x

రేవంత్ దెబ్బకు రోడ్డునపడ్డ 2 వేల ‘ఔట్ సోర్సింగ్’ కుటుంబాలు

సుమారు 2 వేల ఉద్యోగులను రేవంత్ ప్రభుత్వం అర్ధాంతరంగా తీసేసింది


ఈమధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ మాట్లాడినా రెగ్యులర్ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లింపు, బిల్లుల క్లియరెన్స్ గురించి పదేపదే మాట్లాడుతున్నారు. అంటే ఉద్యోగులకు తన ప్రభుత్వంలో ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాము అన్న విషయాన్ని హైలైట్ చేసుకుంటున్నారు. ఇందులో ఎలాంటి తప్పు లేకపోయినా తాజా మరో కోణం బయటపడింది. అదేమిటంటే సుమారు 2 వేల ఉద్యోగులను రేవంత్ ప్రభుత్వం అర్ధాంతరంగా తీసేసింది. 2 వేలమంది ఉద్యోగులు అంటే 2 వేల కుటుంబాలనే అర్ధం.

రెవిన్యుశాఖలో టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న 650 మంది, భూభారతి పోర్టల్ లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు 650 మందితో పాటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖలో 200 మందితో మరికొన్ని శాఖల్లో మరో 500 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం తీసేసింది. 4.5 లక్షల కుటుంబాలను ఆదుకుంటున్నట్లు పదే పదే ప్రకటించుకుంటున్న రేవంత్ ప్రభుత్వానికి ఈ 2 వేల మంది ఉద్యోగులు కనబడలేదా ?

ఉద్యోగాలు పోయిన వారిలో అత్యధికులు 2006 నుండి కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నవారే. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో నియమితులైన వీరంతా ఇపుడు దిక్కుతోచని స్ధితిలో పడిపోయారు. గ్రూప్-4 ద్వారా కంప్యూటర్ ఆపరేటర్లను ప్రభుత్వం నియమించుకున్నది కాబట్టి మీ సేవలు ప్రభుత్వానికి అవసరంలేదు అని ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఈఏడాది మార్చిలో చెప్పింది. సంవత్సరాల తరబడి పనిచేస్తున్న తమను అర్ధాంతరంగా తీసేయటం న్యాయంకాదని తమకు న్యాయంచేయాలని వీళ్ళు ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు అడిగినా ఎలాంటి ఉపయోగం కనబడలేదు. గమనించాల్సిన విషయం ఏమిటంటే వీళ్ళల్లో చాలామందికి సుమారు ఏడాదిగా జీతాలు కూడా ప్రభుత్వం చెల్లించలేదు. ఇపుడు బయటపడింది 2 వేల మంది మాత్రమే ఇంకా ఇలాంటి వాళ్ళు మిగిలిన శాఖల్లో ఎంతమంది ఉన్నారో చూడాలి.

Read More
Next Story