సభ్యులను నిర్బంధించి, దూర ప్రాంతాల్లోని నిర్బంధ కేంద్రాలకు తరలించినట్లు వచ్చిన నివేదికలపైనా ఐరాస నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. వీరిలో చాలామందిని 24 గంటల్లోనే విడుదల చేసినట్లు తెలిపారు. నిరసనలు, నిర్బంధాల సమయంలో గాయాలు, దుర్వ్యవహారం, లింగ ఆధారిత వేధింపులు జరిగినట్లు వచ్చిన ఆరోపణలను కూడా ప్రస్తావించారు.
అంతేకాకుండా, భారతీయ నాగరిక్ సురక్షా సంహితలోని సెక్షన్ 163 కింద బహిరంగ సమావేశాలపై ఆంక్షలు విధించడం, రవాణా సేవలను నిలిపివేయడం, ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంపై ప్రశ్నలు లేవనెత్తారు. శాంతియుత నిరసనల హక్కును కాపాడటంతో పాటు, మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన ఆరోపణలపై న్యాయం జరిగేలా చూడాలని భారత అధికారులను కోరారు.
మరోవైపు, అంతర్జాతీయ మానవ హక్కుల వ్యవస్థలు అన్ని దేశాల విషయంలోనూ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని భారత్ స్పష్టం చేసింది. ఆరోపణలను పూర్తిగా పరిశీలించకుండా వాటి ఆధారంగా దేశాలపై ప్రతికూల అభిప్రాయాలు ఏర్పరచడం సరికాదన్నది భారత వైఖరి. ఈ వ్యవహారంలో నిరసనకారుల హక్కుల పరిరక్షణ, పోలీసుల చర్యలపై వచ్చిన ఆరోపణలు, అంతర్జాతీయ విమర్శలకు భారత్ స్పందన కీలకంగా మారాయి.


Read More
Next Story