
కబ్జాల్లో ఉన్న భూమి విలువ రు. 10 లక్షల కోట్లా !
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రమే పనిచేస్తున్న హైడ్రా తొందరలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించబోతోంది
ప్రభుత్వ భూములను చెరబడుతున్న కబ్జాదారులకు హైడ్రా పెద్ద షాక్ ఇవ్వబోతోంది. విషయం ఏమిటంటే ఇపుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రమే పనిచేస్తున్న హైడ్రా తొందరలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించబోతోంది. భూకబ్జాలను అడ్డుకోవాలంటే హైడ్రా సేవలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలనే డిమాండ్లు కొంతకాలంగా వినబడుతున్నాయి. ఆ డిమాండ్లకు తగ్గట్లే తొందరలోనే హైడ్రాను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి డిసైడ్ చేసినట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాధ్ చెప్పారు. గురువారం మిర్యాలగూడలో కమిషనర్ మీడియాతో మాట్లాడుతు హైడ్రాకు కబ్జాలపై వేలాది వినతులు అందుతున్నట్లు చెప్పారు.
ప్రభుత్వ భూములను కబ్జాలనుండి కాపాడటమే హైడ్రా విధిగా పెట్టుకున్నట్లు రంగనాధ్ వివరించారు. చెరువులు, నాలాలను ఆక్రమణలనుండి తొలగించటమే టాప్ ప్రయారిటీగా పెట్టుకున్నట్లు చెప్పారు. వచ్చిన వినతులను వర్గీకరించి పరిశీలించేందుకు హైడ్రా ఆధ్వర్యంలోని ప్రజావాణిని నాలుగువారాల పాటు నిలిపేసినట్లు కమిషన్ చెప్పారు. హైడ్రా చర్యలకు వ్యతిరేకంగా కొందరు కోర్టులో కేసులు వేసిన విషయాన్ని కమిషనర్ తెలిపారు. ఇప్పటివరకు కబ్జాల నుండి రు. 85 వేల కోట్ల విలువైన భూములను విడిపించామన్నారు. మరో ఏడాదిలో లక్ష కోట్ల రూపాయల విలువైన కబ్జా భూములను కాపాడటమే టార్గెట్ గా పెట్టుకున్నట్లు చెప్పారు. హైడ్రా పరిధిలో రు. 10 లక్షల కోట్ల విలువైన భూములు కబ్జాకు గురైనట్లు తమకు సమాచారం ఉందన్నారు. ఆ భూములన్నింటినీ కబ్జా కోరల్లో నుండి విడిపిస్తామన్న ధీమాను వ్యక్తంచేశారు.

