ప్రతీకార దాడులను తీవ్రతరం చేసిన యూఎస్
x

ప్రతీకార దాడులను తీవ్రతరం చేసిన యూఎస్

ఈజిప్ట్ పై కూడా ఇరాన్ దాడి చేసిందా?


Click the Play button to hear this message in audio format

జోర్డాన్ లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ చేసిన దాడికి ప్రతిస్పందనగా ఆ దేశంలోని పలు సైనిక లక్ష్యాలపై యూఎస్ నేవీ ప్రతీకార దాడులకు పాల్పడింది. అమెరికా- సౌదీ అరేబియా జతకట్టిన తరువాత ఈ ప్రతిదాడులకు చేసింది. ఇందులో కనీసం 20 మంది ఇరాన్ సైనికులు, మరో ఆరుగురు వ్యక్తులు మరణించినట్లు సమాచారం. ఈ దాడులను ఇరాన్ మీడియా కూడా ధృవీకరించింది. హార్ముజ్ జలసంధిలో పెట్రోలియం ఎగుమతులకు కేంద్రంగా ఉన్న ఖేష్మ్ పై, ఖుజేస్తాన్ ప్రావిన్స్ లో దాడులు జరిగినట్లు వార్తలు ప్రసారం చేసింది.

కొత్తగా ఈజిప్ట్ పై దాడులు..

మరో వైపు ఈజిప్ట్ పోర్టులపై కూడా డ్రోన్ దాడులు జరిగాయి. రెండు పెట్రోలియం కేంద్రాలు మంటల్లో చిక్కుకున్నట్లు బ్రిటిష్ సంస్థ తెలియజెప్పింది. అలాగే ఒక గ్రీక్ ట్యాంకర్ పై కూడా దాడి జరిగింది. అయితే ఈ దాడులకు ఎవరూ బాధ్యత తీసుకోలేదు. ఈ పోరాటాలు తిరిగి పూర్తిస్థాయి యుద్ధంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసిన ఈ యుద్దం మరోసారి తీవ్రంగా జరిగితే హార్ముజ్ జలసంధి తెరుచుకోవడం అసాధ్యంగా మారే అవకాశం ఉంది. ఇంకో వైపు అమెరికా ఆయుధ నిల్వలు వేగంగా పడిపోతున్నాయని కూడా ఆందోళన నెలకొంది.
గల్ప్ దేశం కాని ఈజిప్ట్ పై దాడి చేసింది ఇరాన్ లేదా దాని మిత్రపక్షాలు అని తేలితే ఈ యుద్ధం మరింత విస్తరించే అవకాశం ఉంది. ఇది అమెరికా మిత్రదేశమే అయినప్పటికీ ఇప్పటికీ అది తటస్థంగానే ఉంది. కానీ తాజా దాడులతో ఈజిప్ట్ కూడా పునరాలోచనలో పడే అవకాశం ఉంది. ఇప్పటికే సౌదీ హౌతీలపై, యూఏఈ, కువైట్, బహ్రెయిన్ లు కలిసి ఇరాన్ పై దాడులకు పాల్పడుతున్నాయి.

ట్రంప్ ఏమన్నాడంటే..

ఇటు బాబ్ ఎల్ మాండేబ్ జలసంధి, అటూ హార్ముజ్ లోని నౌకలపై జరుగుతున్న దాడులకు ఇరాన్ బాధ్యత తీసుకోవాల్సిందే అని ట్రంప్ అన్నారు. తాము మరిన్ని భారీ స్థాయి దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.
సౌదీ ఆరేబియాలోని చమురు కేంద్రాలపై ఇరాన్ మద్దతు ఉన్న ఇరాకీ మిలిషియా డ్రోన్లతో దాడులు చేశాయని రియాద్ ఆరోపించింది. కానీ వీటిని ఇరాక్ మిలిషీయా ఖండించింది. కానీ హౌతీ తిరుగుబాటు దారులు మాత్రం ఇది తమ పని అని ప్రకటించారు. ఈ దాడులపై సౌదీ రక్షణ మంత్రి ఖలీద్ బిన్ సల్మాన్ బుధవారం ట్రంప్, జేడీ వాన్స్ లను కలిశారు. అయితే భేటీపై రెండు దేశాలు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
మరో వైపు శాంతి ప్రయత్నాలు కూడా తెరవెనక బలంగానే జరుగుతున్నాయి. అది ఇంకా పురోగతి సాధిస్తుందా లేదా అనే విషయం ఎవరూ చెప్పలేరని సదరు ప్రాంతీయ అధికారి చెప్పారు. కానీ రెండు పక్షాలు దాడులు ఆపడానికి ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని, దాడుల తీవ్రత తగ్గితేనే చర్చలకు అవకాశం ఉంటుందని మధ్యవర్తులు చెబుతున్నారు.
అమెరికా- ఇరాన్ మధ్య తిరిగి యుద్ధం ప్రారంభం అయిన నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అంతర్జాతీయ ప్రమాణమైన బ్రెంట్ క్రూడ్ 7.3 శాతం పెరిగి బ్యారెల్ కు 88.09 డాలర్లుగా ట్రేడ్ అవుతోంది. దాడులు ఇలాగే కొనసాగితే మరోసారి వంద డాలర్లు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నిఫుణులు చెబుతున్నారు.
Read More
Next Story