కాక్రోచ్‌ల చలో పార్లమెంట్.. అభిజిత్ దీప్కే అరెస్ట్
లాఠీచార్జ్ చేసిన పోలీసులు.. పదివేల మంది నిరసనకారులు వచ్చి ఉంటారని అంచనా
సీజేపీ ప్రకటించిన ‘చలో సంసద్’ నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నిరసన యాత్రలో దాదాపు పదివేల మంది నిరసనకారులు పాల్గొన్నారు. వీరు పోలీసులతో ఘర్షణకు దిగడంతో రాజధాని నడిబొడ్డున తీవ్ర గందరగోళం నెలకొంది.
Live Updates
- 20 July 2026 6:54 PM IST
పార్లమెంట్ నిరసన లైవ్ వీడియో డ్రోన్ ఎవరిది?
పార్లమెంట్ లో సమీపంలో సీజేపీ చేసిన నిరసనలకు సంబంధించి ఓ డ్రోన్ వీడియో బయటకు వచ్చిన సంఘటనపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది నిబంధనల ఉల్లంఘనగా పోలీసులు గుర్తించారు. ‘‘ ఫుటేజ్ వాస్తవికతను, డ్రోన్ ఆపరేషన్ కు సంబంధించిన పరిస్థితులను పరిశీలిస్తున్నాం.పార్లమెంట్ సమీపంలో డ్రోన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’’ అని ఢిల్లీ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ వీడియో ఆన్ లైన్ ప్రత్యక్షమైన తరువాత విచారణ ప్రారంభం అయింది. న్యూఢిల్లీ అత్యంత కట్టుదిట్టమైన ప్రాంతం అని, అక్కడ డ్రోన్ నుంచి వీడియోలు తీయడానికి ముందస్తు అనుమతి అవసరం అని, ఎలాంటి అనధికార విమానయానం అయిన చట్టపరమైన చర్యలకు దారితీస్తుందని హెచ్చరించారు. - 20 July 2026 5:35 PM IST
మోదీని తొలగించండి.. దేశాన్నికాపాడండి: సీజేపీ
నీట్ యూజీసీ పేపర్ లీక్ లో తన అసలు ఉద్దేశ్యాన్ని సీజేపీ బయటపెట్టింది. మోదీని ఎలాగైన గద్దె దింపడానికి కుట్రలు జరుగుతున్నాయనే జాతీయవాదులు ఆరోపణలను నిజం చేస్తూ.. ఇన్నాళ్లు నీట్ పరీక్షను అడ్డు పెట్టుకున్నా సీజేపీ.. ఇప్పుడు తన ముసుగు తీసేసింది. మోదీని గద్దె దించి దేశాన్ని కాపాడాలనే నినాదం బయటకు తీసింది. సోమవారం నాటి పార్లమెంట్ ముట్టడిలో ఎక్స్ లో ఈ మేరకు స్పష్టమైన ప్రకటన చేసింది. ‘‘మోదీని తొలగించండి.. దేశాన్ని కాపాడండి’’ అనే నినాదం ఎక్స్ లో పోస్ట్ చేసింది.వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజున కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరతూ సీజేపీ పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనికి మద్దతుగా దాదాపు ఐదు నుంచి పదివేల మంది నిరసనకారులు పార్లమెంట్ రోడ్లపై గుమిగూడారు. దీనితో భద్రతా దళాలు బాష్పవాయువు ప్రయోగం, లాఠీ చార్జీ ప్రయోగించారు. ప్రభుత్వం చర్చలకు అంగీకరించినందున సీజేపీ ప్రతినిధులు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. తమ డిమాండ్లను కేంద్రం ముందు ఉంచారు. తమ డిమాండ్లు నెరవేరే వరకూ ఆందోళన కొనసాగుతుందని నిరసనకారులు తెలిపారు. - 20 July 2026 5:02 PM IST
స్పందించిన ప్రియాంక గాంధీ..
నీట్ యూజీసీ 2026 పేపర్ లీక్ ఆరోపణలపై నిరసన చేస్తున్న ఆందోళనకారులపై పోలీసులు లాఠీ చార్జీ చేయడాన్ని ప్రతిపక్ష నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఖండించారు. విద్యా రంగాన్ని ప్రభావితం చేసే సమస్యలపై పార్లమెంటరీ చర్చను కేంద్రం తప్పించుకుంటోందని ఆమె ఆరోపించారు. పార్లమెంట్ వెలుపల ఆమె మాట్లాడారు. విద్యా విధానంపై ప్రతిపక్షం పార్లమెంట్ లో చర్చను డిమాండ్ చేస్తోందని అయితే ప్రభుత్వం వీటిని పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. నిరసనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించడం, లాఠీ చార్జ్ చేయడాన్ని ఆమె తప్పుపట్టారు. వారంతా మన పిల్లలని అన్నారు. జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వైపుకు నిరసనకారులు దూసుకొచ్చిన సందర్భంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. - 20 July 2026 4:44 PM IST
ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే.. పవన్ ఖేరా..
పార్లమెంట్ వద్ద నిరసన తెలిపిందుకు ప్రజలకు పూర్తి హక్కు ఉందని కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా వ్యాఖ్యానించారు. తమ డిమాండ్లను సాధించడానికి ఇలాంటి చర్యలు అవసరమని నిరసనకారుల చర్యలను ఆయన గట్టిగా సమర్థించారు. నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కాక్రోత్ జనతా పార్టీ జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే.
యువత ఆందోళనలను వినడానికి ప్రభుత్వం సుముఖంగా లేదని ఆరోపిస్తూ.. యువత తమ గళాన్ని వినిపించడానికి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి మీ గడప వద్దకు వచ్చినప్పుడూ మీరు భయపడుతున్నారు. ఇది ఏం ప్రజాస్వామ్యం అని ఆయన నిలదీశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. పరీక్షలో పారదర్శకత కల్పించాలని, యువత భవిష్యత్ తో చెలగాటం ఆడటం ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. వీటన్నింటిని సరిచేస్తే ప్రతిపక్షాల నుంచి సహకారం అందుతుందని ఆయన పేర్కొన్నారు.
- 20 July 2026 4:21 PM IST
నిర్భయ నుంచి సీజేపీ వరకూ దేశ రాజధానిలో అతిపెద్ద నిరసనలు..
పార్లమెంట్ ముట్టడికి బయల్దేరిని సీజేపీ నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో దేశ రాజధానిలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ సంఘటన గత పదిహేను సంవత్సరాలలో ఢిల్లీలో జరిగిన అనేక నిరసన ప్రదర్శనలు గుర్తుకు తెచ్చింది.
మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల రైతులు 2021 గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. వారి ర్యాలీకి అనుమతి ఉన్నప్పటికీ కొంతమంది నిరసనకారులు బారికేడ్లను దాటి సెంట్రల్ ఢిల్లీ వైపు దూసుకొచ్చారు. పోలీసులతో ఘర్షణకు దిగిన ఒక బృందం ఎర్రకోట పై రైతు సంఘం జెండాలను ఎగురవేశారు.
నీట్ పరీక్ష పేపర్ లీక్ ను కేంద్రంగా చేసుకుని సీజేపీ నిర్వహిస్తున్న చలో సంసద్ యాత్ర కూడా ఇలాంటి ఘటనే గుర్తుకు తెచ్చింది. వందలాది మంది ఆందోళనకారులు పార్లమెంట్ రోడ్లను దిగ్బంధించే ప్రయత్నం చేశారు. అయితే వారిని పోలీసులు బల ప్రయోగం ద్వారా వెనక్కి నెట్టారు.
గతంలో ఢిల్లీలో అన్నాహాజారే అవినీతిని వ్యతిరేకిస్తూ భారీ ఉద్యమం నడిపారు. లోక్ పాల్ చట్టాన్ని తేవాలని డిమాండ్ చేశారు. 2012 నిర్భయ సంఘటన సందర్భంగా కూడా వేలాది మంది నిరసనకారులు రాష్ట్రపతి భవన్ వైపు దూసుకోవడానికి ప్రయత్నించారు. అలాగే సీఏఏ చట్టం వ్యతిరేకంగా జరిగిన నిరసనలు, రైతుల ఆందోళనలు, రెజ్లర్ల నిరసనలు కూడా వేలాది మంది ఆందోళనకారులను ఢిల్లీలో రోడ్లను దిగ్బంధించడానికి కారణమైంది.
- 20 July 2026 4:14 PM IST
అభిజిత్ ను అరెస్ట్ చేయలేదు..
సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే పోలీసులు అరెస్ట్ చేయలేదని, అదుపులోకి కూడా తీసుకోలేదని ఆ పార్టీ ప్రతినిధులు పేర్కొన్నారు.
- 20 July 2026 4:02 PM IST
సోమవారం నాడు సీజేపీ చలో సంసద్ యాత్ర ప్రారంభించడంతో ప్రభుత్వం వెంటనే చర్చలకు దిగింది. సీజేపీ ప్రతినిధి అశుతోష్, రాంకా మరికొంత ప్రతినిధులు కేంద్రమంత్రి జేపీ నడ్డా నివాసంలో ఆయనను కలిసి సుమారు పది నిమిషాలు మాట్లాడినట్లు ప్రకటించారు. సోనమ్ వాంగ్ చుక్ ను విడుదల చేయడం, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం ఆత్మహత్య చేసుకున్న నీట్ అభ్యర్దులందరూ కుటుంబాలకు కోటీ రూపాయలు ఇవ్వాలనే మూడు డిమాండ్లను కేంద్రం ముందుంచినట్లు పేర్కొన్నారు.

