
మెట్రో టేకోవర్‌కి ఐఆర్ఎఫ్‌సీ సహాయం..
మెట్రో నిర్వహణ మార్పులో భాగంగా ఉద్యోగుల కొనసాగింపు, 20 ఏళ్లలో రుణ చెల్లింపు ప్రణాళికపై కీలక నిర్ణయాలు.
హైద్రబాద్ మెట్రో టేకోవర్‌లో తెలంగాణ సర్కార్‌కు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్మొరేషన్(IRFC) భారీ సహాయం చేయడానికి ముందుకొచ్చింది. ఎల్ అండ్ టీ సంస్థకు తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన లోన్ విషయంలో ఐఆర్ఎఫ్‌సీ చేయూతనందించింది. రూ.13,615 కోట్ల లోన్ ఎక్స్‌టెన్షన్‌కి ఆమోదం తెలిపింది. ఐఆర్ఎఫ్‌సీ తీసుకున్న ఈ నిర్ణయం హైదరాబాద్ మెట్రో టేకోవర్‌లో కీలకంగా మారింది. లోన్ మొత్తం ముందుగా అంచనా వేసిన ₹12,750 కోట్ల కంటే ఎక్కువగా ఉంది. దీంతో టేకోవర్ కోసం ఆర్థిక ప్రణాళికలో మార్పులు జరిగాయి.
ప్రభుత్వం ఈ రుణాన్ని 20 ఏళ్లలో తిరిగి చెల్లించేలా ప్రణాళిక రూపొందించినట్టు అధికారులు తెలిపారు. దీని వల్ల దీర్ఘకాలికంగా ఆర్థిక భారం తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ నిధుల సహాయంతో మెట్రో నిర్వహణ మార్పు సాఫీగా జరిగేలా చూడాలని భావిస్తున్నారు. సేవల్లో ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగించడమే లక్ష్యంగా ఉంది. మార్పిడి సమయంలో పనులు ఆగకుండా ఉండేందుకు 115 మంది సిబ్బందిని ఒక సంవత్సరం పాటు కొనసాగించనున్నారు. ఈ నిర్ణయం రోజువారీ సేవలు నిలిచిపోకుండా ఉండేందుకు తీసుకున్నదిగా సమాచారం.
టేకోవర్ జరిగేది ఇలా
హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ టేకోవర్‌కు మార్గం సుగమమైంది. ఈ నెల 30న ప్రభుత్వానికి మెట్రో బదిలీ అయ్యే అవకాశం ఉంది. తాజా పరిణామాలతో ఈ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి సుమారు రూ.13,615 కోట్ల రుణం అందించేందుకు అంగీకారం రావడంతో ప్రక్రియ వేగం పెరిగింది. మెట్రో మొదటి దశ టేకోవర్‌కు సంబంధించిన షేర్ పర్చేజ్ ఒప్పందం, రుణ వివరాలు, ప్రభుత్వ హామీ వంటి అంశాలను కేబినెట్ చర్చించింది.
ఈ రుణాన్ని 20 ఏళ్లలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. దీనికి ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వనుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం విలువ రూ.15,000 కోట్లుగా నిర్ణయించారు. ఇందులో రూ.13,000 కోట్లు రుణం, రూ.2,000 కోట్లు ఈక్విటీగా ఉంటాయి. ఈక్విటీని పూర్తిగా కొనుగోలు చేసి ప్రభుత్వం మెట్రోను స్వాధీనం చేసుకోనుంది. రుణం పొందడానికి ఐఆర్‌ఎఫ్‌సీ, హెచ్‌ఎంఆర్‌ఎల్, ఎల్ అండ్ టీ మధ్య ఒప్పందం జరగనుంది. మొదట కొన్ని షరతులు పెట్టినా, ప్రభుత్వ అభ్యర్థనతో వాటిని సడలించినట్టు తెలుస్తోంది.
ఈ టేకోవర్ పూర్తి కావాలంటే అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని అధికారులు సూచించారు. ఇందులో హెచ్‌ఎండీఏ కూడా తన భాగం నిధులు ఇవ్వనుంది. మెట్రో సేవలు ఆగకుండా ఉండేందుకు తాత్కాలికంగా 115 మంది సిబ్బందిని ఒక సంవత్సరం కొనసాగించనున్నారు. వారి జీతభత్యాలు హెచ్‌ఎంఆర్‌ఎల్ భరిస్తుంది. అలాగే అనుభవజ్ఞులైన 7 మంది అధికారులను ఆరు నెలలు సలహాల కోసం ఉపయోగించనున్నారు.
కొన్ని ఆర్థిక అంశాలపై కూడా నిర్ణయాలు తీసుకున్నారు. పాత బకాయిలు, పన్నులు, ఇతర చెల్లింపులపై స్పష్టత తీసుకువచ్చారు. అలాగే కోర్టు కేసుల కోసం అవసరమైన అధికారాలను కూడా నిర్ణయించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక మెట్రో నిర్వహణలో మార్పులు స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. తదుపరి అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు.

