బుల్లెట్ ట్రైన్‌లతో  ‘ఫ్యూచర్’ మారిపోతుంది...
x

బుల్లెట్ ట్రైన్‌లతో ‘ఫ్యూచర్’ మారిపోతుంది...

ఫ్యూచర్ సిటీ అభివృద్ధిపై సీఎం కీలక ప్రకటనలు. గ్రామాల కలయిక, పెట్టుబడులు, రైతుల పరిరక్షణపై దృష్టి.


తెలంగాణకు మూడు బుల్లెట్ ట్రైన్ మార్గాలు వచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ఈ కీలక విషయాన్ని వెల్లడించారు. దేశంలో మంజూరైన ఏడు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుల్లో మూడు రాష్ట్రానికి రావడం ముఖ్యమని చెప్పారు. బెంగళూరు-హైదరాబాద్, శంషాబాద్-పూణే, శంషాబాద్-అమరావతి-చెన్నై మార్గాలు సిద్ధమవుతున్నాయని వివరించారు. మంగళవారం నాడు మీర్ఖాన్‌పేట భారత్ ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి గారు భూమి పూజ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధిపై కూడా సీఎం దృష్టి పెట్టారు. ఫ్యూచర్ సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సింగపూర్, టోక్యో, న్యూయార్క్ నగరాల తరహాలో అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. జూన్ 2లోగా డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ప్రారంభించాలని ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు.

అందరూ కలిసి పనిచేస్తేనే ఈ నగరం అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. కొన్ని గ్రామాల ప్రజలు తమ ప్రాంతాలను కూడా ఫ్యూచర్ సిటీలో చేర్చాలని కోరినట్లు చెప్పారు. గ్రామసభలు నిర్వహించి నిర్ణయం తీసుకుని వాటిని కమిషనరేట్ పరిధిలోకి తీసుకురావాలని స్థానిక నాయకులకు సూచించినట్లు వివరించారు.

ఇక నుంచి డెవెలప్ కార్పొరేషన్ కార్యాలయం నుంచే సమీక్షలు నిర్వహించి పెట్టుబడులను ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు.

భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి సంబంధించిన పరిష్కారం కావాలంటే సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులందరినీ భాగస్వాములను చేయాలని, అప్పుడే అద్భుతమైన సిటీగా రాణించగలదని చెప్పారు.

“తమ గ్రామాలను ఫ్యూచర్ సిటీ పరిధిలో కలపలేదని, వాటినీ కలపాలని కొంతమంది పరిసర ప్రాంత గ్రామాలకు చెందిన ప్రతినిధులు కొందరు నా దృష్టికి తెచ్చారు. ఆయా గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి తదనుగుణంగా తీర్మానాలు చేసి కలెక్టర్ గారికి పంపించాలి. అభివృద్ధి ఫలాలు అందరికీ అందించాలి. వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ ప్రాంతాన్ని అధునాత నగరంగా తీర్చిదిద్దాలన్నదే మా లక్ష్యం” అని ముఖ్యమంత్రి అన్నారు.

ఫ్యూచర్ సిటీలో భూములు కోల్పోయే వారందరినీ ప్రభుత్వం తగిన విధంగా ఆదుకుంటుంది. ఎవరికో నష్టం చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదు. మీ పిల్లలు చదువుకున్న వారైతే స్కిల్స్ యూనివర్సిటీలో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. పేదల పట్ల మానవీయ కోణంలో వ్యవహరించాలి. అభివృద్ధి కోసం భూములు ఇస్తున్నారు. వారిని గౌరవించాలి. వారి బాధలు వినాలి” అని అధికారులకు చెప్పారు.

“ప్రపంచంలో అద్భుతమైన నిర్మాణాలు ఇక్కడ వస్తాయి. ఇక్కడ పెట్టుబడులు పెట్టని వారు భవిష్యత్తులో ఏదో కోల్పోయామన్న బాధ పడాల్సి వస్తుంది. శంషాబాద్ బుల్లెట్ ట్రైన్స్‌కు హబ్‌గా మారనుంది. బుల్లెట్ ట్రైన్స్‌కు తోడు ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలును అనుసంధానం చేయబోతున్నాం. బుల్లెట్ ట్రైన్ హబ్‌తో పాటు మెట్రో, అతిపెద్ద బస్ టర్మినల్ కూడా నిర్మించబోతున్నాం.

గతంలో ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంపై అనుమానాలు ఉన్నా, అది విజయవంతమైందని గుర్తు చేశారు. 160.5 కిలోమీటర్ల రింగ్ రోడ్ దేశంలో ప్రత్యేకమని పేర్కొన్నారు.

అభివృద్ధి వల్ల రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం చూసుకుంటుందని తెలిపారు. సమస్యల పరిష్కారానికి మంత్రి శ్రీధర్ బాబు అందుబాటులో ఉంటారని చెప్పారు. పేదల పట్ల మానవీయంగా వ్యవహరించాలని అధికారులకు సూచించినట్లు వివరించారు.

రంగారెడ్డి జిల్లాలో పెద్ద మార్పు రాబోతోందని సీఎం తెలిపారు. అందరి సహకారంతో ప్రపంచ స్థాయి నగర నిర్మాణం సాధ్యమవుతుందని చెప్పారు. కొందరు విమర్శలు చేస్తున్నప్పటికీ వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నట్లు సమాచారం.

అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ కమిషనరేట్‌కు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఇదే వేదికగా మావోయిస్టులకు పిలుపునిస్తూ, అడవుల్లో ఉన్న వారు సాధారణ జీవితంలోకి రావాలని కోరినట్లు చెప్పారు. వారికి ఆరోగ్యం, భద్రత పరంగా ప్రభుత్వం సహాయం అందిస్తుందని వెల్లడించారు.

Read More
Next Story