
అమెరికాపై పూర్తిగా ఆధారపడలేము: నెతన్యాహూ
భారత్‌తో సహా కొత్త మిత్రుల కోసం నెతన్యాహు ప్రయత్నాలు!
ఇజ్రాయెల్ ను ఏర్పాటు చేయడానికి సహకరించింది బ్రిటన్.. రెండో ప్రపంచ యుద్ధం తరువాత జరిగిన పరిణామాలతో అమెరికాకు వెళ్లిన యూదులు అక్కడ శక్తివంతమైన లాబీగా మారారు. ఇప్పుడు ఇజ్రాయెల్ కు అతిపెద్ద అండ యూఎస్ఏనే.. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూడా అమెరికా తమ మిత్రదేశంగా ఉండబోదని టెల్ అవీవ్ గ్రహించినట్లు ఉంది.
కొత్త మిత్రుల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. యూదులకు ఆది నుంచి అండగా ఉన్న భారత్ తో సహ లాటిన్ అమెరికా దేశాలో సన్నిహితంగా మెలగాలని ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ సూచిస్తున్నారు.
భవిష్యత్తులో అమెరికా అధ్యక్షుడిగా ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఉండే వ్యక్తి ఎన్నికయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తూ, భారత్‌తో సహా ఇతర దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అక్టోబర్ 27న ఇజ్రాయెల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నెతన్యాహు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఆదివారం తన భద్రతా విధానాన్ని వివరించే కార్యక్రమంలో నెతన్యాహు ఈ అంశాలను ప్రస్తావించారు. అమెరికాలో నాయకత్వ మార్పు జరిగితే ఇజ్రాయెల్‌కు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే సిద్ధం కావాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీకాలంలో మిగిలిన రెండేళ్లను ఉపయోగించుకుని, ఆ తర్వాత కూడా అమెరికాతో సంబంధాలను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
అదే సమయంలో అమెరికాపైనే ఆధారపడకుండా ఇతర దేశాలతోనూ మైత్రిని పెంచుకోవాల్సిన అవసరం ఉందని నెతన్యాహు స్పష్టం చేశారు. ఈ దిశగా భారత్‌తో పాటు మధ్యప్రాచ్యంలోని ఇతర దేశాలు, లాటిన్ అమెరికా దేశాలతో సంబంధాలను విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
ముఖ్యంగా లాటిన్ అమెరికాలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు ఇజ్రాయెల్‌కు కొత్త అవకాశాలను అందించవచ్చని ఆయన భావిస్తున్నారు.
భారత్‌తో ఇజ్రాయెల్‌కు ఉన్న సంబంధాలను నెతన్యాహు గతంలోనూ ప్రస్తావించారు. అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ ఒంటరిగా లేదని చెప్పేందుకు, తన ప్రభుత్వ దౌత్య విజయాలను వివరించేందుకు ప్రధాని నరేంద్ర మోదీతో ఉన్న సంబంధాలను ఆయన ఉదాహరణగా చూపుతున్నారు.
అమెరికాలో డెమోక్రటిక్ పార్టీకి చెందిన మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, జో బైడెన్‌లతో నెతన్యాహుకు గతంలో విభేదాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ ప్రయోజనాల విషయంలో అమెరికా అధ్యక్షులతోనూ విభేదించగల నాయకుడిగా తనను తాను నెతన్యాహు ప్రజలకు పరిచయం చేసుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అంశం ఆయన ఎన్నికల ప్రచారంలోనూ కీలకంగా మారింది.
ఇదిలా ఉంటే, నెతన్యాహు ప్రకటించిన భద్రతా విధానాన్ని ఆయన ప్రధాన ప్రత్యర్థి గాది ఐసెన్‌కోట్ తీవ్రంగా విమర్శించారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు, దేశం ఎదుర్కొంటున్న భద్రతా సవాళ్లకు స్పష్టమైన పరిష్కారాలు చూపకుండా నినాదాలతో ప్రజలను ప్రభావితం చేసేందుకు నెతన్యాహు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. భద్రత పేరుతో ప్రజల్లో భయాన్ని పెంచుతున్నారని కూడా విమర్శించారు.
మరోవైపు, నెతన్యాహుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా మద్దతు ప్రకటించారు. ఇజ్రాయెల్ ఎన్నికలకు ముందు ట్రంప్ ఇచ్చిన ఈ మద్దతు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఈ మద్దతు ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది వేచి చూడాలి.
Next Story

