
యూఎస్ఏ: హిందూ ఆలయంలో నరమేధానికి కుట్ర
19 ఏళ్ల అమెరికన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
అమెరికాలో హిందూ ప్రార్థనా స్థలాన్ని లక్ష్యంగా చేసుకుని కాల్పులకు పాల్పడేందుకు కుట్ర పన్నని 19 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇల్లినాయిస్లోని అరోరా ప్రాంతంలో ఈ దాడికి ప్రణాళిక వేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. నిందితుడి వద్ద జాత్యహంకార భావజాలాన్ని వ్యక్తం చేసే పత్రంతో పాటు తుపాకులు, మందుగుండు సామగ్రి, ఇతర యుద్ధ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాలటైన్‌కు చెందిన అలెగ్జాండ్రోస్ పాపోరాకిస్‌ను అక్టోబర్ 11న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మౌంట్ ప్రాస్పెక్ట్ పోలీసులకు ఒక వ్యక్తి నుంచి అనుమానాస్పద ఎలక్ట్రానిక్ సందేశాల గురించి సమాచారం అందడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ సందేశాల్లో సామూహిక కాల్పులకు సంబంధించిన ప్రణాళిక ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించారు.
రైఫిల్, మ్యాగజైన్లు, బాడీ ఆర్మర్ సహా ఇతర వ్యూహాత్మక పరికరాలకు సంబంధించిన చిత్రాలను కూడా నిందితుడు పంపినట్లు అధికారులు తెలిపారు. ఈ సమాచారం ఆధారంగా పాలటైన్, మౌంట్ ప్రాస్పెక్ట్ పోలీసులు సంయుక్తంగా చర్యలు చేపట్టి, నిందితుడు తన నివాసం నుంచి బయటకు వస్తున్న సమయంలో అరెస్ట్ చేశారు.
అనంతరం అతడి ఇంట్లో సోదాలు నిర్వహించి ఒక రైఫిల్, లోడ్ చేసిన మ్యాగజైన్లు, వందల సంఖ్యలో అదనపు తూటాలు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. తెల్లజాతి ఆధిపత్య భావజాలానికి సంబంధించిన గుర్తులు ఉన్న బాడీ ఆర్మర్‌ను కూడా గుర్తించారు.
దర్యాప్తులో భాగంగా నిందితుడికి చెందినట్లు భావిస్తున్న ఒక పత్రాన్ని పోలీసులు పరిశీలించారు. అందులో శ్వేతజాతి ఆధిపత్య, తీవ్రవాద భావజాలంతో పాటు దక్షిణాసియా ప్రజలు, ముఖ్యంగా భారతీయ సంతతికి చెందిన వారిపై హింసకు సంబంధించిన ప్రస్తావనలు ఉన్నట్లు వెల్లడించారు. అక్టోబర్ 11న అరోరా ప్రాంతంలోని హిందూ ప్రార్థనా స్థలంపై దాడి చేయాలని నిందితుడు భావించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
అయితే, దాడికి లక్ష్యంగా ఎంచుకున్న నిర్దిష్ట ప్రార్థనా స్థలం ఏదో ఇంకా నిర్ధారించలేదు. ఈ ఘటన నేపథ్యంలో అరోరా పోలీసులు తమ పరిధిలోని హిందూ ప్రార్థనా స్థలాల నిర్వాహకులను అప్రమత్తం చేశారు. నిందితుడిపై ఉగ్రవాద బెదిరింపులకు సంబంధించిన ఒక అభియోగంతో పాటు, చట్టవిరుద్ధంగా ఆయుధాలు కలిగి ఉన్నందుకు మరో అభియోగం నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని అభియోగాలు నమోదు చేసే అవకాశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.
ఈ కేసులో ఎఫ్‌బీఐ కూడా స్థానిక పోలీసులతో కలిసి పనిచేస్తోంది.అక్టోబర్ 14న జరిగిన నిర్బంధ విచారణలో న్యాయమూర్తి నిందితుడిని కస్టడీలో ఉంచాలని ఆదేశించారు. తదుపరి విచారణ అక్టోబర్ 30న జరగనుంది. మరోవైపు, ఈ ఘటనకు సంబంధించి ప్రజలకు ప్రస్తుతం కొనసాగుతున్న ముప్పు ఏదీ గుర్తించలేదని అధికారులు తెలిపారు.
నవరాత్రి సహా హిందూ పండుగలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా, ఒహియోలోని రిచ్మండ్ హైట్స్‌లో ఉన్న శ్రీ స్వామినారాయణ వడ్తాల్ ధామ్ హిందూ మందిర్ ధ్వంసానికి గురైన రెండు వారాలకే ఈ పరిణామం చోటుచేసుకుంది.
ఈ నేపథ్యంలో ప్రార్థనా స్థలాల భద్రతపై అధికారులు దృష్టి సారించగా, ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని హిందూ అమెరికన్ ఫౌండేషన్ ప్రజలకు సూచించింది.
Next Story

