LIVE తమిళ తీరాన్ని తాకిన ‘దళపతి’ సునామీ
x

తమిళ తీరాన్ని తాకిన ‘దళపతి’ సునామీ

జననాయకుడిగా మారిన విజయ్


Click the Play button to hear this message in audio format

దేశంలో నెలరోజుల పాటు సాగిన ఎన్నికల సమరం ముగిసింది. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం నాలుగు రాష్ట్రాలతో పాటు, పుదుచ్చేరీ కేంద్రపాలిత ప్రాంతం ఓట్ల లెక్కింపు మొదలయింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇప్పటికే వెలువడ్డాయి. అయితే సాయంత్రం వరకూ తుది ఫలితాలు వెలువడి ఎవరూ గద్దెనెక్కుతారో తేలుతుంది.

విజయ్ కింగ్ మేకర్ అవుతాడా..

దేశంలో అత్యంత కీలకమైన తమిళనాడు ఎన్నికలలో తిరిగి డీఎంకే అధికారంలోకి వస్తుందా? మెజారిటీ ఎంత సాధిస్తారు? విజయ్ కింగ్ మేకర్ అవుతాడా? హంగ్ వస్తుందా? ఇవే ప్రశ్నలు అందరి మదిలో తలెత్తుతున్నాయి.
సంక్షేమ పథకాలు, ద్రవిడవాదంతో తిరిగి అధికారంలోకి వస్తామని స్టాలిన్ నమ్ముతున్నారు. అయితే పార్టీ ఎప్పుడూ వరుసగా రెండుసార్లు అధికారంలోకి రాలేదు. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం డీఎంకే వైపే నిలిచాయి.
సినీ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ భారీగా ఓట్లు చీలుస్తుందని అంచనాలు ఉన్నాయి. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలలో టీవీకే ఒంటరిగా బరిలోకి దిగింది. యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ లో టీవీకే 30 శాతం ఓట్లు, 120 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇది మొత్తం ఎన్నికల కథనాన్ని తలకిందులు చేసింది. ఇదే నిజమైతే భారత ఎన్నికల చరిత్రలో ఇదో సంచలనం అవుతుంది.

పుదుచ్చేరిలో..

30 స్థానాలు ఉన్న కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో తిరిగి ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని అంచనాలు ఉన్నాయి. అయితే ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా బలంగా ఉండటంతో పోరు హోరాహోరీగా ఉంది. ఇక్కడ చిన్న చిన్న అంశాలు కూడా వేగంగా ప్రభావం చూపే అవకాశం ఉంది.

కేరళ..

కేరళ అసెంబ్లీలో 140 స్థానాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి పినరయి విజయన్ రెండుసార్లు పీఠంపై ఉన్నారు. ఇప్పడు ఆయన హ్యట్రిక్ విజయంపై కన్నేశారు. గత అసెంబ్లీ ఎన్నికలలో 99 స్థానాలు సాధించి అధికారం చేపట్టారు. కానీ తరువాత అన్ని ప్రతికూల అంశాలు ఎల్డీఎఫ్ ను చుట్టుముట్టాయి. అవినీతి,కుంభకోణాలు వెలుగుచూడటంతో యూడీఎఫ్ బలం ఫుంజుకున్నట్లు కనిపిస్తోంది. ఇక్కడ వామపక్షాలు ఓటమి పాలైతే దేశంలో ఉన్న చివరి అధికారకోట కూడా కోల్పోయినట్లు అవుతుంది.

పశ్చిమ బెంగాల్ లో..

ఉత్తరాదిన ఉన్న పశ్చిమ బెంగాల్ యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. 294 స్థానాలు ఉన్న అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 148. ఇక్కడ 2011 నుంచి టీఎంసీ అధికారంలో ఉంది. గత 15 ఏళ్లు పాలనలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తోంది. దీనితో బీజేపీ బలంగా పోరాడింది. ఈసారి ఎగ్జిట్ పోల్స్ కూడా కొన్ని మమతా బెనర్జీ వైపు, ఇంకొన్ని బీజేపీ వైపు నిలిచాయి. బెంగాల్ లో బీజేపీ అధికారంలోకి వస్తే మరో పెద్ద రాష్ట్రం దాని సొంతమవుతుంది.
ఈసారి బెంగాల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఎలాంటి ఘర్షణలు, కర్ప్యూలు లేవు. పార్టీ కార్యాలయాలకు నిప్పులు పెట్టడం లాంటివి జరగలేదు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ వల్ల 27 లక్షల మంది ఓటర్లను తొలగించారు. దీనిపై టీఎంసీ వీధి పోరాటాలతో పాటు న్యాయ స్థానాలను ఆశ్రయించింది.

అస్సాం..

అస్సాంలో 126 స్థానాలు ఉన్నాయి. బీజేపీ మరోసారి ఫేవరేట్ గా బరిలోకి దిగింది. ఇక్కడ మరోసారి ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇదే జరిగితే వరుసగా మూడో సారి బీజేపీ అధికారం దక్కించుకున్నట్లు అవుతుంది.


Live Updates

  • 4 May 2026 5:42 PM IST



  • 4 May 2026 2:54 PM IST

    కేరళలో సెంచరీ మార్క్ దాటిని యూడీఎఫ్

    కేరళ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కీలక ముందంజ సాధించింది. లెక్కింపు తుది దశకు చేరుకుంటున్న వేళ ఫలితాలు ఆ కూటమికి అనుకూలంగా మారాయి. సుమారు ఆరు గంటల లెక్కింపులో యూడీఎఫ్ 101 స్థానాల్లో ఆధిక్యంలో నిలిచింది. 140 సీట్ల సభలో 100 మార్క్ దాటడం ఈ కూటమికి పెద్ద ఊరటగా మారింది.

    మరోవైపు అధికార సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ 40కి లోపు సీట్లలోనే ముందంజలో కొనసాగుతోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. అధికార కూటమికి ఈ ధోరణులు గట్టి ఎదురుదెబ్బగా మారాయి. పలువురు మంత్రులు తమ స్థానాల్లో వెనుకంజలో ఉన్నట్లు సమాచారం వచ్చింది.

    ధర్మదంలో మొదట వెనుకబడిన సీఎం పినరయి విజయన్ తరువాత తన ఆధిక్యాన్ని తిరిగి సాధించి 8,000కిపైగా ఓట్ల లీడ్ సాధించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో సంబరాలు మొదలయ్యాయి. కార్యకర్తలు డప్పులు, నినాదాలతో హడావుడి చేస్తూ విజయోత్సాహం వ్యక్తం చేశారు. కేరళ పీసీసీ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్ మాట్లాడుతూ, ప్రజలు ప్రభుత్వ వ్యతిరేక విధానాలను తిరస్కరించారని, యూడీఎఫ్ మళ్లీ అధికారంలోకి వచ్చే దిశగా ఉందని అభిప్రాయపడ్డారు.

  • 4 May 2026 12:57 PM IST

    ఫలితాల వేళ బీజేపీ కార్యాలయానికి మోదీ రాక

    ఎన్నికల లెక్కింపు ధోరణులు బీజేపీకి అనుకూలంగా కనిపిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సాయంత్రం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించనున్నారు. బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో పార్టీ ముందంజలో ఉన్నట్లు సంకేతాలు వస్తున్న వేళ ఈ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ ప్రధాన ప్రతినిధి అనిల్ బలూని సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపిన ప్రకారం, ప్రధాని మోదీ సాయంత్రం 6 గంటలకు న్యూఢిల్లీ లోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి రానున్నారు.

    గత ఎన్నికల విజయాల సమయంలోనూ మోదీ పార్టీ కార్యాలయానికి వెళ్లి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన సంప్రదాయం కొనసాగిన విషయం తెలిసిందే. ఈసారి కూడా ఫలితాల ధోరణుల నేపథ్యంలో ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉందని సమాచారం.

  • 4 May 2026 12:46 PM IST

    భవానీపూర్‌లో మమతా భారీ లీడ్: సువేందుపై 16,706 ఓట్ల ఆధిక్యం

    పశ్చిమ బెంగాల్ భవానీపూర్ నియోజకవర్గంలో సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తన ఆధిక్యాన్ని మరింత పెంచుకున్నారు. ఐదో రౌండ్ ముగిసే సరికి ఆమె బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి పై 16,706 ఓట్ల స్పష్టమైన లీడ్ సాధించారు. ఎన్నికల సంఘం డేటా ప్రకారం, మమతా బెనర్జీ 25,942 ఓట్లు సాధించగా, సువేందు అధికారి 9,236 ఓట్లు పొందారు. దీంతో ప్రారంభంలో హోరాహోరీగా సాగిన పోరు ఇప్పుడు మమతా వైపు మళ్లింది.

    మొదటి రౌండ్‌లో మమతా 1,996 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉండగా, రెండో రౌండ్‌లో సువేందు 1,558 ఓట్లతో లీడ్ సాధించారు. అయితే మూడో రౌండ్‌లో మమతా మళ్లీ ఆధిక్యంలోకి వచ్చి 898 ఓట్లతో తిరిగి ముందుకు వచ్చారు. ఆ తర్వాత ఆమె ఆధిక్యం మరింత పెరుగుతూ స్థిరపడింది.

  • 4 May 2026 12:45 PM IST

    తమిళనాడులో బీజేపీకి ఆరంభంలోనే షాక్

    తమిళనాడు అసెంబ్లీ ఓట్ల లెక్కింపులో బీజేపీకి ప్రారంభ దశలోనే ఎదురుదెబ్బ తగిలింది. పలు హైప్రొఫైల్ అభ్యర్థులు DMK, TVK (విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం) అభ్యర్థుల కంటే వెనుకంజలో ఉన్నారు. సత్తూర్‌లో పోటీ చేస్తున్న నైనార్ నగేంద్రన్, DMK అభ్యర్థి కడర్కరైరాజ్ ఏపై 909 ఓట్లతో వెనుకబడ్డారు.

    కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ అవినాశి రిజర్వ్డ్ సీటులో TVK అభ్యర్థి కమలి ఎస్‌పై 2,080 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మైలాపూర్‌లో TVK అభ్యర్థి వెంకటరామనన్ పి పై 9,296 ఓట్లతో వెనుకబడ్డారు.  కోయంబత్తూర్ నార్త్‌లో వనతి శ్రీనివాసన్ కూడా TVK అభ్యర్థి వి. సంపత్ కుమార్‌పై 839 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు.

    AIADMKతో కలిసి 27 సీట్లలో పోటీ చేస్తున్న బీజేపీ నేగర్‌కోయిల్, ఉదగమండలం, తల్లి నియోజకవర్గాల్లో ముందంజలో ఉంది. విలవంకోడ్‌లో విజయధరణి ఎస్, కాంగ్రెస్ అభ్యర్థి ప్రవీణ్ టీ టీపై 6,697 ఓట్ల వెనుకంజలో ఉన్నట్లు ధోరణులు సూచిస్తున్నాయి.

  • 4 May 2026 12:37 PM IST

    బెంగాల్‌లో బీజేపీ సంబరాలు.. మార్పుకు ఇదొక సంకేతమంటూ కమలనాథుల ధీమా

    పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల లెక్కింపులో బీజేపీ ముందంజలో కొనసాగుతున్న వేళ, రాష్ట్రంలో మార్పు కోసం ప్రజలు ఓటు వేశారని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి మద్దతుగా ప్రజలు నిలిచారని వారు అన్నారు. తాజా ధోరణుల ప్రకారం బీజేపీ 171 సీట్లలో, టీఎంసీ 83 సీట్లలో ముందంజలో ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద మార్పుకు సంకేతమని బీజేపీ నేతలు పేర్కొన్నారు.

    ప్రతిపక్ష నేత సువేందు అధికారి మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని చెప్పారు. ప్రజలు స్పష్టమైన మద్దతు ఇచ్చారని, ఈ విజయం ప్రధాని మోదీకి చెందినదేనని ఆయన వ్యాఖ్యానించారు. ముస్లిం ఓట్లు టీఎంసీకి ఏకపక్షంగా వెళ్లలేదని, హిందూ ఓట్లు బీజేపీకి ఏకమయ్యాయని ఆయన అన్నారు. భాష, మతం, కులం పేరుతో ప్రజలను విడదీయలేరని కూడా చెప్పారు.

    రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు శమిక్ భట్టాచార్య మాట్లాడుతూ, టీఎంసీ ప్రభుత్వం ప్రజల చేత తిరస్కరించబడిందని అన్నారు. ప్రజల తీర్పుతో భారీ మెజారిటీ బీజేపీకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతర బీజేపీ నేతలు కూడా మార్పు అనివార్యమని వ్యాఖ్యానించారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడుతుందని కొందరు నేతలు ధీమా వ్యక్తం చేశారు.

    కొంతమంది నేతలు ఈ ఎన్నికలను “పోరిబోర్టన్” (మార్పు) కోసం ప్రజల తీర్పుగా అభివర్ణించారు. అదే సమయంలో కొంతమంది నేతలు హింస, అక్రమాలు, అవినీతిపై ప్రజలు తిరస్కరించారని వ్యాఖ్యానించారు.

  • 4 May 2026 12:36 PM IST

    అస్సాంలో బద్రుద్దీన్ అజ్మల్ భారీ లీడ్

    అస్సాంలోని బిన్నాకాండీ నియోజకవర్గంలో ఏఐయూడీఎఫ్ అధ్యక్షుడు బద్రుద్దీన్ అజ్మల్ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఏడో రౌండ్ లెక్కింపు తర్వాత ఆయన 10,253 ఓట్ల లీడ్ సాధించారు. ఎన్నికల సంఘం సమాచారం ప్రకారం, అజ్మల్ 33,615 ఓట్లు సాధించగా, అస్సాం జాతీయ పరిషత్ అభ్యర్థి రెజావుల్ కరీం చౌధురి 23,362 ఓట్లు పొందారు.

    2006 తర్వాత రెండోసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అజ్మల్, గతంలో సౌత్ సల్మారా మరియు జమునముఖ్ నుంచి పోటీ చేసి రెండు సీట్లలో విజయం సాధించారు. తర్వాత జమునముఖ్ సీటును తన సోదరుడు సిరాజుద్దీన్ అజ్మల్‌కు అప్పగించారు. ఆ తర్వాత 2009లో లోక్‌సభలోకి ప్రవేశించిన ఆయన, ధుబ్రి స్థానం నుంచి వరుసగా మూడు పర్యాయాలు ఎంపీగా కొనసాగి 2024 వరకు ఆ సీటును నిలబెట్టుకున్నారు.

  • 4 May 2026 12:33 PM IST

    బారామతి బైపోల్‌లో విజయం దిశగా సునేత్రా పవార్

    మహారాష్ట్ర బారామతి అసెంబ్లీ బైఎన్నికలో డిప్యూటీ సీఎం సునేత్రా పవార్ భారీ విజయానికి చేరువయ్యారు. ఫలితాలు వెలువడుతున్న వేళ ఆమె మద్దతుదారులకు సంబరాలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సంఘం తాజా ధోరణుల ప్రకారం, సునేత్రా పవార్ 61,917 ఓట్లతో స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నారు. ఆమె 22 ప్రత్యర్థుల్లో కేవలం ఒకరు మాత్రమే 200 ఓట్ల మార్క్ దాటినట్లు సమాచారం. విజయం దిశగా సాగుతున్న నేపథ్యంలో ఆమె పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు విజయ ర్యాలీలు లేదా గులాల్ వేడుకలు చేయకూడదని కోరారు.

    తన భర్త, దివంగత అజిత్ పవార్ స్మృతికి ఈ విజయం  అంకితం చేస్తున్నట్లు తెలిపారు. ఈ బైఎన్నిక ఏప్రిల్ 23న జరిగింది. అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించడంతో ఈ ఎన్నిక అవసరమైంది. తొలిసారి అసెంబ్లీ బరిలో నిలిచిన సునేత్రా పవార్, కుటుంబ ప్రభావం మరియు సానుభూతి తరంగంతో భారీ ఆధిక్యంలో ఉన్నట్లు కనిపిస్తోంది. బారామతి ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపిన ఆమె, ఇది ముగింపు కాదని, కొత్త ప్రారంభమని పేర్కొన్నారు.

  • 4 May 2026 12:32 PM IST

    తమిళనాడులో TVK ముందంజ

    తమిళనాడు:

    TVK – 104

    AIADMK+ – 71

    DMK+ – 58

    పశ్చిమ బెంగాల్:

    BJP+ – 189

    TMC+ – 100

    కేరళ:

    UDF – 84

    LDF – 40

    BJP+ – 3

    అస్సాం:

    BJP+ – 99

    Congress – 25

    AIUDF+ – 2

    పుదుచ్చేరి:

    NRC+ – 15

    Congress+ – 11

  • 4 May 2026 12:27 PM IST

    కవుండంపాళయం‌లో TVK ధీమా: భారీ లీడ్‌పై కానిమొళి సంతోష్ వ్యాఖ్యలు

    కవుండంపాళయం నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి కానిమొళి సంతోష్ ఓట్ల లెక్కింపుపై స్పందించారు. ఇప్పటివరకు సుమారు 11 రౌండ్లు పూర్తయ్యాయని, ప్రస్తుతం 12,000 నుంచి 13,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు ఆమె తెలిపారు. ఇంకా లీడ్ పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నట్లు చెప్పారు. ఇతర పార్టీలతో తాము పోల్చుకోవడం లేదా పోటీగా చూడడం చేయడం లేదని, ప్రజల ముందే తమను తాము నిరూపించుకుంటున్నామని ఆమె అన్నారు. విజయ్‌పై ప్రజలకు ఉన్న ప్రేమ, అభిమానమే ఈ ఫలితాల్లో ప్రతిబింబిస్తున్నదని ఆమె వ్యాఖ్యానించారు. సాయంత్రానికి ఫలితాల్లో మరింత స్పష్టత వస్తుందని, సానుకూల మార్పు కనిపిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

Read More
Next Story