ఇంద్రవెల్లి అమరవీరుల పోరాటానికి 45 ఏళ్లు
x
ఇంద్రవెల్లిలోని స్మారక స్షూపం : అమరవీరుల స్మృతి వనం

ఇంద్రవెల్లి అమరవీరుల పోరాటానికి 45 ఏళ్లు

జల్… జంగల్… జమీన్ కోసం ఆదివాసీలు రక్తం చిందించిన రోజు


అడవి కోసం… భూమి కోసం… జీవన హక్కుల కోసం గిరిజనుల రక్తంతో రాసుకున్న చరిత్ర అది. 1981 ఏప్రిల్ 20న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో జరిగిన పోలీసుల కాల్పులు గిరిజనుల హక్కుల పోరాటానికి నిదర్శనంగా నిలిచాయి. నిరాయుధులైన ఆదివాసీలపై జరిగిన ఆ కాల్పులు 19 మంది ప్రాణాలను బలిగొనగా, వందలాది మందిని గాయాల పాలయ్యేలా చేశాయి.

“జల్… జంగల్… జమీన్” కోసం సాగిన ఆ ఉద్యమం నేటికి 45 ఏళ్లు పూర్తిచేసుకున్నా, ఆ బాధ, ఆ పోరాట స్ఫూర్తి ఇప్పటికీ గుండెల్లో మిగిలే ఉంది.
ఆదిలాబాద్ జిల్లా చరిత్రలో 1981వ సంవత్సరం ఏప్రిల్ 20వతేదీ చిరస్థాయిగా నిలిచిపోయింది. తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ బాట పట్టిన ఆదిలాబాద్ జిల్లా ఆదీవాసీలపై నాడు పోలీసులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 19 మంది గిరిజనులు మరణించగా , మరో 178 మంది గాయాల పాలయ్యారు. నాడు ఇంద్రవెల్లి కేంద్రంగా జరిగిన సభకు గిరిజన తండాల ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. సభ సాగుతుండగా పోలీసులు జరిపిన కాల్పుల్లో వాయుపేట, కన్నపూర్, పిట్టబొంగరం, వంకతమ్మ, పాండుగూడ, ఇంద్రవెల్లి ప్రాంతాల ఆదివాసీలు 19మంది నేలకొరగగా, పలువురు గాయాలపాలయ్యారు.నాడు మరణించిన వారికి గుర్తుగా ఏప్రిల్ 20వతేదీన ఇంద్రవెల్లిలోని స్మారక స్ఱూపం వద్ద సమావేశమై ఆదివాసీ అమరవీరులను స్మరించుకున్నారు.

ఇంద్రవెల్లిలో అమరవీరుల స్మృతి వనం

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని ఇంద్రవెల్లి స్ణూపం వద్ద అమరవీరుల స్మృతి వనాన్ని నిర్మించారు. కోటిరూపాయల వ్యయంతో స్షూపం చుట్టూ ప్రహరీగోడ నిర్మించి, పూల మొక్కలు నాటి అమరవీరుల స్మృతి వనం తీర్చిదిద్దారు. తాము అమరవీరులకు నివాళులు అర్పించేందుకు వీలుగా స్మృతి వనాన్ని నిర్మించామని ఎమ్మెల్యే వెడమ బొజ్జు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
“భూమి కోసం పోరాడి రక్తం చిందించిన గిరిజనుల త్యాగం… ఇంద్రవెల్లి అమరవీరులుగా చిరస్మరణీయం” అని ఖానాపూర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వెడమ బొజ్జు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

విషాద ఘటన...

అడవే ఆవాసం… భూమే జీవితం… సంప్రదాయాలే సంపదగా భావించే గిరిజనుల జీవితాల్లో ఒక విషాద చరిత్రగా నిలిచింది ఇంద్రవెల్లి ఘటన. 1981 ఏప్రిల్ 20న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి ప్రాంతంలో జరిగిన ఈ ఘటన తెలంగాణలో గిరిజన హక్కుల కోసం సాగిన పోరాటానికి ఒక మార్గదర్శకంగా నిలిచింది.అప్పట్లో గిరిజనులు తమ భూములపై హక్కులు కోల్పోతూ, అరణ్య చట్టాల పేరుతో అడవుల నుంచి దూరం చేశారు. ప్రభుత్వ విధానాలు, మధ్యవర్తుల దోపిడీ, పోలీసు దౌర్జన్యాలు అన్నీ కలసి వారి జీవనాన్ని సంక్షోభంలోకి నెట్టాయి. ఈ నేపథ్యంలో తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు గిరిజనులు పెద్ద ఎత్తున ఇంద్రవెల్లిలో నాడు సమావేశం నిర్వహించారు.అయితే ఆ సమావేశం ఉద్రిక్తతలకు దారి తీసింది. పరిస్థితులు అదుపు తప్పడంతో పోలీసులు కాల్పులకు దిగారు. ఆ కాల్పుల్లో పలువురు నిరాయుధ గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. రక్తంతో తడిసిన ఆ నేల, గిరిజనుల బాధను, వారి పోరాటాన్ని దేశానికి తెలియజేసింది.

ఆదివాసీ అమరవీరులకు రాథోడ్ బాపురావు ఘన వివాళి

భూమి కోసం భుక్తి కోసం పోరుబాట సాగించిన ఆదివాసీలపై పోలీసులు కాల్పులు జరిపి పలువురిని పొట్టనబెట్టుకున్నారని మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ జాగృతి నాయకుడు రాథోడ్ బాపురావు ఆరోపించారు. సోమవారం ఇంద్రవెల్లిలో అమరవీరులకు బాపురావు నివాళులు అర్పించారు. నాటి ఇంద్రవెల్లి అమరవీరులను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ జాగృతి పక్షాన గిరిజనుల అభ్యున్నతి కోసం తాము పోరాడుతామని బాపురావు ప్రకటించారు.

1981వ సంవత్సరం ఏప్రిల్ 20వతేదీ ప్రాణాలు అర్పించిన వారిని ప్రజలు ఇంద్రవెల్లి అమరవీరులుగా గౌరవంగా స్మరిస్తున్నారని ఇంద్రవెల్లికి చెందిన సీనియర్ జర్నలిస్టు కె నరసయ్య ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

మరో జలియన్ వాలాబాగ్...ఇంద్రవెల్లి కాల్పుల ఘటన

నాడు ఇంద్రవెల్లిలో పోలీసులు ఆదివాసీలపై జరిపిన కాల్పుల ఘటన మరో జలియన్ వాలాబాగ్ అని నిర్మల్ జిల్లా బీజీపీ అధ్యక్షుడు రాథోడ్ రితేష్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
నాడు ఇంద్రవెల్లి సభలో పాల్గొన్న గిరిజనులపై ఆంగ్లేయుల్లా విచక్షణా రహితంగా కాల్పులు జరిపారని రితేష్ వ్యాఖ్యానించారు. గిరిజనుల హక్కుల కోసం తాము ఇంద్రవెల్లి అమరవీరుల స్ఫూర్తితో పోరాడుతున్నామని రితేష్ రాథోడ్ పేర్కొన్నారు.

అమరవీరులకు ఘనంగా నివాళులు

ఈ ఘటన కేవలం ఒక దుర్ఘటన కాదు… అది గిరిజన హక్కుల కోసం ఉన్న ఆవేదనకు ప్రతీక. ఇంద్రవెల్లి తర్వాత గిరిజనుల సమస్యలపై ప్రభుత్వాలు మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. వారి భూమి, అరణ్య హక్కుల కోసం చట్టపరమైన మార్పులకు ఇది ఒక ఆరంభంగా నిలిచింది.ప్రతి సంవత్సరం ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో అమరవీరుల స్మారక స్థలంలో వేలాది మంది గిరిజనులు, ప్రజాసంఘాలు, నాయకులు చేరి సోమవారం నివాళులు అర్పించారు. వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ, గిరిజన హక్కుల పరిరక్షణకు ప్రతిజ్ఞ చేశారు.ఇంద్రవెల్లి అమరవీరుల త్యాగం మనకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది.
ఇంద్రవెల్లి ఘటన కేవలం గతంలో జరిగిన ఒక విషాదం కాదు… అది గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీక. హక్కుల కోసం పోరాడిన ఆ అమరవీరుల త్యాగం సమాజానికి మార్గదర్శకం. ప్రతి ఏప్రిల్ 20న వారిని స్మరించుకోవడం మాత్రమే కాదు… వారి ఆశయాలను నిలబెట్టడం మన బాధ్యత. భూమి, అరణ్యం, జీవన హక్కుల కోసం వారు చూపిన మార్గం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తూనే ఉంటుంది.
Read More
Next Story