మల్కారం క్వారీలో విషాదం.. 17 ఏళ్ల విద్యార్థి మృతి
x

మల్కారం క్వారీలో విషాదం.. 17 ఏళ్ల విద్యార్థి మృతి

మల్కారం క్వారీలో స్నేహితులతో ఈతకు వెళ్లిన 17 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థి ప్రణవ్ సాయి నీటిలో మునిగి మృతి చెందాడు.


మల్కాపురం క్వారీలో శనివారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దసరా పండగ సెలవులకు ఇంటికి వచ్చిన బీటెక్ విద్యార్థి.. స్నేహితులతో సరదాగా గడిపేందుకు వెళ్లి విగతజీవిగా తిరిగొచ్చాడు. మరో రెండు రోజుల్లో బాగుంటుందనుకున్న కుటుంబంలో అంతులేని విషాదం నిండింది. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కీసర మండల పరిధిలోని మల్కారం క్వారీలో ఈతకు వెళ్లిన 17 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థి నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు.

దమ్మాయిగూడలోని సాయిప్రియ కాలనీకి చెందిన ముమ్మారెడ్డి ప్రణవ్ సాయి చీరాలలోని గీతాంజలి ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్‌ఈ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం స్నేహితులతో కలిసి మల్కారం క్వారీకి వెళ్లాడు. అక్కడ అందరూ నీటిలోకి దిగి ఈత కొడుతూ ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. ఇదే సమయంలో రీల్స్ చేసుకుందాన్న ఉత్సుకతతో.. ప్రణవ్ అనుకోకుండా లోతైన ప్రాంతంలోకి వెళ్లిపోయాడు. నీటిలో మునిగిన అతడు బయటకు రాలేకపోయాడు.

గాలింపు చేపట్టిన రెస్క్యూ బృందాలు

సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో ఈ ప్రమాదం గురించి ప్రణవ్ తల్లి హేమలతకు తెలిసింది. దీంతో ఆమె హుటాహుటిన క్వారీ వద్దకు చేరుకున్నారు. తన కుమారుడికి ఏమైందని స్నేహితులను అడిగి తెలుసుకున్నారు. ఈత కొడుతున్న సమయంలో ప్రణవ్ నీటిలో మునిగిపోయినట్లు వారు ఆమెకు వివరించారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు వెంటనే అక్కడికి చేరుకున్నాయి. క్వారీలో గాలింపు చేపట్టి ప్రణవ్‌ను బయటకు తీసుకొచ్చాయి. అయితే, అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు

కంటికి రెప్పలా పెంచుకున్న ఏకైక కుమారుడు ఇక లేడన్న వార్తతో హేమలత తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కుమారుడి మృతిని తట్టుకోలేక ఆమె కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆమె రోదనలు అక్కడున్న వారిని కలచివేశాయి. తల్లి ఫిర్యాదు మేరకు కీసర పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలపై దర్యాప్తు చేపట్టారు. ప్రణవ్ సాయి మృతితో కుటుంబ సభ్యులు, స్థానికంగా విషాదం నెలకొంది.

Read More
Next Story