
వెనిజులాలో భూకంపం..235 మంది మృతి, వేల మందికి గాయాలు
వెనిజులాలో వరుసగా సంభవించిన భూకంపాలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. వందల సంఖ్యలో మృతి చెందగా, వేలాది మంది గల్లంతైనట్లు సమాచారం.
వెనిజులాలో 7.2, 7.5 తీవ్రతతో వరుసగా సంభవించిన రెండు భూకంపాలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 235 మంది మరణించగా, 4,300 మందికి పైగా గాయపడినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రి కార్లోస్ అల్వరాడో తెలిపారు. వేలాది మంది గల్లంతైనట్లు సమాచారం రావడంతో సహాయక బృందాలు శిథిలాల కింద ప్రాణాలతో ఉన్నవారి కోసం గాలిస్తున్నాయి.
వెనిజులా రాజధాని కారకాస్‌కు ఉత్తరాన ఉన్న లా గువైరా ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. అనేక భవనాలు కూలిపోగా, దేశంలోని ప్రధాన విమానాశ్రయం కూడా దెబ్బతిని మూతపడింది. దీంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది. శిథిలాల నుంచి చిన్నారులు, మహిళలు సహా పలువురిని రక్షించినప్పటికీ, ఇంకా అనేక మంది చిక్కుకుపోయి ఉంటారని అధికారులు తెలిపారు.
భూకంపం తర్వాత ప్రజలు ఇళ్లను విడిచి బహిరంగ ప్రదేశాల్లోనే రాత్రి గడిపారు. విద్యుత్, మొబైల్ సేవలు పలు ప్రాంతాల్లో నిలిచిపోయాయి. పాఠశాలలకు సెలవులు ప్రకటించి, కొన్ని విద్యాసంస్థలను తాత్కాలిక సహాయ కేంద్రాలుగా మార్చారు.
ఇటు మెక్సికో, బ్రెజిల్, కెనడా, స్పెయిన్, పోర్చుగల్, ఖతార్ తదితర దేశాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. అవసరమైన మందులు, ఆహారాన్ని పంపిస్తున్నాయి. అమెరికా కూడా ప్రత్యేక సహాయక బృందాలను పంపనున్నట్లు ప్రకటించింది.
వెనుజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. దెబ్బతిన్న ఇళ్లు, ఆసుపత్రుల పునర్నిర్మాణం కోసం 200 మిలియన్ డాలర్ల ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
అమెరికా భూగర్భ శాస్త్ర సర్వే (USGS) ప్రకారం, మొదటి భూకంపం 22 కిలోమీటర్ల లోతులో, రెండో భూకంపం కేవలం ఒక నిమిషం వ్యవధిలో 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. భూమికి సమీపంలో వరుసగా సంభవించిన ఈ రెండు భూకంపాల ప్రభావమే భారీ ప్రాణ, ఆస్తి నష్టానికి ప్రధాన కారణమని నిపుణులు పేర్కొన్నారు.

